సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.
ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.
అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment