జ్వర విలయం | Malaria cases registered in district | Sakshi
Sakshi News home page

జ్వర విలయం

Published Wed, Oct 1 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

Malaria cases  registered in district

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. భద్రాచలం మండలం గుండాల కాలనీ... బూర్గంపాడు మండలం అంజనాపురం...కొత్తగూడెం మండలం రాఘవాపురం ... రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడెం...సత్తుపల్లి మండలం రామానగరం... ఇలా జిల్లా వ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూల విషజ్వరాల బారిన పడి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గత నెలరోజులుగా జిల్లాలో ఏదో చోట డెంగ్యూ లేదా విషజ్వరాలకు సంబంధించిన కేసులు నమోదు కాని రోజు లేదు.

 విషజ్వరాలతో నెలరోజుల్లో దాదాపు 50 మంది చనిపోయారంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరే కాక అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో వందల మంది విషజ్వరాల లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. జిల్లా నలుమూలలా గ్రామాలకు గ్రామాలే విషజ్వరాలతో అల్లాడుతున్నాయి. ఇంతకాలం ఏజెన్సీకే పరిమితమైన ఈ జ్వరాలు ఈ ఏడాది మైదాన ప్రాంతాన్ని కూడా హడలెత్తిస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీ పరిధిలో చేపట్టిన అధ్యయనాన్ని పరిశీలిస్తే ‘ఆర్బో’ అనే కొత్తరకం వైరస్ కారణంగా ఈ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యశాఖ వర్గాలంటున్నాయి.

జ్వరాలు ఇంత తీవ్రంగా ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఫలానా గ్రామంలో జ్వరం వచ్చిందని పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు అక్కడికి వెళ్లి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడం మినహా, జిల్లాలో విషజ్వరాలను నియంత్రించేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేక చొరవ తీసుకుని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా జిల్లాను జ్వరగండం నుంచి బయటపడేయాలని ప్రజానీకం కోరుతోంది.

 ఇంత జరుగుతున్నా...
 జిల్లాలో పెద్ద ఎత్తున విషజ్వరాలు, మలేరియా, డెంగీ కేసులు నమోదయి ప్రజలు మృత్యువాత పడుతున్నా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ఎప్పుడూ ఉండే ఈ జ్వరాల అదుపునకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఏయేటికాయేడు అయినా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో 45 కేంద్రాలను ఇప్పటికే డేంజర్‌జోన్‌గా గుర్తించారు.

ఆయా పీహెచ్‌సీల పరిధిలోని 1000కిపైగా గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యే చింతూరు మండలం తులసిపాక పీహెచ్‌సీ పరిధిలో కూడా పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైనేజీల నిర్వహణ, దోమతెరల పంపిణీలాంటి కార్యక్రమాలు మొక్కుబడిగానే సాగా యి. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీరు అందడం లేదు.

 నీటి కాలుష్యం వల్లనే విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్య వర్గాలు చెపుతున్నా.. ముందస్తు ప్రణాళిక లేక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఈ విషయంలో విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు దోమల నివారణ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు దోమతెరలు పంపిణీ కాలేదు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు గ్రామీణ ప్రాంతాలకు నిధులు వెచ్చించడం లేదు.

జ్వరం బారిన ఓ గ్రామం పడి అల్లాడుతోందని పత్రికల్లో వస్తున్న వార్త చూసి అధికారులు అక్కడికి వెళ్లి ఆదరాబాదరాగా ఏవో చర్యలు తీసుకుంటున్నారే తప్ప జ్వరాలను అదుపుచేసేలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇదే విషయమై జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుతీరిన రోజే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. కాగా, జ్వరాలతో ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోతోంది.

అయితే ఏజెన్సీలో అత్యధికంగా విషజ్వరాలు నమోదవుతున్నా.. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కనీసం ప్లేట్‌లెట్స్‌ను నిర్ధారించే పరీక్ష జరిపే పరికరాల్లేవు. జ్వరం రాగానే రక్తనమూనాలను ఖమ్మం తీసుకొచ్చి పరీక్ష చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ప్లేట్‌లెట్స్‌ను నిర్ధారించే పరీక్ష నిర్వహించే పరికరాలను జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏజెన్సీ గిరిజనులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.

 జ్వరంకాటుకు బలైన వారి వివరాలు నియోజకవర్గాల వారీగా...
 పినపాక నియోజకవర్గంలోని గత నెల రోజులుగా డెంగ్యూ, విషజ్వరా బారిన పడి సుమారు 8మందిమృతి చెందినారు. బూర్గంపాడు మండలం అంజనాపురంలో తేజావత్ సక్కుబాయి(52), పల్లపు నర్సింహా(55),  అశ్వాపురం మండలం గొల్లగూడెంలో విష్ణువర్దన్(8), మణుగూరు మండలం చిక్కుడుగుంటలో మైపా స్పందన(19), తంతరపల్లి లక్ష్మి(32),  పినపాక మండలం గోపాలరావుపేటలో అంతటి రాము(22), కరకగూడెంలో మౌనిక(15), గుండాల మండలం రామానుజగూడెంలో వానపాకుల అఖిల్(9)తో పాటు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం  పాపాయిగూడేనికి చెందిన రేపాకుల రంజిత్‌కుమార్(5) అనే బాలుడు సెప్టెంబర్ 30న మృతి చెందాడు. సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో యలమర్తి భారతమ్మ(45), రుద్రాక్షపల్లి గ్రామం లో ఇస్లావత్ నీలమ్మ(40), పెనుబల్లి మండలం రామచంద్రారావు బం జరులో తుంగా సంధ్య(21)లు  విషజ్వరాలతో మృతి చెందారు.

భద్రాచలం నియోజకవర్గంలో.. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ బొబ్బళ్లపాటి రవిరత్న ప్రసాద్(43), కాసర్ల వెంకటాచారి(26), చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామానికి చెందిన బందా బిందు(11) చర్లకు చెందిన పులగడప నవీన్ కుమార్(19), విజయకాలనీకి చెందిన సౌదుల ఇందులేఖ(3), చింతూరు మండలం సుకుమామామిడికి చెందిన తోయ లింగారెడ్డి(45), పీర్ల మాలాశ్రీ(6) వాజేడు మండలం కోయవీరాపురానికి చెందిన వర్సా విజయ(16) దుమ్ముగూడెంలోని సుంకరకాలనీకి చెందిన నాగేందర్, రుంజా జయ్‌కుమార్(43) తదితరులున్నారు.  

ఇక, కొత్తగూడెం నియోజకవర్గంలో విషజ్వరాల బారినపడి 25 రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో కొత్తగూడెం మండలం  పెనగడపకు చెందిన షెక్ కమాలుద్దీన్, సాజీదా బేగం, సావిత్రమ్మ ఉన్నారు. కట్ట సతీష్ అనే వ్యక్తి డెంగీ లక్షణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 17న మృతిచెందాడు.

 దమ్మపేట ఎపీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కారుకొండ రామవరం హోళితండాకు చెందిన మాళోతు నరేందర్ (10), రాఘవాపురం పంచాయతీ పరిధిలో మొరిపేటి చందర్‌రావు, మొరిపేటి సరస్వతి విషజ్వరం బారినపడి మృతిచెందారు. అశ్వారావుపేట మండలంలో నలుగురు, చండ్రుగొండలో ముగ్గురు, కుక్కునూరులో నలుగురు, ములకలపల్లి మండలంలో ఇద్దరు జ్వరం బారిన పడి గత నెల రోజుల్లో మృతి చెందారని రికార్డులు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement