Monkeypox: మరో మహమ్మారి.. ! | Monkeypox: WHO declares mpox a global public health emergency | Sakshi
Sakshi News home page

Monkeypox: మరో మహమ్మారి.. !

Published Sat, Aug 17 2024 5:42 AM | Last Updated on Sat, Aug 17 2024 11:48 AM

Monkeypox: WHO declares mpox a global public health emergency

ఇప్పటికే ఆఫ్రికా దేశాలను చుట్టేసిన ప్రమాదకర మంకీపాక్స్‌ వైరస్‌ 

దశాబ్దాల నిర్లక్ష్యం నేడు ప్రాణాంతకంగా మారిన వైనం 

నిన్న స్వీడన్‌కు నేడు పాకిస్తాన్‌కు పాకిన వైరస్‌ 

అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్‌ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. 

ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్‌ఓ ‘గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్‌ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. 

ఏమిటీ ఎంపాక్స్‌ వైరస్‌? 
1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్‌ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్‌ పరీక్షలు జరిపి ఈ వైరస్‌ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్‌ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. 

మనుషులు, చిట్టెలుకలకూ వైరస్‌ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్‌ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్‌ వైరస్‌ రకానికి చెందిన ఎంపాక్స్‌ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్‌ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్‌ కూడా ఈ రకానిదే.  

వైరస్‌ ఎలా సోకుతుంది? 
→ అప్పటికే వైరస్‌ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్‌ సోకుతుంది. 
→ కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్‌ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్‌ సోకుతుంది. 
→ చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్‌ సోకుతుంది 
→ ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు 
→ రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్‌ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం 

వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? 
రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్‌ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించవచ్చు. 

కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించింది
కొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్‌ కొత్త వేరియంట్‌ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్‌ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్‌ క్లాడ్‌2 రకం వేరియంట్‌ విజృంభిస్తే ఈసారి క్లాడ్‌1 వేరియంట్‌ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్‌ అత్యంత ప్రమాదకరం.  

లక్షణాలు ఏమిటీ?
→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. 
→ మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.
→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి.  

వ్యాక్సిన్‌ ఉందా? 
అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్‌ ఔషధమైన టికోవిరమాట్‌(టీపీఓఎక్స్‌ ఎక్స్‌)ను ఎంపాక్స్‌ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్‌ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్‌ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్‌ వ్యాప్తి ఆగట్లేదు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement