చాలారకాల వైరల్ జ్వరాల్లాగే డెంగీ కూడా తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) వ్యాధి. అయితే కొంతమందిలో మాత్రం ప్లేట్‌లెట్లు ప్రమాద స్థాయి కంటే కిందికి పడిపోతాయి. అది మినహా చాలావరకు డెంగీ నుంచి దాదాపుగా అందరూ కోలుకుంటారు. పైగా ఇది వైరల్ జ్వరం కావడంతో కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తూ... ప్లేట్‌లెట్ కౌంట్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇటీవల పెద్దసంఖ్యలో ఈ కేసులు వస్తున్న నేపథ్యంలో డెంగీపై అవగాహన కోసం ఈ కథనం.
డెంగీలో రకాలు
ఏ హెచ్చరికలూ లేకుండా వచ్చే డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) ; కొన్ని హెచ్చరికలతో వచ్చే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) ; తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ)
లక్షణాలు
హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా వచ్చే డెంగీ: డెంగీ ఎండెమిక్ ప్రాంతాల్లో... అంటే డెంగీ ఎక్కువగా వస్తున్న ప్రాంతంలో ఇది కనిపిస్తుంటుంది. వీళ్లలో జ్వరం, వికారం/వాంతులు, ఒళ్లు నొప్పులు, ఒంటి మీద ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొన్ని హెచ్చరికలతో కనిపించే డెంగీ:
పైన చెప్పిన లక్షణాలతో పాటు పొట్టనొప్పి, ఊపిరితిత్తుల చూట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం. కొందరిలో పొట్ట లోపలి పొరల్లో రక్తస్రావం అవుతుండటం, బాధితులు అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికి ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోతుంది.
తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) కేసుల్లో :
అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా బాధితుడు తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు స్పృహకోల్పోవచ్చు లేదా పాక్షిక స్పృహలో ఉండవచ్చు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కీలకమైన అవయవాలు పనిచేయకుండా పోవచ్చు.
నిర్ధారణ పరీక్షలు :
- సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ∙నిర్ధారణ కోసం డెంగీ ఎన్‌ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు.
- డెంగీ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాలి. కొన్ని అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చేందుకు పట్టే సమయం కూడా ఎక్కువే కాబట్టి డాక్టర్లు అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి చికిత్స అందించడం ప్రారంభిస్తారు. ∙పై పరీక్షలతో పాటు ఇప్పుడు ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్‌లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష అందుబాటులో ఉంది. ఇది ప్లేట్‌లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోవడంతో పాటు మరెన్నో అంశాలు తెలుసుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
నివారణ ఇలా...
అన్ని వ్యాధుల్లోలాగే డెంగీలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగీని కలిగించే టైగర్‌దోమ పగటిపూటే కుడుతుంది. దీని సంతానోత్పత్తి మంచి నీటిలోనే. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి వారంలోని ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటిస్తే, దీని జీవితచక్రానికి విఘాతం కలిగి ప్రత్యుత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది.
- ఇళ్ల మూలలూ, చీకటి, చల్లటి ప్రదేశాలే టైగర్ దోమల ఆవాసం. ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవడంతో పాటు, దోమలు రాకుండా తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకుంటే...ఒక్క డెంగీ దోమలే కాకుండా...మలేరియా, ఇతర వ్యాధులకు గురి చేసే దోమల్నీ నివారించినట్లు అవుతుంది.
- టైగర్ దోమ పెద్దగా ఎత్తుకు ఎగరలేదు. అందువల్ల కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులతో, ఫుల్‌స్లీవ్‌తో చాలావరకు రక్షణ కలుగుతుంది. ∙నిల్వ నీటిలోనే దోమ గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే వాడని డ్రమ్ముల్ని బోర్లించి ఉంచాలి.
- దోమలను తరిమివేసేందుకు మస్కిటో రిపలెంట్స్ వాడవచ్చు.
- డెంగీ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కొందరిలో మినహాయించి అది అందరిలోనూ ప్రమాదకరం కాదు. కాకపోతే గర్భిణులు, చిన్నారులు, పెద్దవయసు వారికి డెంగీ సోకినప్పుడు అది తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
చికిత్స:
డెంగీ అన్నది వైరస్ కారణంగా వచ్చేది కాబట్టి దీనికి నిర్దిష్టంగా మందులేమీ ఉండవు. అందువల్ల లక్షణాలకు మాత్రమే చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్) ఇస్తారు. అంటే... అవసరమైనప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం, అవసరాన్ని బట్టి రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్‌ఎఫ్‌పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్లేట్‌లెట్స్ కౌంట్ 20 వేల నుంచి 15 వేలు లేదా అంతకంటే తక్కువకు పడిపోతేనే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి.
(చదవండి: అదొక మిస్టీరియస్ వ్యాధి!..ఎలా వస్తుందో తెలియదు..గుర్తించినా.. చనిపోవడం ఖాయం)
Comments
Please login to add a commentAdd a comment