Symptoms
-
ఎముక కేన్సర్ అంటే..?
ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ కేన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్హమ్లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎముక కేన్సర్‌లో రకాలివి...ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ కేన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు. ఇక ఎముక కేన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ ఈ కేన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన కేన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ కేన్సర్’ అని డాక్టర్లు చెబుతారు. ప్రైమరీ బోన్ కేన్సర్లలో... మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే కేన్సర్) ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన కేన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది) ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ రూన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది). సెకండరీ బోన్ కేన్సర్లలో దేహంలోని... రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రోస్టేట్ వంటి ఇతర ప్రాంతాల్లో వచ్చి కేన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక కేన్సర్‌కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అమాయకరం కాని ‘నాన్ కేన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు. లక్షణాలు..ఎముక కేన్సర్ లక్షణాలు తొలి దశల్లోనే గుర్తించడం అంతగా సాధ్యం కాదు. లక్షణాలిలా ఉంటాయి. నొప్పి : కేన్సర్ గడ్డ వచ్చిన ఎముక ప్రాంతంలో నిరంతరం నొప్పి వస్తూ సమయం గడుస్తున్నకొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది. వాపు : ఎముక క్యాన్సర్ వచ్చిన చోట స్పష్టంగా వాచినట్లుగా వాపు కనిపిస్తుంది. ఫ్రాక్చర్లు: క్యాన్సర్ వచ్చిన ఎముక బలహీనంగా మారడంతో తేలిగ్గా విరగడానికి అవకాశాలెక్కువ. తీవ్రమైన అలసట, బరువు తగ్గడం : బాధితుల్లో బాగా నీరసం, నిస్సత్తువ, అలసట కనిపిస్తాయి. అలాగే బాధితులు ఎక్కువగా బరువు తగ్గుతారు. చికిత్స... ఒకసారి ఎముక కేన్సర్ నిర్ధారణ చేశాక... ఆ కేన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక కేన్సర్‌కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. కీమోథెరపీ : కొన్ని మందులతో కేన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి కేన్సర్ల కోసం వాడతారు. రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో కేన్సర్‌ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు. అన్ని కేన్సర్లలో లాగే ఎముక కేన్సర్‌నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతోపాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి. బాధితుల్లో కనిపించే మెరుగుదల (ప్రోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన కేన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతోపాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. ఎముక కేన్సర్‌తో జీవించాల్సి వస్తే... ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక కేన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని కేన్సర్లలో లాగానే బాధితులు షాక్‌కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతోపాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తమకు వచ్చిన కేన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతోపాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్‌పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙నిర్ధారణ...సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతోపాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక కేన్సర్ నిర్ధారణ చేస్తారు. డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్ మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!) -
జ్ఞాపకశక్తి తగ్గుతుందా?! ఈ చిట్కాలు పాటించండి!
శరీరానికి వ్యాయామం గురించి ఆలోచిస్తాం. అలాగే, జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అని గ్రహించాలి. కండరాల కణాలు చురుగ్గా ఉండాలంటే మైండ్కూ వ్యాయామం త్పనిసరి. మైండ్‌కు బూస్ట్‌లా పనిచేసే సులువైన, సమర్ధవంతమైన వ్యాయామాలు ఇవి...ధ్యానంతో స్పష్టత: రోజూ ప్రశాంత వాతావరణంలో కూర్చొని పది నిమిషాలసేపు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ధ్యానం చేయాలి. దీని వల్ల మన ఆలోచనల్లో స్పష్టత లభిస్తుంది. ఫలితంగా మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. పజిల్స్ నింపడం: క్రాస్‌వర్డ్స్, సుడోకో వంటి బ్రెయిన్ టీజర్స్ జ్ఞాపకశక్తికి పదునుపెడతాయి. ఎక్కడైనా జ్ఞాపకశక్తిలో సమస్యలు ఏర్పడినా త్వరగా పరిష్కారం లభిస్తుంది. పుస్తకపఠనం: ఆసక్తిని పెంచే రచనలు, వ్యాసాలు, మైండ్‌కి ఛాలెంజింగ్‌గా అనిపించే పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానానికి సంబంధించిన సామర్థ్యం పెరుగుతుంది. సాధన: ప్రస్తుత మీ మానసిక స్థితి ఎలా ఉందో గ్రహించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. భావోద్వేగాలు, చుట్టూ ఉండే వాతావరణం మన మైండ్‌కు మరింత పదును పెట్టేలా ఉండాలి. శారీరక వ్యాయామం మైండ్‌కు బూస్ట్: రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుంది. యోగా వంటి సాధనలు కూడా మనోవికాసాన్ని పెంచుతాయి. నలుగురిలో కలవడం: సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండాలి. దీని వల్ల ఎదుటివారితో సంభాషణ, చర్చలు, ఆలోచనల విస్తృతి పెరుగుతుంది. భావోద్వేగాల పరంగా, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. బ్రెయిన్ ఎక్సర్‌సైజులతో, అవగాహనతో జ్ఞాపకశక్తికి ఎప్పుడూ పదునుపెడుతూ ఉండాలి. అది ఈ సమయం నుంచే మొదలుపెట్టండి. -
నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధం
చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్‌లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
చిక్కే....‘సిస్ట్’ర్స్... జాగ్రత్త!
మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్‌లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం. ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్‌కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది. కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్లు వాటంతట అవే కనుమరుగవుతాయి.ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కనపడుతుంది. ఈ సిస్ట్లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్‌లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్‌లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్‌తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్‌లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది. సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్‌లో సాధారణంగా కనిపించే సిస్ట్లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే... ఇన్ని రకాల సిస్ట్లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్‌లో ఉన్న సీరస్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.శస్త్రచికిత్స అవసరమయ్యేవి... కొన్ని సిస్ట్లు మెలిక తిరిగి అంటే టార్షన్కు గురై పేషెంట్‌కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి. చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్వికన్సల్టెంట్, అబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
రోజూ అదే టైమ్‌కు ఠంచనుగా వాంతులా? ఎందుకలా?!
కొందరికి అదే పనిగా వాంతులవుతాయి. అంతేకాదు... రోజూ అదే టైమ్‌కు అవుతాయి. ఒకవేళ వాంతులు కాని పక్షంలో... కనీసం వికారంగానైనా ఉండే అవకాశముంది. వాంతులై కొన్ని గంటలు గడిచాకే హాయిగా అనిపిస్తుంటుంది. చిత్రంగా మళ్లీ ఆ మర్నాడు మళ్లీ అదే టైమ్‌కు వాంతులు కావడం మొదలవుతుంది! క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సేపు అవుతుంటాయి!. విచిత్రమైన ఈ జబ్బు పేరు... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు. చిన్నపిల్లల్లో ఇది మరీ ఎక్కువ. పెద్ద వయసు వాళ్లలోనూ కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలెక్కువ. దీనికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదుగానీ... వాంతుల వల్ల తగ్గి΄ోయిన / దేహంలోంచి వెళ్లిపోయిన లవణాలను భర్తీ చేసేందుకు సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇతరత్రా ప్రత్యేకమైన చికిత్స లేకపోయినప్పటికీ... సాధారణంగా వాంతులను, వికారాన్ని తగ్గించే మందులను‘యాంటీ–ఎమెటిక్’ డ్రగ్స్‌తో డాక్టర్లు ఈ ‘సీవీఎస్’ సమస్యకు చికిత్స అందిస్తారు. ఇదీ చదవండి: Clinical vampirism రక్తం తాగాలనిపించే జబ్బు గురించి తెలుసా? -
ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..
ప్రపంచవ్యాప్తంగా... ఆమాటకొస్తే భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ విస్తృతియే చాలా ఎక్కువ. మొత్తం అన్ని రకాల క్యాన్సర్లను పరిగణనలోకి తీసుకుంటే రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యేవారు 28 శాతం ఉంటారని అంచనా. తాజా ‘గ్లోబకాన్’ లెక్కల ప్రకారం మన దేశంలో రొమ్ముక్యాన్సర్ల కేసుల సంఖ్య 1,78,361 కాగా దురదృష్టవశాత్తు దాని వల్ల 90,408 మరణాలు సంభవించాయి. అయితే కేవలం రొమ్ముక్యాన్సర్‌పై సరైన అవగాహన లేని కారణం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. సాధారణంగా మహిళల్లో 40 – 50 ఏళ్ల వయసప్పుడు వచ్చే ఈ రొమ్ముక్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తిస్తే దీని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని భరోసా ఇస్తున్నారు. అక్టోబరు నెల రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం కోసమే ఈ కథనం. మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్)తో ΄ాటు మరికొన్ని అంశాలూ కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... రిస్క్ఫ్యాక్టరు...సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌కు కారణమయ్యే రిస్క్‌లో పెరిగే వయసు, దాంతోపాటు కుటుంబంలో రొమ్ముక్యాన్సర్లు ఉండటం, మొదటి నెలసరి చాలా త్వరగా రావడం, మెనోపాజ్ చాలా ఆలస్యం కావడం, జీవితకాలంలో పిల్లలు లేకపోవడం వంటివి. ∙చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌కు గురి అయ్యే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. ఐదు నుంచి పది శాతం కేసుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారిలోనే వస్తుండటం గమనార్హం. బీఆర్సీఏ1, బీఆర్సీఏ 2 వంటి జెనెటిక్ మ్యూటేషన్లు ఉంటే ఆ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. ఇందులో బీఆర్సీఏ 1 జెనెటివ్ మ్యూటేషన్ వల్ల ముప్పు శాతం 72 % కాగా బీఆర్సీఏ 2 వల్ల 69% ముప్పు ఉన్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇక నివారించగలిగే రిస్క్‌ఫ్యాక్టర్లలో స్థూలకాయం ∙ఆధునిక జీవౖనశెలిలో భాగంగా కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు ∙ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం ∙తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైన బిడ్డకు రొమ్ము పాలు పట్టించడం మేలు. లక్షణాలు...మహిళలు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి లేదా స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అవి హానికలిగించని (బినైన్) గడ్డలా, లేక హానికరమైనవా (మేలిగ్నెంట్) అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం ∙రొమ్ము చర్మం మందంగా మారడం ∙రొమ్ములో సొట్ట పడినట్లుగా ఉండటం రొమ్ము ఆకృతిలో మార్పులు ∙సమస్య ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్. నిపుల్కు సంబంధించినవి: రొమ్ముపై దద్దుర్ల వంటివి రావడం నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటివి స్రవించడం రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం, వాటిలో గమనించగలిగే తేడా రావడం బాహుమూలాల్లో :గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం చేతివాపు (లింఫ్ ఎడిమా)ఇమ్యూనో థెరపీ, టార్గెట్ థెరపీ : శస్త్రచికిత్సతోపాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాధితులకు సరిపడే చికిత్సను డాక్టర్లు అందిస్తారు. వ్యాధి తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడం తోపాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ విషయంలో గతంలోలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ ఎక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు ‘నియో అడ్జువెంట్ థెరపీ’ అని ఇస్తారు. తర్వాతి చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండటం కోసం డాక్టర్లు ఈ చికిత్స ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ముందుగా ఆపరేషన్ చేయాలా, లేక కీమోథెరపీ ఇవ్వాలా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే కనుగొంటే 90% పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం ఉంది. చికిత్స... ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉండే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అ΄ోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి.నిర్ధారణ పరీక్ష... తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం ద్వారా మామోగ్రాఫీ అనే స్కాన్ ద్వారా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే పరీక్ష పూర్తి నిర్ధారణ కోసం వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ పెట్ స్కాన్. (చదవండి: కిడ్నీలను కిడ్స్‌లా కాపాడుకుందాం..!) -
అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతి
అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతితో తన కూతుళ్లు అనుభవిస్తున్న బాధల గురించి భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ‘వైకల్యాలతో బాధపడుతూ జీవనం సాగిస్తున్న చిన్నారుల హక్కుల’పై ఏర్పాటైన తొమ్మిదో వార్షిక జాతీయ కన్సల్టేషన్’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన కూతుళ్లు, అలాంటి వాళ్ల సమస్యలతో ఆ కుటుంబాల వాళ్లు ఎదుర్కొనే వాస్తవ సమస్యలూ, ఉద్వేగభరితమైన సవాళ్ల గురించి తెలియజేశారు. ‘‘మా పిల్లలు ‘నెమలైన్ మయోపతి’ అనే సమస్యతో పుట్టారు. మయోపతి సమస్య గురించి డాక్టర్లకే పూర్తిగా తెలియదంటే... ఇక వాళ్ల తల్లిదండ్రులూ, వారికి సేవలందించే వాళ్ల గురించి పెద్దగా చెప్పేదేముంటుంది. చాలా కుటుంబాల వాళ్లు దీని గురించి పెద్దగా ఆలోచించకుండా అంతా బాగుందనే భ్రమల్లో జీవిస్తుంటారు. మన దేశంలోని పెద్ద పెద్ద వైద్యవిజ్ఞాన సంస్థల్లోనూ ఈ కండిషన్‌కు నిర్వహించే పరీక్షలూ, నిర్ధారణ పరీక్షల సౌకర్యాలూ పెద్దగా లేవు. ఈ నెమలైన్ మయోపతీనే ‘రాడ్ మయోపతి’ అని కూడా అంటారు. ఇది పుట్టుకతోనే వచ్చే చాలా అరుదైన సమస్య. ఇందులో కండరాలు (స్కెలెటల్ మజిల్స్) క్రమంగా బలహీనంగా మారిపోతాయి. జన్యుపరమైన ఉత్పరివర్తనాల (జెనెటిక్ మ్యుటేషన్స్) కారణంగా వచ్చే ఈ సమస్యలో ముఖం, మెడ, ఛాతీలో కండరాలన్నీ క్రమంగా బలహీన పడుతూపోతాయి. (ఈ లోపం మినహా నా పిల్లలు ఇతర ఏ చిన్నారులతో ΄ోల్చినా తీసి΄ోనంత చురుకైన, మంచి తెలివితేటలు కలవారు). ఈ లోపం కారణంగా చిన్నారులకు ఆహారం తీసుకోవడంలో... శ్వాస తీసుకోవడంలో... ఇలా ప్రతి అంశంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. కండరాలన్నీ బలహీనపడటంతో ఏ పనీ చేసుకోలేని వైకల్యాలు ఏర్పడతాయి’’ అంటూ ఉద్వేగభరితమైన ప్రసంగంలో తెలిపారు.ఈ వ్యాధిని ఎదుర్కొనే తీరిది... ‘‘ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేదు. ఇప్పుడున్న చికిత్స ప్రక్రియలు కేవలం లక్షణాలను తగ్గించడానికి మాత్రమే సహాయం చేస్తాయి. కండరాలు ఉన్నంతలో బాగా పనిచేసేందుకు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ లాంటి వాటిని మాత్రమే డాక్టర్లు సూచిస్తుంటారు. దీనికితోడు వాళ్లు తమ ఆహారాన్ని తామే తీసుకునేవిధంగా, ఉచ్చారణ బాగుండేందుకు కొంత స్పీచ్ థెరపీ, ఉన్నంతలో వాళ్ల పనులు వాళ్లే చేసుకునే విధంగా వాళ్ల జీవన నాణ్యత మెరుగుపరచడం కోసం కొన్ని ఉపకరణాలు సహాయం తీసుకోవడం... ప్రస్తుతానికి ఇవి మాత్రమే అందుబాటులో ఉన్న పద్ధతులు. వీటి సహాయం తీసుకోవాలంటూ డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు’’ అని తెలిపారు చంద్రచూడ్.మరింత అవగాహన కావాలి... ఈ వ్యాధిపై ఇంకాస్త ఎక్కువ అవగాహన కావాలనీ, ప్రజల్లో దీని గురించి తెలియాల్సిన అవసరముందని చంద్రచూడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నెమలైన్ మయోపతి లాంటి వ్యాధుల విషయంలో మరింతగా మెరుగైన నిర్ధారణ పద్ధతులు రావాల్సిన అవసరముందని తెలిపారు. ఆయనా, ఆ కుటుంబ సభ్యులు, అమాయకులైన ఆ చిన్నారుల వెతలతో సహానుభూతి చెందిన వారెవరైనా... ఇలాంటి వ్యాధుల విషయంలో మరింత అవగాహన, వైద్యచికిత్సా పద్ధతుల్లో మరింత పురోగతి అవసరముందంటూ తప్పక చెబుతారనే అభి్ర΄ాయాలు సర్వత్రా వెల్లడవుతున్నాయి.నా చెల్లెలికి ఈ పరీక్ష వద్దు నాన్నా... నెమలైన్ మయోపతి గురించి వివరించే క్రమంలో దీని నిర్ధారణ కోసం తన కూతుళ్లకు ఎదురైన అత్యంత వేదనాభరితమైన క్షణాలను ఇలా వివరించారాయన. ‘‘ఈ వ్యాధిని నిర్ధారణ చేయాలంటే శరీర కణజాలంలోని చిన్న ముక్కను బయాప్సీ ద్వారా సేకరించాలి. ఇది అత్యంత బాధాకరమైన ప్రోసీజర్. ఇదెంత బాధాకరమంటే ఆ సందర్భంగా నా కూతురు నాతో అన్న మాటలు ఇప్పటికీ నన్ను ఆవేదనకు గురిచేస్తాయి.‘నాన్నా... నాకు నిర్వహిస్తున్న ఈ సీజర్ చెల్లెలికి ఎప్పటికీ చేయవద్దు నాన్నా’’ అంటూ అభ్యర్థించిన నా కూతురి మాటలు నా చెవుల్లో, హృదయంలో ప్రతిధ్వనిస్తుంటాయి’’ అని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారాయన. ఇదే కాకుండా భౌతికంగా నిర్వహించే పరీక్షలూ, జన్యుపరమైన పరీక్షలూ, కండరాల బయాప్సీ (కండరపు ముక్క సేకరించి చేసే పరీక్ష)... వీటన్నింటి సహాయంతో నెమలైన్ మయోపతిని నిర్ధారణ చేస్తారని వివరించారు. (చదవండి: చేపలు మాత్రమే తింటు..ఏకంగా 15 కిలోల బరువు తగ్గిన మహిళ..!) -
Cerebral Palsy Day: మస్తిష్క పక్షవాతం అంటే..
నేడు వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. సెరిబ్రల్ పాల్సీ అంటే మస్తిష్క పక్షవాతం. ఇదొక నరాల వ్యాధి. దీనిపై అవగాహన కల్పించేందుకు సెరిబ్రల్ పాల్సీ డేను అక్టోబర్ 6న నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటీ 70 లక్షలకు పైగా సెరిబ్రల్ పాల్సీ కేసులు నమోదయ్యాయి.కొందరికి పుట్టుకతో, మరికొందరికి తలకు గాయమైనప్పుడు మస్తిష్క పక్షవాతం సంభవిస్తుంది. దీని కారణంగా మెదడులో ఎదుగుదల లోపించి కండరాలు, కదలికలపై సమన్వయం అనేది లోపిస్తుంది. బాల్యంలో సంభవించే ఈ వైకల్యానికి జన్యుపరమైన లోపాలే ప్రధాన కారణంగా నిలుస్తాయి. భారతదేశంలోని ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురికి మస్తిష్క పక్షవాతం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మస్తిష్క పక్షవాతం సోకిన పిల్లల్లో దొర్లడం, కూర్చోవడం, నడవడం వంటివి ఆలస్యమవుతాయి. ఇది ఆడపిల్లల కంటే కంటే మగపిల్లలలోనే అధికంగా కనిపిస్తుంది.మూడు నెలల వయసులో శిశువును ఎత్తిన సందర్భంలో తల వెనక్కి వాలిపోవడం, శరీరమంతా బిగుసుకోపవడం, కండరాల బలహీనత, ఆరు నెలలకు గానీ దొర్లకపోవడం, రెండు చేతులను కూడదీసుకోవడంలో వైఫల్యం, నోటివద్దకు చేతులు తీసుకురావడంలో సమస్యలు.. ఇవన్నీ మస్తిష్క పక్షవాతం లక్షణాలని వైద్యులు చెబుతుంటారు. ఇది కండరాల తీరు, ప్రతిచర్యలు, భంగిమ సమన్వయాన్ని, కదలికలు, కండరాల నియంత్రణను సమన్వయం చేయక ఇబ్బందులకు గురిచేస్తుంది.గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధిపై ప్రభావం చూపే రుబెల్లా వ్యాధి, శిశువు మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడటం, ప్రసూతిలో సమయంలో ఆక్సిజన్ కొరత మొదలైనవి మస్తిష్క పక్షవాతానికి దారితీస్తాయి. మస్తిష్క పక్షవాతం నయం చేయలేని వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే మందులు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ మొదలైనవి మస్తిష్క పక్షవాతం బాధితులకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ వ్యాధి బారినపడినవారికి సకాలంలో వైద్యం అందిస్తే వ్యాధిని కొంత వరకు అరికట్టవచ్చని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం -
ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..?
తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తూ, టార్గెట్లు ఛేదించడానికి శ్రమపడుతూ ఉండే వారిలో... ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు ఆస్తమా రావడం కొందరిలో కనిపిస్తుంది. అందుకే ఈ అంశం అటు పరిశోధనల్లో, ఇటు వైద్యవర్గాల్లో చాలావరకు ఓ చర్చనీయాంశం (డిబేటబుల్ సబ్జెక్ట్)గా ఉంది. ఏతావాతా చెప్పదగిన అంశమేమిటంటే... ఆస్తమా లేనివారిలో అధిక ఒత్తిడి కొత్తగా ఆస్తమాను కలిగించదుగానీ... అప్పటికే ఆస్తమా సమస్య ఉన్నవారిలో ఒత్తిడి అనేది ఓ ట్రిగరింగ్ ఫ్యాక్టర్‌గా పనిచేసి ఆస్తమాను ప్రేరేపించగలదు.మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే... తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా ఎటాక్స్ చాలా తరచుగా కనిపిస్తుంటాయి. పరిశోధకులు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని చాలా సందర్భాల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని చాలామంది ఇతర అధ్యయనవేత్తలూ రూఢి చేశారు. ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబాల్లో విభేదాలు, విపత్తుల్లో చిక్కుకు΄ోవడం, హింసకు లోనుకావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. మొదట ఒత్తిడి అనేది యాంగ్జైటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలయ్యేలా చేస్తుంది. ఆ ప్రభావంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. ఇక మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే... ఒత్తిడీ, యాంగ్జైటీ వంటి సమస్యలతో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు వారి పరిస్థితిని నియంత్రించడం మరింత కష్టమవుతుంది.ఒత్తిడినీ, దాంతో వచ్చే ఆస్తమానూ అరికట్టడం ఎలా...? మొదట తమకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్‌లైన్స్‌తో సతమతమవుతుండటమా అనేది తొలుత గుర్తించాలి. సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడమనేది తమ వల్ల అవుతుందా, ఎవరి సహాయమూ లేకుండానే సమస్యకు పరిష్కారం సాధ్యపడుతుందా లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అన్ని పనులూ ఒకరే పూర్తి చేయలేరని గుర్తించాలి. తొలుత పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించాలి. ఉదాహరణకు డెడ్‌లైన్‌లోపు ఒకరే ఆ పని చేయలేరనుకుంటే... దాన్ని విడదీసి తలా కాసింత బాధ్యత అప్పగించాలి. దీన్నే వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అంటారు. ఆఫీసు పనిచేసే సమయాల్లో ఈ వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అనుసరించాలి. అంతేకాదు... పని ఒత్తిడి అన్నది ఆఫీసులో ఒక్కరికే పరిమితమైనది కాదు... అది అక్కడ పనిచేసే అందరికీ వర్తించేదన్న విషయాన్ని గుర్తెరగాలి. దాంతో సగం ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజూ అలసట కలిగించని వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మంచి స్ట్రెస్ బస్టర్. ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి అనుసరించాలి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయడం స్ట్రెస్‌ను చాలావరకు తగ్గిస్తుంది. అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి . రోజూ కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే తక్షణం తప్పనిసరిగా వైద్యుల సహాయం తీసుకోవాలి. చికిత్స : విండ్పైపులు (వాయునాళాలు) వాపునకు (ఇన్ఫ్లమేషన్కు) గురైనప్పుడు... ఆ వాపు వల్ల గాలి ప్రవహించే లోపలి దారి సన్నబారి΄ోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. దాంతో ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు తగ్గాలంటే మొదట తక్షణమే వాయునాళాలను విప్పార్చే / విస్తరింపజేసే మందులను లేదా ఇన్హేలర్స్ను వాడాలి. అదే రాకముందు లేదా వచ్చి తగ్గాక డాక్టర్ సలహా మేరకు ... ఆస్తమా రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు / ఇన్హేలర్స్ వాడాలి. ఆస్తమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించేందుకు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీ హిస్టమైన ఇంజెక్షన్స్ కూడా వాడవచ్చు.అపోహ – వాస్తవం : ఇన్హేలర్ అలవాటు అవుతుందనీ, అది మంచిది కాదనే అ΄ోహ కొంతమందికి ఉంటుంది. నిజానికి టాబ్లెట్లతో పోలిస్తే ఇన్‌హేలర్స్‌తో దేహంలోకి ప్రవేశించే మందు మోతాదు చాలా తక్కువ. దాంతో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. అందుకే ఇన్హేలర్స్ సురక్షితమని గుర్తించాలి. ప్రివెంటివ్ మందు ఉండే ఇన్హేలర్స్ వాడుతుంటే అటాక్ రాకుండా అవి ఆస్తమాను అదుపులో ఉంచుతాయి.డాక్టర్ రవీంద్ర రెడ్డి, పల్మనాలజిస్ట్(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
నిద్రలేమితో ఆస్తమా తీవ్రం!
నిద్రలేమి (ఇన్సామ్నియా) సమస్యతో బాధపడేవారిలో ఒక్కోసారి అది ఆస్తమాను ప్రేరేపించవచ్చంటున్నారు నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు. ఆస్థమాతో బాధపడేవారిలో ఆస్తమా అటాక్ రాగానే రాత్రివేళ నిద్రలేకపోవడం, నిద్రలో నాణ్యత లోపించడం మామూలే. అయితే రాత్రివేళ సరిగా నిద్ర పట్టకపోవడం కూడా ఆస్తమాకు దారి తీస్తుందన్న విషయం తెలిసిందనీ, ఇదో వలయంలాగా సాగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లిన్ బీటె స్ట్రాండ్ తెలిపారు. నిద్రలేమితో బాధపడుతున్న 20 నుంచి 65 ఏళ్ల వయసున్న దాదాపు 18,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో చాలామందికి ఆస్తమా అటాక్ అయినట్టు స్ట్రాండ్ పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఇన్సామ్నియా బాధితుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువని తెలి΄ారు. -
దేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ రెండో కేసు నమోదైంది. ఇటీవలే యూఏఈ నుంచి కేరళ వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన వ్యక్తికి మలప్పురంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.ఆ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో మంకీపాక్స్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ కాగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.మంకీపాక్స్ కొత్త వేరియెంట్ బయటపడడంతో ఆగస్టులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ అత్యవసర స్థితిగా ప్రకటించింది. ఇదీచదవండి..50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూపు కనిపెట్టిన సైంటిస్టులు -
విటమిన్ బీ12 లోపమా? ఈ ఆహారం తీసుకోండి!
ఆరోగ్యకరమైన జీవనం కోసం పోషకాలు,విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా అసవరం. వీటిల్లో ఏది లోపించినా ఏదో శారీరక ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిల్లో విటమిన్ బీ 12. ఇది ఎర్రరక్త కణాల వృద్దికి, నాడీ వ్యవస్థకు చాలా తోడ్పాటునిస్తుంది. ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుందని అనేది గమనించాలి. మరి బీ 12 లోపంతో వచ్చే అనర్థాలు, లభించే ఆహారం గురించి తెలుసుకుందాం.వయసులో ఉన్నవారితో పోలిస్తే సాధారణంగా వయస్సుపైబడినవారు, స్త్రీలు, శాకాహారుల్లో విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయుల్లో సుమారు 47 శాతం మందిలో విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నట్టు అంచనా. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వలు తగ్గినప్పుడు బీ 12 లోపంకనిపిస్తుంది. లక్షణాలు రక్తహీనత, నీరసం అలసట, నిరాశ, నిస్సహాయత, గుండె దడ, నరాల సమస్యలు , ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా చర్మం పాలిపోయినట్లు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, తలనొప్పి, ఇన్ఫెక్షన్లు, నోరు పొడిబారడం, అతిసారం, మలబద్దకం, ఆకలి లేకపోవడం,జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, డిప్రెషన్, చిరాకు ఇవన్నీ బీ 12 లోపం వల్ల కావచ్చు. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.విటమిన్ బీ12 లేకపోవడం వల్ల వచ్చే అరుదైన పరిస్థితి ఆప్టిక్ న్యూరోపతి సంభవిస్తుంది. కంటి నుండి మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నరం దెబ్బతింటుంది. ఇది క్రమంగా చూపు కోల్పోయేలా చేస్తుంది. చర్మంపై హైపపర్ పిగ్మంటేషన్ (డార్క్ స్పాట్స్) కనిపిస్తాయి. బీ 12 ఎక్కువైనా, బొల్లి ,నోటి పూతల, తామర, మొటిమలు లాంటి లక్షణాలు కనిస్తాయి. (ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ గుండెపోటుతో కన్నుమూత)బీ12 లభించే ఆహారంచేపలు, రొయ్యలు, మాంసం, శనగలు, బాదం పప్పు, పుట్ట గొడుగులు, జీడిపప్పు, అల్లం, ఉల్లిపాయ, ప్రాన్స్ , మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. శాకాహారులు తృణధాన్యాలు పోషక ఈస్ట్ వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా చీజ్, పాల ఉత్పత్తులు,సోయా ,బియ్యంలో కూడా ఇది లభిస్తుంది. వైద్యుల సలహా మేరకు ‘విటమిన్ బీ12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు.ఇదీ చదవండి : ఓనం అంటే సంబరం సరదా, సాధ్య! -
మధుమేహం ముప్పు : ‘కళ్లు’ చెబుతాయి!
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్నసమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. మారుతున్న జీవనశైలి, ఆహారం తదితర కారణాలరీత్యా వయసుతో సంబంధం లేకుండా తొందరగా షుగర్వ్యాధికి గురవుతున్నారు. కేసుల సంఖ్యకూడా వేగంగానే పెరుగు తోంది. మధుమేహం కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ , శాశ్వత నరాల, కంటి, పాదాల సమస్యలకు దారితీస్తుంది. అయితేఏ వ్యాధినైనా ముందుగా గుర్తించడం కీలకం. అలాగే డయాబెటిస్‌ను వార్నింగ్ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు,సరైన చికిత్స తీసుకుంటే, ప్రభావం తీవ్రతనుంచి బయటపడవచ్చు. అయితే దీన్ని గుర్తించడం ఎలా? ముఖ్యంగా కంటి చూపులో ఎలాంటి మార్పులొస్తాయి? తెలుసుకుందాం!డయాబెటిస్ లేదా ప్రమాదం పొంచి ఉందని మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా ఉండటం, తొందరగా ఆలసిపోవడం లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కళ్లలో జరిగే కొన్ని మార్పులు డయాబెటిస్‌కు ముందస్తు లక్షణమని వైద్యులు చెబుతున్న మాట. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో కంటి చూపు మందగిస్తుంది. ఉదయం లేవగానే కళ్లు మసకగా అనిపించడం, దృష్టి మసక బారుతుంది. అంతేకాదు కళ్లలో నొప్పి, అలసట ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే షుగర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించి అలర్ట్ అవ్వాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి కంటి నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించు కోవాలి. చికిత్స చేయించు కోవాలి. లేదంటే డయాబెటిక్ రెటినోపతికి దారికావచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశదృష్టిలో మచ్చలు లాగా, ఏదో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అస్పష్టమైన దృష్టిదృష్టిలో హెచ్చుతగ్గులు నల్లటి చుక్కల్లాగా, ఖాళీ ప్రదేశం ఉన్నట్టుచూపు కోల్పోవడం లాంటివి కనిపిస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి శాశ్వతంగా కంటి చూపును కోల్పోవచ్చు. నోట్: లక్షణాలు కనిపించినా, వ్యాధి నిర్ధారణ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మా లైఫ్‌స్టయిల్ తో సంబంధమున్న వ్యాధులు చాలా జీవనశైలి మార్పులు, కొద్దిపాటి వ్యాయామం, ఆహారమార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ఏదైనా నిపుణులైన వైద్యుల సలహాల మేరకు ఈ మార్పులు చేసుకోవాలి. -
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చబా గ్రామానికి చెందిన గిరిజన బాలిక బిడ్డిక రషి్మత(8) మలేరియాతో గత నెల 6వతేదీన మృత్యువాత పడింది. జూన్ 22న సరుబుజ్జిలి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరిన ఈ చిన్నారి నాలుగు రోజుల అనంతరం జ్వరం బారిన పడింది. పీహెచ్సీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రషి్మతతో పాటు మరికొందరు బాలికలు కూడా మలేరియా బారినపడ్డారు. గత నెలలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి రెండు రోజుల వ్యవధిలో 30 మంది పిల్లలు జ్వరాలతో రాగా 15 మందికి మలేరియా నిర్ధారణ అయింది. పాడేరు మండలం దేవాపురంలో కె.రత్నామణి(37) గత నెల పాడేరు ప్రభుత్వాస్పత్రిలో మలేరియాకు చికిత్స పొందుతూ మృతి చెందింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యం అధ్వానంగా మారడంతోపాటు అంటురోగాలు, విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. ప్రజారోగ్య విభాగం పడకేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయకపోవడంతో జూన్, జూలైలో డయేరియా ప్రబలగా, ఇప్పుడు డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉత్తరాంధ్ర, గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టినవారే కనిపిస్తున్నారు. అనారోగ్య పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మలేరియా, డెంగీ, డయేరియా, విష జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇక జ్వరాల బాధితుల్లో వింత లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ నెగిటివ్ అని వచి్చనప్పటికీ కొంతమందిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించి కొత్త రకం వైరల్ జ్వరాలు, వైరస్ల వ్యాప్తిౖò³ ప్రజలను జాగృతం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మృత్యు ఘంటిక మోగిస్తున్న డెంగీ ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా మలేరియా కేసులు, 2 వేలకుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. గత సోమవారం విశాఖ కేజీహెచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక డెంగీతో మరణించింది. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ డెంగీకి చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువాత పడింది. గత వారం బాపట్ల జిల్లా ముత్తాయపాలెంలో డెంగీ లక్షణాలతో ఓ అంగన్వాడీ కార్యకర్త చనిపోగా చిత్తూరు జిల్లా మేలుపట్ల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి బాలిక ఈ నెలలోనే కన్ను మూసింది. ఇక రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో అధిక శాతం ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. గత నెల 15వతేదీ నుంచి 28 మధ్య రెండు వారాల్లో ఏఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 260, పార్వతీపురం మన్యంలో 178 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరల్ ఓపీల్లో మూడో వంతు జ్వర బాధితులే ఉన్నారు. పాడేరు ప్రభుత్వాస్పత్రి కిక్కిరిసిపోతోంది. రోజుకు 400 వరకూ ఓపీలు నమోదవుతుండగా మలేరియా, డెంగీ, విష జ్వరాల కేసులు అధికంగా ఉంటున్నాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి వైరల్ జ్వరాల్లో కొత్త లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల శరీర ఉష్ణోగ్రత 103, 104 వరకూ వెళుతోంది. వికారం, కీళ్లు, ఒంటి నొప్పులు, నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కాళ్లు, చేతులు వాపులు, ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, కళ్ల మంట లాంటి లక్షణాలు వారం నుంచి 10 రోజులు ఉంటున్నాయి. ప్లేట్లెట్స్ 30 వేల వరకూ పడిపోతున్నాయి. బాధితులు తీవ్ర నొప్పులతో మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డెంగీ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతోంది. దీంతో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డయేరియా విలయతాండవం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయడం లేదు. దీంతో జూన్, జూలైలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 56 చోట్ల డయేరియా ప్రబలింది. ఈ ఏడాది జూన్‌లో జగ్గయ్యపేట నుంచి డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. అదే నెలలో తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి కన్నుమూయగా గత నెలలో కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో నాలుగేళ్ల చిన్నారిని మత్యువు కబళించింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఏకంగా 250 మందికి డయేరియా సోకగా ఏడుగురు మృతి చెందారు. మంత్రి నారాయణ సమీక్షలు నిర్వహించినా పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం మార్పు రాలేదు. ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి డ్రోన్ల ద్వారానే మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను తెస్తాం. సీజనల్ వ్యాధులను సున్నాకు కట్టడి చేస్తాం..’ అని వైద్య శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం డ్రోన్లను ఎగరేసి దోమలను చంపే లోపే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఫీవర్ సర్వే ఊసే లేదు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. ఇందుకోసం సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించేది. ఆశా, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇతర లక్షణాలున్న వారిని గుర్తించేవారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును గమనించి ప్రజలకు జాగ్రత్తలు సూచించేవారు. ఫీవర్ సర్వేలో అవసరం మేరకు కిట్ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. అవసరం మేరకు ఆస్పత్రులకు రెఫర్ చేసి వైద్యం అందేలా సమన్వయం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలను గాలికి వదిలేసింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే ఇప్పటి వరకూ నిర్వహించనే లేదు. దీంతో మలేరియా, డెంగీ బారిన పడ్డ బాధితులు ఆస్పత్రులకు వెళ్లడంలో జాప్యం కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, రక్షిత నీటి సరఫరా, ముందస్తు జాగ్రత్తలు చాలా కీలకం. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి మురికి కూపాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ⇒శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నంలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 63,932 మంది జ్వర పీడితులున్నట్లు ప్రకటించారు. డెంగీ కేసులు 25 నమోదు కాగా, మలేరియా 30, టైఫాయిడ్ 196, డయేరియా 3,113 కేసులున్నాయి. ⇒విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు 491 నమోదయ్యాయి. జిల్లాలో 2.45 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు.⇒విశాఖ జిల్లాలో 329 డెంగీ కేసులు, 114 మలేరియా కేసులు నమోదు అయినట్టు జిల్లా మలేరియా అధికారి తులసి తెలిపారు. ⇒పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెలలో 24 డెంగీ కేసులు, 345 మలేరియా, 911 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. èఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జ్వరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.èఅనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 20,100 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 52 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి.⇒విజయవాడ ప్రభుత్వాస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి పది మంది అనారోగ్య పీడితుల్లో ఐదుగురు విష జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు డెంగీ బాధితులు ఉంటున్నారు. డెంగ్యూ ఎన్ఎస్ 1 పాజిటివ్ కేసులు విజయవాడలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ⇒ప్రకాశం జిల్లాలో డెంగీ కేసులు 56 నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీన కంభం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. టైఫాయిడ్ కేసులు సుమారు 800, విషజ్వరాలు 1,100 నమోదయ్యాయి.⇒ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైరల్ జ్వరాలు చెలరేగుతున్నాయి. గత రెండు నెలలుగా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో 150 మంది వైరల్ జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు.⇒డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో 60 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఆరుగురు డెంగీ బారినపడ్డారు. కొత్తపేట మండలం వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో ఈ నెలలో సుమారు 800 జ్వరాలు కేసులు రాగా 100 టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఐదు వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో సుమారు 32 డెంగీ కేసులు నమోదయ్యాయి.èశ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, ధర్మవరం, కదిరి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మడకశిరలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. ధర్మవరంలో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ⇒వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకు డెంగీ కేసులు 244, మలేరియా కేసులు 11 నమోదయ్యాయి. ⇒కర్నూలు జిల్లాలో డెంగీ కేసులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో 63 నమోదయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాల్టీ, గూడురు నగర పంచాయతీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నంద్యాల జిల్లాలో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 77 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత జూన్ 21న జూపాడు బంగ్లా మండలం చాబోలులో అతిసార ప్రబలి 20 మంది ఆసుపత్రి పాలు కాగా నడిపి నాగన్న మృతి చెందాడు.⇒అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు 132 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఈ నెలలో 45 డెంగీ, 30 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. రాయచోటిలోని వంద పడకల ఆస్పత్రిలో 69 డెంగీతోపాటు 104 మలేరియా కేసులు నమోదయ్యాయి. ⇒అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్, రూరల్, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు వందకు పైగా నమోదైనట్లు సమాచారం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇంటి ఆవరణ, పరిసరాల్లో పనికిరాని వస్తువులు,టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రపరచి వాటిపై మూతలు ఉంచాలి. ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి. తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వాడాలి. గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. సీజనల్ వ్యాధులు.. లక్షణాలు వ్యాధి లక్షణాలుమలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం డయేరియా: విరేచనాలు, కడుపు నొప్పి, వికారంటైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపులో నొప్పికలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడండెంగ్యూ: హఠాత్తుగా జ్వరం, భరించలేని తల, కండరాలు, కీళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలుకామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం -
World Lung Cancer Day 2024 లక్షణాలను గుర్తించడం ముఖ్యం, లేదంటే ముప్పే!
ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా అనేకమరణాలను ప్రధానకారణం లంగ్ కేన్సర్. ప్రతీ ఏడాది 1.6 మిలియన్ల మంది ఈ కేన్సర్‌కి బలవుతున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్‌కు ప్రధాన కారణం పొగాకు,ధూమపానం అయినప్పటికీ, ఎపుడూ ధూమపానం చేయని వ్యక్తులలో కూడా సంభవించవచ్చు. దాదాపు 15 శాతం మంది పొగాడు వినియోగం చరిత్ర లేనప్పటికీ ఈ వ్యాధిబారిన పడుతున్నారని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈరోజు ( ఆగస్టు 1)న ప్రపంచ ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ధూమపానంతో పాటు కొన్ని జన్యు పరమైన కారణాలు, గాలి కాలుష్యం, పరోక్షంగా ధూమపాన ప్రభావానికి లోనుకావడం, ఆస్బెస్టాస్ ఎక్స్పోజర్, రాడాన్ వాయువులు, డీజిల్ ఎగ్జాస్ట్ పొగ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడే వారిలో కూడా ఈ ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఊపిరితిత్తుల కేన్సర్‌ను సోకిన మహిళల్లో 20 శాతం మంది ఎప్పుడూ ధూమపానం చేయనివారే.ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2024: చరిత్రఊపిరితిత్తుల కేన్సర్ వ్యాప్తి మరియు ప్రభావం,ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం పాటిస్తారు. ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (FIRS), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (IASLC) మధ్య సహకారంతో 2012లో మొదటిసారిగా దీన్ని పాటించారు. గమనించారు. ఇక అప్పటినుంచి ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 1న జరుపు కుంటారు. లంగ్ కేన్సర్‌పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.కేన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం, సమయానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ కేన్సర్‌ను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న పరిశోధన ఆవిష్కరణల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచారాలు ,కార్యకలాపాలు నిర్వహిస్తారు.థీమ్: “క్లోజ్ ది కేర్ గ్యాప్: ప్రతి ఒక్కరూ కేన్సర్ నుంచి రక్షణ పొందేందుకు అర్హులు’’ అనే థీమ్‌తో 2024 వరల్డ్ లంగ్ కేన్సర్ డే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఊపిరితిత్తుల కేన్సర్ రకాలుఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా రెండు రకాలగా విభజించారు. నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల కేన్సర్ (NSCLC) , చిన్న-కణ ఊపిరితిత్తుల క్యాన్సర్ (SCLC). రెండో రకం కేన్సర్‌లో రెండింటి లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఎడతెరపి లేని దగ్గుఉన్నట్టుండి బరువు తగ్గడంగాలిపీల్చుకోవడంలో ఇబ్బంది, ఆయాసంఛాతీలో నొప్పిదగ్గుతున్నప్పుడు రక్తం పడటంఎముకల్లో నొప్పివేలిగోళ్లు బాగా వెడల్పుకావడంజ్వరం అలసట / నీరసంఆహారాన్ని మింగడంలో ఇబ్బందులుఆహారం రుచించకపోవడంగొంతు బొంగురుపోవడంచర్మం, కళ్లు పసుపు రంగులో మారడంనోట్ : వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపించినంత మాత్రాన కేన్సర్ సోకినట్టు కాదు. ఇలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. టీబీ సోకినా వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ణారణ చేసుకోవాలి. ఈ కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. -
అన్యురిజమ్స్ అంటే?
మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అకస్మాత్తుగా ప్రమాదకరంగా పరిణమించే ఈ సమస్య గురించి...మెదడులోని ఏప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి ఉంటే ఆప్రాంతం పేరుతో అన్యురిజాన్ని చెబుతారు. ఉదాహరణకు సెరిబ్రమ్ అనే ప్రదేశంలో ఉంటే సెరిబ్రల్ అన్యురిజమ్స్ అంటారు. మెదడు చుట్టూ ఉండే ప్రధాన ప్రాంతం సబార్కనాయిడ్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమైతే దాన్ని ‘సబార్కనాయిడ్ హ్యామరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రదేశాన్ని బట్టి మెదడు ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ అవయవం ప్రభావితమవుతుంది. అయితే ఇలా అన్యురిజమల్ బ్లీడ్కి గురైన ప్రతి ఏడుగురిలోనూ నలుగురు ఏదో ఒక రకమైన వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. కీలక ప్రాంతంలో రక్తస్రావం కాగానే మొదట అది పక్షవాతానికీ (స్ట్రోక్‌కు), తీవ్రతను బట్టి కోమాలోకి తీసుకెళ్లే అవకాశాలెక్కువ.బయట పడేందుకు అవకాశం తక్కువ... ఎందుకంటే? అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో అవి వారి జీవితకాలంలో అవి చిట్లక΄ోవచ్చు. ఉబ్బు చిన్నగా ఉన్నవి కాకుండా... ‘జెయింట్ అన్యురిజమ్స్’ అని పిలిచే పెద్దవి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలెక్కువ. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా వస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక వల్ల గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు: కంట్రోల్లో లేని అధిక రక్త΄ోటు, డయాబెటిస్ వంటి జబ్బులు. చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు (ఈ కారణంగా ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ) రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్తో కలిగే కాంప్లికేషన్లు ఆరోగ్యకరంగా లేని జీవనశైలి పొగాకు వాడకం, మద్యం అలవాటు యాక్సిడెంట్లో రక్తనాళాలకు గాయం కొన్ని అరుదైన కేసుల్లో : ఉదా. ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియాకిడ్నీల్లో నీటితిత్తులు వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్.చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు: జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం.చికిత్సలు: మందులిస్తూ చేసే చికిత్స: ఇది రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స. రక్త΄ోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొన్ని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె (క్రేనియమ్) తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిగాక ముందులాగే రక్తప్రసరణ జరిగేలా చూస్తారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్‌ను ప్రవేశపెట్టి... అందులో నుంచి మరింత చిన్నపైప్లను అన్యురిజమ్స్ వరకు చేరేలా చేసి, అక్కడ కాయిల్ అనే డివైజ్‌ని అన్యురిజమ్ నింపడానికి వాడతారు. దాంతో ఉబ్బిన బలహీన ప్రాంతానికి రక్తసరఫరా ఆగడంతో చిట్లడం జరగదు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియతో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. దాంతో పెద్ద రక్తనాళాల దగ్గర ఉన్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇక ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’తో రక్తపు దిశను మళ్లించి ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. (చదవండి: కేరళలో నిఫా వైరస్ కలకలం..!) -
ప్రాణాంతక చండీపురా వైరస్ : అసలేంటీ వైరస్, లక్షణాలు
వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తాజాగా గుజరాత్, రాజస్థాన్‌లలో ‘చండీపురా’ వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్కారణంగా చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుజరాత్ లోని ఆరావళి సబర్ కాంతా జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు చిన్నారులు మృతిచెందారు. చండీపురా వైరస్ ఎంత ప్రమాదకరమైనది? లక్షణాలేంటి? దీని బారినుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.చండీపురా వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లవాడు సకాలంలో చికిత్స పొందకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.చండీపురా వైరస్ లక్షణాలు సాధారణం ఫ్లూతో సమానంగా ఉంటాయి లక్షణాలు. దీంతో మామూలుగా జ్వరమే అనుకోవడంతో ప్రమాదం పెరుగుతోంది. చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. అధిక జ్వరం, జ్వరం వేగంగా పెరగడం. వాంతులు, విరేచనాలు , తలనొప్పి, ఒక్కోసారి తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.చండీపురా వైరస్ అంటే ఏమిటి?చండీపురా వ్యాధి అనేది ఫ్లూ నుండి మెదడు జ్వరం వరకు తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్. ఈ వైరస్ తొలి కేసులు 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనిపించింది. అందుకే దీనికి చండీపురా అని పేరు పెట్టారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన RNA వైరస్. ఇది కీటకాలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.ఏ వయస్సు పిల్లలకు ప్రమాదంచండీపురా వైరస్ ఎక్కువగా 9 నెలల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ పిల్లలపై దాడి చేసినప్పుడు, సోకిన పిల్లలకి హై ఫీవర్, జ్వరం, విరేచనాలు, వాంతులు, బ్రెయిన్ ఫీవర్ ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. కనుక అప్రమత్తత చాలా అవసరం. చండీపురా వైరస్‌ను ఎలా నివారించాలి?దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది కనుగ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆహారం విషయంలో జ్రాగ్రత్త వహించాలి. చండీపురా వైరస్‌ను నివారించడానికి, దోమలు, ఈగలు , కీటకాలను నివారించడం ముఖ్యం. పిల్లలకు రాత్రిపూట పూర్తిగా కప్పే దుస్తులు ధరించేలా జాగ్రత్తపడాలి. దోమ తెరలు వాడాలి. దోమల నివారణ మందు వాడండి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు , తలుపులు మూసి ఉంచాలి. -
ఊరికే అలసిపోతున్నారా? గుండె దడగా ఉంటోందా? కారణమిదేనేమో చెక్ చేసుకోండి!
ఐరన్ లోపం, రక్తహీనత లేదా అనీమియా. రక్తంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితినే రక్తహీనతగా గుర్తిస్తారు. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో భాగం. ఐరన్ లోపించినపుడు శరీరం తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయదు. దీంతో శరీర కణజాలాలకు ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపాలను ఎలా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.పోషకాహార లోపం, స్త్రీలు ఋతుస్రావం సమయంలో రక్తాన్ని కోల్పోవడం, గర్భధారణ సమయంలో స్త్రీలలో వచ్చే సమస్యలు, పెప్టిక్ అల్సర్, హయాటల్ హెర్నియా, పెద్దప్రేగు పాలిప్ లేదా కొలొరెక్టల్ కేన్సర్ తదితర వ్యాధుల కారణంగా తీవ్రమైన ఇనుము లోపం వస్తుంది. రక్త పరీక్ష ద్వారా అనీమియాను గుర్తించవచ్చు. తొందరగా అలిసిపోవడం, నీరసం, ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి.ఐరన్ లోపం లక్షణాలుగుండె వేగంగా కొట్టుకుంటుంది.రక్తహీనతతో వచ్చిన ఆక్సిజన్ కొరతను భర్తీ చేయడానికి గుండె మరింత రక్తాన్ని పంప్ చేయాలి. ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది. తలతిరగడంమట్టి, సున్నం లాంటివి తినాలనిపించడంతొందరగా చికాకు, మనిషి బలహీనంగా మారడం, ఏకాగ్రత లోపించడంచిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోవడం.నిద్ర సరిగ్గా పట్టకపోవడం, దురదలు రావడం.తీవ్ర ఆందోళనఐరన్ లోపంతో ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది ఆకలి మందగించడం, కాళ్లు, చేతులు చల్లగా అనిపించడంజుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, నోటిలో పుళ్లు, నాలుక మంటఐరన్ లభించే ఆహారంమాంసాహారం, బచ్చలికూర వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూరలువిటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలుదానిమ్మ,ఎండుద్రాక్ష , ఆప్రికాట్లు వంటి ఎండిన పండ్లు, బెల్లంఐరన్-ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, రొట్టెలు , పాస్తా, బటానీలురక్తహీనతను గుర్తించినపుడు సాధారణంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నపుడు వైద్యుల సలహా మేరకు ఇంజక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రక్తహీనకు గల కారణాలను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు , దాన్ని బట్టి చికిత్సలు అవసరం. చికిత్స కంటే ముందు రక్తహీనతకు గలకారణాలను గుర్తించడం ముఖ్యం. అంతర్గతంగా ఏదైనా ప్రమాదకరమైన వ్యాధి, అంతర్గతంగా రక్తస్రావం లాంటి కారణాలను విశ్లేషించుకోవాలి. -
‘పుష్ప’ విలన్‌కు అరుదైన వ్యాధి... లక్షణాలు, కారణాలు తెలుసా?
మలయాళ భాషల్లో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, తెలుగులో మాత్రం ‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మలయాళ బ్యూటీ, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త కూడా. అయితే తాను అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి? ఒకసారి చూద్దాం. ఏడీహెచ్‌డీ: ఆవేశం సినిమాతో సహా, వరుస హిట్లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇదొక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత లేకపోవడం, అతిగా స్పందించడం, ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్డీలో కనిపిస్తాయి. దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది. కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.లక్షణాలు ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే ఒకమాదిరి లక్షణాలుండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాల ఆధారంగా మానసిక వైద్య నిపుణులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్‌నెస్) టైమ్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు ఏకాగ్రత లోపించడం, పనిపై దృష్టి పెట్టలేరు, లేదా ప్రాధాన్యత ఇవ్వలేరు.మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం. మూడ్ స్వింగ్స్ క్యూలో వేచి ఉండటం లేదా ట్రాఫిక్‌లో ఉన్నా ఉద్రేకపడతారు.అతిగా ఆవేశం ఒత్తిడిని తీసుకోలేకపోవడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి.ముఖ్యంగా ఏడీహెచ్‌డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ తీవ్రంగా ఉంటాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్‌డీ వల్ల రోగుల్లో యాంక్సైటీ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్‌డీ రోగుల్లో కనిపించొచ్చు.ఏడీహెచ్‌డీ కారణాలుస్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు కారణాలు, నాడీ సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలు ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తాయంటారు పరిశోధకులు. ముఖ్యంగా చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ , గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు పెరగొచ్చు. ఏడీహెచ్‌డీతో బాధపడే వారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలతోపాటు ,మానసిక థెరపీలను తీసుకోవాల్సి ఉంటుంది. -
సోరియాసిస్ 'అంటు వ్యాధా'? ముద్దు పెట్టుకుంటే..?
చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ ( Psoriasis) దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు కనిపిస్తాయి. సొరియాసిస్‌లో ప్రధానంగా తెల్లటి పొలుసులు , లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు వస్తాయి. మంట, విపరీతైన దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ప్రధానంగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. చేతులు లేదా కాళ్ళపై సోరియాసిస్ రోజువారీ కార్యకలాపాలు కష్టంగా ఉంటుంది. అలాగే గజ్జ లేదా పిరుదుల వంటి ప్రాంతాలలో సోరియాసిస్ వస్తే కూర్చోవడం లేదా టాయిలెట్‌కు వెళ్లడం కూడా బాధాకరంగా ఉంటుంది.సోరియాసిస్ భౌతిక అంశాలను పక్కన పెడితే దీనిపై అనేక అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం సోరియాసిస్ సోకినవారి దూరంపెట్టడం, అది అంటు వ్యాధి ఏమో అని భయపడటం లాంటివి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సోరియాసిస్ చుట్టూ ఉన్న అపోహలను, వాస్తవాలను తెలుసుకుందాంసోరియాసిస్ అంటువ్యాధి: కాదు ఇది అంటువ్యాధి కాదు. ప్రాణాంతకం అంతకన్నా కాదు. కానీ దీర్ఘకాలం వేధిస్తుంది. వ్యక్తి-నుండి-వ్యక్తికివ్యాపించదు. పరిచయం లేదా శారీరక స్రావాల ద్వారా వ్యాపించదు. ఉదాహరణకు, ముద్దు పెట్టుకున్నా, ఆహారం లేదా పానీయాలను పంచుకున్నా, ఈత కొలనులు లేదా ఆవిరి స్నానాలలో లాంటి సన్నిహిత బహిరంగ ప్రదేశాలలో ఇది ఇతరులకు సోకదు. సోరియాసిస్ కేవలం పొడి చర్మంవారికే వస్తుంది. కానే కాదు. చర్మ నిర్మాణం చాలా వేగంగా మారుతుంది - సాధారణ స్కిన్ టర్నోవర్ ప్రతి 28 రోజులు అయితే, సోరియాసిస్‌లో 4-5 రోజులలోపే ఉంటుంది. రక్తనాళాలు కూడా మారుతాయి అందుకే గోకిన ప్రాంతాలు ఎర్రగా మారతాయి. మరింత తీవ్రమైన సందర్భాల్లో, సోరియాసిస్ చర్మం పగుళ్లు ,రక్తస్రావం అవుతుంది.సోరియాసిస్‌లో చాలా రకాలుసోరియాసిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉంటాయని భావిస్తారు. కానీ గట్టెట్ సోరియాసిస్, ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్, పస్ట్యులర్ సోరియాసిస్, ప్లాంటార్ సొరియాసిస్, ఇన్వర్స్ సొరియాసిస్, ఫేస్ సొరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ లాంటి పలు రకాలు ఉన్నాయి. లక్షణాలు బట్టి ఏ రకం సోరియాస్ అనేది నిర్ధారిస్తారు.పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల సోరియాసిస్ వస్తుంది అనేది పూర్తి అపోహ మాత్రమే. అయితే సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు స్వీయ-సంరక్షణ గురించి జాగ్రత్తపడాలి. నిరంతరం సంరక్షణ అవసరం.సోరియాసిస్‌ను నయం చేయవచ్చుఇది మరొక అపోహ. ప్రస్తుతానికి సోరియాసిస్‌కు నివారణ సాధ్యం కాదు కానీ నిర్వహణ, ఉపశమన చికిత్స ఉంది. వ్యక్తి ఎంత తీవ్రంగా ప్రభావితమయ్యాడనే దానిపై ఆధారపడి, సోరియాసిస్ లక్షణాల నుండి ఉపశమన మార్గాలున్నాయి.సోరియాసిస్ చర్మాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందా? కానేకాదు ఒక్కోసారి చర్మం కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో 6–42శాతం సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు దారి తీయవచ్చు.చికిత్స లేనప్పటికీ, చికిత్స ఎంపికలు లేవు అనేది మరో అపోహ. సోరియాసిస్ అనేది జీవితకాలం పాటు ఉండే దీర్ఘకాలిక పరిస్థితి. క్రీములు, లేపనాలు , జెల్స్, సమయోచిత (చర్మానికి వర్తించే), లైట్ థెరపీ లాంటి చికిత్సల ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది వైద్యునిమార్గదర్శకత్వంలో తీసుకోవాలి. దీనిపై శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో నివారణ చికిత్స మార్గాలు వెలుగులోకి వస్తాయిని ఆశిద్దాం. ఏం చేయాలి?సోరియాసిస్ ఎగ్జిమా లాంటిదే అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎక్కువగా యుక్తవసులో ప్రారంభమై జీవిత కాలం ఉంటుంది. పిల్లలు, శిశువుల్లో ఇది చాలా అరుదు. అలాగే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల సోరియాసిస్‌ను నయం చేయవచ్చని కొంతమంది నిపుణులు చెబుతారు.ఊబకాయం, ఆల్కహాల్, ధూమపానం వంటి కారకాలు సోరియాసిస్ లక్షణాల తీవ్రతను పెంచుతాయి. అందుకే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం, బరువు నియంత్రణలో ఉండేలా చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం విధిగా పాటించాలి. -
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
పతీ ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబీపీ లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం.వరల్డ్ హైపర్‌టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్‌లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.హైపర్ టెన్షన్ లక్షణాలుసాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు , మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడంతల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందివికారం, వాంతులు అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులుఆందోళన, గందరగోళంచెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం హైపర్ టెన్షన్ చికిత్స ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం శారీరకంగా చురుగా ఉండటంధూమపానం, మద్యపానాన్ని మానేయడంబరువు ఎక్కువగా ఉంటే తగ్గడంజాగ్రత్తలుకూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడంగంటల తరబడి కూర్చోకుండా ఉండటంనడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలువారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి. నోట్ : ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుంది. -
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తన సోషల్ మీడియాలో వెల్లడిరచింది. చాలా బాధాకరమైన ఎండోమెట్రియోసిస్నునిర్లక్ష్యం చేయకండి. దయచేసి గూగుల్‌లో ఎండోమెట్రియోసిస్ కోసం సెర్చ్ చేయండి. లక్షణాల గురించి తెలుసుకోండి అంటూ మహిళలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో, అది కలిగించే నొప్పి కారణంగా ఇది వైకల్యంలో భాగంగా ప్రకటించారట. ఈ నేపథ్యంలో అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతక వ్యాధా? ఇది మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీని గర్భధారణ సమస్యలొస్తాయా? తెలుసుకుందాం.ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?మహిళల గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. సాధారణంగా ఈ కణజాలం నెలసరి సమయంలో బయటకు వెళ్లిపోతుంది. కానీ, ఇలా వెళ్లకుండా కటి భాగంలో, అండాశయంలో, ఫాలోపియన్ నాళాల్లోకి చేరి, అక్కడ పెరిగిపోతే దాన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఎండోమెట్రియం కణాలు గర్భాశయం లైనింగ్ వెలుపల పెరుగుతాయి. ఫలితంగా గర్భాశయం, అండాశయాలు (పెరిటోనియం), ప్రేగు, మూత్రాశయం చుట్టూ ఉన్న కణజాలంలో గాయాలు ఏర్పడతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, వ్యంధత్వం(ఇన్ఫర్టిలిటీ) వంటి లక్షణాలు ఏర్పడతాయి.ఎండోమెట్రియోసిస్ వ్యాధికి కారణం తెలియదు. కానీ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు తేలికపాటి లక్షణాలుంటే, మరికొందరిలో విపరీతమైన నొప్పి, అధిక రక్త స్రావం ఉంటాయి. చాలామందిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించవు.ఎండోమెట్రియోసిస్ లక్షణాలుపెల్విక్ విపరీతమైన నొప్పిపీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పిఅధిక ఋతు రక్తస్రావం లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావంప్రేగు కదలిక నొప్పిమూత్రవిసర్జన సమయంలో నొప్పిసంతానలేమిసంతానోత్పత్తిపై ప్రభావంసాధారణంగా ఎండోమెట్రియోసిస్ తీవ్రతను బట్టి గర్భధారణ సమస్యఉండకపోవచ్చు. అయితే, ఎండోమెట్రియోసిస్ కలిగిన మహిళలకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే ముప్పు ఉంది. వీటిపై అవగాహన కలిగి ఉండాలి. గర్భం పోవడం, లేదా నెలలు నిండకముందే ప్రసవించే ముప్పు ఉంటుంది. నిపుణులైన గైనకాలజిస్ట్ పర్యవేక్షణ అవసరం.హార్మోన్ థెరపీహార్మోన్లతో చికిత్స చేయడం ఒక మార్గం. బర్త్ కంట్రోల్ పిల్స్ లేదా గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్లు ఎండోమెట్రియోసిస్ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. మరికొందరిలో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుంది. ఆపరేషన్ ద్వారా ఎండోమెట్రియోసిస్ కణాలను సమూలంగా తొలగిస్తారు. ఎండోమెట్రియోసిస్ స్టేజ్‌ని నిర్ధారించుకుని తగిన చికిత్స చేసుకోవాలి.ఎండోమెట్రియోసిస్‌కు చికిత్స ఏమిటి?హార్మోన్ థెరపీ సప్లిమెంటరీ హార్మోన్లను తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు .ఎండోమెట్రియోసిస్ పురోగతిని ఆపవచ్చు. ఎండోమెట్రియోసిస్ ప్రాణాంతకం కాదు. చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒక్కోసారి కొన్ని కేన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.నోట్ : లక్షణాలను గమనించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒత్తిడిని మరింత పెంచుతుంది. వైద్యుల పర్యవేక్షణలో రోగనిర్ధారణ, సరైన సమయం చికిత్స చాలా ముఖ్యం. -
కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్.. ఎంత ప్రమాదకరమంటే?
కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ విస్తరిస్తోంది. దోమలు కుట్టడం ద్వారా ఈ జ్వరం సోకుతుంది. రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఈ కేసులు నమోదైన నేపధ్యంలో అన్ని జిల్లాల్లో ప్రీ మాన్సూన్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ జ్వరం లక్షణాలు, ఇది సోకకుండా ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.కోజికోడ్‌లో ఇప్పటివరకు ఐదు వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు మీడియాకు తెలిపారు. మలప్పురం, త్రిస్సూర్‌లో కూడా ఈ వ్యాధి బారినపడినవారున్నారని, ఈ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపించవని వారు తెలిపారు. అందుకే వ్యాధి సోకిన వారి సంఖ్యను అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేకపోతున్నారని సమాచారం.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ జ్వరం సోకిన ఐదుగురిలో నలుగురు కోలుకున్నారు. ఒకరు ఇప్పటికీ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వెస్ట్ నైల్ జ్వరం లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. 80 శాతం కేసుల్లో లక్షణాలు కనిపించవు.వెస్ట్ నైల్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ దోమల వృద్ధిని అరికట్టడం, నీటి వనరులను శుభ్రపరచడంపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 2011 నుంచి ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని, ఈ ఫీవర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే డ్యెంగ్యూ లక్షణాలు కనిపించినవారు వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.వెస్ట్ నైల్ ఫీవర్ దోమ కాటు ద్వారా మనుషులకు సోకుతుంది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి లక్షణాలు కనిపించవు. అయితే వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన అనంతరం తగిన చిక్సిత్స అందకపోతే బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. కేరళలో ఈ వ్యాధి సోకి 2019లో ఒకరు, 2022లో ఒకరు మృతి చెందనట్లు నివేదికలు చెబుతున్నాయి. -
మద్యానికి బానిసైతే...ఇంత భయంకరమా? వైరల్ వీడియో!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసు, మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసు. అయినా మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకుపెరుగుతూనే ఉంది. అసలు మద్యం లేదా అల్కహాల్ సేవించడం ఎంత ప్రమాదమో తెలుసా?ఒక్కసారి మద్యానికి బానిపైపోతే మనిషి చివరికి ఎలాంటి దుస్థితికి దిగజారి పోతాడో తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు ఆల్కహాల్‌కు బానిసై, అకస్మాత్తుగా అకస్మాత్తుగా మద్యపానాన్ని ఆపివేసినా లేదా బాగా తగ్గించేసినా మానసిక, శారీరక సమస్యలు రెండూ వస్తాయి. ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. తక్షణ వైద్య సహాయం తీసుకోకపోతే ప్రాణాపాయం కావచ్చు. మద్యం తాగిన తరువాత నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ మనతోపాటు పాటు నరాలు కూడా అలవాటు పడతాయన్న మాట. చివరికి అదొక ఎడిక్షన్‌లా మారిపోతోంది. అంటే అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. ఈ స్థాయి మరింత ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం) లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి ఇది ప్రాణాపాయం కావచ్చు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి జరుగుతోంది అదే. మద్యానికి అలవాడు పడిన నరాలు స్థిమితంగా ఉండలేకపోయాయి. దీంతో కాస్త మద్యం పుచ్చుకోగానే కుదుటపడ్డాయి. అంతిమంగా ఇది మరణానికి దారితీస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాలు: అధిక రక్త పోటు, నిద్రలేమి, శరీర భాగాలు బాగా వణికిపోవడం (హైపర్ రెఫ్లెక్సియా) ఆందోళన, కడుపు నొప్పి, తలనొప్పి, గుండె దడ లాంటివి. ఓకే అండీ, మనం మందు తాగమే అనుకోండి, ముందు నరాలు ఎక్సైట్ అవుతాయన్నమాట, తర్వాత తర్వాత అలవాటు పడతాయన్నమాట, చివరికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట ఇలాగే. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. బాగా ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం), ఇంకా ప్రాణాపాయం కావచ్చు. pic.twitter.com/wmqiDsTr6U — Srikanth Miryala (@miryalasrikanth) April 12, 2024 మద్యానికి బానిసైతే ♦ ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ♦ అతిము ఖ్యమైన అవయం కాలేయం దెబ్బతింటుంది. ఇది ముదిరితే కాలేయ కేన్సర్‌కు దారి తీస్తుంది. ♦ఏకాగ్రతను కోల్పోవడం, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు భావోద్వేగాలను నియంత్రించ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ♦ ఎంజైమ్‌లు అండ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. నోట్: మద్యం ఆరోగ్యానికి అనర్థం. ఇందులో రెండో మాటకు తావేలేదు. ఆరోగ్య జీవనం కోసం ఆ వ్యసనాన్ని మెల్లిగా వదిలించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. అవసరమైన నిపుణుల సలహాలు తీసుకొని మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం.