రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు | Seasonal Diseases in Children: Causes and Symptoms | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు

Published Sun, Aug 25 2024 8:15 AM | Last Updated on Sun, Aug 25 2024 8:15 AM

Seasonal Diseases in Children: Causes and Symptoms

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చబా గ్రామానికి చెందిన గిరిజన బాలిక బిడ్డిక రషి్మత(8) మలేరి­యాతో గత నెల 6వతేదీన మృత్యువాత పడింది. జూన్‌ 22న సరుబుజ్జిలి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరిన ఈ చిన్నారి నాలుగు రోజుల అనంతరం జ్వరం బారిన పడింది. పీహెచ్‌సీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రషి్మతతో పాటు మరికొందరు బాలికలు కూడా మలేరియా బారినపడ్డారు. గత నెలలో  సీతంపేట ఏరియా ఆస్పత్రికి రెండు రోజుల వ్యవధిలో 30 మంది పిల్లలు జ్వరాలతో రాగా 15 మందికి మలేరియా నిర్ధారణ అయింది.  పాడేరు మండలం దేవాపురంలో కె.రత్నామణి(37) గత నెల పాడేరు ప్రభుత్వాస్పత్రిలో మలేరియాకు చికిత్స పొందుతూ మృతి చెందింది.  

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యం అధ్వానంగా మారడంతోపాటు అంటురోగాలు, విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. ప్రజారోగ్య విభాగం పడకేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్‌ చేయకపోవడంతో జూన్, జూలైలో డయేరియా ప్రబలగా, ఇప్పుడు డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉత్తరాంధ్ర, గిరి­జన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టినవారే కనిపిస్తున్నారు. అనారోగ్య పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మలేరియా, డెంగీ, డయే­రియా, విష జ్వరాలు, ఇతర సీజనల్‌ వ్యాధులను నియంత్రించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇక జ్వరాల బాధితుల్లో వింత లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ నెగిటివ్‌ అని వచి్చనప్పటికీ కొంతమందిలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. యం­త్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు ఫీవర్‌ సర్వేలు నిర్వహించి కొత్త రకం వైరల్‌ జ్వరాలు, వైరస్‌ల వ్యాప్తిౖò³ ప్రజలను జాగృతం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.  

మృత్యు ఘంటిక మోగిస్తున్న డెంగీ 
ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా మలేరియా కేసులు, 2 వేలకుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. గత సోమవారం విశాఖ కేజీహెచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక డెంగీతో మరణించింది. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ డెంగీకి చికిత్స పొందుతూ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృత్యువాత పడింది. గత వారం బాపట్ల జిల్లా ముత్తాయపాలెంలో డెంగీ లక్షణాలతో  ఓ అంగన్‌వాడీ కార్యకర్త చనిపోగా చిత్తూరు జిల్లా మేలుపట్ల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి బాలిక ఈ నెలలోనే కన్ను మూసింది. ఇక రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో అధిక శాతం ఏఎస్‌ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. గత నెల 15వతేదీ నుంచి 28 మధ్య రెండు వారాల్లో ఏఎస్‌ఆర్‌ జిల్లాలో అత్యధికంగా 260, పార్వతీపురం మన్యంలో 178 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరల్‌ ఓపీల్లో మూడో వంతు జ్వర బాధితులే ఉన్నారు. పాడేరు ప్రభుత్వాస్పత్రి కిక్కిరిసిపోతోంది. రోజుకు 400 వరకూ ఓపీలు నమోదవుతుండగా మలేరియా, డెంగీ, విష జ్వరాల కేసులు అధికంగా ఉంటున్నాయి.
  
కొత్త రకం వైరస్‌ వ్యాప్తి 
వైరల్‌ జ్వరాల్లో కొత్త లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల శరీర ఉష్ణోగ్రత 103, 104 వరకూ వెళుతోంది. వికారం, కీళ్లు, ఒంటి నొప్పులు, నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కాళ్లు, చేతులు వాపులు, ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, కళ్ల మంట లాంటి లక్షణాలు వారం నుంచి 10 రోజులు ఉంటున్నాయి. ప్లేట్‌లెట్స్‌ 30 వేల వరకూ పడిపోతున్నాయి. బాధితులు తీవ్ర నొప్పులతో మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డెంగీ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతోంది. దీంతో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  

డయేరియా విలయతాండవం 
గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్‌ చేయడం లేదు. దీంతో జూన్, జూలైలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 56 చోట్ల డయేరియా ప్రబలింది. ఈ ఏడాది జూన్‌లో జగ్గయ్యపేట నుంచి డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. అదే నెలలో తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి కన్నుమూయగా గత నెలలో కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో నాలుగేళ్ల చిన్నారిని మత్యువు కబళించింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఏకంగా 250 మందికి డయేరియా సోకగా ఏడుగురు మృతి చెందారు. మంత్రి నారాయణ సమీక్షలు నిర్వహించినా పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం మార్పు రాలేదు.  ‘దోమలు ఎక్కు­వగా ఉన్న ప్రాంతాలను డ్రోన్‌ల ద్వారా గుర్తించి డ్రోన్ల ద్వారానే మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను తెస్తాం. సీజనల్‌ వ్యాధులను సున్నాకు కట్టడి చేస్తాం..’ అని వైద్య శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం డ్రోన్‌లను ఎగరేసి దోమలను చంపే లోపే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  

ఫీవర్‌ సర్వే ఊసే లేదు 
సీజనల్‌ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. ఇందుకోసం సీజనల్‌ వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీవర్‌ సర్వే నిర్వహించేది. ఆశా, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇతర లక్షణాలున్న వారిని గుర్తించేవారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్‌సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును గమనించి ప్రజలకు జాగ్రత్తలు సూచించేవారు. ఫీవర్‌ సర్వేలో అవసరం మేరకు కిట్‌ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. అవసరం మేరకు ఆస్పత్రులకు రెఫర్‌ చేసి వైద్యం అందేలా సమన్వయం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలను గాలికి వదిలేసింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే ఇప్పటి వరకూ నిర్వహించనే లేదు. దీంతో మలేరియా, డెంగీ బారిన పడ్డ బాధితులు ఆస్పత్రులకు వెళ్లడంలో జాప్యం కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. సీజనల్‌ వ్యాధుల కట్టడిలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, రక్షిత నీటి సరఫరా, ముందస్తు జాగ్రత్తలు చాలా కీలకం. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి మురికి కూపాలు దోమలకు ఆవాసాలుగా మారాయి.  

శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాత­పట్నంలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగు­తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 63,932 మంది జ్వర పీడితులున్నట్లు ప్రకటించారు. డెంగీ కేసులు 25 నమోదు కాగా, మలేరియా 30, టైఫాయిడ్‌ 196, డయేరియా 3,113 కేసులున్నాయి. 

⇒విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు 491 నమోద­య్యాయి. జిల్లాలో 2.45 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు.

⇒విశాఖ జిల్లాలో 329 డెంగీ కేసులు, 114 మలేరియా కేసులు నమోదు అయినట్టు జిల్లా మలేరియా అధికారి తులసి తెలిపారు. 
⇒పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెలలో 24 డెంగీ కేసులు, 345 మలేరియా, 911 వైరల్‌ ఫీవర్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 
èఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జ్వరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
èఅనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 20,100 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 52 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి.

⇒విజయవాడ ప్రభుత్వాస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్‌­సీలు, యూపీహెచ్‌సీలు జ్వర బాధితులతో కిటకిటలాడు­తున్నాయి. ప్రతి పది మంది అనారోగ్య పీడితుల్లో ఐదుగురు విష జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు డెంగీ బాధితులు ఉంటున్నారు. డెంగ్యూ ఎన్‌ఎస్‌ 1 పాజిటివ్‌ కేసులు విజయవాడలో ఎక్కువగా నమోదవుతున్నాయి. 

⇒ప్రకాశం జిల్లాలో డెంగీ కేసులు 56 నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీన కంభం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలుడు డెంగీతో 
మృతి చెందాడు. టైఫాయిడ్‌ కేసులు సుమారు 800, విషజ్వరాలు 1,100 నమోదయ్యాయి.
⇒ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైరల్‌ జ్వరాలు చెలరేగుతున్నాయి. గత రెండు నెలలుగా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో 150 మంది వైరల్‌ జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 17 డెంగీ కేసులు నమోదయ్యాయి.  భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు.

⇒డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో 60 మంది విష జ్వరాలతో బాధపడుతు­న్నారు. ఆరుగురు డెంగీ బారినపడ్డారు. కొత్తపేట మండలం వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో ఈ నెలలో సుమారు 800 జ్వరాలు కేసులు రాగా 100 టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఐదు వరకు డెంగీ కేసులు నమోద­య్యాయి. ఈ నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో సుమారు 32 డెంగీ కేసులు నమోదయ్యాయి.

èశ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, ధర్మవరం, కదిరి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడు­తున్నాయి. మడకశి­రలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. ధర్మవరంలో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. 
⇒వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకు డెంగీ కేసులు 244,  మలేరియా కేసులు 11 నమోదయ్యాయి. 
⇒కర్నూలు జిల్లాలో డెంగీ కేసులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో 
63 నమోదయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు మున్సి­పాల్టీ, గూడురు నగర పంచాయతీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. 
నంద్యాల జిల్లాలో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 77 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత జూన్‌ 21న జూపాడు బంగ్లా మండలం చాబోలులో 
అతిసార ప్రబలి 20 మంది ఆసుపత్రి పాలు కాగా నడిపి నాగన్న మృతి చెందాడు.

⇒అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు 132 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఈ నెలలో 45 డెంగీ, 30 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాయచోటిలోని వంద పడకల ఆస్పత్రిలో 69 డెంగీతోపాటు 104 మలేరియా కేసులు నమోదయ్యాయి. 

⇒అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్, రూరల్, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు వందకు పైగా నమోదైనట్లు సమాచారం.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంటి ఆవరణ, పరిసరాల్లో పనికిరాని వస్తువులు,
టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. 
ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 
నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రపరచి వాటిపై మూతలు ఉంచాలి. 
ఆర్‌వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి.  
తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.  
దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వాడాలి. గర్భిణులు, 
చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి.  


సీజనల్‌ వ్యాధులు.. లక్షణాలు వ్యాధి    లక్షణాలు

మలేరియా:    చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం  
డయేరియా:    విరేచనాలు, కడుపు నొప్పి, వికారం
టైఫాయిడ్‌:    జ్వరం, నీరసం, కడుపులో నొప్పి
కలరా:    నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం
డెంగ్యూ:    హఠాత్తుగా జ్వరం, భరించలేని తల, కండరాలు, కీళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలు
కామెర్లు:    జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం       
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement