malaria cases
-
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చబా గ్రామానికి చెందిన గిరిజన బాలిక బిడ్డిక రషి్మత(8) మలేరియాతో గత నెల 6వతేదీన మృత్యువాత పడింది. జూన్ 22న సరుబుజ్జిలి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరిన ఈ చిన్నారి నాలుగు రోజుల అనంతరం జ్వరం బారిన పడింది. పీహెచ్సీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రషి్మతతో పాటు మరికొందరు బాలికలు కూడా మలేరియా బారినపడ్డారు. గత నెలలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి రెండు రోజుల వ్యవధిలో 30 మంది పిల్లలు జ్వరాలతో రాగా 15 మందికి మలేరియా నిర్ధారణ అయింది. పాడేరు మండలం దేవాపురంలో కె.రత్నామణి(37) గత నెల పాడేరు ప్రభుత్వాస్పత్రిలో మలేరియాకు చికిత్స పొందుతూ మృతి చెందింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యం అధ్వానంగా మారడంతోపాటు అంటురోగాలు, విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. ప్రజారోగ్య విభాగం పడకేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయకపోవడంతో జూన్, జూలైలో డయేరియా ప్రబలగా, ఇప్పుడు డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉత్తరాంధ్ర, గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టినవారే కనిపిస్తున్నారు. అనారోగ్య పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మలేరియా, డెంగీ, డయేరియా, విష జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇక జ్వరాల బాధితుల్లో వింత లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ నెగిటివ్ అని వచి్చనప్పటికీ కొంతమందిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించి కొత్త రకం వైరల్ జ్వరాలు, వైరస్ల వ్యాప్తిౖò³ ప్రజలను జాగృతం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మృత్యు ఘంటిక మోగిస్తున్న డెంగీ ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా మలేరియా కేసులు, 2 వేలకుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. గత సోమవారం విశాఖ కేజీహెచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక డెంగీతో మరణించింది. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ డెంగీకి చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువాత పడింది. గత వారం బాపట్ల జిల్లా ముత్తాయపాలెంలో డెంగీ లక్షణాలతో ఓ అంగన్వాడీ కార్యకర్త చనిపోగా చిత్తూరు జిల్లా మేలుపట్ల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి బాలిక ఈ నెలలోనే కన్ను మూసింది. ఇక రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో అధిక శాతం ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. గత నెల 15వతేదీ నుంచి 28 మధ్య రెండు వారాల్లో ఏఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 260, పార్వతీపురం మన్యంలో 178 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరల్ ఓపీల్లో మూడో వంతు జ్వర బాధితులే ఉన్నారు. పాడేరు ప్రభుత్వాస్పత్రి కిక్కిరిసిపోతోంది. రోజుకు 400 వరకూ ఓపీలు నమోదవుతుండగా మలేరియా, డెంగీ, విష జ్వరాల కేసులు అధికంగా ఉంటున్నాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి వైరల్ జ్వరాల్లో కొత్త లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల శరీర ఉష్ణోగ్రత 103, 104 వరకూ వెళుతోంది. వికారం, కీళ్లు, ఒంటి నొప్పులు, నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కాళ్లు, చేతులు వాపులు, ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, కళ్ల మంట లాంటి లక్షణాలు వారం నుంచి 10 రోజులు ఉంటున్నాయి. ప్లేట్లెట్స్ 30 వేల వరకూ పడిపోతున్నాయి. బాధితులు తీవ్ర నొప్పులతో మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డెంగీ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతోంది. దీంతో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డయేరియా విలయతాండవం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయడం లేదు. దీంతో జూన్, జూలైలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 56 చోట్ల డయేరియా ప్రబలింది. ఈ ఏడాది జూన్‌లో జగ్గయ్యపేట నుంచి డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. అదే నెలలో తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి కన్నుమూయగా గత నెలలో కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో నాలుగేళ్ల చిన్నారిని మత్యువు కబళించింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఏకంగా 250 మందికి డయేరియా సోకగా ఏడుగురు మృతి చెందారు. మంత్రి నారాయణ సమీక్షలు నిర్వహించినా పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం మార్పు రాలేదు. ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి డ్రోన్ల ద్వారానే మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను తెస్తాం. సీజనల్ వ్యాధులను సున్నాకు కట్టడి చేస్తాం..’ అని వైద్య శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం డ్రోన్లను ఎగరేసి దోమలను చంపే లోపే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఫీవర్ సర్వే ఊసే లేదు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. ఇందుకోసం సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించేది. ఆశా, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇతర లక్షణాలున్న వారిని గుర్తించేవారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును గమనించి ప్రజలకు జాగ్రత్తలు సూచించేవారు. ఫీవర్ సర్వేలో అవసరం మేరకు కిట్ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. అవసరం మేరకు ఆస్పత్రులకు రెఫర్ చేసి వైద్యం అందేలా సమన్వయం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలను గాలికి వదిలేసింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే ఇప్పటి వరకూ నిర్వహించనే లేదు. దీంతో మలేరియా, డెంగీ బారిన పడ్డ బాధితులు ఆస్పత్రులకు వెళ్లడంలో జాప్యం కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, రక్షిత నీటి సరఫరా, ముందస్తు జాగ్రత్తలు చాలా కీలకం. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి మురికి కూపాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ⇒శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నంలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 63,932 మంది జ్వర పీడితులున్నట్లు ప్రకటించారు. డెంగీ కేసులు 25 నమోదు కాగా, మలేరియా 30, టైఫాయిడ్ 196, డయేరియా 3,113 కేసులున్నాయి. ⇒విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు 491 నమోదయ్యాయి. జిల్లాలో 2.45 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు.⇒విశాఖ జిల్లాలో 329 డెంగీ కేసులు, 114 మలేరియా కేసులు నమోదు అయినట్టు జిల్లా మలేరియా అధికారి తులసి తెలిపారు. ⇒పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెలలో 24 డెంగీ కేసులు, 345 మలేరియా, 911 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. èఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జ్వరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.èఅనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 20,100 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 52 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి.⇒విజయవాడ ప్రభుత్వాస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి పది మంది అనారోగ్య పీడితుల్లో ఐదుగురు విష జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు డెంగీ బాధితులు ఉంటున్నారు. డెంగ్యూ ఎన్ఎస్ 1 పాజిటివ్ కేసులు విజయవాడలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ⇒ప్రకాశం జిల్లాలో డెంగీ కేసులు 56 నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీన కంభం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. టైఫాయిడ్ కేసులు సుమారు 800, విషజ్వరాలు 1,100 నమోదయ్యాయి.⇒ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైరల్ జ్వరాలు చెలరేగుతున్నాయి. గత రెండు నెలలుగా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో 150 మంది వైరల్ జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు.⇒డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో 60 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఆరుగురు డెంగీ బారినపడ్డారు. కొత్తపేట మండలం వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో ఈ నెలలో సుమారు 800 జ్వరాలు కేసులు రాగా 100 టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఐదు వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో సుమారు 32 డెంగీ కేసులు నమోదయ్యాయి.èశ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, ధర్మవరం, కదిరి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మడకశిరలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. ధర్మవరంలో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ⇒వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకు డెంగీ కేసులు 244, మలేరియా కేసులు 11 నమోదయ్యాయి. ⇒కర్నూలు జిల్లాలో డెంగీ కేసులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో 63 నమోదయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాల్టీ, గూడురు నగర పంచాయతీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నంద్యాల జిల్లాలో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 77 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత జూన్ 21న జూపాడు బంగ్లా మండలం చాబోలులో అతిసార ప్రబలి 20 మంది ఆసుపత్రి పాలు కాగా నడిపి నాగన్న మృతి చెందాడు.⇒అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు 132 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఈ నెలలో 45 డెంగీ, 30 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. రాయచోటిలోని వంద పడకల ఆస్పత్రిలో 69 డెంగీతోపాటు 104 మలేరియా కేసులు నమోదయ్యాయి. ⇒అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్, రూరల్, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు వందకు పైగా నమోదైనట్లు సమాచారం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇంటి ఆవరణ, పరిసరాల్లో పనికిరాని వస్తువులు,టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రపరచి వాటిపై మూతలు ఉంచాలి. ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి. తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వాడాలి. గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. సీజనల్ వ్యాధులు.. లక్షణాలు వ్యాధి లక్షణాలుమలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం డయేరియా: విరేచనాలు, కడుపు నొప్పి, వికారంటైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపులో నొప్పికలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడండెంగ్యూ: హఠాత్తుగా జ్వరం, భరించలేని తల, కండరాలు, కీళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలుకామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం -
జ్వరం.. వణుకుతున్న జనం!
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఒడిశా కాలనీకి చెందిన బోయ అజయ్, బోయ మరియమ్మల కుమార్తె అక్షర (3) విషజ్వరంతో ఆదివారం మృతి చెందింది. చిన్నారికి తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఏటూరునాగారంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సరిగా వైద్యం అందక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన గోస్కుల శ్రీజ (4) అనే చిన్నారి డెంగీ లక్షణాలతో మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు తొలుత సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలిసింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొత్మీర్ గ్రామానికి చెందిన యువకుడు మిట్టె నాగరాజు (24) ఆదివారం రాత్రి విష జ్వరానికి బలయ్యాడు. అప్పటికే నాలుగైదు రోజులుగా జ్వరంతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందినా పరిస్థితి మెరుగుకాలేదు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభించి జనం అల్లాడుతున్నారు. ప్రస్తుత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 5,315 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య సంగతేమోగానీ పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కరిద్దరు జ్వరంతో మంచాన పట్టి కనిపిస్తున్నారు. గత ఇరవై రోజులుగా విష జ్వరాల తీవ్రత మరింతగా పెరిగింది. డెంగీ, మలేరియాలతో గత ఐదారు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్‌లో నలుగురు మృత్యువాత పడటం ఆందోళనకరం. గోదావరి పరీవాహక ఏజెన్సీ ప్రాంతాల్లో.. ముఖ్యంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ పల్లెల్లో జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే ప్రాణం పోయింది చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ కళ్లముందు తిరిగిన నాబిడ్డ గంటల వ్యవధిలోనే దూరమైపోయింది. గత నెల 28న ఆమెకు జ్వరం వస్తే.. స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాం. పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చి, సిరప్ రాసిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి సిరప్ తాగిస్తే తెల్లవారే సరికి జ్వరం తగ్గింది. రెండు రోజులు బాగానే ఉంది. కానీ 30న మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటూ వాంతులు చేసుకుంది. వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. రూ.10వేలు అడ్వాన్సుగా తీసుకుని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కానీ పరిస్థితి సీరియస్‌గా ఉందని, తమ వల్ల కాదంటూ 65 కిలోమీటర్ల దూరంలోని మణుగూరుకు వెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్తుండగానే నా బిడ్డ ప్రాణాలు విడిచింది. – బోయి అజయ్, (అక్షర తండ్రి) ఆందోళన వద్దు.. మలేరియా, డెంగీ జ్వరాల పట్ల ఆందోళన వద్దు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇటీవల జ్వరాలు విజృంభిస్తుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారుల సూచన మేరకు డెంగీ, మలేరియాలను నియంత్రించేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. జ్వరం లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సహాయం పొందాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులకు తగినన్ని మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ -
రాష్ట్రంపై డెంగీ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోందని.. ఈ ఏడాది ఇప్పటివరకు 583 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. అందులోని ఇటీవలి మే, జూన్ నెలల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయని నివేదికలో వెల్లడించింది. సాధారణంగా వానాకాలం సీజన్ మొదలయ్యాక డెంగీ, ఇతర విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి. కానీ ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలోనే డెంగీ కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 218 డెంగీ కేసులురాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ జిల్లాల్లో 38 చొప్పున కేసులు నమోదయ్యాయి. వానలు మొదలైన నేపథ్యంలో డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆ పది జిల్లాల్లో రిస్క్ రాష్ట్రంలో డెంగీ హైరిస్క్ జిల్లాలను ప్రజారోగ్య కార్యాలయం గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది నమోదైన డెంగీ కేసుల్లో ఈ జిల్లాల్లోనే 80 శాతం వరకు నమోదైనట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 121 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను హైరిస్క్ జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గతేడాది రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో ఈ ఏడు జిల్లాల్లోనే 91.5 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది. అధికారులతో మంత్రి సమీక్ష వానాకాలం మొదలైన నేపథ్యంలో డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్‌రావు తాజాగా సమీక్ష నిర్వహించారు. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథతో తగ్గిపోయాయని.. కానీ కీటకాలతో వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. మలేరియాను గుర్తించే 8 లక్షల ర్యాపిడ్ కిట్లను, డెంగీని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపామని తెలిపారు. -
మలేరియాపై అస్త్రం.. అలిస్పోరివిర్
న్యూఢిల్లీ: మలేరియా. దోమకాటు వల్ల వచ్చే అతి పెద్ద జబ్బు. దేశంలో ఏటా లక్షలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మరణిస్తున్నారు. ఆడ ఆనాఫిలిస్ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసిన్’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్–రెసిస్టెంట్ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్ సి డ్రగ్ ‘అలిస్పోరివిర్’ను కనిపెట్టారు. అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్–రెసిస్టెంట్, అర్టిమెసినిన్–రెసిస్టెంట్ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని çడాక్టర్ ఆనంద్ రంగనాథన్ చెప్పారు. ‘‘దీన్ని అర్టిమెసినిన్ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి! -
మలేరియాకు చెక్
మలేరియా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మహమ్మారి తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖల శ్రమకు ఫలితం లభించింది. మరణాల నివారణతోపాటు మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. సాక్షి, పాడేరు : మన్యంలో మలేరియా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. ఒకప్పుడు మలేరియా మహమ్మారితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దోమకాటుకు గురై మలేరియా జ్వరాల బారిన పడటంతో పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చేది. పారిశుధ్య కార్యక్రమాలు గ్రామాల్లో అంతంత మాత్రంగానే ఉండేవి. మన్యంలో 2012 నుంచి 2018 వరకు మలేరియా విజృంభించడంతో మరణాలు చోటు చేసుకునేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా.. ఏర్పడిన తరువాత మన్యంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వలంటీర్ల సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను సచివాలయ వ్యవస్థ విస్తృతం చేసింది. మరోవైపు దోమల నివారణకు ప్రభుత్వం ] మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ బృందాలు నిరంతరం పనిచేశాయి. దోమతెరలతో.. తెరలను ప్రభుత్వం పంపిణీ చేయడం మరింత మేలు చేసింది. గిరిజనులకు దోమ కాట్ల బెడద లేకుండా 5,02,950 దోమతెరలను అందజేసింది. వీటి వినియోగంపై వైద్య బృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు ఎపిడమిక్ సీజన్‌గా ప్రభుత్వం గుర్తించి వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపడుతోంది. మలేరియా, వైద్యారోగ్యశాఖలు.. మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మలేరియా తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతో శ్రమించాయి. మరణాలు కూడా లేకపోవడంతో మలేరియాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. పాడేరు ఐటీడీఏ పీవో, ఇతర శాఖల అధికారులు కూడా దోమల నివారణ మందు పిచికారీ పనులను నిరంతరం పర్యవేక్షించేవారు. ఏటా రెండు దఫాలుగా దోమల నివారణ మందు పిచికారీ పనులు జరిగాయి. ప్రతి గిరిజన కుటుంబం ఇంటా, బయట దోమల మందు పిచికారీని తప్పనిసరిగా జరుపుకోవాలనే నిబంధనలు కూడా సచివాలయ ఉద్యోగులు అమలు చేసేవారు. గ్రామ వలంటీర్ల పర్యవేక్షణలో.. సచివాలయ వ్యవస్థ ఏర్పడడంతో పాటు గ్రామ వలంటీర్లంతా తమ నిర్దేశిత గిరిజన కుటుంబాల నివాసాలకు దగ్గరుండి దోమల నివారణ మందు పిచికారీ చేయించేవారు. ఇంటింటా ఫీవర్ సర్వే కూడా విజయవంతంగా జరిగింది -
చిన్నారులపై వ్యాధుల పంజా!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో అన్ని రకాల టీకాలు తీసుకోకపోవడం, ఇతరత్రా జాగ్రత్తలు చేపట్టకపోవడం తదితర కారణాల వల్ల ఈ వయసు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలపై అనేక జబ్బులు దాడి చేస్తున్నాయని తేలింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు అంటే 10 నెలల కాలంలో మలేరియా కేసులు దేశవ్యాప్తంగా 4.96 లక్షలు నమోదు కాగా, అందులో తెలంగాణలో 6,075 నమోదయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 5,940 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దేశంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 16వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,582 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 623 కేసులు నమోదు కావడం గమనార్హం. సిరిసిల్ల జిల్లాలో 514 మలేరియా కేసులు నమోదయ్యాయి. మలేరియా నియంత్రణ చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ ఏడాది ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అంటున్నారు. టీకా మరణాల్లో ఎనిమిదో స్థానం.. పిల్లలకు వివిధ రకాల టీకాలు వేసిన అనంతరం చనిపోయిన సంఘటనల్లో దేశంలో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో టీకాలు వేసిన అనంతరం 12 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో గత 10 నెలల్లోనే 24 మంది చనిపోయారని కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 11 మంది టీకాలు వేసిన అనంతరం చనిపోగా, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 9 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. టీకాల వల్ల వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ కేసులు ఈ ఏడాది అధికంగా నమోదయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 546 కేసులు నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లోనే 738 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. టీకాల సైడ్ ఎఫెక్ట్స్‌లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 309 టీకా సైడ్ ఎఫెక్ట్స్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 123 మంది పిల్లలకు టీకాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అయితే లక్షలాది మందికి టీకాలు వేస్తున్నప్పుడు ఈ మాత్రం సంఘటనలు సహజమేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. టీకాలను సరిగా నిల్వ చేయకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి వ్యాఖ్యానించారు. భారీగా పెరిగిన డిఫ్తీరియా కేసులు.. ఐదేళ్లలోపు పిల్లల్లో డిఫ్తీరియా కేసులు రాష్ట్రంలో రెట్టింపు స్థాయి లో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 83 డిఫ్తీరియా కేసులు నమోదవ్వగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల్లోనే 149 పెరగడం గమనార్హం. ఇందులో దేశంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచిం ది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం లో 80 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. హైదరాబాద్‌లోనూ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిఫ్తీరియా కేసు కూడా లేకపోగా, 2019–20లో 10 నెలల్లో ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గతేడాది కంటే ప్రసవ మరణాలు పెరిగాయి. గత సంవత్సరంలో 337 మంది బాలింతలు చని పోగా, ఈ ఏడాది జనవరి వరకు 389 మంది చనిపోయారని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. గతే డాది కంటే ఈ ఏడాది డయేరియా కేసులు రాష్ట్రంలో బాగా పెరిగాయి. 2018–19లో ఐదేళ్లలోపు పిల్లల్లో 39,541 డయేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరికి 42,597 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధి కంగా 7,932డయేరియా కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఐదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత కేసులు కూడా పెరిగాయి. గతేడాది 5,940 మంది రక్తహీనతకు గురి కాగా, ఈ ఏడాది జనవరి వరకు 6,075 కేసులు నమోదయ్యాయి. -
దోమను చూస్తే... ఇంకా దడదడే!
దేశంలో మలేరియా కేసుల నమోదులో గణనీయ తగ్గుదల కనిపిస్తున్నా.. ఇప్పటికీ ఆగ్నేయాసియాలో మొదటి స్థానంలో మనమే ఉండటం కలవరపరుస్తోంది. అలాగే ప్రపంచంలోనూ ఆఫ్రికా దేశాల సరసన నిలబడి 11వ స్థానంలో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ మలేరియా నివేదిక–2019 స్పష్టం చేసింది. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఆగ్నేయాసియాలో 11 దేశాలుంటే, వాటిల్లో కేవలం 3 దేశాల్లోనే 98 శాతం మలేరియా కేసులు నమోదయ్యాయి. అందులో భారత్‌లోనే ఎక్కువగా 58 శాతం కేసులు నమోదవగా.. ఇండోనేసియాలో 30 శాతం, మయన్మార్‌లో 10 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే మలేరియా మరణాలు సైతం భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం మలేరియా కేసులు 19 దేశాల్లోనే నమోదవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఐదేళ్లలో భారత్‌లో తగ్గుముఖం.. 2020 నాటికి మలేరియా కేసుల సంఖ్యను 40 శాతం కంటే ఎక్కువగా తగ్గించాలని, 2030 నాటికి మలేరియాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు మార్గనిర్దేశనం చేసింది. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ ముందుకు సాగుతోందని, సాపేక్షికంగా చూస్తే మలేరియా కేసులు గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2014లో భారత్‌లో 11.02 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా, 562 మంది చనిపోయారు. అయితే తర్వాత మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2018లో మలేరియా కేసుల సంఖ్య ఏకంగా 3.99 లక్షలకు తగ్గింది. మరణాల సంఖ్య కూడా 85కు పడిపోయింది. ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన నివేదికలో నూ వెల్లడించింది. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2014లో 5,189 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 1,327 మలేరియా కేసులే నమోదయ్యాయి. 38 దేశాలు మలేరియా రహితం.. మన పక్కనే ఉన్న మాల్దీవులు, శ్రీలంక దేశాలు మలేరియా రహితంగా కొనసాగుతున్నాయి. మొత్తం 38 దేశాలు మలేరియా రహితమని ధ్రువీకరించడం గమనార్హం. ఇక 2018లో 27 దేశాల్లో 100 కంటే తక్కువ మలేరియా కేసులున్నట్లు తేలింది. ప్రపంచంలో గతేడాది ఏకంగా 4.05 లక్షల మంది మలేరియా కారణంగా మరణించారని నివేదిక తెలిపింది. అందు లో 2.72 లక్షల (67%) మంది ఐదేళ్ల పిల్లలే కావడం గమనార్హం. ఈ మరణాల్లో 85 శాతం భారత్ సహా ఆఫ్రికన్ ప్రాంతంలోనే సంభవించడంపై విచారం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో మలేరియాను ఎదుర్కోవాలన్న సవాల్లో పురోగతి మందగించిందని ప్రపంచ మలేరియా నివేదిక వ్యాఖ్యానించింది. వెయ్యిలో 57 మందికి.. 2010–18 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియా తీవ్రత తగ్గిందని ప్రపంచ మలేరియా నివేదిక తెలిపింది. 2010లో ప్రతీ వెయ్యిలో 71 మంది మలేరియాకు గురికాగా, 2018లో ఆ సంఖ్య 57 కేసులకు పడిపోయింది. ఏదేమైనా 2014–2018 వరకు మలేరియా వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గింది. గర్భిణీలు, పిల్లలు ఎక్కువ గా మలేరియా బారిన పడుతున్నా రు. వీరిపై దృష్టి పెట్టకపోతే ఎటువంటి పురోగతి సాధించలేమని మలేరియా నివేదిక తెలిపింది. -
కథలు చెప్పొద్దు
♦ జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంది. ♦ ఒక్కో గ్రామంలో 300 మంది జ్వర పీడితులున్నారు ♦ 56 మండలాల్లో ఇదే పరిస్థితి ♦ ఎక్కడా డాక్టర్లు సరిగ్గా లేరు.. సరైన మెడిసిన్ లేదు ♦ మీవల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది ♦ పద్దతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి సారించండి ♦ వైద్యాధికారులపై మంత్రి శిద్దా ఫైర్ ఒంగోలు టౌన్ : ‘ప్రతి గ్రామంలో 250 నుంచి 300 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంటే డాక్టర్స్ ఎక్కడా కరెక్ట్‌గా లేరు. సరైన మెడిసిన్ లేదు. అదేమని అడిగితే స్టోరీలు చెబుతున్నారు. పద్ధతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. జ్వరాలు మాత్రం కంట్రోల్ కావాలి’అని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. జిల్లాలో జ్వరాల తీవ్రత నేపథ్యంలో మంగళవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 96,524 మంది జ్వర బాధితులు: డీఎంహెచ్ఓ జిల్లాలో గతేడాది 1,12,254 మంది సాధారణ జ్వరాలతో బాధపడగా.. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 96,524 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.యాస్మిన్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో 11, ఫిబ్రవరిలో 25, మార్చిలో 21, ఏప్రిల్‌లో 28, మే నెలలో 19, జూన్‌లో 7, జూన్‌లో 13, జూలైలో 13, ఆగస్టులో 53, సెప్టెంబర్‌లో 91 డెంగీ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ డెంగీ కేసులు పెరిగాయన్నారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకుంటూ తాను 15 రోజుల కిందట దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేరని, మందులు కూడా లేవన్నారు. అదే సమయంలో ఒక ఆర్ఎంపీకి చెందిన చిన్న షెడ్లో 50 మంది జ్వర పీడితులు ఉన్నారని, బెడ్స్ లేకపోవడంతో చాపలు, నాపరాళ్లపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారన్నారు. ఎంత చెప్పినా మార్పు రావడంలేదని, మీవల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఒంగోలులో కూర్చుంటే కుదరదని, సరైన డైరెక్షన్ ఇస్తూ జ్వరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేయకపోతే సస్పెండే: కలెక్టర్ జిల్లాలో వ్యాధులను నియంత్రించేందుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్‌చంద్ ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే వైద్యులు, వైద్యులైనా, వైద్య సిబ్బంది అయినా, పంచాయతీ కార్యదర్శులైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్యంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏరోజుకారోజు తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఒంగోలుతో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లో జనావాసాల మధ్య పందులు పెంచకుండా ఉండేందుకు, వాటి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. 20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెíషీన్: మంత్రి శిద్దా 20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెషీన్ వస్తోందని మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లేట్లెట్స్ మెషీన్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో డెంగీతో ఎవరూ చనిపోలేదని, వివిధ అనారోగ్య కారణాలతోనే చనిపోయారని స్పష్టం చేశారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తం
జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వాణిశ్రీ గుంటూరు మెడికల్ : జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాలు కురిసి దోమలు వృద్ధి చెంది వ్యాధులను కలుగజేస్తాయని, సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వాణిశ్రీ హెచ్చరించారు. డీఎంహెచ్ఓ చాంబర్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దోమ కాటు ద్వారా పలు వ్యాధులు వస్తాయని, వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడాలని సూచించారు. దోమలు పెరగకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని చెప్పారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశామని, సీజనల్ వ్యాధులకు మందులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి మాట్లాడుతూ జూన్ 1 నుంచి 30 వ తేదీ వరకు నెలరోజుల పాటు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారని. జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేసి మందులు అందజేస్తారని చెప్పారు. జిల్లా మలేరియా అధికారి వరదా రవీంద్రబాబు మాట్లాడుతూ జూన్ నెలను యాంటీ మలేరియా నెలగా, జూలై నెలను యాంటీ డెంగీ నెలగా నిర్ణయించి ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. దోమలద్వారా, నీటి ద్వారాా, గాలి ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయని, వ్యాధులు దరిచేరకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వారానికి ఒకసారి వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. చర్చిలు, మసీదులు, గుడుల్లో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గ్రామాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో గత ఏడాది 130 మలేరియా కేసులు నమోదవగా ఒక్క గుంటూరు నగరంలోనే 102 కేసులు నమోదు అయినట్టు తెలిపారు. -
వణికిస్తున్న మలేరియా
- గుమ్మడిగుంటలో ఒకే ఇంట్లో నలుగురికి జ్వరాలు - ఏజెన్సీలో 3 వేల మలేరియా పాజిటివ్ కేసులు నమోదు - ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని గిరిజనుల వినతి పాడేరు: విశాఖ ఏజెన్సీలో మళ్లీ మలేరియా విజృంభిస్తోంది. హుకుంపేట మండలం మారుమూల ప్రాంతమైన చీకుమద్దెల పంచాయితీ గుమ్మడిగుంట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గిరిజనులు మలేరియా బారిన పడ్డారు. ఈ గ్రామంలో పలువురు కొద్ది రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఆశ వర్కర్ లేకపోవడం వల్ల గ్రామంలో జ్వరాలు ప్రబలిన సంగతి తెలియరాలేదు. శనివారం పొరుగూరి నుంచి బంధువులు ఇంటికి వెళ్లిన ఒక ఆశా వర్కర్ జ్వరబాధితులకు రక్తపరీక్షలు చేయగా జ్వరాలతో బాధపడుతున్న ఒక కుటుంబంలోని వలసనైని చిన్నమ్మి(35), వలసనైని మచ్చులు(40), వి.కుమారి(22), విష్ణు(6)లకు మలేరియా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఇంకా పలువురు జ్వరబాధితులు ఉన్నారని వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాలే కారణం.. విశాఖ మన్యంలో మలేరియా ముంచుకొస్తోంది. గ్రామాల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మన్యంలో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏజెన్సీలో ఈ ఏడాది మలేరియా జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలను నిర్వహిస్తు గ్రామాల్లో జ్వర బాధితులకు రక్తపూతల ద్వారా మలేరియా పాజిటివ్ కేసులను గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నారు. పాడేరు, అరకు ఏరియా ఆస్పత్రులకు, చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి మలేరియా జ్వరబాధితుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏజెన్సీలో ఇప్పటి వరకు 3 వేల వరకు మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వర్షాలు పడుతుండటంతో మన్యంలో గిరిజనులు వ్యవసాయ పనుల్లో ముమ్మరంగా పాల్గొంటుంటారు. వాతావరణ పరిస్థితులు మారడమే కాకుండా వర్షాల మూలంగా పంట పొలాల్లో దోమలు ప్రబలుతున్నాయి. సహజంగా పంట పొలాల్లోని వర్షపునీరు మీద మలేరియా కారకమైన అనాఫిలస్ దోమలు పెరుగుతాయని, దీని వల్ల ఎక్కువగా గిరిజనులు మలేరియా జ్వరాల బారిన పడే పరిస్థితి ఉందని జిల్లా మలేరియా అధికారి కె.ప్రసాదరావు తెలిపారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులు మలేరియా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకుని పాజిటివ్ వస్తే వెంటనే ఏసీటీ మందులు 3 రోజులు వాడాలని సూచించారు. -
జ్వర విలయం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. భద్రాచలం మండలం గుండాల కాలనీ... బూర్గంపాడు మండలం అంజనాపురం...కొత్తగూడెం మండలం రాఘవాపురం ... రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడెం...సత్తుపల్లి మండలం రామానగరం... ఇలా జిల్లా వ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూల విషజ్వరాల బారిన పడి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గత నెలరోజులుగా జిల్లాలో ఏదో చోట డెంగ్యూ లేదా విషజ్వరాలకు సంబంధించిన కేసులు నమోదు కాని రోజు లేదు. విషజ్వరాలతో నెలరోజుల్లో దాదాపు 50 మంది చనిపోయారంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరే కాక అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో వందల మంది విషజ్వరాల లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. జిల్లా నలుమూలలా గ్రామాలకు గ్రామాలే విషజ్వరాలతో అల్లాడుతున్నాయి. ఇంతకాలం ఏజెన్సీకే పరిమితమైన ఈ జ్వరాలు ఈ ఏడాది మైదాన ప్రాంతాన్ని కూడా హడలెత్తిస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీ పరిధిలో చేపట్టిన అధ్యయనాన్ని పరిశీలిస్తే ‘ఆర్బో’ అనే కొత్తరకం వైరస్ కారణంగా ఈ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యశాఖ వర్గాలంటున్నాయి. జ్వరాలు ఇంత తీవ్రంగా ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఫలానా గ్రామంలో జ్వరం వచ్చిందని పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు అక్కడికి వెళ్లి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడం మినహా, జిల్లాలో విషజ్వరాలను నియంత్రించేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేక చొరవ తీసుకుని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా జిల్లాను జ్వరగండం నుంచి బయటపడేయాలని ప్రజానీకం కోరుతోంది. ఇంత జరుగుతున్నా... జిల్లాలో పెద్ద ఎత్తున విషజ్వరాలు, మలేరియా, డెంగీ కేసులు నమోదయి ప్రజలు మృత్యువాత పడుతున్నా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ఎప్పుడూ ఉండే ఈ జ్వరాల అదుపునకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఏయేటికాయేడు అయినా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో 45 కేంద్రాలను ఇప్పటికే డేంజర్‌జోన్‌గా గుర్తించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని 1000కిపైగా గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యే చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ పరిధిలో కూడా పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైనేజీల నిర్వహణ, దోమతెరల పంపిణీలాంటి కార్యక్రమాలు మొక్కుబడిగానే సాగా యి. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీరు అందడం లేదు. నీటి కాలుష్యం వల్లనే విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్య వర్గాలు చెపుతున్నా.. ముందస్తు ప్రణాళిక లేక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఈ విషయంలో విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు దోమల నివారణ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు దోమతెరలు పంపిణీ కాలేదు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు గ్రామీణ ప్రాంతాలకు నిధులు వెచ్చించడం లేదు. జ్వరం బారిన ఓ గ్రామం పడి అల్లాడుతోందని పత్రికల్లో వస్తున్న వార్త చూసి అధికారులు అక్కడికి వెళ్లి ఆదరాబాదరాగా ఏవో చర్యలు తీసుకుంటున్నారే తప్ప జ్వరాలను అదుపుచేసేలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇదే విషయమై జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుతీరిన రోజే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. కాగా, జ్వరాలతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఏజెన్సీలో అత్యధికంగా విషజ్వరాలు నమోదవుతున్నా.. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కనీసం ప్లేట్‌లెట్స్‌ను నిర్ధారించే పరీక్ష జరిపే పరికరాల్లేవు. జ్వరం రాగానే రక్తనమూనాలను ఖమ్మం తీసుకొచ్చి పరీక్ష చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ప్లేట్‌లెట్స్‌ను నిర్ధారించే పరీక్ష నిర్వహించే పరికరాలను జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏజెన్సీ గిరిజనులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. జ్వరంకాటుకు బలైన వారి వివరాలు నియోజకవర్గాల వారీగా... పినపాక నియోజకవర్గంలోని గత నెల రోజులుగా డెంగ్యూ, విషజ్వరా బారిన పడి సుమారు 8మందిమృతి చెందినారు. బూర్గంపాడు మండలం అంజనాపురంలో తేజావత్ సక్కుబాయి(52), పల్లపు నర్సింహా(55), అశ్వాపురం మండలం గొల్లగూడెంలో విష్ణువర్దన్(8), మణుగూరు మండలం చిక్కుడుగుంటలో మైపా స్పందన(19), తంతరపల్లి లక్ష్మి(32), పినపాక మండలం గోపాలరావుపేటలో అంతటి రాము(22), కరకగూడెంలో మౌనిక(15), గుండాల మండలం రామానుజగూడెంలో వానపాకుల అఖిల్(9)తో పాటు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడేనికి చెందిన రేపాకుల రంజిత్‌కుమార్(5) అనే బాలుడు సెప్టెంబర్ 30న మృతి చెందాడు. సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో యలమర్తి భారతమ్మ(45), రుద్రాక్షపల్లి గ్రామం లో ఇస్లావత్ నీలమ్మ(40), పెనుబల్లి మండలం రామచంద్రారావు బం జరులో తుంగా సంధ్య(21)లు విషజ్వరాలతో మృతి చెందారు. భద్రాచలం నియోజకవర్గంలో.. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ బొబ్బళ్లపాటి రవిరత్న ప్రసాద్(43), కాసర్ల వెంకటాచారి(26), చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామానికి చెందిన బందా బిందు(11) చర్లకు చెందిన పులగడప నవీన్ కుమార్(19), విజయకాలనీకి చెందిన సౌదుల ఇందులేఖ(3), చింతూరు మండలం సుకుమామామిడికి చెందిన తోయ లింగారెడ్డి(45), పీర్ల మాలాశ్రీ(6) వాజేడు మండలం కోయవీరాపురానికి చెందిన వర్సా విజయ(16) దుమ్ముగూడెంలోని సుంకరకాలనీకి చెందిన నాగేందర్, రుంజా జయ్‌కుమార్(43) తదితరులున్నారు. ఇక, కొత్తగూడెం నియోజకవర్గంలో విషజ్వరాల బారినపడి 25 రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో కొత్తగూడెం మండలం పెనగడపకు చెందిన షెక్ కమాలుద్దీన్, సాజీదా బేగం, సావిత్రమ్మ ఉన్నారు. కట్ట సతీష్ అనే వ్యక్తి డెంగీ లక్షణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 17న మృతిచెందాడు. దమ్మపేట ఎపీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కారుకొండ రామవరం హోళితండాకు చెందిన మాళోతు నరేందర్ (10), రాఘవాపురం పంచాయతీ పరిధిలో మొరిపేటి చందర్రావు, మొరిపేటి సరస్వతి విషజ్వరం బారినపడి మృతిచెందారు. అశ్వారావుపేట మండలంలో నలుగురు, చండ్రుగొండలో ముగ్గురు, కుక్కునూరులో నలుగురు, ములకలపల్లి మండలంలో ఇద్దరు జ్వరం బారిన పడి గత నెల రోజుల్లో మృతి చెందారని రికార్డులు చెబుతున్నాయి. -
జనం విలవిల
సాక్షి, అనంతపురం : జిల్లాను ఇప్పటికే డెంగీ మహమ్మారి వణికిస్తోంది. దీనికితోడు మలేరియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం జూన్ నాటికి 200 మలేరియా కేసులుండగా.. జూలై ఆఖరు నాటికి ఆ సంఖ్య 304కు చేరుకుంది. అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి రోజూ దాదాపు వెయ్యి మంది జ్వర పీడితులు వస్తుండగా.. వారిలో 20 మంది వరకు మలేరియా బాధితులు ఉంటున్నారు. పాముదుర్తి, కదిరి, నల్లమాడ, తనకల్లు, గోరంట్ల క్లష్టర్ల పరిధిలో వందలాది మంది మలేరియాతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుండగా, కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత కలిగిన వారు మాత్రం ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు కరువు జిల్లాలో ప్రతియేటా మలేరియా కేసులు అధికంగానే ఉంటున్నాయి. 80 శాతం మంది బాధితులు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండడంతో వీరి వివరాలు రికార్డుల్లో నమోదు కావడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామంలో ఏడాదిలో మూడు నుంచి ఐదు కేసులు నమోదైతే.. అక్కడ మాత్రమే ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 345 గ్రామాల్లో దోమల నివారణకు పైరాథాయిడ్‌ను జూలై13 నుంచి ఆఖరు వరకు పిచికారీ చేశారు. జూన్‌లో పెనకచర్ల డ్యాం, గార్లదిన్నె ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ నివారణ చర్యలు చేపట్టిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ఏడాది జూలై నాటికి గత సంవత్సరం కంటే 84 కేసులు అధికంగా నమోదైనట్లు అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో పాటు వాతావరణంలో మార్పుల వల్ల చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు పత్రికల్లో వచ్చే వార్తలకు ఖండనలు ఇవ్వడానికి, కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు నిర్వహించడానికే పరిమితమవుతున్నారు. మరికొంత మంది సొంత నర్సింగ్ హోంలలో తీరిక లేకుండా గడుపుతున్నారన్న విమర్శలున్నాయి. అధ్వానంగా పారిశుద్ధ్యం చాలా గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపడుతున్న చర్యలు నామమాత్రమే. మునిసిపాలిటీలలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం మలేరియా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల 345 గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టాం. మరిన్ని గ్రామాల్లో దోమల నివారణకు పైరాథాయిడ్‌ను పిచికారీ చేస్తాం. గత ఏడాది కంటే ఈసారి మలేరియా బాధితుల సంఖ్య కాస్త పెరిగిన మాట వాస్తవమే. బాధితుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు సిద్ధంగా ఉన్నాయి. - డాక్టర్ ఆదినారాయణ, జిల్లా మలేరియా వైద్యాధికారి, అనంతపురం