తెలంగాణలో మలేరియా కేసులు ఇలా
దేశంలో మలేరియా కేసుల నమోదులో గణనీయ తగ్గుదల కనిపిస్తున్నా.. ఇప్పటికీ ఆగ్నేయాసియాలో మొదటి స్థానంలో మనమే ఉండటం కలవరపరుస్తోంది. అలాగే ప్రపంచంలోనూ ఆఫ్రికా దేశాల సరసన నిలబడి 11వ స్థానంలో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ మలేరియా నివేదిక–2019 స్పష్టం చేసింది. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఆగ్నేయాసియాలో 11 దేశాలుంటే, వాటిల్లో కేవలం 3 దేశాల్లోనే 98 శాతం మలేరియా కేసులు నమోదయ్యాయి. అందులో భారత్‌లోనే ఎక్కువగా 58 శాతం కేసులు నమోదవగా.. ఇండోనేసియాలో 30 శాతం, మయన్మార్‌లో 10 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే మలేరియా మరణాలు సైతం భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం మలేరియా కేసులు 19 దేశాల్లోనే నమోదవుతున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
ఐదేళ్లలో భారత్‌లో తగ్గుముఖం..
2020 నాటికి మలేరియా కేసుల సంఖ్యను 40 శాతం కంటే ఎక్కువగా తగ్గించాలని, 2030 నాటికి మలేరియాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు మార్గనిర్దేశనం చేసింది. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ ముందుకు సాగుతోందని, సాపేక్షికంగా చూస్తే మలేరియా కేసులు గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2014లో భారత్‌లో 11.02 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా, 562 మంది చనిపోయారు. అయితే తర్వాత మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2018లో మలేరియా కేసుల సంఖ్య ఏకంగా 3.99 లక్షలకు తగ్గింది. మరణాల సంఖ్య కూడా 85కు పడిపోయింది. ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన నివేదికలో నూ వెల్లడించింది. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2014లో 5,189 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 1,327 మలేరియా కేసులే నమోదయ్యాయి.
38 దేశాలు మలేరియా రహితం..
మన పక్కనే ఉన్న మాల్దీవులు, శ్రీలంక దేశాలు మలేరియా రహితంగా కొనసాగుతున్నాయి. మొత్తం 38 దేశాలు మలేరియా రహితమని ధ్రువీకరించడం గమనార్హం. ఇక 2018లో 27 దేశాల్లో 100 కంటే తక్కువ మలేరియా కేసులున్నట్లు తేలింది. ప్రపంచంలో గతేడాది ఏకంగా 4.05 లక్షల మంది మలేరియా కారణంగా మరణించారని నివేదిక తెలిపింది. అందు లో 2.72 లక్షల (67%) మంది ఐదేళ్ల పిల్లలే కావడం గమనార్హం. ఈ మరణాల్లో 85 శాతం భారత్ సహా ఆఫ్రికన్ ప్రాంతంలోనే సంభవించడంపై విచారం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో మలేరియాను ఎదుర్కోవాలన్న సవాల్‌లో పురోగతి మందగించిందని ప్రపంచ మలేరియా నివేదిక వ్యాఖ్యానించింది.
వెయ్యిలో 57 మందికి..
2010–18 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియా తీవ్రత తగ్గిందని ప్రపంచ మలేరియా నివేదిక తెలిపింది. 2010లో ప్రతీ వెయ్యిలో 71 మంది మలేరియాకు గురికాగా, 2018లో ఆ సంఖ్య 57 కేసులకు పడిపోయింది. ఏదేమైనా 2014–2018 వరకు మలేరియా వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గింది. గర్భిణీలు, పిల్లలు ఎక్కువ గా మలేరియా బారిన పడుతున్నా రు. వీరిపై దృష్టి పెట్టకపోతే ఎటువంటి పురోగతి సాధించలేమని మలేరియా నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment