new virus
-
HKU5-CoV-2: చైనాలో మరో మహమ్మారి!
బీజింగ్: ఐదేళ్ల క్రితం కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా! చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గబ్బిలాల నుంచి హెచ్‌కేయూ5–కోవ్–2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరి, మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా, అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇవి హెచ్‌కేయూ5–కోవ్–2కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నాయి. గాంగ్జౌ లేబోరేటరీ, గాంగ్జౌ అకాడమీ అఫ్ సైన్సెస్, వూహాన్ యూనివర్సిటీ, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం సార్స్–కోవ్–2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోటెన్సిన్–కోవర్టింగ్ ఎంజైమ్(ఏసీఈ2) అనే రిసెప్టర్‌ను ఉపయోగించుకొని కణాలపై దాడి చేసింది. ఫలితంగా కోవిడ్–19 పంజా విసరింది. గబ్బిలాల నుంచి పుట్టిన హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కోవిడ్–19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
కొత్త వైరస్ వచ్చేసింది.. మాస్క్ ఈజ్ బ్యాక్ (ఫొటోలు)
-
హెచ్ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా!
చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. 👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్‌లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.ఏమిటీ హెచ్ఎంపీవీ వైరస్?హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్.. ఆర్ఎన్ఏ వైరస్. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ లక్షణాలు, చికిత్సకరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.ఇక హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్ డాటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది. -
చైనాలో కొత్త వైరస్
-
చైనాలో కొత్త వైరస్ కలకలం
బీజింగ్: విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడను ఒక్కసారిగా ప్రశ్నార్థంచేసి మహా మహమ్మారిగా ప్రపంచదేశాలను చుట్టేసిన కరోనా వైరస్ భయాల నుంచి తేరుకున్న పౌరులకు చైనా మరో భయపెట్టే వార్త మోసుకొచ్చింది. చైనాలో ఇప్పుడు కొత్తగా హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) వ్యాప్తిచెందుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. కోవిడ్ సంక్షోభం సమసిపోయిన ఐదేళ్లకు మళ్లీ అదే డ్రాగన్ దేశం నుంచి వైరస్ వార్త వెలువడటంతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొత్త వైరస్ విజృంభణ, దాని విస్తృతి, సాంక్రమణ శక్తి సామర్థ్యాలపై వెంటనే ఆలోచనల్లో పడ్డాయి. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్తితిపై ఆరా తీస్తున్నాయి. చైనాలో పలు ప్రాంతాల్లో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలొచ్చాయి. పుకార్ల వార్తలకు మారుపేరుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న సోషల్‌మీడియాలో ఇప్పటికే కొత్త వైరస్‌పై వార్తలు వెల్లువెత్తాయి. చైనాలో హెచ్ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైసోప్లాస్మా నిమోనియో, కోవిడ్19లు విజృంభించాయని, చైనా అత్యయిక ఆరోగ్య స్థితిని విధించారని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు షేర్ చేసిన వీడియోల్లో చైనీయులు ఆస్పత్రులు, శ్మశానాల వద్ద క్యూ లైన్లు కనిపించిన దృశ్యాలున్నాయి. అయితే ఈ వార్తలను ఇంతవరకు చైనా ప్రభుత్వంగానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థగానీ ధృవీకరించలేదు. ఇది పాత వైరస్సేనని కొందరు వైద్యులు చెబుతుండటం గమనార్హం. -
నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోన్న జికా వైరస్
-
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్‌ను వణికిస్తున్న ‘వెస్ట్ నైల్ ఫీవర్’, లక్షణాలు, జాగ్రత్తలు
ఇజ్రాయెల్‌లో కొత్త వైరస్ ఆందోళన రేపుతోంది. మే ప్రారంభంలో దేశంలో వ్యాప్తి చెందినప్పటినుంచీ ఇప్పటిదాకా ‘వెస్ట్ నైల్ ఫీవర్’ తో దేశంలో31 మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్‌లోని ఆరోగ్య అధికారులు తెలిపారు.జిన్హువా వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం అక్కడ కొత్తగా 49 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 405కి చేరుకుంది. 2000 నాటి వార్షిక రికార్డు గరిష్ట స్థాయి 425 కేసులకు చేరువలో ఉంది. దీంతో అప్రమత్తమైన, ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. దోమలు పెచ్చరిల్లే వాతావరణం కారణంగా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.70 అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులతోపాటు పిల్లలు కూడా వైరస్‌తో బాధపడుతున్నారని పేర్కొంది.గత రెండు నెలల్లో 159 పక్షులు వైరస్ బారిన పడ్డాయని, మొత్తం 2023లో పక్షులలో కేవలం మూడు ఇన్ఫెక్షన్లు మాత్రమే సంభవించాయని ఇజ్రాయెల్ యొక్క చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, తమీర్ గోషెన్ మీడియాకు తెలిపారు.వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? వెస్ట్ నైల్ ఫీవర్ వెస్ట్ నైల్ వైరస్ వల్ల వస్తుంది. ఇది దోమకాటు ద్వారా జంతువలనుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వెస్ట్ నైల్ వైరస్ మనుషులు, పక్షులు, దోమలు, గుర్రాలు , కొన్ని ఇతర క్షీరదాలకు సోకుతుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ చెబుతోంది.వెస్ట్ నైల్ ఫీవర్‌లో సాధారణంగా, తేలికపాటి ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో, పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు, మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్), మెదడు , వెన్నుపాము లైనింగ్ (మెనింజైటిస్), మెదడు దాని చుట్టుపక్కల పొర (మెనింగోఎన్సెఫాలిటిస్) వాపునకు కారణమవుతుంది.ఒక్కోసారి ఇవి ప్రాణాంతకంగా మారవచ్చు. వెస్ట్ నైలు జ్వరం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోఇన్వాసివ్ వ్యాధికి దారితీస్తుంది. గందరగోళం, మూర్ఛ, కండరాల బలహీనత , అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం పోలియో కూడా సంభవించవచ్చు.వెస్ట్ నైల్ వైరస్ కోరియోరెటినిటిస్ , ఆప్టిక్ న్యూరిటిస్ (రెటీనా వాపు, నరాల) కంటి సమస్యలను కలిగిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపును శాశ్వతంగా కోల్పోవచ్చు..మయోకార్డిటిస్‌కు దారితీసే గుండెపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. గుండె కండరాల వాపు, గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. కిడ్నీ వాపు నెఫ్రైటిస్కు కారణం కావచ్చు.నివారణ చర్యలుచుట్టుపక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడటం చాలా అవసరం. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. రోగనిరోధక శక్తిపెరిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. తాగు నీరు విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. ఏ కొద్ది అనుమానం వచ్చినా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్‌గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్‌ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్‌లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్‌లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్‌లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్‌గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్‌లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్‌గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్‌తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్‌గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ -
పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు
లండన్: కోవిడ్–19.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో పదేళ్లలో కోవిడ్–19 లాంటి భీకరమైన మహమ్మారి పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని లండన్‌లోని ప్రెడిక్టివ్ హెల్త్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ సంస్థ ‘ఎయిర్ఫినిటీ’ వెల్లడించింది. వచ్చే పదేళ్లలో కొత్త మహమ్మారి తలెత్తడానికి 27.5 శాతం అవకాశాలు ఉన్నట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లతోపాటు వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల ఆధారంగా ఈ సంస్థ అంచనాలు వెలువరిస్తూ ఉంటుంది. తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తించే కొత్త వైరస్ యూకేలో ఒక్కరోజులో 15,000 మందిని అంతం చేయగలదని తెలియజేసింది. ఎవియన్ ఫ్లూ తరహాలోనే ఇది మార్పులు చెందుతూ ఉంటుందని పేర్కొంది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసుకోవడం, నియంత్రణ చర్యలను వేగవంతం చేయడం, 100 రోజుల్లో వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకోవడం ద్వారా కొత్త వైరస్ ముప్పు 27.5 శాతం నుంచి క్రమంగా 8.1 శాతానికి తగ్గిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారులను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధత అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితి చాలా మెరుగుపడాలని ఎయిర్ఫినిటీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రాస్మస్ బెచ్ హన్సెన్ స్పష్టం చేశారు. -
మిస్టరీగా మారిన కొత్త వైరస్.. 24 గంటల్లో ముగ్గురు మృతి!
ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలపై మరో వైరస్ దాడి మొదలైంది. వైద్యులకే అంతుచిక్కని కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందడం కలకలం సృష్టించింది. కాగా, ఈ వైరస్ ఆఫ్రికాలో వ్యాప్తిచెందుతోంది. వివరాల ప్రకారం.. ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో ఉన్న బజిరోలో ప్రాంతంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్నది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా 24 గంటల్లోనే ముగ్గురు మృతిచెందారు. అయితే, ఈ వైరస్ బారినపడిన వారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు అక్కడి వైద్యులు నిర్దారించారు. ఇదే సమయంలో వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బురుండి దేశ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలా ఉండగా, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సమీప దేశాలను హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇటీవలే బురుండి పక్క దేశమైన టాంజానియాలో మార్బర్గ్ అనే వైరస్ వ్యాప్తి జరిగింది. దీంతో, ఇదే వైరస్ కూడా బురుండిలో వ్యాప్తి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బురుండిలో ఎబోలా, మార్బర్గ్ వ్యాప్తి చెందే అవకాశంలేదని ఆరోగ్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. Deadlier than Covid19: Africa sees new virus that kills within 24 hours, claims three in Burundi A unidentified disease, anticipated as a virus that causes nosebleed and reportedly kills the infected person within 24 hours#indianews #india #newsindia #dailynews #ohmyindia pic.twitter.com/DyjgVdQrTC — Oh My India (@OhMyIndiaNews) March 31, 2023 -
గడ్డకట్టే మంచులో జాంబీ వైరస్లు!
గ్లోబల్ వార్మింగ్‌తో మానవాళికి ముమ్మాటికీ ముప్పే!. అతిశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో.. వాతావరణ మార్పుల ప్రభావం పెను ముప్పుకు దారి తీయొచ్చని శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. వాతావరణం వేడెక్కడం వల్ల మంచు కరిగిపోవడం.. అందులో అప్పటికే చిక్కుకున్న మీథేన్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదల కావడం, తద్వారా పరిస్థితి మరింత దిగజారుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే.. గడ్డ కట్టుకుపోయే స్థితిలో ఉన్న మంచులో సైతం.. ప్రమాదకరమైన వైరస్ల ఉనికి ఉంటుందని, ఒకవేళ ఇవి గనుక విజృంభిస్తే .. మానవాళికి ముప్పు ఊహించని రీతిలో ఉండొచ్చని తాజాగా సైంటిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచ మానవాళి ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాం. అలాగే.. కనుమరుగు అయ్యాయనుకునే వైరస్ల జాడ.. మంచు ప్రాంతాల్లో సజీవంగా తరచూ బయటపడుతుంటుంది కూడా. కానీ, వాటి ప్రభావం ప్రపంచంపై ఏమేర ఉంటుందనే దానిపై ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది. తాజాగా.. రష్యాలోని సైబీరియా రీజియన్‌లో సుమారు 48 వేల సంవత్సరాల వయసున్న వైరస్ల ఉనికిని.. గడ్డకట్టుకుపోయిన ఓ సరస్సు అడుగు భాగం సేకరించారు యూరోపియన్ సైంటిస్టులు. మంచు ప్రాంతాల్లో తమ పరిశోధనల్లో భాగంగా.. మొత్తం పదమూడు రకాల వ్యాధికారకాలను గుర్తించి.. ‘జాంబీ వైరస్’లుగా వాటిని వ్యవహరిస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా.. ఇంతకాలం గడ్డకట్టిన స్థితిలో ఉన్నా కూడా అంటువ్యాధులు ప్రబళించే సామర్థ్యంతో అవి ఉన్నట్లు చెప్తున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన సైంటిస్టులు ఈ వైరస్లు తిరిగి విజృంభిస్తే.. ఏమేర ప్రభావం చూపుతాయి అనే అంశంపై పరిశోధనలు ముమ్మరం చేశారు. వీటి వయసు ఎంత? అంటువ్యాధులను ఎలా వ్యాప్తి చెందిస్తాయి? బయటకు వచ్చాక వాటి ప్రభావం ఎలా ఉంటుంది?.. మనిషి/జంతువుల్లో వాటి ప్రభావం ఏమేర ఉంటుంది?.. తదితర అంశాలపై ఇప్పుడే ఓ అంచనాకి రాలేమని, మరికొంత సమయం పడుతుందని రీసెర్చర్లు చెప్తున్నారు. ఇదీ చదవండి: మంకీపాక్స్ పేరు మారింది! -
కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..?
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేసిన విషయం తెలిసిందే. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. అయితే రాబోయో రోజుల్లో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా విసరబోతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మార్బర్గ్ అనే వైరస్ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగుచుశాయని, ఈ రోగులకు సరైన చికిత్స అందించి.. వైరస్‌ను కట్టడి చేయలేకపోతే మరో మహమ్మారిలా విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దీనికి 'డిసీజ్-ఎక్స్' గా నామకరణం చేసింది. డిసీజ్-ఎక్స్ ఎబోలా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి సోకినవారిలో 80 శాతం మంది రోగులు మరణిస్తారు. ఇప్పటికే కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గింది. ఈ సమయంలో డిసీజ్-ఎక్స్ ఎటాక్ చేస్తే వాళ్లు తట్టుకోలేరని, కరోనా కంటే ఊహించని ప్రాణనష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మందు లేదు.. డిసీజ్-ఎక్స్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ గానీ, ఔషధాలు గానీ అందుబాటులో లేవు. దీనికి సంబంధించిన సమాచారం కూడా లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది మరో మహమ్మారిలా పరిణమిస్తే మానవాళి మనుగడకే ప్రమాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ ఇంకా పూర్తిగా కోలేదు. అన్ని దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డిసీజ్-ఎక్స్ కేసులు పెరిగి విశ్వమంతా వ్యాపిస్తే.. ఆ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై.. -
కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్‌లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్ ఎక్స్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్), నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్‌లతో జాబితాను సవరించనున్నారు. ‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ! -
Khosta-2: రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్
వాషింగ్టన్: సార్స్–కోవ్–2.. అంటే కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేదు. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. తొలుత చైనాలో పుట్టినట్లు భావిస్తున్న ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. అచ్చంగా కోవిడ్–19 లాంటి వైరస్‌ను రష్యాలోని గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేవని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం రష్యా గబ్బిలాలపై అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఖోట్సా–2 అనే వైరస్‌లో స్పైక్ ప్రొటీన్లను గుర్తించారు. ఇవి మనుషుల్లోని కణాల్లోకి చొచ్చుకుపోయి, విషపూరితం చేస్తాయని తేల్చారు. కరోనా వైరస్లలో (సార్బీకోవైరస్లు) ఖోట్సా–2, సార్స్–కోవిడ్–2 అనేవి ఒకే ఉప కేటగిరీకి చెందినవని పరిశోధకులు చెప్పారు. అధ్యయనం వివరాలను ప్లాస్ పాథోజెన్స్ పత్రికలో ప్రచురించారు. కేవలం సార్స్–కోవ్–2 వంటి వేరియంట్లను నియంత్రించడానికి కాదు, సార్బీకోవైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యూనివర్సల్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్ట్ మైఖేల్ లెట్కో చెప్పారు. ఖోట్సా–2 వైరస్ వ్యాపిస్తే మనుషులకు తీవ్ర అనారోగ్యం ముప్పుందని గుర్తించారు. కోవిడ్–19, ఖోట్సా–2 లాంటి వైరస్లు ప్రొటీన్ స్పైక్‌ల సాయంతో మనుషులపై దాడి చేస్తాయి. -
వణికిస్తున్న లంపీ ముప్పు.. రోజుకు 600–700 ఆవులు మృత్యువాత
దేశంలో కొద్ది నెలలుగా మరో వైరస్ పేరు మారుమోగుతోంది. పాడి పశువుల్లో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే లంపీ స్కిన్ వ్యాధి (ఎల్ఎస్డీ). కాప్రిపాక్స్ అని పిలిచే ఈ వైరస్ ఆవులు, గేదెలకు సోకుతోంది. ఈ ఏప్రిల్‌లో గుజరాత్‌లోని కచ్‌లో తొలిసారి ఇది బయటపడింది. రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, యూపీ సహా పలు రాష్ట్రాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 వేల పశువులు మరణించాయి. మరో 15 లక్షల పశువులకు వైరస్ సోకింది. ఈ అంటువ్యాధి మరింత విస్తరిస్తే దేశ పాడిపరిశ్రమకే తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలున్నాయి. రాజస్తాన్‌లో పశువులపై తీవ్ర ప్రభావం లంపీ స్కిన్ వ్యాధి రాజస్తాన్‌లో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వ్యాధితో రాష్ట్రంలోనే ఏకంగా 57,000 ఆవులు మరణించగా, మరో 11 లక్షల ఆవులు దీని బారిన పడ్డాయి. రోజుకి సగటున 600–700 ఆవులు మరణిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి 15–18 శాతం తగ్గిపోయింది. దీంతో పాలు, వాటితో తయారు చేసే స్వీట్ల ధరలు బాగా పెరిగిపోయాయి. రోజుకు 5–6 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోయిందని రాజస్థాన్ కో ఆపరేటివ్ డెయిరీ వెల్లడించింది. రాజస్తాన్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతలు ఈ వ్యాధి నివారణకు రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ భారతీయ జనతా పార్టీ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి భారీ సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. కానీ నిరసనకారులు బారికేడ్లు దూకి మరీ అసెంబ్లీలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలా సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాధి తీవ్రత గురించి అందరికీ తెలియజేయడానికి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒక ఆవుని కూడా తోలుకొని వచ్చారు. వ్యాధి సోకిన పశువులకి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా డిమాండ్ చేశారు. మరోవైపు దీనిపై కేంద్రమే స్పందించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 13 రాష్ట్రాల్లో పశువులకి ఈ వ్యాధి సోకడం వల్ల జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి సాయం అందించాలన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏమిటీ వైరస్? దోమలు, ఈగలు, పేలు మరికొన్ని కీటకాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది గోటోపాక్స్, షీప్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్. ఈ వ్యాధితో పశువులకు జ్వరం సోకడంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఈ వైరస్ సోకితే పశువులు ఆహారం తీసుకోలేవు. అధికంగా లాలాజలం ఊరి నోట్లో నుంచి బయటకు వస్తుంది. ముక్కు, కళ్లల్లోంచి కూడా స్రవాలు బయటకి వస్తాయి. కొన్నాళ్లకే పశువులు బరువును కోల్పోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది.ఈ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎన్నో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ సోకిన జంతువులకు పశు వైద్యులు ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్ ఇస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు. మనుషులకు సోకదు లంపీ స్కిన్ వ్యాధి మనుషులకి సోకే అవకాశం ఎంత మాత్రం లేదదిది జూనోటిక్ (మనుషులకు సంక్రమించదు) వైరస్ కాదని, మనుషులకు సోకదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు వెల్లడించారు. వ్యాధి సోకిన ఆవుల పాలను నిర్భయంగా తాగవచ్చునని మనుషులకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు. పరిష్కారమేంటి? ప్రస్తుతానికి ఈ వ్యాధి మరింత విస్తరించకుండా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులు, పశుపోషకుల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్రం రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కొన్నాళ్లు పాటు పశువుల్ని వేరే రాష్ట్రాలకు తరలించవద్దని సూచించింది. గోట్‌పాక్స్ వైరస్ నిరోధక వ్యాక్సిన్ దీనినీ అరికడుతుందని నిపుణులు చెప్పడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 కోట్లను ఈ వైరస్ ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐబీఆర్‌ఐ) సంయుక్తంగా లంపీ స్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నారు. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుంది. దేశంలోని పశువులన్నింటికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే 18–20 టీకా డోసులు అవసరం. దేశంలోని పశువులకి 80శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయితేనే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడతామని ఏనిమల్ సైన్సెస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బి.ఎన్. త్రిపాఠి అభిప్రాయపడ్డారు. 2025 నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. -
కేంద్రం వార్నింగ్.. భారత్‌లోకి కొత్త రకం బ్యాంకింగ్ వైరస్ ఎంట్రీ!
బనశంకరి: నేరాలు దాని స్వరూపాన్ని మార్చుకుంటోంది. క్రెడిట్ కార్డులు బకాయిలు చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు ముగిసిందని ఫోన్ చేసి ఓటీపీలు అడిగి డబ్బులు కాజేసేవారు. ఇప్పుడు కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు కన్నం వేసేందుకు సోవా అనే మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ అడుగు పెట్టింది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్, స్మార్ట్ఫోన్లలో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లను టార్గెట్‌గా చేసుకుని ఈ వైరస్ దాడి చేస్తుంది. అమెరికా, రష్యా, స్పెయిన్ అనంతరం భారత్ బ్యాంకింగ్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుంది. జూలైలో ఈ వైరస్ భారత్‌లో కనబడగా ప్రస్తుతం మరింత అప్డేట్ కాబడి తన హవా కొనసాగిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. మొబైల్లో ప్రవేశించే ఈ వైరస్‌ను తొలగించడం (అన్ ఇన్స్టాల్) చాలాకష్టం. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ యాప్‌ల్లో దాగి ఉంటుంది. వివిధ రూపాల్లో.. పేమెంట్ యాప్ రూపంలో సోవా మీ మొబైల్లో చేరవచ్చు. బ్యాంకింగ్ ఇ–కామర్స్ యాప్‌లు రూపంలో కనబడవచ్చు. వాటిని వినియోగించినప్పుడు కస్టమర్లు వ్యక్తిగత వివరాలు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురి అవుతుందని జాతీయ కంప్యూటర్ భద్రతా అత్యవసర బృందం (సర్ట్స్ ఇన్) హెచ్చరించింది. గూగుల్‌క్రోమ్, అమెజాన్, ఎఫ్ఎఫ్టీ రూపంలో స్మార్ట్స్ ఫోన్‌లోనికి దొంగలా వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. అనంతరం వినియోగదారులకు తెలియకుండా పాస్వర్డ్ లాగిన్ వివరాలు చోరీ చేస్తుంది. ఇది ప్రమాదకరం సోవా–0.5 సోవా కానీ లేదా మరో వైరస్ కానీ సైబర్‌స్పేస్‌లో కస్టమర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి సోవా అనేది కొత్తది కాదు. విదేశాల్లో ఇది చాలా వరకు దెబ్బతీసింది. ప్రస్తుతం భారత్‌లో ప్రవేశించిన సోవా 5.0 మరింత ప్రమాదకారి అని సైబర్ నిపుణుడు జీ.అనంతప్రభు తెలిపారు. మొబైల్ లేదా కంప్యూటర్లో రారయండ్ సమ్వేర్లో చేరుకుని మీ అకౌంట్‌ను లాక్ చేస్తుంది. అన్‌లాక్ చేయడానికి సైబర్ వంచకులు డబ్బు అడుగుతారు. ఈ ఫ్యూచర్ సైతం సోవాకు చేరుతుంది. కస్టమర్లు జాగ్రత్త వహించాలి. గూగుల్, ఫేస్బుక్, జీ మెయిల్ వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేస్తుంది. బ్యాకింగ్ వ్యవహారాలకు కన్నం వేస్తుంది. 200కు పైగా యాప్‌లు బ్యాంకింగ్ అప్లికేషన్లు, క్రిప్టో ఎక్సేంజీలు, వ్యాలెట్లతో పాటు 200కు పైగా మొబైల్ అప్లికేషన్లను కొత్త వైరస్ టార్గెట్ చేసుకుంటుందని భద్రతా సంస్థ తెలిపింది. వినియోగదారులు తమ నెట్‌బ్యాకింగ్ అప్లికేషన్లకు లాక్ ఇన్ చేయగా, బ్యాంక్ అకౌంట్లలో ప్రవేశించినప్పుడు ఈ సోవా మాల్వేర్ డేటాను కాజేస్తుంది. సైబర్ సాక్షరత సమస్యకు పరిహారమని ఐటీ నిపుణుడు వినాయక్ పీఎస్, తెలిపారు. ఇలా జాగ్రత పడాలి : - మొబైల్ బ్యాంకింగ్ వ్యవహారాలు చేసేవారు తమ అకౌంట్‌ను రెండు దశల్లో ధ్రువీకరణ (ఐడెంటీఫికేషన్) వ్యవస్థ వినియోగించాలి. - బ్యాంకింగ్ యాప్‌లను నిత్యం అప్డేట్ చేయాలి - కచ్చితంగా ఉత్తమమైన యాంటీ వైరస్ మొబైల్ వినియోగించాలి - మొబైల్స్‌కు వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయరాదు - యాప్‌లు, ఓపెన్, బ్రౌజర్లు నిత్యం అప్డేట్ చేసి అధికారిక యాప్ స్టోర్ నుచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్లును మాత్రమే వినియోగించాలి. - పబ్లిక్ వైఫైను వినియోగించడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. -
చైనాలో మరో కొత్త వైరస్
-
Langya Virus: చైనాలో లాంగ్యా వైరస్ అలజడి.. అది ప్రమాదకరమా? లక్షణాలు ఇవే!
బీజింగ్: చైనాలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. షాన్డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లాంగ్యా హెనిపావైరస్ సోకినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్.. మరి అసలు లాంగ్యా వైరస్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి? వైరస్ ప్రమాదకరమైనదా? కాదా అనే విషయాలు తెలుసుకుందాం ... ఎప్పుడు బయట పడిందంటే.. లాంగ్యా వైరస్ 2019లో మొదటిసారిగా మనుషుల్లో గుర్తించారు. కానీ లాంగ్యా వైరస్ కేసులు ఈ ఏడాదిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఒకరి నుంచి మరొరరికి సోకుతుందా? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చైనా వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. కరోనా ప్రభావం కనిపించిన 2020 జనవరి-జులై నెలల మధ్యలో లాగ్యా వైరస్ ఇన్ఫెక్షన్లు కనిపించలేదని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఎపిడెమియాలజీ పరిశోధకులు వెల్లడించారు. సంబంధిత వార్త: ఓరి దేవుడో! చైనాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్, 35 కేసులు నమోదు లాంగ్యా వైరస్ లక్షణాలు కానీ 2020 జులై తర్వాత 11 లాంగ్యా వైరస్ కేసులను గుర్తించారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలను గమనించిన పరిశోధకులు.. ఎక్కువ మంది జ్వరం బారిన పడినట్లు గుర్తించారు. లాంగ్యా వైరస్ బారిన పడిన 50 శాతం మందిలో దగ్గు, 54 శాతం మందిలో అలసట, సగం మందిలో ఆకలి లేకపోవడం, 46 శాతం మందిలో కండరాల నొప్పులు, 38 శాతం మందిలో వాంతులు వంటి లక్షణాలను గుర్తించారు. అలాగే ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. చదవండి: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు మృతి హెనాన్, షాన్డాంగ్ ప్రావిన్సుల్లోని ఎలుకల్లా ఉండే 262 ష్రూస్‌లపై పరిశోధనలు చేయగా 71 జీవుల్లో ఈ వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. కుక్కలు (5 శాతం), మేకల్లోనూ (2శాతం) ఈ వైరస్‌ను కనుగొన్నారు. మరో విషయమేంటంటే.. సాధారణంగా గబ్బిలాలలో కనిపించే ప్రాణాంతక నిఫా వైరస్ కుటుంబానికి చెందినదే లాంగ్యా వైరస్. నిఫా కోవిడ్-19 తరహాలోనే లాంగ్యా వ్యాపిస్తుందట! అయితే నిఫా వైరస్ తదుపరి మహమ్మారికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది. -
ఓరి దేవుడో! చైనాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్, 35 కేసులు నమోదు
బీజింగ్: కరోనా వైరస్ ఇంకా అంతమవ్వనేలేదు. కోవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల్లో నిత్యం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. భారత్‌లోనూ కోవిడ్ కేసులు వేలల్లో వెలుగు చూస్తున్నాయి. దీనికి తోడు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త రకం వైరస్ హడలెత్తిస్తోంది. అదే లాంగ్యా హెనిపా వైరస్‌గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తూర్పు చైనాలోని హెనాన్, షాన్డాంగ్ ప్రావిన్సుల్లో ఇప్పటి వరకు 35 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. జర్వంతో బాధపడుతున్న రోగుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో లాంగ్యా వైరస్‌ను వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ మనుషుల్లో మూడో వంతు మంది ప్రాణాలను తీయగలదని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులో ఎలాంటి మరణం సంభవించలేదు. అంతేగాక ఈ వైరస్ బారిన పడిన వారిలో కేవలం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. పేషెంట్లు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లాంగ్యా వైరస్‌కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని లక్షణాలు, సమస్యల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. చదవండి: కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్.. ఇది నిజమేనా! -
Marburg virus: వెలుగులోకి మరో ప్రాణాంతక వైరస్.. డబ్ల్యూహెచ్‌వో అలర్ట్!
అక్ర: ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్ బయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన 'మార్బర్గ్' వైరస్ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. జులై 10నే పాజిటివ్‌గా తేలినప్పటికీ.. ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 'సెనెగల్‌లోని ఇన్స్టిట్యూట్ పాస్టెర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది' అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్‌కు తరలించామని, ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ వెలుగు చూడటం ఇది రెండో సంఘటన. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి కేసులు వెలుగు చూడలేదు. డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం.. ప్రాణాంతక మార్బర్గ్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. 'ఘనా ఆరోగ్య విభాగం వేగంగా స్పందించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇలా చేయటమే మంచిది. లేదంటే మార్బర్గ్ వైరస్ చేయిదాటిపోతుంది.' అని పేర్కొన్నారు డబ్యూహెచ్‌వో ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మాట్షిడిసో మోటీ. మార్బర్గ్ వైరస్ సోకిన ఇద్దరు రోగులు.. ఘనాలోని సదరన్ అశాంతి నగర్‌కు చెందిన వారిగా తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందే ముందు వారిలో డయేరియా, శరీరంలో రక్త స్రావం, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు. ఇదీ చదవండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం -
వరంగల్: వామ్మో! అంతుచిక్కని వైరస్‌తో 4వేల కోళ్లు మృతి
వరంగల్ (నెక్కొండ): అంతు చిక్కని వ్యాధితో 4వేల కోళ్లు మృత్యువాతపడిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని మడిపెల్లి శివారు హరిశ్చంద్రుతండాలోని సరిత పౌల్ట్రీపామ్‌లో జరిగింది. యజమాని తేజావత్ మురళీనాయక్ తెలిపిన వివరాలు ప్రకారం.. పౌల్ట్రీనపామ్లో 25 రోజుల నుంచి 11,300 కోళ్లను పెంచుతున్నాడు. ఈ క్రమంలో మూడురోజులుగా రోజుకు 1,000కి పైగా కోళ్లు మృతి చెందుతున్నాయి. ఇప్పటి వరకు 4వేల కోళ్లు మృతి చెందాయి. మరో రెండుమూడు రోజులు గడిస్తే పామ్‌లోని మిగితా కోళ్లు కూడా మృతిచెందే అవకాశం ఉందని యజమాని వాపోయాడు. కోళ్లకు కిడ్నీ వాపు, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి మృతి చెంది ఉండవచ్చని యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు రూ. 6లక్షల నష్టం వాటిల్లిందని, మిగితా కోళ్లు మృతి చెందితే మరో రూ.15 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. మృతి చెందిన కోళ్లను గోతి తోపాతిపెట్టినట్లు యజమాని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తాం.. పౌల్ట్రీపామ్‌లో మృతి చెందిన కోళ్ల వ్యాధి నిర్ధారణ కోసం పోస్టుమార్టం నిర్వహిస్తాం. ప్రస్తుతం కోళ్లు రానికెట్, బర్డ్ ఫ్లూ, వీవీ ఆర్డీ వ్యాధులతో పెద్ద మొత్తంలో మృత్యువాత పడతాయి. లేదా వేసవి తాపం, సాధారణ వ్యాధులతో కోళ్లు మృతి చెంది ఉండవచ్చు. కోళ్ల మృతి విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఏడీడీఎల్ ఏడీ నాగమణి ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరుగుతుంది. అలాగే పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాం. –మమత, పశువైద్యాధికారి, నెక్కొండ -
కరోనా సరే.. ఇంకా వస్తాయా?
కరోనా మహమ్మారి దాడి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ చాలా దేశాలను వణికిస్తూనే ఉంది. మరి దీనికి అంతమెప్పుడు? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిదీ కాదు.. ఇదే చివరిది అయ్యే అవకాశమూ లేదు. తరచూ ఏదో ఓ కొత్త వైరస్ దాడి మొదలవుతూనే ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? కారణాలు ఏమిటి? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న సందేహాలు వస్తున్నాయి కదా. దీనిపై ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ (ఐపీబీఈఎస్)’ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా.. ► జంతువులు, పక్షుల నుంచే.. మనుషులకు కొత్తగా సంక్రమిస్తున్న వ్యాధుల్లో చాలా వరకు జంతువులు, పక్షుల నుంచి వ్యాపిస్తున్నవే. అంటే ప్రాథమికంగా జంతువులు, పక్షుల్లోనే ఉండి, వాటిపైనే ప్రభావం చూపే సూక్ష్మజీవులు.. మ్యూటేషన్ చెంది మనుషులపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను జూనోటిక్ లేదా జూనోసెస్ అని పిలుస్తారు. ♦1940 దశాబ్దం నుంచి ఇప్పటివరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించగా.. అందులో 60 శాతానికిపైగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించినవే. ► ఏటా మరిన్ని కొత్త వ్యాధులు జంతువులు, పక్షుల నుంచి మనుషులకు విస్తరిస్తున్న కొత్త వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూపోతోంది. సగటున 3, 4 వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో కొన్నిరకాల వైరస్లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. ► మహమ్మారులుగా మారేవి అవే.. ఇన్ఫ్లుయెంజా, సార్స్, ఇప్పటి కోవిడ్ సహా మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికించిన, వణికిస్తున్న వ్యాధులు మొత్తం కూడా జంతువులు, పక్షుల నుంచి వచ్చినవే. ♦ ఎబోలా, జికా, నిఫా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే వైరస్లలో 70 శాతానికిపైగా అడవి జంతువుల నుంచో, పెంపుడు జంతువుల నుంచో మనుషులకు విస్తరించినవే. ► ఇంకా గుర్తించని వైరస్లు లక్షల్లోనే.. జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్లలో మనం ఇంకా గుర్తించని వాటి సంఖ్య 17 లక్షలకుపైనే అని ఒక అంచనా. అందులో 6.3 లక్షల నుంచి 8.2 లక్షల వైరస్‌లకు మనుషులకు సోకే సామర్థ్యం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ♦ నిజానికి భూమ్మీద కొన్నికోట్ల రకాల వైరస్లు ఉన్నాయని.. వాటిలో మనం గుర్తించినవి, గుర్తించగలిగినవి చాలా తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ► ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్లే.. వైరస్లు ఇప్పుడిప్పుడు కొత్తగా పుడుతున్నవేమీ కాదు. కొన్ని లక్షల ఏళ్లుగా జంతువులు, పక్షుల్లో ఉన్నవే. పరిస్థితులకు అనుగుణంగా రూపుమార్చుకుంటున్నవే. మరి ఇప్పుడు కొత్తగా ప్రభావం చూపించడం ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ప్రకృతి సమతౌల్యాన్ని మనుషులు దెబ్బతీయడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అడవులను నరికివేయడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులు, వన్యప్రాణులు జనావాసాలకు దగ్గర కావడం, వాటి మాంసం వినియోగం వంటివి ప్రమాదకరంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ♦ దాదాపు వందేళ్ల కిందటితో పోలిస్తే.. 30 శాతం అడవులు తగ్గిపోయాయి. ఆ భూమిలో వ్యవసాయం, పట్టణీకరణ పెరిగింది. ♦ 2050 నాటికి 247 కోట్ల ఎకరాల అడవులు అంతరిస్తాయని ఒక అంచనా. ♦ ప్రపంచవ్యాప్తంగా అడవి జంతువుల్లో 24 శాతం వరకు స్మగ్లింగ్ బారినపడుతున్నాయి. దీని విలువ సగటున ఏటా 17 వేల కోట్ల రూపాయలకుపైనే అని అంచనా. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
డెల్టా ఉంది.. ల్యామ్డా వచ్చేసింది?
కొత్తా దేవుడండి.. కొంగొత్తా దేవుడండి... అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు సినిమా పాట పల్లవిది! ఇప్పుడు తరచూ దీన్ని మార్చి పాడుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటారా? ఏముందీ.. ఇంకో కొత్త కరోనా రూపాంతరితం అవతరించిందట! ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్‌లు ఎక్కడికీ పోలేదు కానీ... పాతికకుపైగా దేశాల్లో ఇప్పుడు ల్యామ్డా కలకలం మొదలైంది! కంగారేమీ లేదు లెండి.. ప్రస్తుతానికి దీంతో ముప్పు తక్కువే. దేశంలో రెండో దశ కరోనాలో విధ్వంసం సృష్టించిన డెల్టా రూపాంతరితం ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తూంటే.. కొన్ని దేశాల్లో ల్యామ్డా ఆందోళన రేకెత్తిస్తోంది. నిజానికి ఇది కొత్తగా కనుక్కున్న రూపాంతరితం ఏమీ కాదు. గత ఏడాది ఆగస్టులోనే దక్షిణ అమెరికా దేశమైన పెరూలో దీన్ని గుర్తించారు. ఆ తరువాత అది సుమారు 30 దేశాలకు విస్తరిం చింది కూడా. కానీ ఇప్పటివరకూ భారత్‌లో ఈ కొత్త రూపాంతరిత వైరస్ సోకిన వారు ఎవరూ లేరు. గత నెల 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించింది. అప్పటివరకూ దీనికున్న సాంకేతిక నామం సి.37. కరోనా వచ్చిన తరువాత గుర్తించిన ఏడవ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇది. మనకేమైనా ప్రమాదమా? భారత్‌తోపాటు, మన ఇరుగుపొరగు దేశాల్లోనూ ఇప్పటివరకూ ల్యామ్డా రూపాంతరితాన్ని గుర్తించలేదు. ఆసియా మొత్తమ్మీద ఒక్క ఇజ్రాయెల్‌లోనే దీన్ని గుర్తించారు. అయితే యూరోపియన్ దేశాలు కొన్నింటిలో ఈ వైరస్ ఉన్న కారణంగా, ఆ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో ల్యామ్డాపై కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్లు వేసుకున్న వారికీ ఈ వైరస్ సోకే అవకాశం ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయమే. మూక నిరోధకతకు దగ్గరగా ఉన్న యూరోపియన్ దేశాల్లో కూడా మళ్లీ మళ్లీ కేసులు ఎక్కువ అవుతూండటం గమనించాల్సిన అంశం. లక్షణాలేమిటి? ల్యామ్డాను ఇప్పటివరకూ 30 దేశాల్లో గుర్తించారు. డెల్టా రూపాంతరితం మాదిరిగానే వేగంగా వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ అధ్యయనాలు జరుగుతున్నాయి. పెరూతోపాటు దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన కేసుల్లో ల్యామ్డావే ఎక్కువ. ఒక దశలో పెరూలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ రూపాంతరితానివే కావడం గమనార్హం. ఇటీవలే యునైటెడ్ కింగ్డమ్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఫ్రాన్స్, జర్మ నీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలతోపాటు ఆస్ట్రేలియాలోనూ దీని ఉనికిని గుర్తించారు. జన్యుమార్పులేమిటి? వైరస్ పరిణామ క్రమంలో మ్యుటేషన్లు (జన్యుమార్పులు) సహజం. అయితే ఈ మ్యుటేషన్లు అన్నీ ప్రమాదకరం కాదు. ల్యామ్డా విషయానికి వస్తే దీని కొమ్ము ప్రొటీన్‌లో ఏడు ముఖ్యమైన జన్యుమార్పులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టాలో ఈ సంఖ్య మూడు మాత్రమే. కొమ్ము ప్రొటీన్‌లో కీలకమైన మార్పులు జరిగాయి కాబట్టి ఈ వైరస్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, యాంటీబాడీలను (సహజంగా పుట్టేవైనా.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యేవైనా) నిరోధించగలదని కొంతమంది అంచనా వేస్తున్నారు. చిలీలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ల్యామ్డా రూపాంతరితం యూకే, బ్రెజిల్‌లలో ముందుగా గుర్తించిన ఆల్ఫా కంటే ఎక్కువ నిరోధకత (యాంటీబాడీలకు) కలిగి ఉన్నట్లు తెలిసింది. చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్కు ల్యామ్డా స్పందించడం లేదని కూడా స్పష్టమైంది. అయితే పూర్తిస్థాయి అంచనాకు వచ్చేందుకు మరింత విస్తృత స్థాయిలో ఈ రూపాంతరితం తాలూకూ జన్యుక్రమాలను నమోదు చేసి పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అబద్దపు ప్రచారంగా తేలిన బాబు స్టేట్ మెంట్
-
కరోనా సెకండ్ వేవ్ భయం!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభి స్తోందనే భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,264 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. వారం రోజుల్లో 86,711 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేలకి చేరువలో ఉంది. మొత్తం కేసుల్లో ఇవి 1.32 శాతం. మహారాష్ట, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదకరంగా కొత్త స్ట్రెయిన్: ఎయిమ్స్ చీఫ్ మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకడం ఆందోళన పుట్టిస్తోందని అన్నారు. ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు అంతగా నమోదు కాకపోవడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామేమోనన్న అంచనాలకు చాలా మంది వచ్చారు. కానీ భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు. జనాభాలో 80 శాతం మందికి యాంటీబాడీలు ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారని అన్నారు. ప్రజల నిర్లక్ష్యమే కారణం మహారాష్ట్రలో కేసులు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఆరోగ్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకపోవడం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని కరోనా టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సంజయ్ ఓక్ అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కేసుల్ని కట్టడి చేయలేమన్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి కరోనాని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని విశ్వసిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వారంలో కనీసం నాలుగు రోజులు టీకా డోసులు ఇచ్చే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. వచ్చే నెలకల్లా సీనియర్ సిటిజన్లకి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మళ్లీ పంజా సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అత్యధికంగా కరోనా ప్రభావం ఉన్న యావత్మాల్ జిల్లాలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి వారంపాటు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు మంత్రి యశోమతి ఠాకూర్ ప్రకటించారు. అకోలా జిల్లాలోని అకోలా, మూర్తిజాపూర్, అకోట్ తదితర పట్టణాల్లో 23 నుంచి లాక్డౌన్ అమలవుతుందని అధికారులు చెప్పారు. నాగపూర్, అమరావతి, బుల్దానా, వాశీం, పుణే, నాసిక్ జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. 15న 3,365 కేసులు, 21న 6,071 కేసులు బయటపడ్డాయి. కాగా, మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించాలా వద్దా అనే నిర్ణయం ప్రజల చేతిలో ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖానికి మాస్క్ వినియోగించాలని కోరారు. అదే మన ఆయుధమని వ్యాఖ్యానించారు. నిబంధనలు పాటించకుంటే ఆఖరి అస్త్రంగా లాక్డౌన్ అమలు చేస్తామన్నారు. నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. లాక్డౌన్ కావాలనుకునేవారు కరోనా నియమాలు పాటించరని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ధార్మిక కార్యక్రమాలన్నింటినీ సోమవారం నుంచి కొన్ని రోజులపాటు రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్టు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కొత్త స్ట్రెయిన్లతో ‘దడ’.. తెలంగాణకు పొంచివున్న ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయని, వ్యాక్సిన్ పుణ్యమాని ఇక వైరస్ నిర్వీర్యం అవుతుందన్న భావనలో ఉండగా... మహారాష్ట్ర ముప్పు వణికిస్తోంది. అక్కడ పుట్టుకొచ్చిన రెండు కొత్త స్ట్రెయిన్లు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న మొన్నటివరకు యూకే కొత్త స్ట్రెయిన్‌తో గజగజ వణికిపోయాం. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌తోనూ ఆందోళనకు గురయ్యాం. ఇప్పుడు మహారాష్ట్రలో పుట్టుకొచ్చిన రెండు కొత్త కరోనా వేరియంట్లతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అంతేకాదు మొదటి వేరియంట్‌కు భిన్నంగా ఈ కొత్త స్ట్రెయిన్లు రోగులపై పంజా విసురుతున్నాయి. మొదట్లో వచ్చిన స్ట్రెయిన్ల వల్ల వారం పది రోజులకు కొందరి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరగా, ఇప్పుడు ఒకట్రెండు రోజులకే నిమ్ము చేరి పరిస్థితి సీరియస్ అవుతోంది. ఈ స్ట్రెయిన్లు ఇతర రాష్ట్రాలకు పాకితే పరిస్థితి ఏంటనే ఆందోళన అందరినీ వేధిస్తోంది. మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో, సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ప్రజా రవాణా వ్యవస్థలపైనా, ప్రయాణికుల రాకపోకలపైనా ఆంక్షలు విధించింది. మనదగ్గరి నుంచీ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు నిత్యం రాకపోకలు అధికంగా ఉంటాయి. కానీ తెలంగాణ వైద్య యంత్రాంగం మాత్రం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అమరావతి, యావత్మాల్ జిల్లాల్లో పుట్టిన స్ట్రెయిన్లు మొదటి విడత కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశంలో అత్యధికంగా అక్కడే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడక్కడ మళ్లీ కరోనా కొత్త రూపంలో రాజుకుంది. మరో రెండు కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. మహారాష్ట్రలో కోవిడ్ నియంత్రణ చర్యలు దేశంలోనే అధ్వానంగా ఉన్నాయని ఇటీవలి ఇండియన్ ఎకనమిక్ సర్వే తేల్చి చెప్పింది. అక్కడి అమరావతి జిల్లాలో నిత్యం వెయ్యి కేసుల వరకు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడ కరోనా వచ్చిన నలుగురు రోగులపై జన్యు విశ్లేషణ చేశారు. వారిలో కొత్తగా ఇ–484క్యూ అనే మ్యుటేషన్‌ను కనుగొన్నారు. ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా వేరియంట్ ఇ–484కే అనే మ్యుటేషన్‌కు దగ్గరగా ఈ కొత్త వేరియంట్లో జన్యు మార్పులు కనిపించాయి. అలాగే అదే రాష్ట్రం యావత్మాల్ జిల్లాలో నలుగురిపై జన్యు విశ్లేషణ చేస్తే, గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించిన ఎన్–440కే మ్యుటేషన్‌కు దగ్గరగా ఉందని తేల్చారు. కేసుల వ్యాప్తిని ఆపకపోతే, ఇలాగే కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొస్తాయని, మళ్లీ దేశమంతా విస్తరించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 31 జిల్లాల్లో భారీగా కేసులు దేశంలో 718 జిల్లాలకు గాను, 31 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు వస్తున్నాయి. అందులో కేరళలో మొత్తం 13 జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనూ 13 జిల్లాల్లో 100కు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. 20వ తేదీన అమరావతి జిల్లాలో ఒకేరోజు వెయ్యి కేసులు నమోదయ్యాయి. పుణే, ముంబై, థానే, నాగ్‌పూర్, అమరావతి జిల్లాల్లో రోజుకు 500కు పైగా నమోదవుతున్నాయి. గత వారంలో కేరళలో ప్రతి పది లక్షల జనాభాలో 750 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఈ సంఖ్య దేశంలోనే ఎక్కువ. అలాగే మహారాష్ట్రలో పది లక్షల జనాభాకు గత వారంలో 250 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సగటున ప్రతి పది లక్షల్లో గత వారంలో 60 మందికి కరోనా సోకింది. తెలంగాణలో 40 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే కేరళలో పంచాయతీ ఎన్నికలు, ఓనం పండుగ తర్వాత భారీగా కేసులు పెరిగాయి. అప్పటి నుంచి అదే ట్రెండ్ కొనసాగుతోంది. మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం మహారాష్ట్రలో లాగా ఇతర ప్రాంతాల్లోనూ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముంది. మహారాష్ట్రలో రెండు కొత్త కరోనా వేరియంట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయా లేదా అన్నదానిపై జన్యు విశ్లేషణ చేయాలి. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందాకే ప్రమాదం పోతుంది. అందువల్ల జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. జనవరిలో దేశంలో ప్రతి వంద కేసుల్లో ఐదింటిపై జన్యువిశ్లేషణ చేయాలనుకున్నారు. కానీ అది పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పటివరకు దేశంలో 8 వేల జన్యు విశ్లేషణలు చేశారు. అంటే 1,250 కేసుల్లో ఒక దానికి జన్యు విశ్లేషణ చేశారు. యూకేలో ప్రతీ 10 కేసుల్లో ఒకదానికి, ప్రపంచంలో ప్రతి 200కు ఒక జన్యు విశ్లేషణ చేశారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వేగంగా విస్తరణ... ఇప్పటివరకు దేశంలో ఉన్న కరోనా మ్యుటేషన్ల వల్ల వైరస్ వ్యాప్తి జరిగిన దానికంటే... కొత్త వేరియంట్లు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అంతేకాదు సాధారణ మ్యుటేషన్ సోకిన కరోనా రోగుల్లో కొందరిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము వారం పది రోజుల్లో వస్తే, ప్రస్తుతం అమరావతి కొత్త వేరియంట్ల రోగుల ఊపిరితిత్తుల్లో ఒకట్రెండు రోజుల్లోనే నిమ్ము వచ్చినట్లు జన్యు విశ్లేషణలో తేలింది. నాగ్‌పూర్ నుంచి ఔరంగాబాద్ మధ్య రహదారి కనెక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల భారీగా కేసులు నమోదవుతున్నాయని అంచనా. -
మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్స్ కలకలం
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆగడం లేదు. అమరావతి, అకోలా జిల్లాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్స్ కలకలం రేపుతున్నాయి. జన్యుపరంగా మారిన ఈ కొత్త రకం వైరస్ మరింత త్వరితంగా వ్యాప్తి చెందుతోందని కోవిడ్–19పై ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సుభాష్ సలంఖే చెప్పారు. ఈ కొత్త స్ట్రెయిన్ సోకిన వెంటనే న్యుమోనియాలోకి దింపేస్తోందని, దీనివల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన అమరావతిలో 700 మందికి కరోనా పాజిటివ్ వస్తే అందులో 350 మందికి ఈ కొత్త రకం సోకిందని చెప్పారు. నాగపూర్ నుంచి ఔరంగాబాద్ వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ప్రజల నిర్లక్ష్యం వల్ల కూడా కేసులు పెరిగిపోతున్నాయన్నారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు లేకుండా ప్రజలు తిరుగుతున్నారని చెప్పారు. ఈ కొత్త రకం దేశంలోని ఇతర ప్రాంతాలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మహారాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 5వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. హోటల్స్‌లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతి, ఒక భవనంలో అయిదు కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తే సీజ్ చేయడం, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి వంటి నిబంధనలు ముంబై, నాగపూర్లలో అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయడానికి మహారాష్ట్ర సర్కార్ మార్షల్స్‌ని రంగంలోకి దించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు, మెట్రో రైళ్లలో, సిటీ బస్సు ప్రయాణికులు మాస్కులు ధరించకపోతే మార్షల్స్ వచ్చి బలవంతంగా మాస్కు పెట్టుకునేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర నీటి వనరుల సంరక్షణ శాఖ సహాయ మంత్రి బచ్చు కదూకి రెండోసారి కరోనా సోకింది. నెల వ్యవధిలో ఆరుగురు మంత్రులకు కరోనా వచ్చింది. -
‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా..!
లండన్: ‘యూకేలో బయట పడిన కరోనా స్ట్రెయిన్ ‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా వ్యాపించే అవకాశం ఉంది. ఈ తరహా మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చు’ అంటూ యూకే కోవిడ్–19 యూకే కన్సార్టియం డైరెక్టర్ ప్రొఫెసర్ పీకాక్ అభిప్రాయపడ్డారు. 2020 సెప్టెంబర్‌లో బయటపడిన ఈ స్ట్రెయిన్ ఇప్పటికే యూకేతో పాటు మరో 50 దేశాలకు వ్యాపించిందని ఆమె చెప్పారు. వైరస్ మ్యుటేషన్ జరగకుండా ఆగిపోతే బాధపడాల్సిన అవసరం లేదని, కానీ ఈ మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చని భావిస్తున్నాను అంటూ హెచ్చరించారు. అయితే పదేళ్ల పాటు మహమ్మారి కొనసాగకపోవచ్చని, కానీ పాజిటివ్ కేసుల్లో వచ్చే మ్యుటేషన్ ప్రపంచంలో అక్కడక్కడా బయట పడొచ్చని అభిప్రాయపడ్డారు. -
స్టెయిన్‌తో యూరప్ బెంబేలు, మరణాలూ ఎక్కువే!
కోపెన్‌హాగెన్: బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ యూరప్‌ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. 70శాతం వేగంగా కొత్త స్ట్రెయిన్ కేసులు వ్యాప్తి చెందుతున్నట్టుగా డెన్మార్క్ ప్రభుత్వ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. డెన్మార్క్‌లో అత్యంత కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ఒకే వారంలో కేసుల సంఖ్య ఏకంగా 70శాతం ఎగబాకింది. ఈ వైరస్ జన్యుక్రమాన్ని త్వరితగతిన మార్చుకుంటూ ఉండడంతో పాజిటివ్ కేసులు నమోదైన వారిలో ఏ రకమైన వైరస్ సోకిందో విశ్లేషించాల్సి ఉంటుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ సైంటిఫిక్ డైరెక్టర్ ట్యారా గ్రోవ్ క్రాజ్ అన్నారు. టీకా తీసుకున్నా జాగ్రత్తలు తప్పదు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే రోగ నిరోధక శక్తి రాదని, అందుకే ప్రజలం దరూ కచ్చితంగా లాక్డౌన్ నిబంధనల్ని పా టించాలని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ జొనాథన్ వాన్–టామ్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మూడు వారాల తర్వాతే అది పని చేయడం మొదలవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందదని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుకే ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ‘‘వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రజలందరూ కచ్చితంగా నిబంధనల్ని పాటించాలి. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సలహాల్ని స్వీకరించాలి. మరణాలు అధికం.. కొత్త స్ట్రెయిన్ వల్ల మరణా లు అధికంగా సంభవిస్తున్నా యని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. యూకే ఆరోగ్య సంస్థలతో కూడా సీడీసీ మాట్లాడింది. సాధారణ కరోనా వైరస్ సోకిన ప్రతీ వెయ్యి మందిలో 10 మంది ప్రాణాలు కోల్పోతే ఈ కొత్త స్ట్రెయిన్‌తో సగటున వెయ్యి కేసుల్లో 14 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఈ వైరస్‌తో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అంతేగాక గత వారం రోజుల్లో బ్రిటన్‌లో మృతుల సంఖ్య ఏకంగా 16 శాతం పెరిగింది. -
దక్షిణాఫ్రికాలో మరింత ప్రమాదకరమైన కరోనా
దక్షిణాఫ్రికాలో మరింత ప్రమాదకరమైన కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ బ్రిటన్ స్ట్రెయిన్ కంటే డేంజర్ అని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఈ కొత్త కరోనాకు 501 డాట్వీ2గా నామకరణం చేశారు. జీనోమ్ శాస్తవేత్తల బృందం ఈ వైరస్‌ను కనుగొంది. ఇది వేగంగా విస్తరిస్తూ మరింత హానికరంగా మారినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వైరస్ యువతలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణుల బృందం పేర్కొంది. దీంతో దక్షిణాఫ్రికా నుంచి యూకేకు అన్ని విమాన రాకపోకలను రద్దు చేశారు. -
30కి పైగా దేశాల్లో కొత్త స్ట్రెయిన్
న్యూఢిల్లీ: 2020 చివర్లో యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా శనివారం వియత్నాంలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. దాంతో తక్షణమే అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించింది. ఇప్పటివరకు దాదాపు 30కి పైగా దేశాల్లో ఈ కొత్త వైరస్ ప్రకంపనలను సృష్టిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణంగా.. ఈ వైరస్‌పై అత్యంత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్ట్రెయిన్ కారణంగా యూకేలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, దాంతో, అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేయడం తెలిసిందే. అమెరికాలోనూ దాదాపు 3 రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందే కానీ, గత వైరస్ కన్నా ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన, త్వరలో మార్కెట్లోకి రానున్న టీకాలు ఈ వైరస్‌పై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. వైరస్‌లో జన్యు పరివర్తనాలు సహజమేనని వివరిస్తున్నారు. -
న్యూ ఇయర్.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యూకే స్ట్రెయిన్(రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్) కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. బుధవారం రాసిన ఈ లేఖలో కేంద్రం న్యూ స్ట్రెయిన్ కేసులు పెరగకుండా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇందుకోసం కేంద్రం రేపు, ఎల్లుండి జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు సూచించింది. కాగా బ్రిటన్‌లో కొత్త వైరస్ న్యూ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీ వరకు ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గోలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
అమెరికా చేరిన కొత్త కరోనా..
వాషింగ్టన్: ఇప్పుడిప్పుడే కోవిడ్ భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని కొత్త కరోనా వైరస్ మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. బ్రిటన్‌లో మొదలైన ఈ కొత్త కరోనా వ్యాప్తి తాజాగా అగ్రరాజ్యానికి కూడా చేరింది. ఇప్పటికే కోవిడ్‌తో కకావికలమైన అమెరికాను కొత్త కరోనా వైరస్ మరింత భయపెట్టనుంది. కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ జేర్డ్ పొలిస్ తెలిపారు. ఈ కొత్త వైరస్ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన కల్గిస్తుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎలా వైరస్ బారిన పడ్డాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇక బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఇక బ్రిటన్‌లో కొత్త వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి అమెరికా ఆ దేశం నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు చూపించాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (కొత్త వైరస్: ఆ లక్షణాలు కనిపించడం లేదు ) ఈ వైరస్‌కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇక మనదేశంలోను కొత్త కరోనా కేసులు 20కి చేరుకున్నాయి. నిన్న ఆరు కేసులు వెలుగు చూడగా.. తాజాగా నేడు 14 కేసులు నమోదయ్యాయి. -
రివైండ్ 2020: ప్రపంచానికి తాళం
ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూతపడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్ కాలనాగై కాటేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా పెనుసవాళ్లు విసిరింది. ఏడాది చివర్లో కరోనా కొత్తస్ట్రెయిన్ మరింత భయాందోళనల్ని పెంచుతున్నాయి. అయినా.. ఇకపై కరోనా, క్వారంటైన్, మాస్కులు, భౌతికదూరం అన్న మాటలు వినిపించకూడదన్న ఆశతో కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం చెప్పనుంది. అగ్రరాజ్యాల వణుకు కరోనా మహమ్మారి ప్రపంచంలో అగ్రదేశాల వెన్నులో వణుకుపుట్టించింది. అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలు కోవిడ్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తొలిసారిగా జనవరి 9న ప్రకటించింది. ఆ తర్వాత చాప కింద నీరులా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 15న తొలి కేసు నమోదైంది. మార్చి 11న డబ్ల్యూహెచ్ఓ కోవిడ్‌ని మహమ్మారిగా గుర్తించింది. భౌతిక దూరమే ఈ వైరస్‌పై బ్రహ్మాస్త్రం కావడంతో అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం మన జీవితంలో ఒక భాగమైపోయింది. కరోనా కట్టడిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 లక్షల మంది వరకు మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 2 కోట్ల వరకు కేసులు నమోదయ్యాయి. మూడున్నర లక్షల మంది మరణించారు. భారత్ ప్రపంచ పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ జనాభా ఆధారంగా చూస్తే కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నట్టే చెప్పాలి. బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా కరోనాతో తీవ్రంగా సతమతమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్, యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌తో ఇంకా భయాందోళనలు తొలగిపోలేదు. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ఎంత మేరకు కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పని చేస్తాయోనన్న ఆందోళనల మధ్యే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రభ ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై భారతీయం వెల్లివిరిసింది. అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తమిళనాడులో తులసెంథిరపురం కమల స్వగ్రామం. ఆమె తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలు కాగా తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అమితమైన ఇష్టం కలిగిన కమలా హ్యారిస్ విజయంతో భారతీయులు పండుగ చేసుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్‌కు ఎంపిక చేసిన 18 మందిలో హైదరాబాద్ మూలాలున్న రాజాచారికి స్థానం లభించడంతో జాబిల్లిపైనా భారతీయ వెలుగులు ప్రసరించనున్నాయి. ట్రంప్‌కి గుడ్‌బై కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే ఏర్పాట్లు చేసుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజలు బై బై చెప్పేశారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడంలో, అమెరికాని ఆర్థికంగా నిలబెట్టడంలో ట్రంప్ వైఫల్యాలు ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి. జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ వలసదారుల్ని పలు ఇబ్బందులకు గురిచేయడం, కరోనా ఆంక్షల్ని పాటించకపోవడం, మాస్కు ధరించడాన్ని హేళన చేయడం వంటి చర్యలతో ట్రంప్ ప్రజాదరణ కోల్పోయారు. నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 306 ఎలక్టోరల్ స్థానాలతో విజయం సాధించినప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఐ కాంట్ బ్రీత్ అమెరికాలోని మొనిసెటా రాష్ట్రంలో ఆఫ్రికన్ అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ (46) హత్యపై రేగిన ఆందోళనలు అంతకంతకూ ఉధృతమై జాతి వివక్షపై పోరాటానికి దారితీశాయి. తెల్ల తోలు అహంకారంతో డెరెక్ చావిన్ అనే పోలీసు ఫ్లాయిడ్ గొంతుపై తన బూటు కాళ్లతో తొమ్మిది నిమిషాల సేపు తొక్కి పెట్టి ఉంచడంతో ఊపిరాడక ఫ్లాయిడ్ చనిపోయాడు. ‘నాకు ఊపిరి ఆడట్లేదు(ఐ కాంట్ బ్రీత్)’ అంటూ ఫ్లాయిడ్ మొరపెట్టుకున్నా ఆ పోలీసు అధికారి పెడచెవిన పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. మొత్తం 60 దేశాల్లో జాతి వివక్షపై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కరోనాని లెక్క చేయకుండా జనం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో శాంతి వీచికలు ఉద్రిక్తతలకు నిలయమైన మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగస్టు 13న ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ పరిణామాల్లో మైలురాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, యూఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్ జాయేద్ సాధారణ సంబ«ంధాలను పునరుద్ధరించడానికి అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. మెగ్జిట్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కె ల్ రాజ ప్రాసాదాన్ని వీడుతున్నట్టుగా జనవరి 8న ప్రకటించారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడడం కోసం ఈ జంట బకింగ్హమ్ ప్యాలెస్ వీడి వెళ్లింది. సోషల్ మీడియాలో నెటిజన్లు యువజంట స్వతంత్ర భావాలకు సలాం చేశారు. ప్యాలెస్ నుంచి మేఘన్ బయటకు రావడాన్ని మెగ్జిట్గా పిలుస్తున్నారు. అవీ ఇవీ ► అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ కడ్స్ దళాల జనరల్ ఖాసీం సులేమానీ మరణించారు. బాగ్దాద్ విమానాశ్రయంలో కారులో వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే సులేమానీని అమెరికా సైనికులు చంపేశారు. ► ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయల్దేరిన ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలింది. జనవరి 8న జరిగిన ఈ విషాద ఘటనలో విమానంలో ఉన్న 176 మంది మరణించారు. మూడు రోజుల తర్వాత ఆ విమానాన్ని పొరపాటున తామే కూల్చివేశామని ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది. ► అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపడం కోసం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం.. ఫిబ్రవరిలో సెనేట్‌లో వీగింది. ► పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి ప్రయాణిస్తున్న పైలట్ తప్పిదం కారణంగా కరాచీలోని నివాస ప్రాంతాలపై మే 22న కుప్పకూలింది. ఈ ఘటనలో 97 మంది మరణించారు. ► హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని నీరు కార్చేలా జాతీయ భద్రతా బిల్లుని జూన్‌లో చైనా ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ► లెబనాన్ రాజధాని బీరూట్ పోర్టులో ఆగస్టు 4న జరిగిన భారీ పేలుళ్లలో 200 మంది మరణిస్తే, వేలాది మంది గాయపడ్డారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగానే ఈ పేలుళ్లు సంభవించాయి. ► అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రూత్ బాడెర్ గిన్స్బర్గ్(87) సెప్టెంబర్ 18న పాంక్రియాటిక్ కేన్సర్‌తో మరణించారు -
ఆరుగురికి ‘యూకే’ వైరస్
న్యూఢిల్లీ: యూకేలో బయటపడి యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్‌లో కనిపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వీరికి కరోనా కొత్త స్ట్రెయిన్ పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ముగ్గురి శాంపిల్స్‌ను బెంగళూరు నిమ్హాన్స్లో, ఇద్దరివి హైదరాబాద్ సీసీఎంబీలో, ఒకరిది పుణెలోని ఎన్ఐవీలో పరీక్షించగా, అన్నింటిలో యూకే వేరియంట్ జీనోమ్ కలిగిన కరోనా రకం సార్స్– సీఓవీ–2 కనిపించినట్లు వివరించింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో భారత్‌కు యూకే నుంచి వచ్చే విమానాలన్నింటినీ ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 31 వరకు నిషేధించింది. విదేశీయాత్రికులకు జీనోమ్ సీక్వెన్సింగ్ డిసెంబరు 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వారందరికీ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించనుంది. కరోనా నెగెటివ్ వచ్చిన వారిని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం పరీక్షించి, రాష్ట్ర, జిల్లా నిఘా అధికారుల పర్యవేక్షణలో ఉంచుతారని తెలిపింది. యూకే స్ట్రెయిన్ సహా కొత్తరకం వైరస్‌లను గుర్తించేందుకు చర్యలు చేపట్టాము. జీనోమ్ పరీక్షల కోసం 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. దేశంలోకి కొత్త వేరియంట్ రాకముందే దాదాపు 5వేల జీనోమ్ పరీక్షలు చేశాం. ఈ సంఖ్యను క్రమంగా పెంచుతాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్యలో యూకే నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు 33వేల మంది వచ్చారని కేంద్రం తెలిపింది. వీరిందరినీ ఆయా రాష్ట్రాలు ట్రేస్ చేసి పీసీఆర్ పరీక్షలు నిర్వహించాయని, వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని తెలిపింది. వైరస్ కొత్త రకంపైనా వ్యాక్సిన్ల ప్రభావం కోవిడ్–19 వ్యాక్సిన్లు కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం లేదనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే), దక్షిణాఫ్రికాల నుంచి ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని వెల్లడించింది. యూకే విమానాలపై నిషేధం కొనసాగింపు? యునైటెడ్ కింగ్డమ్, భారత్ మధ్య విమానాల రాకపోకలపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించే అవకాశం ఉందని విమానయాన మంత్రి హర్దీప్ చెప్పారు. త్వరలో దీనిపై స్పష్టతనిస్తామన్నారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణ తదుపరి రౌండ్‌ను 2021లో ఆరంభించవచ్చని ఏఏఐ చైర్మన్ అర్వింద్ సింగ్ చెప్పారు. -
కొత్త వైరస్: యూకే నుంచి తెలంగాణకు..!
సాక్షి, హైదరాబాద్: యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సహా పలు దేశాలను హడలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ తెలంగాణకూ పాకింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనాకన్నా సుమారు 70 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న కరోనా కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలోనే తొలి కేసు సోమవారం నమోదైంది. యూకే నుంచి ఈ నెల 10న వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లుగా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) నిర్ధారించింది. అయితే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ వైరస్ కొత్త స్ట్రెయిన్ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరుగుతుండటంతో వాటన్నింటి ఫలితాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఏకకాలంలో వెల్లడించే అవకాశాలున్నాయి. మరోవైపు కొత్త వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అన్ని జిల్లాల వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వీలైనంత వేగంగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తల్లీకొడుకులు ఒకే ఆసుపత్రిలో... యూకే నుంచి వచ్చిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఆ వ్యక్తిలో ఈ నెల 16న కరోనా లక్షణాలు కనిపించగా జిల్లాలోనే పరీక్షలు నిర్వహించగా 22న పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పట్నుంచీ అతను వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపగా ఆ నమూనాల్లో కరోనా కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి తక్షణమే పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో బాధితుడి తల్లి (71)కి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను కూడా అదే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కుమారుడికి కరోనా కొత్త వైరస్ నిర్ధారణ కావడంతో తల్లికి కూడా ఆ వైరస్ సోకి ఉంటుందేమోనన్న అనుమానంతో ఆమె నుంచి శాంపిళ్లను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు. కొత్త వైరస్‌తో మరణాలు తక్కువే... కరోనా కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందేగానీ దానివల్ల మరణాల తీవ్రత తక్కువే. వ్యాక్సిన్ వచ్చేవరకు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం నిబంధన పాటించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి యూకే నుంచి వచ్చిన వారిలో మరొకరికి పాజిటివ్ యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో సోమవారం మరొకరికి (మేడ్చల్ జిల్లా) కరోనా పాతరకం వైరస్ నిర్ధారణ అయినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటివరకు 21 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ జిల్లా నుంచి 9 మంది, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు ఫలితాలు వచ్చాయన్నారు. బాధితులను వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి 1,216 మంది తెలంగాణకు రాగా వారిలో 1,060 మందిని గుర్తించామన్నారు. వారిలో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా మరో ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్లారన్నారు. మిగిలిన 996 మందికి పరీక్షలు నిర్వహించగా 966 మందికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. 21 మందికి పాజిటివ్‌గా తేలిందని, మరో 9 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి వచ్చిన వారు లేదా యూకే మీదుగా ప్రయాణించి వచ్చిన వారు 040–24651119కు ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు. -
వ్యాక్సినేషన్ వైపే మార్కెట్ చూపు..!
ముంబై: వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కొత్త స్ట్రైయిన్ వైరస్ వ్యాప్తి వార్తలే ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిమాణాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఆటో కంపెనీలు డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. అలాగే డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు (డిసెంబర్ 31న) తేది కూడా ఉంది. కాగా, క్రిస్మస్, కొత్త ఏడాది ప్రారంభంతో ఎఫ్ఐఐల కొనుగోళ్ల పరిమాణం తగ్గొచ్చు. జనవరి 1న లిస్టింగ్..!? ఇటీవలే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ షేర్లు జనవరి 1న ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 21న ప్రారంభమై, డిసెంబర్ 23తో ముగిసిన ఈ ఇష్యూకు 15 రెట్ల స్పందన లభించిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో భారీ పెట్టుబడులు.. దేశీయ స్టాక్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో (డిసెంబర్ 1 నుంచి 24వ తేదీ వరకు) రూ.60,094 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
ఫ్రాన్స్‌కు పాకిన కొత్త కరోనా
పారిస్: ఫ్రాన్స్‌లో తొలిసారి కొత్తరకం కరోనా వైరస్ బయటపడినట్లు ఫ్రెంచ్ వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఇంగ్లండులో నివసించే ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి 19న ఫ్రాన్స్‌కి తిరిగి వచ్చారు. ఈయనకు పరీక్షలు జరపగా కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర యూరోపియన్ దేశాల్లో సైతం ఈ కొత్తరకం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఫ్రాన్స్ సైతం బ్రిటన్నుంచి వచ్చే ప్రయాణీకులపై, కార్గోలపై రెండు రోజులు నిషేధం విధించింది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ఫ్రాన్స్ రాకపోకలకు అనుమతిచ్చింది. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. మోడెర్నా టీకాతో వైద్యుడికి తీవ్ర అలర్జీ వాషింగ్టన్: మోడెర్నా కరోనా టీకా తీసుకున్న ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బోస్టన్‌కు చెందిన వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్కు అంతకు ముందే షెల్ఫిష్ అలర్జీ ఉంది. టీకా వేయించుకున్న వెంటనే మైకం కమ్మేసినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని వైద్యుడు తెలిపారు. -
కొత్త వైరస్: ఆ లక్షణాలు కనిపించడం లేదు
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వైరస్‌తో తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. ఎక్కువ మందికి సోకి కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రముఖ వైద్యులు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. కె. శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది మరణాల సంఖ్య అధికం కావడానికి పరోక్షంగా కారణం కావొచ్చన్నారు. అందువల్ల ఇది వ్యాప్తి చెందకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కరోనా కొత్త వైరస్ వ్యాప్తిపై శనివారం ‘సాక్షి’కి డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... వైరస్ రూపురేఖల మార్పుతోనే... ఏ వైరస్ అయినా స్వాభావికంగా తన రూపురేఖలు మార్చుకోవడం సహజమే. యూకేలో సెప్టెంబర్‌లోనే ఈ వైరస్ కనపడినా డిసెంబర్లో దానిని కొత్త రకంగా గుర్తించి.. కేసులు వేగంగా వ్యాప్తి చెందడాన్ని కనుగొన్నారు. యూకేతో పాటు సౌతాఫ్రికా, నైజీరియా వంటి దేశాల్లోనూ కొత్త మ్యుటేషన్లు వచ్చాయంటున్నారు. వీటి వల్ల వైరస్ వ్యాప్తి పెంచుకుంటుంది. చదవండి: (ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!) అడ్డంకులు దాటేందుకు... మాస్క్‌లు ధరించడం, ఇతరత్రా పద్ధతుల ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పుడు వైరస్ రూపాన్ని మార్చు కుంటుంది. ఎక్కువ మందికి వ్యాప్తి చెందేందుకు ఈ అడ్డంకులను అధిగమించేందుకు తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అప్రమత్తత అవసరం... ఈ కొత్త వైరస్ ఇప్పటికైతే ప్రమాదకరంగా మారే లక్షణాలు కనిపించడం లేదు. అయితే వైరస్ పెరగకపోయినా, తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. అధిక వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది ఈ వైరస్ బారినపడతారు. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరిగి ఆసుపత్రులు, వైద్య వ్యవస్థపై తాకిడి, ఒత్తిళ్లు పెరుగుతాయి. క్రమంగా ఈ కేసుల్లో మరణాల సంఖ్య ఎక్కువయ్యే అవకాశాలుండొచ్చు. ప్రత్యేక టెస్టింగ్‌లు అవసరం... కొత్త వైరస్ సెప్టెంబర్‌లోనే బయటపడినందున.. భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఇది ఇప్పటికే చేరుకుని ఉండొచ్చు. దీని జెనిటిక్ స్ట్రక్చర్ తెలుసుకునేందుకు ‘సైంటిఫిక్ టెస్టింగ్’ద్వారా ప్రత్యేక పరీక్షలు చేయాలి. బ్రిటన్, సౌతాఫ్రికా, ఐరోపాలో ని కొన్ని దేశాల్లోని ల్యాబ్‌లలో తరచుగా ఈ టెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా పరిస్థితిపై మరింత సమాచారం కోసం వేచిచూడాలి. జనవరిలో వ్యాక్సిన్... భారత్‌లో తయారవుతున్న ఆస్ట్రా జెనెకా(బ్రిటన్‌ది) వ్యాక్సిన్ జనవరి 1, 2 వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి బ్రిటీష్ రెగ్యులేటర్ అనుమతి లభించాలి. భారత్ బయోటెక్, రష్యన్ వ్యాక్సిన్ స్టేజ్–3 ప్రయోగాలు పూర్తయ్యాక వాటి డేటా ఇవ్వాలి. భారత్ బయోటెక్ ప్రయోగాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో వీటికి అనుమతి రావొచ్చు. రెగ్యులేటరీ ఏజెన్సీలు, ఇంటర్నేషనల్ అప్రూవల్స్‌పై ఇది ఆధారపడి ఉంది. మరో 3, 4 నెలలు జాగ్రత్త... వ్యాక్సిన్ డోసులు 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకున్నాక, 14 రోజుల తర్వాతే యాంటీబాడీస్ ఏర్పడి రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశాలున్నాయి. అదీ కాకుండా మొదట ఫ్రంట్‌లైన్ వారియర్స్.. తర్వాత క్లిష్టమైన అనారోగ్యంతో ఉన్న వారు.. ఇలా అంచెలంచెలుగా వ్యాక్సిన్లు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుంది. అందువల్ల మరో 3, 4 నెలల దాకా అందరూ బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్పటివరకు వైరస్‌కు సంబంధించిన పరిస్థితులు, మనం తీసుకున్న చర్యల ప్రభావంపై స్పష్టత వస్తుంది. సెకండ్ వేవ్ ప్రభావం... మన దేశంలో సెకండ్ వేవ్ వస్తే తీవ్రత ఉండబోదని చెప్పలేం. పశ్చిమ దేశాల్లో నిబంధనలు పాటించకుండా స్వేచ్ఛగా తిరగ డం, విందులు, వినోదాల్లో మునిగితేలడం వల్ల విపత్కర పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఇక్కడా అజాగ్రత్తగా ఉంటే కేసులు పెరగొచ్చు. హెర్డ్ ఇమ్యూనిటీపై చెప్పలేం... భారత్‌లో ఎంత శాతం మందిలో ఇమ్యూనిటీ ఏర్పడితే..æ హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందనేది చెప్పలేం. అది వచ్చినా కొన్ని ప్రదేశాలు, ప్రాంతాలకు పరిమితం కావొచ్చు. ఒక ప్రాంతంలోని ఇమ్యూనిటీ ఏర్పడిన ప్రజల్లోంచి ఎవరైనా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు సొంతంగా రోగ నిరోధకశక్తి లేకపోతే వైరస్ బారినపడే అవకాశాలున్నాయి. అందువల్ల అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ జనాభా ఎక్కువ కాబట్టే... యూఎస్, యూకే, ఐరోపా దేశాలతో పోలిస్తే.. భారత్‌లో యువత అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా ఎక్కువకావడం, అక్కడి వారికి అనారోగ్య లక్షణాలు తక్కువగా ఉండటం, చిన్నప్పటి నుంచే వివిధ టీకాలు తీసుకోవడం వంటి కారణాలతో కరోనా వైరస్ నుంచి కొంతమేర ఇమ్యూనిటీకి కారణమై ఉండొచ్చు. అందువల్లే కరోనా కేసుల తీవ్రత పెరగకపోవడంతోపాటు మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండేందుకు కారణం కావచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇతర దక్షిణాసియా దేశాల్లోనూ కేసుల సంఖ్య ఎలా ఉన్నా కోవిడ్ మరణాలు తక్కువగానే ఉన్నాయి. భారతీయులు జన్యుపరంగా స్ట్రాంగ్‌గా ఉన్నారా.. అన్నది పరిశోధనలతోనే తేల్చాలి. కొత్త వైరస్‌పైనా వ్యాక్సిన్... ఇప్పటికే సిద్ధమైన వివిధ వ్యాక్సిన్లు కొత్త వైరస్‌పైనా పనిచేస్తాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా ‘స్పైక్ ప్రోటీన్’ కొంత రూపుమారినా దానిపైనా వ్యాక్సిన్ పనిచేస్తుంది. అయితే, ఈ వైరస్ మరింత అధికంగా రూపు మార్చుకుంటే మాత్రం దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్‌లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చు. వైరస్ తీవ్రత మరింత పెరిగినా ఇప్పటికే ఇస్తున్న చికిత్స, మందులు పనిచేస్తాయి. ఎక్కువ మందికి వైరస్ సోకితే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం పెరగొచ్చు. సాధారణ పరిస్థితులకు ఏడాది... మన దేశంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరో ఏడాది పట్టే అవకాశాలున్నాయి. వచ్చే ఏప్రిల్ కల్లా కరోనా వైరస్ తీరుతెన్నులు, దాని అదుపునకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ప్రభావం చూపాయి.. వ్యాక్సిన్ వినియోగం తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. కరోనా వైరస్ విషయంలో భయాందోళనకు గురికాకుండా, పూర్తిస్థాయి కట్టడితోపాటు మళ్లీ వస్తే ఎదుర్కొనేందుకు ఏమి చేయాలన్నది తేలుతుంది. జాగ్రత్తలే రక్షణ కవచం... పశ్చిమ దేశాల్లో అత్యంత శీతల పరిస్థితులు ఉన్నందున కొంత వేగంగా కేసుల వ్యాప్తి జరుగుతోంది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినందున అక్కడ ఎక్కువ ప్రభావం ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిలో పండుగల ప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కేసుల పెరుగుదలకు అడ్డుకట్టవేయొచ్చు. ప్రస్తు తం తలెత్తిన కొత్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే. వైరస్ సోకినట్లు అనుమానం వస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలే రక్షణ కవచం. -
వారంలోనే 2,75,310 కేసులు
లండన్/అట్లాంటా/జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్హెచ్ఎస్) గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లో 1,73,875 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 58 శాతం అధికం కావడం గమనార్హం. అలాగే డిసెంబర్ 17 నుంచి 24వ తేదీ దాకా ఏకంగా 2,75,310 కేసులు నమోదయ్యాయి. దేశంలో వారం రోజుల్లోనే ఇన్ని కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. యునైటెడ్ కింగ్డమ్(యూకే) వ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికంగానే ఉందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్ఎస్) వెల్లడించింది. వేల్స్లో ప్రతి 60 మందిలో ఒకరికి, ఇంగ్లాండ్‌లో ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలియజేసింది. కరోనా కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలకమైన ప్రాంతాల్లో టైర్–4 ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాణి ఎలిజబెత్–2 క్రిస్మస్ వేడుకలను కేవలం తన భర్త ఫిలిప్‌తో కలిసి జరుపుకున్నారు. కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు విలియమ్స్ ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా, దక్షిణాఫ్రికాలోనూ 501.వీ2 అనే వేరియంట్ బయటపడింది. అయితే, దక్షిణాఫ్రికాలోని వేరియంట్ మరింత ప్రమాదకరమని, ఇది అత్యధిక వేగంతో వ్యాపించే అవకాశాలున్నాయని బ్రిటిష్ ఆరోగ్య శాఖ మంత్రి వెలినీ ఖిజే ప్రకటించారు. ఈ ప్రకటనను దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి ఖండించారు. నెగెటివ్ అయితేనే అమెరికాలోకి అనుమతి బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రయాణాలపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. కరోనా నెగెటివ్‌గా తేలినవారినే తమ దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది. విమాన ప్రయాణానికి 3 రోజుల ముందే పరీక్షలు చేయించుకోవాలని, సంబంధిత రిపోర్టును విమానయాన సంస్థకు అందజేయాలని సూచించింది. కొత్త ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
‘బ్రిటన్’ భయం!
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 16కు చేరింది. మొదట 7 కేసులుంటే, ఇప్పుడు రెండింతలకు పైగా కేసులు పెరిగాయి. వారిలో బ్రిటన్‌కు చెందిన కొత్త రకం వైరస్ ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సీ చేయ నున్నారు. అందుకోసం హైదరాబాద్ సీసీ ఎంబీకి శాంపిళ్లను పంపించినట్లు ప్రజా రోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 16 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచి నట్లు శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువున్నట్లు వివరించారు. వారితో అతి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, స్నేహితు లను 76 మందిని గుర్తించామన్నారు. వీరిని క్వారం టైన్లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామన్నారు. తమ పర్యవేక్షణలో 92 మంది ఉన్నట్లు తెలిపారు. 1,200 మందిలో 926 మందికి టెస్టులు.. ‘ఇటు యూకే నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు 1,200 మంది యూకే నుంచి తెలంగాణకు రాగా.. వారిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన 16 మందిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగి త్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగా రెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజి టివ్‌గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. జీనోమ్ సీక్వెన్సీ కోసం సీసీఎంబీకి పంపిన శాంపిళ్ల ఫలితాలు మరో రెండ్రోజుల్లో వస్తా యని ఆశిస్తున్నాం. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధా నాన్ని అవలంబిస్తున్నాం. చదవండి: (న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం) ఇప్పటి వరకు ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగాం. మున్ముందు కూ డా ప్రజలు సహకరించాలి. కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అప్ర మత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలి.. డిసెంబర్ 9వ తేదీ తర్వాత యూకే నుంచి రాష్ట్రానికి నేరుగా లేదా యూకే మీదుగా ప్రయాణించి వచ్చిన వారుంటే వివరా లను 040–24651119కు ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్ చేసి తెలపాలని కోరుతున్నాం. అలా ఎవరైనా ఉంటే సిబ్బందే వారి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుంది’అని శ్రీనివాస రావు తెలిపారు. ఇటు వివిధ జిల్లాల్లో ఉన్న బ్రిట న్కు చెందిన పాజిటివ్ వ్యక్తులను హైదరా బాద్‌కు పంపిస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. -
ఢిల్లీలో 51 లక్షల మందికి టీకా
న్యూఢిల్లీ: ఢిల్లీలో తొలి దశలో ప్రాధాన్యతల వారీగా 51 లక్షల మందికి కరోనా టీకా అందజేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆయన గురువారం వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీకా స్వీకరణ, నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకా అందగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మూడు కేటగిరీల ప్రజలకు తొలుత వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 6 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్లకుపైగా వయసున్న, 50 ఏళ్లలోపు వయసుండి వ్యాధులతో బాధపడుతున్న 42 లక్షల మందికి తొలి దశలో వ్యాక్సిన్ అందజేస్తామని వివరించారు. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున మొత్తం 1.02 కోట్ల డోసులు ఇస్తామని పేర్కొన్నారు. . యూకే ప్రయాణికులపై నిషేధం: యూకే నుంచి తమ రాష్ట్రంలోకి ప్రయాణిలకు రాకపై మేçఘాలయ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యూకే నుంచి ఇటీవలి కాలంలో తమ రాష్ట్రానికి వచ్చిన వారి జాడ తెలియక ఉత్తరప్రదేశ్ అధికారులు హైరానా పడుతున్నారు. సదరు ప్రయాణికులు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణం. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ లేదు.. సాక్షి, బెంగళూరు: రాత్రిపూట కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే మనసు మార్చుకుంది. ప్రకటించిన 24 గంటల్లోనే కర్ఫ్యూను ఎత్తివేసింది. కరోనా వైరస్ కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో 9 రోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంది. కరోనా రికవరీ రేటు 95.75% దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 96.93 లక్షలకు చేరుకోవడంతో రికవరీ రేటు 95.75%కి పెరిగిందని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే కొత్తగా 24,712 కరోనా కేసులు బయటపడటంతో ఇప్పటి వరకు వెల్లడైన మొత్తం కేసులు 1,01,23,778కు పెరిగినట్లు వెల్లడించింది. అదేవిధంగా, కోవిడ్‌తో మరో 312 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,46,756గా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 96,93,173కు చేరుకోవడంతో రికవరీ రేటు 95.75%, మరణాల రేటు 1.45%గా ఉంది. కరోనా యాక్టివ్ కేసులు 2,83,849 కాగా మొత్తం కేసుల్లో ఇవి 2.80%మాత్రమే. -
కోరలు చాస్తున్న కొత్త రకం
లండన్/నైరోబీ/బీజింగ్: యునైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త రకం(వేరియంట్) క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇటీవలే యూకే నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ కరోనా కొత్త వేరియంట్ (పీ681హెచ్) ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీని ప్రభావం, వ్యాప్తిపై మరింత అధ్యయనం అవసరమని నైజీరియా ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో పుట్టి, యూకేలోకి ప్రవేశించిందన్న వాదన వినిపిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను యూకే రద్దు చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి పెరుగుతుండడంతో దాదాపు 40 దేశాలు యూకే నుంచి ప్రయాణాలను నిలిపివేశాయి. ఈ జాబితాలో తాజాగా చైనా, బ్రెజిల్ కూడా చేరాయి. ఎప్పటి నుంచి విమానాలు రద్దు చేస్తారన్న సమాచారాన్ని చైనా బయటపెట్టలేదు. నాన్–చైనీస్ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారు యూకే నుంచి తమ దేశంలోకి రాకుండా చైనా నవంబర్ నుంచే నిషేధం అమలు చేస్తోంది. కొత్త రకమైనా టీకాలు పనిచేస్తాయి కరోనా వైరస్‌లో ఎన్ని మార్పులు జరిగినా.. టb వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నట్లు మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని వెల్లడింరాయి. కొత్త వేరియంట్ భయానకం యూకేను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్‌తో మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రోపికల్ మెడిసిన్’కు చెందిన సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ కొత్త రకం వల్ల ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య, మరణాల రేటు వచ్చే ఏడాది భారీగా పెరుగుతుందని తెలియజేసింది. ఈ వేరియంట్ 56 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపింది. దీనిని అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. వారానికి కనీసం 20 లక్షల మందికి టీకా అందజేయాలని కోరింది. -
బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. వారిలో ఎందరికీ బ్రిటన్ వేరియంట్ కొత్త వైరస్ సోకిందో నిర్ధారించేందుకు ప్రభుత్వం సీసీఎంబీకి ఆ ఏడుగురి శాంపిళ్లను పంపింది. అక్కడ వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతిలో జన్యు విశ్లేషణ చేస్తారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి నేరుగా.. యూకే మీదుగా తెలంగాణకు మొత్తం 1,200 మంది వచ్చారని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారిలో 846 మందిని గుర్తించి వారి నమూనాలను పరీక్షించగా అందులో ఏడుగురికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివ్ వచ్చిన వారిని కలసిన వారందరినీ కూడా ట్రేస్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెగెటివ్ వచ్చిన వారిని సైతం మానిటర్ చేస్తున్నట్లు వివరించారు. పాజిటివ్ వచ్చిన ఈ ఏడుగురు హైదరాబాద్, మేడ్చల్, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వారని వెల్లడించారు. ఒకవేళ బ్రిటన్ వైరస్ సోకితే వారికి ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తారు. అంటే రాష్ట్రంలో నిర్దేశించిన 12 ఆసుపత్రుల్లో బ్రిటన్ వైరస్ వార్డు, చైనా వైరస్ వార్డులుగా తీర్చిదిద్దనున్నారు. అప్రమత్తంగా ఉండాలి..: మంత్రి ఈటల కొత్త రకం కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్యా సంచాలకుడు రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కరోనా రాష్ట్ర సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. ఈ కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలు ఇంటికే పరిమితమై జరుపుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని, మాస్క్, భౌతిక దూరం, తరచూ చేతులు శుభ్రపరుచుకోవడం మరిచిపోవద్దని కోరారు. వ్యాక్సిన్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లు.. కరోనా వైరస్ భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం, టీకా రాష్ట్రానికి అందిన వెంటనే ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. వ్యాక్సిన్ రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై అధికారులతో చర్చించారు. ‘వ్యాక్సిన్ వేయడానికి 10 వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వీరంతా రోజుకు వంద మందికి టీకా వేసినా పది లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయగలం. మొదటి దశలో 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. వైద్య ఆరోగ్య, పోలీస్, మున్సిపల్, ఫైర్ సిబ్బందితో పాటు వయసు మీద పడిన వారికి మొదటి దశలో టీకా ఇవ్వనున్నాం. మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు వేయాలి. వ్యాక్సిన్ సరఫరాకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి’అని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో కలకలం సాక్షి, పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్/జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘బ్రిటన్ వైరస్’కలకలం రేగింది. ఇటీవల బ్రిటన్ నుంచి కరీంనగర్ జిల్లాకు 16 మంది, పెద్దపల్లి జిల్లాకు 10 మంది, జగిత్యాల జిల్లాకు 12 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాకు నలుగురు వచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, వైద్య సిబ్బంది అందరి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపించారు. మొత్తం 42 మందిలో 30 మందికి నెగెటివ్ వచ్చినట్లుగా తెలిసింది. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన ఒకరికి, అమెరికా నుంచి వచ్చిన జగిత్యాలకు చెందిన మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంపై దృష్టి.. కరోనా లాంటి మహమ్మారులను తట్టుకోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈటల చెప్పారు. ‘ప్రస్తుతం 11 సీటీఆర్ స్కాన్లు, 3 ఎంఆర్ఐ మెషీన్లను వెంటనే కొనుగోలు చేయాలి. సాధ్యమైనంత త్వరగా వీటిని అందు బాటులోకి తేవాలి. ఆసుపత్రుల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్లను ఆధునిక సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా నవీకరించాలి. మరో ఆరు నెలల్లో వీటిని సిద్ధం చేయాలి. బస్తీ దవాఖా నాలకు వచ్చిన పేషెంట్లకు వైద్య పరీక్షల కోసం 8 డయాగ్నస్టిక్ మినీ హబ్‌లను సిద్ధం చేశాం. అక్కడ రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, ఈసీజీ పరీక్షలు చేయనున్నాం. ఈ నెలాఖరు నుంచి ఈ హబ్‌లను ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. డయాలసిస్ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా చూడాలి’అని మంత్రి అధికారులకు సూచించారు. -
బ్రిటన్ కొత్త వైరస్ టెస్టులకు దొరకదా?
బ్రిటన్‌లో కొత్త రూపం సంతరించుకున్న వైరస్ ప్రస్తుతం చేసే కరోనా పరీక్షల్లో బయటపడకపోవచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈ–సీడీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం వైరస్‌పై నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం వాడుతున్న ఎస్–జీన్ (స్పైక్ జీన్) ఆధారిత ఆర్టీపీసీఆర్ టెస్టుల స్థానంలో అన్ని రకాల జీన్లు, మార్పులతో తయారైన కిట్లు తయారుచేయాలి. లేకుంటే ఈ వైరస్‌ను పూర్తిగా కనిపెట్టలేం.. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో దీన్ని గుర్తించడం తక్కువ.. అందువల్ల పరీక్షల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం స్పైక్–జీన్‌లో మార్పులను బట్టి ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరగడం లేదని తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ 60 ఏళ్లలోపు వారిపైనే పంజా ఈ వైరస్‌కు గురైన వారి సగటు వయసు 47 ఏళ్లు.. అంటే 60 ఏళ్లలోపు వారికే ఎక్కువగా ఈ వైరస్‌తో ప్రమాదముంది. దీనికి కారణమేంటంటే.. లాక్డౌన్ తర్వాత బ్రిటన్‌లో అన్నింటినీ వదిలేశారు. దీంతో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. చలికాలం కూడా అనుకూలంగా పనిచేసింది.. సాధారణ వైరస్‌తో పోలిస్తే దీని వల్ల ఎక్కువ మరణాలు సంభవించలేదు. వైరస్‌పై లేబొరేటరీల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. దీని ఇన్ఫెక్టెవిటీని తెలుసుకుంటున్నారు. ఎలా గుర్తించారంటే? బ్రిటన్‌లో జన్యు విశ్లేషణ ప్రతీ పది కరోనా కేసుల్లో ఒకదానిపై జరుగుతోంది. అదే భారత్‌లో 5 వేలకు ఒక కేసుపై జన్యు విశ్లేషణ చేస్తున్నారు. దేశంలో కేసులు పడిపోతుండటంతో గత రెండు నెలలుగా కరోనా జన్యు విశ్లేషణ నిలిచిపోయింది. అయితే ఇటు సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌లో కేసులు బాగా పెరిగినట్లు గుర్తించారు. 14 రోజుల్లో నాలుగు రెట్లు పెరిగాయి. పెరిగిన కేసుల్లో జన్యు విశ్లేషణ ఆధారంగా కొత్త వర్గానికి చెందిన కరోనా బయటపడింది. ప్రపంచంలో 10 రకాల కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లున్నాయి. అందులో కోవిడ్ ఒకటి. కోవిడ్‌లో 11 రకాల ఉప గ్రూప్‌లున్నాయి. ప్రస్తుతం ప్రపం చాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్‌లో ఏ2ఏ అనే వర్గపు వైరస్ ప్రధానమైంది. మన దేశంలోనూ అదే ఉంది. ఇప్పుడు యూకేలో వచ్చింది కోవిడ్–19లో బీ వర్గానికి చెందినది. ఇది అనూహ్యంగా జన్యు మార్పులు చెంది 29 రకాలుగా మార్పులు చెందింది. సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌లో వారం పది రోజుల్లో నమోదైన వెయ్యి కేసుల్లో సగం ఈ వర్గానికి చెందినవే.. గతంలో 5% ఉన్నది కాస్తా ఇప్పుడు 50% పెరిగింది. మిగిలిన కరోనా వైరస్ల కంటే ఇది 70% వేగంగా విస్తరిస్తుంది. అయితే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తించలేదని ఈ–సీడీసీ తెలిపింది. దక్షిణాఫ్రికాలోనూ ఇదే వర్గానికి చెందినదే గతంలో వచ్చింది. సింగపూర్‌లోనూ కొత్త వెరైటీలు వచ్చి బలహీనపడ్డాయి. దీనిపై పరిశోధనలు జరగాలి.. ప్రతీ దేశంలోనూ కొత్త వైరస్‌పై జన్యువిశ్లేషణ జరగాలని సూచించింది. కొత్త వైరస్‌తో అనూహ్యంగా కేసులున్నాయే కానీ, మరణాలు పెద్దగా పెరగలేదని తెలిపింది. కొత్త వైరస్లలో మార్పులకు కారణమేంటంటే? కొత్త రకం వైరస్లలో అనూహ్యంగా మార్పులున్నాయి. బీ వర్గం వైరస్ కూడా మార్పులకు లోనై తక్కువ కాలంలో వేగంగా విస్తరిస్తోంది. దీనికి గల కారణాలను ఈ–సీడీసీ విశ్లేషించింది. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న అతి కొద్దిమంది కరోనా రోగుల్లో కొన్ని నెలల పాటు వైరస్ ఉంటుంది. దీంతో వైరస్ వారి శరీరంలో ఎన్నో మార్పులకు లోనవుతుంది. అలా అది ఆ మార్పులతో బయటకు వచ్చి మరింత వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. ఇక రెండోది జంతువుల్లోకి వైరస్ వెళ్లి మార్పులు చెంది మళ్లీ మనిషికి రావడం వల్ల దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చదవండి: (కరోనాకు కొత్త కొమ్ములు) ఉదాహరణకు డెన్మార్క్‌లో మింక్ అనే జంతువులో వైరస్ ప్రవేశించి అనేక మార్పులకు లోనైంది. అందులో ఒక ప్రత్యేక మార్పును ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అదే మార్పు ఇంగ్లండ్‌లోని బీ వర్గం వైరస్‌లోనూ కనిపిస్తోంది. అయితే అది ప్రమాదకరం కాదని నిర్ధారణ అయింది. బ్రిటన్‌లోని కొత్త రకం వైరస్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ–సీడీసీ చెప్పింది. బ్రిటన్ నుంచి వచ్చేవారిని ఇతర దేశాల్లో క్వారంటైన్లో ఉంచాలి. ఎవరూ ఎక్కువ ప్రయాణాలు చేయవద్దు. ప్రస్తుతం తీసుకుంటున్న కరోనా జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా బయటకు రాకూడదని తెలిపింది. ఈ–సీడీసీ ప్రతిపాదనలు ►ప్రస్తుతం వాడుతున్న మందులతో నయం కాని కరోనారోగులను ప్రత్యేకంగా పరిశీలించాలి.. ►కరోనా రీఇన్ఫెక్షన్ వచ్చిన వారిలోని మార్పులను గుర్తించాలి. రెండోసారి వచ్చింది బీ వర్గానిదా కాదా చూడాలి. ►వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వచ్చినవారున్నారా లేదా చూడాలి. వాళ్లల్లో కొత్త వైరస్ ఉందా లేదా పరీక్షించాలి. జాగ్రత్తలే శ్రీరామరక్ష.. కొత్త వైరస్ ప్రమాదకారి అని చెప్పలేం.. ఆర్ఎన్ఏ వైరస్లలో మార్పులు సహజమే.. దీనివల్ల మనుషులపై చూపించే ప్రభావం కూడా తక్కువేనని ఈ–సీడీసీ స్పష్టం చేసింది. బీ వర్గానికి చెందిన కొత్త వైరస్‌కు దగ్గరి పోలికలున్న వైరస్‌ను దక్షిణాఫ్రికా, సింగపూర్, డెన్మార్క్‌ల్లో గుర్తించారు. కానీ ఇది ఏమాత్రం ప్రభావితం చేయలేదని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. వ్యాక్సిన్ పురోగతికి, కరోనా వైద్యంపై కొత్త వైరస్ ప్రభావం చూపదు.. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజల్ని ప్రభుత్వాలు వైరస్‌కు దూరంగా ఉంచాలి. ఆ మేరకు ప్రజలూ తగు జాగ్రత్తలు పాటించాలి.. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
కరోనాకు కొత్త కొమ్ములు
సాక్షి, హైదరాబాద్: లండన్‌లో బయటపడి పలు దేశాలకు విస్తరించిన కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుండగా, ఇందుకు తగిన ఆధారాలు, సమాచారం చూపాలని బ్రిటన్ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఈ కొత్త రకం వైరస్ మరింత తీవ్రమైందని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగపు ముఖ్యాధికారి మైకేల్ ర్యాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించ కూడదని నిర్ణయించుకున్నామని అమెరికా వ్యాక్సిన్ నిపుణుడు ఆంథోనీ పాసీ ప్రకటిం చారు. ఇప్పటివరకు 1,000 మంది ఈ రూపాం తర వైరస్ బారిన పడగా నలుగురు మాత్రమే మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉండేలా వ్యాధి కారక వైరస్లలో జన్యుమార్పులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. అయితే గతంలో రూపాంతర వైరస్ కారణంగా వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ‘వీయూఐ 202012/01’వైరస్ సోకిన వారి పరిస్థితి ఏంటన్నది నిశితంగా గమనించాల్సి ఉంది. చదవండి: (కొత్త రకం కరోనా: భారత్‌లో ఆందోళన అవసరం లేదు!) జన్యుమార్పులు ఎలా? శరీరంలోకి చేరిన వైరస్ వేగంగా తన నకళ్లను తయారు చేసుకుంటుందని తెలిసిందే. ఒక వైరస్ రెండుగా విడిపోయే క్రమంలో సహజసిద్ధంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు వైరస్ మనుగడకు ఉపయోగపడకపోతే అవి మరణిస్తాయి. ఈ ఏడాది జనవరిలో తొలిసారి గుర్తించిన సార్స్ సీవోవీ–2 వైరస్ పలు ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా.. అనేక మార్పులకు గురయ్యాయి. సాధారణంగా జనాభాలో అత్యధికుల్లో పాత వైరస్ లేదా ఇతర వ్యాధులకు వేసిన టీకాల వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో యాంటీబాడీల ఉత్పత్తి జరిగి ఉంటే వాటిని అధిగమించి మనుగడ సాగించేందుకూ ఈ జన్యుమార్పులు దోహదపడతాయి. కాకపోతే ఇందుకు చాలా సమయం పడుతుంది. ‘వీయూఐ 202012/01’వైరస్ ఉనికి అక్టోబర్ నుంచి క్రమేపీ పెరుగుతుండటాన్ని బట్టి చూస్తే ఇది నిలకడ కలిగిందని తెలుస్తోంది. ఈ వైరస్ ఉన్న రోగులను పరిశీలించగా, వైరస్‌లో మొత్తం 23 జన్యుమార్పులు ఉన్నట్లు తెలిసింది. జన్యుక్రమంలో రెండు చోట్ల (పొజిషన్ 69/70, 144/145) తొలగింపులు ఉండటం వ్యాధి వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమని నిపుణుల అంచనా. కొమ్ములోనే అధిక జన్యుమార్పుల వల్ల వైరస్ నకళ్లు ఏర్పడే వేగం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్‌కు చెందిన నిపుణుల బృంద సభ్యుడు వెండీ బార్క్లే అంటున్నారు. వ్యాప్తి వేగం మునుపటి వైరస్ కంటే 71 శాతం ఎక్కువగా ఉందని వివరించారు. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!) ఆ మూడింటి విషయంలో జాగ్రత్త.. కోవిడ్ నియంత్రణ కోసం మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. త్రీసీలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు అంటున్నారు. గాలి, వెలు తురు సక్ర మంగా లేని చోట్ల గుమి కూడకపోవ డం (క్లోస్డ్ స్పేసెస్), జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరక్కపోవడం (క్రౌడెడ్ స్పేసెస్), సన్నిహితంగా మెలగకపోవడం (క్లోజ్ కాంటాక్ట్)లను జాగ్రత్తగా పాటించాలని వివరిస్తున్నారు. వదంతులు నమ్మకండి కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి ఇంకా తెలియాల్సిన అంశా లు చాలా ఉన్నాయని, అంత వర కూ ప్రజలు వదంతులు నమ్మ కూడదని, జాగరూకతతో వ్యవ హరించాలని జస్లోక్ ఆసుపత్రి సాం క్రమిక వ్యాధుల విభాగపు అధ్య క్షుడు డాక్టర్ ఓం శ్రీవాత్సవ స్పష్టం చేశారు. కొత్త రకం వైరస్ కార ణం గా వచ్చే వ్యాధి లక్షణాల్లో పెద్ద తేడాలేమీ లేవని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు అవ సరమైన నిబంధనలు పాటించడం ద్వారా కొత్త రకం వైరస్‌ను కట్టడి చేయొచ్చని అన్నారు. -
రాష్ట్రంలో కొత్త వైరస్ ప్రభావం లేదు!
కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రంలోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. -పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సాక్షి, హైదరాబాద్: కొత్తరకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రం లోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బ్రిటన్‌లో గుర్తించిన కొత్తరకం వైరస్‌పై కేంద్ర వైద్య, పౌర విమానయాన శాఖల ఆదేశాల మేరకు అలర్ట్ అయ్యామని, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. సోమవారం బ్రిటన్ నుంచి ఏడుగురు ప్రయాణికులు హైదరాబాద్ రాగా, వారందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 మధ్య బ్రిటన్ నుంచి 358 మంది హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వారు ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. గత వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారు 040–24651119 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. వారికి కొత్త వైరస్ సోకిందా లేదా అన్నది పరీక్షల్లో తేలుతుందన్నారు. నెగెటివ్ వచ్చినా కూడా ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డా.పుట్రాజు తదితరులు ఈ కార్యకమంలో పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు.. కొత్త రకం వైరస్ విషయంలో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులపై ప్రభుత్వ శాఖలన్నింటితో కలసి యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. కొత్త వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. అత్యంత తక్కువ స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయని, గత నాలుగు వారాలుగా కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. చదవండి: (కరోనా కొత్త అవతారం!) పండుగల సమయంలో జాగ్రత్త.. నూతన సంవత్సర వేడుకలు ఇంటి సభ్యులతోనే జరుపుకోవాలని, బయటి వేడుకల్లో పాల్గొనవద్దని కోరారు. పండుగల సందర్భంగా విందులు, వినోదాలు జరుపుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నాలుగైదు వారాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, దీని పంపిణీకి 10 వేల మందిని సిద్ధం చేశామన్నారు. మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు భద్రపరిచేం దుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్యనే పండుగలు జరుపుకోవాలని, కొత్త వ్యక్తులు, అపరిచితులతో జరుపుకోవద్దని కోరారు. రాబోయే 2 వారాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలన్నారు. పబ్‌లు, రెస్టారెంట్ల వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదన్నారు. పబ్‌లలో యువతీ, యువకులు జాగ్రత్తలు పాటించడం లేదని, వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పుణేకు రెండు శాంపిళ్లు ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు కొందరు ప్రయాణికులు వచ్చారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అది కొత్త రకపు కరోనా వైరసా కాదా.. అన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో అనుమానాలు తలెత్తాయి. దీంతో వారి శాంపిళ్లను మరోసారి క్షుణ్నంగా పరీక్షించే నిమిత్తం ఫుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. సాధారణ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో సరైన ఫలితాలు రావచ్చు.. రాకపోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కొత్త వైరస్ బయట పడకపోవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ వైరస్ సంచలనం కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!) కొత్త మ్యుటేషన్లు వస్తూనే ఉంటాయి: డీఎంఈ ప్రతి వైరస్‌లో కొత్త కోణాలు, మ్యుటేషన్లు, వేరియంట్లూ వస్తూనే ఉంటాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి తెలిపారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. తక్కువ తీవ్రత ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కట్టడిలో రాష్ట్రం ఎంతో విజయం సాధించిందని చెప్పారు. వైరస్ విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ ప్రభావం తగ్గిందనే భావన ప్రజల్లో ఏర్పడి, భౌతికదూరం పాటించట్లేదని తెలిపారు. -
కరోనా కొత్త అవతారం!
ఈ సంవత్సరం తొలినాళ్ల నుంచి ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో విరగడయ్యే అవకాశం లేదని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. అది రూపం మార్చుకుని మరింత ప్రమాదకరంగా పరిణమించిందని, వ్యాప్తి చెందే వేగం కూడా బాగా పెరిగిందని నిపుణులు చెబుతున్న మాటలు దడ పుట్టిస్తున్నాయి. గత పది పన్నెండు నెలలుగా కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ భిన్న రూపాలు సంతరించుకోగా... వాటిల్లో ఇప్పుడు కొత్తగా కనుగొన్న వీయూఐ 202012/01 రకం మిగిలిన కరోనా రకాలతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనదని తేల్చారు. పాత రకం కన్నా దీనికి 70 శాతం అధికంగా విస్తరించే లక్షణం వుందన్నది వారి మాట. దీని జాడ సెప్టెంబర్‌లోనే బయటపడినా అన్ని రకాలుగా పరీక్షించి నిర్ధారించడానికి సమయం పట్టింది. కనుక ఈ వైరస్ ప్రస్తుతం బ్రిటన్‌కి మాత్రమే పరిమితమైందని చెప్పలేం. ఇప్పటికే నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియాలకు ఇది విస్తరించిందంటున్నారు. కరోనాను అరికట్టడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి రాబోతున్నాయని, త్వరలోనే మాస్క్‌లను దూరం పెట్టొచ్చని, భౌతికదూరం పాటించే అలవాటుకు కూడా స్వస్తి పలకొచ్చునని ఆశిస్తున్నవారికి ఈ తాజా రూపం వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ఏడాదంతా ఎదురుచూసే అలవాటున్న పాశ్చాత్య ప్రపంచానికి ఇది ఊహించని షాక్. ఇప్పుడు కొత్త రకం కరోనా బయటపడిన బ్రిటన్‌కు దాదాపు అన్ని దేశాలూ తలుపులు మూస్తున్నాయి. ఈ నెల 31 వరకూ ఆ దేశానికి విమాన రాకపోకలను నిలిపేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇరుగుపొరుగునున్న యూరప్ దేశాలు మాత్రమే కాదు... మన దేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ అక్కడినుంచి వచ్చినవారి ఆచూకీని రాబట్టి పరీక్షలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఒకసారి వైరస్ జన్యు అమరిక మారిందంటే అందుబాటులో వున్న వ్యాక్సిన్లకు అది లొంగడం కష్టమన్న వాదన వుంది. అయితే వ్యాక్సిన్ చేసే పని వైరస్‌లోని వివిధ భాగాలపై దాడిచేసే శక్తిని మన రోగ నిరోధక వ్యవస్థకు ఇవ్వడం. కనుక వైరస్ రూపం మార్చుకున్నా ఆ వ్యాక్సిన్ ప్రభావంతో రోగ నిరోధక వ్యవస్థ తన పని తాను చేస్తుందని నిపుణులంటున్న మాట కొంతలో కొంత ఉపశమనం. కానీ కొత్త రకం వైరస్ తీరుతెన్నులు పూర్తిగా అవగాహనకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితమైన నిర్ధారణకు రావడం సులభం కాదు. బ్రిటన్, డెన్మార్క్ పరిశోధనాలయాల్లో శాస్త్రవేత్తల మేధోమథనం నిరంతరాయంగా సాగుతోంది. ఇప్పుడు జరిగిన ఉత్పరివర్తన స్వరూపస్వభావాలేమిటో, దాని తీవ్రత ఎంతో, రోగ నిరోధక వ్యవస్థపై అది చూపగల ప్రభావమేమిటో వారు పరిశోధిస్తున్నారు. ఇటీవలే కరోనాలోని డీ614జీ రకం వైరస్‌ను కనుగొన్నారు. అది స్పెయిన్‌లో మొదలై యూరప్‌లో విస్తరించిందని నిర్ధారించారు. అలాగే దానికి ముందు వై453ఎఫ్ రకం కరోనా వైరస్ జాడను డెన్మార్క్‌లో పసిగట్టారు. దాని వ్యాప్తి మందకొడిగానే వుంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన 501.వీ2 రకానికి మాత్రం వేగంగా విస్తరించే లక్షణం వుందంటున్నారు. బ్రిటన్ వైద్యరంగాన్ని పర్యవేక్షించే నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ప్రపంచంలోనే పేరెన్నికగన్నది. కానీ రాజకీయ నాయకత్వం అసమర్థత దానికి శాపమైంది. అంటువ్యాధుల నిపుణులు మొదట్లో లాక్డౌన్ విధింపే మార్గమని చెబుతున్నా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తాత్సారం చేశారు. మార్చిలో లాక్డౌన్ విధించేనాటికి అది కాస్తా ఉగ్రరూపం ధరించింది. వేలమందికి ప్రాణాంతకమైంది. తీవ్రత అధికంగా వున్నచోట్ల లాక్డౌన్ అవసరమని సెప్టెంబర్‌లో నిపుణులు సూచించినప్పుడు కూడా ఆయన సకాలంలో స్పందించలేదు. పర్యవసానంగా నవంబర్‌లో సుదీర్ఘ లాక్డౌన్ తప్పలేదు. మొన్నీమధ్య కూడా అంతే. వైరస్ ఉత్పరివర్తనతో వ్యాధి తీవ్రత పెరుగుతోందని, ఆంక్షలు సడలించవద్దని చెబితే క్రిస్మస్ వేడుకలకు అడ్డుపడటం అమానుషమని జాన్సన్ వ్యాఖ్యానించారు. ఈలోగా ఆగ్నేయ ఇంగ్లండ్‌లో వైరస్ శరవేగంతో విస్తరిస్తూ పోయింది. ఆంక్షల అమలు తప్పనిసరని ఆయన నిర్ణయానికొచ్చాక వాటినుంచి తప్పించుకుని వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాదిమంది రైల్వే స్టేషన్లకూ, విమానాశ్రయాలకూ తరలారు. ఫలితంగా వ్యాధి వ్యాప్తి ప్రమాదం పెరిగింది. వ్యాపార, వాణిజ్య రంగాలు భారీ నష్టాలు చవిచూడక తప్పని స్థితి ఏర్పడింది. ఈసారి సుదీర్ఘకాలంపాటు ఆంక్షలు అమలు చేయాల్సిరావొచ్చునని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో, యువకుల్లో ఇది విరుచుకుపడే అవకాశం వుందంటున్నారు గనుక పాఠశాలలు ముందనుకున్నట్టు జనవరిలో ప్రారంభించే అవకాశాలు తక్కువ. పండగలు, సంప్రదాయాలు, నిబంధనలు వగైరా మాటున ఆంక్షల్ని గాలికొదిలితే ఏమవుతుందో బ్రిటన్ వర్తమాన పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైతే మన దేశంలో దీని జాడ లేదు. కానీ అంతమాత్రం చేత ఇది ప్రవేశించలేదని నిర్ధారణగా చెప్పలేం. ఎందుకంటే మొన్న సెప్టెంబర్ నుంచి ఇది బ్రిటన్‌లో వ్యాప్తిలో వుంది. అప్పటినుంచీ లెక్కేస్తే అక్కడినుంచి వచ్చినవారు గణనీయంగానే వుంటారు. మొదట్లో విమానాశ్రయాల్లో కట్టడి విధించకపోవడం వల్ల దేశం ఎంతటి వైపరీత్యాన్ని ఎదుర్కొనవలసివచ్చిందో అందరికీ అనుభవమే. అందుకే ప్రభుత్వాలన్నీ తక్షణ చర్యలు చేపట్టాయి. మానవాళితో జరిపే నిరంతర యుద్ధంలో వైరస్లు రూపాంతరం చెందడం సర్వసాధారణం. కనుకనే వాటిపై పోరాటం కూడా ఆ స్థాయిలో నిరంతరం జరగక తప్పదు. గత పది నెలలుగా కరోనాతో చేసిన పోరాటం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ అనుభవం ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను పెంచింది. ప్రజానీకానికి సైతం ఆ వైరస్ ఎంతటి ప్రమాదకారో అర్థమైంది. అవన్నీ కొత్త రకం వైరస్‌ను ఎదుర్కొనడంలో అక్కరకొస్తే ఈ గండాన్ని అధిగమించడం కష్టం కాదు. -
బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!
సాక్షి, ముంబై: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ విజృంభింస్తుడటంతో కేంద్రప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి విమాన సేవలను నిలిపివేసింది. కానీ, అంతకు ముందే అంటే సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముంబైకి ఐదు విమానాలు వచ్చాయని తెలిసింది. అందులో సుమారు వేయి మందికిపైగా ప్రయాణికులు వచ్చి ఉండవచ్చని సమాచారం రావడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో బీఎంసీ తలమునకలైంది. వీరంతా నేరుగా తమ ఇళ్లకు వెళ్లకుండా వారం రోజులపాటు హోటల్ గదులలో బస చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కరోనా పరీక్షలు నిర్వహించి ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధరణ అయితే అప్పుడు ఇంటికి పంపిస్తారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. 8 ఆస్పత్రుల్లో టీకా నిల్వ.. కరోనా టీకా మందు త్వరలో అందుబాటులోకి రానుందని సంకేతాలు రావడంతో బీఎంసీ పరిపాలన విభాగం ఏర్పాట్లు చేసే పనులు మరింత వేగవంతం చేసింది. టీకా మందు తీసుకునేందుకు పరేల్‌లోని కేం, సైన్‌లోని లోకమాన్య తిలక్, ముంబై సెంట్రల్‌లోని నాయర్, బాంద్రాలోని బాబా, విలేపార్లేలోని కూపర్, ఘాట్కోపర్లోని రాజావాడి, శాంతకృజ్లోని వి.ఎన్.దేశాయ్, కాందివలిలోని అంబేడ్కర్ ఇలా ఎనిమిది ఆçస్పత్రులను ఎంపిక చేసింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయని బీఎంసీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రాలలో టీకా మందు ఇచ్చేందుకు వైద్య రంగంలో నిపుణులైన 40 మంది వైద్యులను నియమించనున్నారు. వీరందరికి బీఎంసీకి చెందిన ఆరోగ్య అధికారి డాక్టర్ శీలా జగ్తాప్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు బీఎంసీ ఆస్పత్రి డాక్టర్ రమేశ్ బార్మల్ అన్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్రం జారీ చేసిన నియమావళి ప్రకారం టీకా మందు తొలుత ఎవరికివ్వాలో మెబైల్ ఫోన్లో సందేశాలు పంపించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. అందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది తీరికలేకుండా పనిచేస్తున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్ పోలీసులను కూడా సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భారీ మాత్రలో నిల్వచేసిన కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి కరోనా టీకా ఆస్పత్రులకు తరలించేందుకు ట్రాఫిక్ పోలీసుల సాయం తీసుకోనున్నారు. ట్రాఫిక్ జామ్‌లో టీకా మందు తీసుకెళ్లే అంబులెన్స్‌లు చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి టీకా మందు బయటకు తీసిన తరువాత నిర్ణీత సమయంలోపు కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యం కాకుండా సకాలంలో టీకా మందు సంబంధిత కేంద్రాలకు చేరుకునేలా ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. 15 రోజుల క్వారంటైన్.. బ్రిటన్‌లో కొత్త వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి ముంబై వచ్చిన ప్రయాణికులు నేరుగా జనాల్లోకి వెళ్లకుండా వారం లేదా పక్షం రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అందుకు నగరంలోని వివిధ హోటళ్లలో రెండు వేల గదులు సిద్ధంచేసి ఉంచింది. ఇందులో వేయి గదులు ఫోర్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, మిగతా గదులు కొన్ని స్టార్ హోటళ్లలో ఉన్నాయి. హోటళ్లలో బస ఖర్చులు స్వయంగా ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ స్పష్టం చేశారు. సోమవారం కంటే ముందు ముంబైకి చేరుకున్న వారి వివరాలు సేకరిస్తున్నామని చహల్ అన్నారు. ఒకవేళ ముంబైలో ఉన్నట్లు సమాచారం ఉంటే వెంటనే వారింటికెళ్లి పరీక్షలు నిర్వహించి చేతికి స్టాంప్ వేస్తామని ఆయన అన్నారు. అంతకు ముందు విమానాశ్రయంలోనే ప్రాథమిక పరీక్షలు జరుగుతాయి. అందులో లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులను కోవిడ్ లక్షణాలుంటే వారిని విలేపార్లేలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో, యూరప్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో ఉన్న జీ.టి.ఆస్పత్రిలో చేర్పిస్తామని చహల్ తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా వార్డులు కేటాయించామని స్పష్టంచేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని, అలాగే ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
కరోనా 2.O: వైరస్ కొత్త రూపం, అసలు కథేంటి?
సమస్త దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. వైరస్‌ల్లో జన్యుమార్పులు సహజంగానే జరుగుతుంటాయి. కానీ నెమ్మదిగా జరగాల్సిన ఇలాంటి జన్యుమార్పులను వేగంగా పూర్తి చేసుకొని కరోనా రివైజ్డ్ వెర్షన్‌లాగా సిద్ధమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు వచ్చాయని సంతోషించేలోగానే కొత్త రూపంలో కరోనా దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ రివైజ్డ్ కరోనా వివరాలు ఇవీ.. ఏమని పిలుస్తారు? వీయూఐ 20212/01. ఎలా ఏర్పడింది?: కోవిడ్ వైరస్‌లో 23 జన్యుమార్పులు జరిగి ఏర్పడింది. ఎక్కడ, ఎప్పుడు బయటపడింది? దక్షిణ లండన్‌లో, గత అక్టోబర్‌లో బయటపడింది. డిసెంబర్ నాటికి వేగంగా వ్యాపిస్తోంది. యూరప్‌లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్ జాడలు కనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో కేసులు పైపైకి బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన కడపటి వార్తలుఅందే సమయానికి 33,364 కేసులు నమోదయ్యాయి. ఎంత ప్రమాదకరం? గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వైరస్ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు. టీకాలు పనిచేస్తాయా? కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వైరస్ టీకాకు లొంగని విధంగా పూర్తి జన్యుమార్పులు చెందేందుకు సంవత్సరాలు పడుతుందని, ఇప్పుడు తయారవుతున్న ఆధునిక వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను అడ్డుకోగలవని చెబుతున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు. ఏం చర్యలు చేపట్టారు? ముందుగా బ్రిటన్‌కు పలు దేశాలు రాకపోకలను నియంత్రించాయి. బ్రిటన్‌లో కూడా నూతన వ్యాప్తి అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు వాక్సినేషన్ మొదలెట్టారు. భారత్‌లో పరిస్థితి.. ఇండియాలో ఇంకా అధికారికంగా ఈ కొత్త వేరియంట్ వైరస్ ఉనికి నిర్ధారించలేదు. అటు ఆరోగ్య శాఖ జనవరి నుంచి దేశ ప్రజలకు టీకాలు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్తగా బ్రిటన్‌కు విమాన రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అనవసర పుకార్లు నమ్మవద్దని, కరోనా నివారణకు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోకిన వారికే మళ్లీ? దక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని సోమవారం ‘సాక్షి’తో చెప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త వైరస్ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్‌లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వైరస్‌లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్‌లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు. (చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం) -
కొత్త కరోనా భయంతో మళ్లీ ఆంక్షలు
31వరకు నిషేధం హమ్మయ్య... కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మాస్క్ కాస్త పక్కకు పెట్టి ఊపిరిపీల్చుకోవచ్చు.. అనుకునేలోపే.. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. కరోనా కంటే వేగంగా దూసుకొస్తోంది. ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను ఈ వైరస్ ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ ఇప్పటికే డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో పలు దేశాలు యూకే నుంచి రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ నేపథ్యంలో భారత్ బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని ప్రకటించింది. బ్రిటన్ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని డీజీసీఏ ఆదేశించింది. ►కొత్త తరహా వైరస్‌పై కేంద్రం అప్రమత్తంగా ఉంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిమిషానికి 1,850 కోట్లు నష్టం సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1.78 లక్షల కోట్లకు దిగివచ్చింది. రాష్ట్రంలో అలర్ట్ బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రం అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తర్వాతే పంపాలనినిర్ణయించింది. -
మార్కెట్లను బెంబేలెత్తించిన కొత్త రకం కరోనా
ముంబై: రోజుకో కొత్త రికార్డును తిరగరాస్తూ జోరుమీదున్న సూచీలకు సోమవారం అమ్మకాల షాక్ తగిలింది. కొత్త రకం కరోనా వైరస్ భయాలు మార్కెట్‌ను మరోసారి వెంటాడడంతో పాటు జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఏడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి వెల్లువెత్తిన అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 47,000– 46,000 పాయింట్ల స్థాయిలను ఒకే రోజులో కోల్పోయింది. చివరికి 1,407 పాయింట్లు కుప్పకూలి 45,554 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 13,328 వద్ద ముగిసింది. దీంతో సూచీల ఆరురోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. మార్కెట్ భారీ పతనంతో అన్ని రంగాల ఇండెక్స్‌లు భారీ నష్టాల మూటగట్టుకున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ 2038 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 44,923 స్థాయిని చేరుకుంది. నిఫ్టీ 629 పాయింట్లు క్షీణించి 13,131 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. రూపాయి విలువ 23 పైసల నష్టాన్ని చవిచూసి 73.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ–50 ఇండెక్స్, సెన్సెక్స్ సూచీల్లో ఏ ఒక్క షేరు లాభపడలేదు. కొత్త రకం కరోనా విజృంభణతో బ్రిటన్, భారత్‌ల మధ్య డిసెంబర్ 31 వరకు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటనతో ఎయిర్‌లైన్స్ షేర్లు 10% నష్టాన్ని చవిచూశాయి. స్టాక్ మార్కెట్లో వొలటాలిటీ(వీఐఎక్స్) ఇండెక్స్ అనూహ్యంగా 25% పెరిగి 23 స్థాయిపైన ముగిసింది. ఈ ఇండెక్స్ ఎంత ర్యాలీ చేస్తే మార్కెట్లో అంత ఒడిదుడుకులు ఉన్నట్లు భావిస్తారు. నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం... సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.178 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలు ఎందుకంటే... ►తెరపైకి కొత్త రకం కరోనా భయాలు... ఈ ఏడాది ప్రథమార్ధం చివర్లో మార్కెట్ పతనాన్ని శాసించిన కరోనా భయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోవిడ్–19 నియంత్రణకు వ్యాక్సిన్ పంపిణికీ సిద్ధమవుతున్న వేళ వైరస్ తాజాగా రూపు మార్చుకుని ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఈ కొత్త వైరస్ విజృంభణతో యూరప్‌లో పలు దేశాలు పరిమితితో కూడిన లాక్‌డౌన్‌ను విధించగా, బ్రిటన్ పూర్తిలాక్ స్థాయిలో ఆంక్షలను అమలు చేస్తోంది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు తెరతీశారు. ►గరిష్టస్థాయిల లాభాల స్వీకరణ.... గత కొన్ని రోజులుగా సూచీలు ముగింపులోనూ, ఇంట్రాడేలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుండడంతో పలు షేర్లు అధిక వ్యాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు క్రిస్మస్, ఏడాది ముగింపు సెలవులు రానున్న నేపథ్యంలో ఇన్వెసర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ►బలహీన అంతర్జాతీయ సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ యూరో దేశాల్లో విజృంభించడంతో బ్రిటన్ అంతటా లాక్‌డౌన్‌ను విధించారు. అలాగే బ్రెగ్జిట్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన సూచీలు 3 శాతం నష్టంతో ముగిశాయి. ఆసియాలో జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ సింగపూర్ దేశాల ఈక్విటీ సూచీలు 1 శాతం నుంచి 5 శాతం వరకు నష్టాలతో ముగిశాయి. -
వికారాబాద్ జిల్లాలో కొత్త రకం వైరస్ కలకలం
సాక్షి, వికారాబాద్: జిల్లాలో కొత్తరకం వైరస్ మూగ జీవుల ఉసురు తీస్తోంది. ఈ మహమ్మారి ఎంటో వైద్యులకు కూడా అంతుచిక్కకపోవడంతో పశువులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పశువుల చర్మంపై చిన్న చిన్న రంధ్రాలు పడి రక్తం కారుతుండటంతో వాటిని ముట్టుకోవడానికి కూడా రైతులు భయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 300 పైగా పశువులకు ఈ వింత రోగం సోకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మాయదారి మహమ్మారి నుంచి పశువులను రక్షించుకునేందుకు రైతులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో వేలకు వేల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. అయినా ఫలితం దక్కడం లేదు. ఇక ఇది రోగమా? వైరస్ అనేది తెలియక పశువైద్యులు పరెషాన్ అవుతున్నారు. ప్రస్తుతం వైద్యులు పశువులకు గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చి సరిపెడుతున్నారు. అయితే ఈ మాయదారి రోగం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు పశు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
చైనాలో మరో మహమ్మారి!
-
‘చైనా మరో కుట్ర: మనకోసం మరో వైరస్’
హైదరాబాద్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా చైనా దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా మమహ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కుట్ర కచ్చితంగా చైనా కుట్రేనని తేల్చిచెప్పిన భజ్జీ ఆ దేశ వస్తువులు బహిష్కరించాలని దేశ ప్రజలకు గతంలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డ్రాగన్ కంట్రీలో మరో వైరస్ పురుడు పోసుకుంటుందన్న వార్తలపై భజ్జీ స్పందించాడు. (వాటే ప్లాన్ చైనా: భజ్జీ) పందుల్లో స్వైన్ ఫ్లూ వంటి మరో రకం వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపిన రాయిటర్స్ కథనాన్ని రీట్వీట్ భజ్జీ రీట్వీట్ చేశాడు. ‘కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుంటే వాళ్లేమో మన కోసం మరో వైరస్ సిద్ధం చేశారు’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా కోపంతో ఉండే ఎమోజీలను జతచేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆధిపత్యం కోసం చైనా ఎంత నీచానికైనా దిగజారుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’) కాగా మరో కొత్త రకం స్వైన్ ఫ్లూ వైరస్ ఒకటి ప్రస్తుతం చైనాను కలవరపెడుతోంది. ఇది గతంలో విస్తరించిన స్వైన్ ఫ్లూ వైరస్ కంటే ఎంతో ప్రమాదకరమైనదని.. అంటువ్యాధిగా మారే లక్షణాలు కలిగి ఉందని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్ఏఎస్ సోమవారం ప్రచురించింది. జీ4 అని పిలువబడే ఇది జన్యుపరంగా 2009లో స్వైన్ ఫ్లూకు కారణమైన హెచ్1ఎన్1 జాతి నుంచి వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఇది మానవులకు సోకడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. (‘కరోనా చాలా నేర్పింది.. వ్యవసాయం చేస్తా’) While the whole world is still struggling to deal with Covid 19 they have made another virus ready for us..🤒🤬😡 https://t.co/kCBwajGD2n — Harbhajan Turbanator (@harbhajan_singh) June 30, 2020 -
ఇది మన కరోనా!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ ‘భారతీయీకరణ’(ఇండియనైజ్) చెందిందా? భారతీయత వచ్చేసిందా..? ఇక్కడి పరిస్థితులు, మనుషుల్లో భిన్నమైన జన్యువులు, లక్షణాలకు అనుగుణంగా మార్పు చెందుతోందా? ఆయా మార్పులకు అనుగుణంగా కొత్త వైరస్ వర్గం (క్లాడ్) 1/ఏ3 ఐ ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. ప్రపంచంలో ప్రధానంగా 10 వైరస్ క్లాడ్‌లు వ్యాప్తిలో ఉండగా, ఇప్పటికే భారత్‌లో ఏ 2ఏ, ఏ3, బీ, బీ 4 అనే నాలుగు రకాల క్లాడ్‌లు కరోనా వైరస్‌లో కామన్‌గా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే కొత్తగా మరో వేరియంట్ 1/ఏ3 ఐ బయటపడింది. ఫిబ్రవరి నుంచే ఇది వ్యాప్తి చెందడం మొదలైందని, ప్రస్తుతం అన్ని వైరస్ వేరియెంట్లలో ఇది 42 శాతం ఉన్నట్లు, ప్రపంచవ్యాప్తంగా 3.5 శాతం ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. ఇప్పటికే దీనికి సంబంధించిన జన్యువులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), పుణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా విశ్లేషించాయి. తాజాగా సీసీఎంబీ జరిపిన తాజా పరిశోధనల్లో ఐదో రకం వైరస్ వర్గం ఉన్నట్లు గుర్తించింది. ఇది ఎక్కువగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీకి సంబంధించిన వైరస్ కేసుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లో వీటి ఛాయలున్నట్లు తేల్చారు. ఈ జీనోమ్‌లు సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రూనే, కెనడా, చైనాలోని కేసుల్లో స్వల్పస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ వర్గం వైరస్‌లోనూ జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నందున దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తే మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. నాలుగో రకం చాలా ప్రమాదకరం.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల వైరస్ శాంపిళ్లు, వాటిలోని జీనోమ్‌లు, అవి ఏ విధంగా మార్పు చెందుతున్నాయన్న దానిపై పరిశోధనలు నిర్వహించారు. వీటిలో ప్రధానంగా 10 రకాల వేరియెంట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటికి తగ్గట్లు వైరస్ జీనోమ్ స్వభావాలు మారుతున్నట్లు గుర్తించారు. మనదేశం విషయానికొస్తే 361 నమూనాలను పరిశీలించారు. వాటిలో ఇప్పటికే 297 శాంపిళ్ల జన్యువు నమూనాలపై ఐసీఎంఆర్, ఎన్ఐవీ, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, తదితర సంస్థలు పరిశోధనలు నిర్వహించాయి. వాటిలో నాలుగు వర్గాలు లేదా రకాల జీనోమ్‌లు ఏ1, ఏ2 బీ, బీ, బీ3 ఉన్నట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీటికి తోడు సీసీఎంబీ, ఢిల్లీకి చెందిన సీఎస్ఐఆర్ 64 శాంపిళ్ల పైనా జన్యు విశ్లేషణ జరపడంతో పాటు గతంలోని 297 నమూనాలు కూడా కలిపి మొత్తం 361 శాంపిళ్లను పరిశీలించినప్పుడు కొత్తరకం వైరస్ వర్గాన్ని కనుగొన్నారు. ఇలా భారత్‌లో ఐదవ, ప్రపంచంలో 11వ వర్గాన్ని గుర్తించారు. దీని స్వభావాన్ని తెలుసుకునేందుకు జనవరి 22 నుంచి ఏప్రిల్ 30 వరకు ఐసీఎంఆర్ చేసిన ల్యాబ్ డేటాను విశ్లేషించగా, సీసీఎంబీ ఎక్కడైతే 1/ఏ3 ఐ వైరస్ ప్రాచుర్యంలో ఉందని చెప్పిందో (తెలంగాణ, మహారాష్ట్ర తదితరాలు)ఆ ప్రాంతాల్లో సెకండరీ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఐసీఎంఆర్ విశ్లేషణలను బట్టి ఏ1/ఏ3 ఐ వైరస్ వ్యాప్తి లక్షణం ఎక్కువగా ఉన్నట్లు భావించొచ్చు. 1/ఏ3ఐ వైరస్ స్వల్ప తేడాలతో 4 రకాలుగా ఉన్నట్లు గుర్తించారు. వాటిలో మూడు రకాలు ప్రమాదకరం కాదని, సీ13730టీ అనే రకం ప్రమాదకరమైందని గుర్తించారు. ఇది ఏ మేరకు వైరస్ స్వభావాన్ని మారుస్తుందనేది విశ్లేషించాల్సి ఉంది. ఈ కొత్తరకం వైరస్‌లోని ప్రమాదకరమైన నాలుగో వర్గానికి చెందిన స్వభావమే వివిధ రాష్ట్రాల్లోని వైరస్ వ్యాప్తిలో వ్యత్యాసాలకు కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. వలస కార్మికుల కారణంగా ఈ నాలుగో వర్గం వైరస్ ఆయా రాష్ట్రాల నుంచి కొత్త రాష్ట్రాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఇండియన్ వైరసే ‘1/ఏ3ఐను ఇండియన్ వైరస్‌గానే పరిగణించాలి. వ్యాక్సిన్ కనుక్కోవడంలో భాగంగా ఇక్కడ ప్రబలిన, వ్యాప్తిలో ఉన్న వైరస్‌పై పరిశోధనలు జరిపితే ప్రయోజనం ఉంటుంది. ఈ రకం వైరస్ లక్షణాల వ్యాప్తి ఏ మేరకుంది అన్న దానిపై విస్తృతస్ధాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. సీసీఎంబీ వ్యాక్సిన్‌పై చేస్తున్న పరిశోధనలు ఈ వైరస్ లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నంగా భావించొచ్చు. భారతీయ వైరస్‌కు పరిష్కారం కూడా మనదేశానికి చెందినదై ఉంటేనే మనకు మంచిది.’ – డా.కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్యశాల -
హుబేలో లాక్డౌన్ ఎత్తివేత?
బీజింగ్/వూహాన్: సుమారు మూడు నెలల తరువాత మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని ప్రజలకు కరోనా నుంచి విముక్తి లభించినట్లు అయ్యింది. ఆ ప్రావిన్స్‌లో ప్రజల రాకపోకలపై పెట్టిన నియంత్రణలు (లాక్డౌన్) అన్నింటినీ ఎత్తివేయాలని చైనా మంగళవారం నిర్ణయించింది. మార్చి 25వ తేదీ నుంచి మొదలుపెట్టి దశలవారీగా నియంత్రణలను ఎత్తివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇదేమంత మంచి ఆలోచన కాదని, కరోనా కారక కోవిడ్–19 వ్యాధి మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూండటం గమనార్హం. విదేశాల నుంచి చైనాకు వచ్చిన వారిలో ఈ వ్యాధి బయటపడటం ఇటీవలి కాలంలో స్థిరంగా పెరుగుతోంది. హుబేలో సోమవారం కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. ప్రస్తుతం 4200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం 74 విదేశీ కేసులతో కలిపి చైనా మొత్తమ్మీద 78 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కమిషన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ చైనాలో కరోనా కారణంగా 3277 మంది చనిపోగా, 81,171 మంది వ్యాధి బారిన పడ్డారు. సుమారు 73,159 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 4,735 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హుబే ప్రావిన్స్ రాజధాని వూహాన్లో మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఎత్తివేయాలని చైనా నిర్ణయించింది. వూహాన్ జనాభా కోటీ పది లక్షల వరకూ ఉండగా కరోనా భయంతో వీరందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచారు. (లాక్డౌన్ : జనం మారుతున్నారు..) గత ఏడాది డిసెంబరు ఆఖరులో తొలి కరోనా వైరస్ బాధితుడిని గుర్తించింది ఇక్కడే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 23వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో లాక్డౌన్ ప్రకటించారు. అయితే గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య దాదాపుగా సున్నాకు చేరిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు కేసులేవీ లేకపోగా సోమవారం ఒకే ఒక్క కోవిడ్–19 కేసు నమోదైంది. లాక్డౌన్ ఎత్తివేయనుండటంతో కోవిడ్ బాధితులు, అనుమానితులు ఎవరితోనూ సంబంధాలు లేని వూహాన్ ప్రజలు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి వూహాన్, హుబే ప్రావిన్సు బయటకు వెళ్లవచ్చు. ఈ మేరకు హుబే ప్రాంత కోవిడ్ నియంత్రణ కేంద్ర అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారిక వార్తా సంస్థ షిన్హువా తెలిపింది. వ్యాపార కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు వూహాన్ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పద్ధతులను పాటించనుంది. హుబేలోని ఇతర ప్రాంతాల్లో నేటి నుంచి రవాణా నియంత్రణలు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారిని వారు పనిచేసే ప్రాంతాలకు నేరుగా పంపనున్నారు. అయితే వ్యాధి పరీక్షల్లో ఉన్న లోపాలు, తగిన క్వారంటైన్ పద్ధతులు పాటించని కారణంగా అనేకమందిలో వ్యాధి లక్షణాలు బయటపడలేదని, ఈ నేపథ్యంలో మరోసారి వ్యాధి తిరగబెట్టే అవకాశముందని గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక నిపుణులను ఉటంకిస్తూ హెచ్చరించింది. (2021లో... టోక్యో 2020) చైనాలో కొత్త వైరస్.. ఒకరు మృతి చైనాలో మరో ప్రాణాంతక వైరస్ జాడలు బయటపడ్డాయి. హంటా అనే ఈ వైరస్‌తో ఒకరు మృతి చెందినట్లు చైనా అధికార మీడియా తెలిపింది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ కార ణంగా యున్నాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి చనిపోయాడు. షండోంగ్ ప్రావిన్సులో పనిచేసేందుకు వెళ్తుండగా అతడు హంటా వైరస్‌తో చనిపోయాడు. దీంతో అధికారులు ఆ బస్సు లోని 32 మందిని ఆస్పత్రికి తరలించి, పరీక్షలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎలుకల ద్వారా సంక్రమిం చే వైరస్లలో హంటా వైరస్ ఒకటని, ఈ వ్యాధి బాధితుల్లో లక్షణాలు కూడా ఒకేలా ఉండవని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటోంది. -
బ్రెజిల్లో కొత్త వైరస్ ‘యారా’
బ్రెసిలియ : బ్రెజిల్‌లోని ఓ కత్రిమ సరస్సులో సరికొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి బ్రెజిల్ పురాణంలో ఉన్న మత్యకన్య ‘యారా’ పేరు పెట్టారు. ఇప్పటి వరకు కనుగొన్న వైరస్‌లకు ఈ వైరస్‌కు ఎలాంటి పోలిక లేకపోవడమే కాకుండా పూర్తి భిన్నంగా ఉండడం పట్ల శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్స్ ఫెడరల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మినా జెరాయిస్ నాయకత్వంలోని పరిశోధన బందం యారావైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించింది.ఈ వైరస్‌లో మొత్తం 74 జన్యువులు ఉండగా, అందులో 68 జన్యువులను తాము ఇంతవరకు ఏ వైరస్‌లో చూడలేదని, అందుకని వాటికి అనాథ జన్యువులుగా వ్యవహరిస్తున్నామని జెరాయిస్ తెలిపారు. గ్లోబల్ సైంటిఫిక్ డేటాలోని 8,500 రకాల జన్యువులతో పోల్చి చూసినా ఎక్కడా పోలిక దొరకలేదని ఆయన చెప్పారు. నేడు కరోనావైరస్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వైరస్ వెలుగులోకి రావడం విశేషమే. బ్రెజిల్‌లోని బెలో హారిజాంటే నగరంలోని ఓ కత్రిమ సరస్సు నీటిలోని ఏకకణ జీవి అమీబాలో దీన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఏక కణ జీవి అమీబాల్లోనే ఈ వైరస్ కనిపిస్తున్నందున,మనుషులకు సోకే ప్రమాదం లేకపోవచ్చని జెరాయిస్ అభిప్రాయపడ్డారు.ప్రపంచంలోని సముద్రాల్లో గతంలో 15,222 రకాల వైరస్‌లను కనుగొనగా గత 2016 నుంచి 2019 మధ్య మూడేళ్ల కాలంలోనే దాదాపు 1,80,000 రకాల వైరస్‌లను కనుగొన్నారు. వాటితో నీటిలో నివసించే వైరస్లు 1,95,728కు చేరుకున్నాయి. బహూశ సముద్ర జలాలు కలుషితం అవుతుండడం వల్ల వైరస్లు పెరిగి ఉండొచ్చేమో! -
వణికిస్తున్న చైనా జలుబు
కొత్త కొత్త వైరస్లు ఆవిర్భవిస్తూ... మనల్ని బెంబేలెత్తించడం మనకు కొత్త కాదు. చాలాకాలం కిందట ఆంథ్రాక్స్ ఆ తర్వాత సార్స్, కొన్నేళ్ల కిందట బర్డ్ ఫ్లూ, అటు తర్వాత స్వైన్‌ఫ్లూ, ఈ వరసలో జికా, తాజాగా నిపా... ఇలా వైరస్‌లన్నీ వరసపెట్టి మన భూగోళాన్ని వణికించాయి. ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా వచ్చి చేరింది ‘కరోనా’ వైరస్. ఇప్పటికి తెలుస్తున్న దాన్ని బట్టి దీని జన్మస్థానం మధ్య చైనాలోని వుహాన్ అనే నగరం. గతేడాది (2019) డిసెంబరులో అక్కడ దీన్ని గుర్తించారు. ఆ తర్వాత అక్కణ్నుంచి ఇది చాలాచోట్లకు (ఆఖరికి యూఎస్‌కు కూడా) వ్యాపించినట్లుగా కనుగొన్నారు. చైనా నుంచి మనకు ప్రయాణికుల సంఖ్య తక్కువేగానీ... యూఎస్‌నుంచి వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ కావడంతో మనమూ దీని గురించి తెలుసుకొని ఉండటం మంచిది. ఈ కొత్త వైరస్ బాధితులనూ, వాళ్ల రక్తంలోని వైరస్‌నూ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌తో పరీక్షించాక ఈ కొత్త వైరస్ కిరీటం ఆకృతిలో ఉందని గుర్తించారు. దాంతో దీనికి ‘కరోనా’ అనే పేరు పెట్టారు. దీన్ని గురించి అధ్యయనం చేశాక... ఇది ‘సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ (సార్స్) కుటుంబానికి చెందిందని తెలిసింది. దాంతో దీనికి ‘సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్’ అని పిలుస్తున్నారు. సంక్షిప్తంగా ‘సార్స్–సీవోవీ’. దాదాపు పదిహేడేళ్ల కిందట సార్స్ వైరస్ విచ్చలవిడిగా విజృంభించి వందలాది మందిని చంపేసిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనికి 2019–ఎన్‌సీవోవీ అని నామకరణం చేసింది. మిగతా అన్ని శ్వాసకోశ వైరస్ల లాగే ‘కరోనా వైరస్’ కూడా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పాముల నుంచి మనుషులకు వచ్చిందట... ఈ వైరస్ గురించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... అప్పట్లో వ్యాపించిన సార్స్ అనేదాన్ని జూనోటిక్ వైరల్ డిసీజ్‌గా చెప్పారు. అంటే... తొలుత ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందనీ, ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తోందని అర్థం. మనుషులను ప్రభావితం చేయడానికి ముందర ఇది కోళ్లలో, (పౌల్ట్రీ), గాడిదలూ, గొర్రెలూ, పందులూ, ఒంటెలూ, నక్కలూ, బ్యాడ్జర్స్, బ్యాంబూ రాట్స్ అనే ఎలుకలూ, హెడ్జ్హాగ్స్ వంటి జంతువులను ఆశ్రయించుకొని ఉందట. ఆ తర్వాత పాములకూ విస్తరించిందట. ఇక చైనా ప్రజలు పాముల్ని తింటారన్నది తెలిసిందే కదా. అలా అది తొలుత అక్కడి గబ్బిలాలు, వాటి నుంచి అక్కడి పాములకు విస్తరించిందట. మరీ ముఖ్యంగా చైనా క్రెయిట్ (చైనా కట్లపాము), చైనా కోబ్రా (చైనా నాగుపాముల) ద్వారా మనుషులకు అంటుకుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్న మాట. లక్షణాలివి... ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలన్నీ ఫ్లూను పోలి ఉంటాయి. అంటే... దగ్గు, జలుబు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ, తలనొప్పి, గొంతులో గరగర, కొందరిలో జ్వరంతో ఇది కనిపిస్తుంది. ఇక చిన్నపిల్లలకు ఇది సోకితే వాళ్లలో చెవి ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తుంది. అంటే గొంతులో (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్లో ఏ లక్షణాలు కనిపిస్తాయో... ఇందులోనూ అంతే. నివారణ / చికిత్స ఈ వైరస్ నుంచి రక్షణ కోసం మనం ఎప్పుడూ చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. సబ్బుతో చేతులు రుద్దుకోవడం అన్నది కనీసం 15–20 సెకండ్లపాటు చేయాలి. సబ్బు, నీళ్లు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ బేస్డ్ డిస్పోజబుల్ రుమాళ్లు (హ్యాండ్ వైప్స్) లేదా శానిటైజర్స్ లేదా జెల్స్ ఉపయోగించవచ్చు. ∙దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతుల్ని, చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు వ్యక్తులు ఫుల్ స్లీవ్స్ వేసుకున్నప్పుడు విధిగా వారంతా తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే ఇతర సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు ►దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు ఆ తర్వాత వాటిని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి ►దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను గాని వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి ►జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల తర్వాత కూడా మరికాసేపు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది. ►పరిసరాలను, కిచెన్లను, బాత్రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ►రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. అయినా వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడం మంచిదే. ►పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్ రూమ్ ఉపయోగించినప్పుడు అందరూ తలుపు హ్యాండిల్గాని, కొళాయి నాబ్ కానీ ఉపయోగించినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దాన్నే ఫొమైట్ ట్రాన్స్మిషన్ అంటారు. కాబట్టి హ్యాండిల్స్/నాబ్స్‌ను ఉపయోగించిన తర్వాత చేతులను తప్పనిసరిగా ‘హ్యాండ్ శానిటైజర్స్’తో శుభ్రం చేసుకోవడం అసవరం. చికిత్స... ప్రస్తుతానికి దీనికి నిర్దిష్టంగా వ్యాక్సిన్ అయితే అందుబాటులో లేదు. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సింప్టమాటిక్ చికిత్స అన్నమాట. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇప్పటికి ఇది మన దగ్గర లేదు కాబట్టి దీని గురించి ఆందోళన అవసరం లేదు. అయితే మన పొరుగుదేశంతో పాటు, మన దేశానికి విస్తృతంగా వచ్చే యూఎస్‌లోనూ ఉన్నందున దీని గురించి అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటంలో తప్పు లేదు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
జికా పేరు మారుస్తున్నాం: టాటా మోటార్స్
ముంబై: జికా... ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ ఇది. చిత్రంగా టాటా మోటార్స్ కంపెనీ త్వరలోనే తేనున్న హ్యాచ్‌బాక్ పేరు కూడా ఇదే. అయితే జికా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో జిప్పీ కార్ నుంచి తీసుకున్న జికా పేరును మార్చాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. వివిధ దేశాల్లో జికా వైరస్ ప్రబలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నందున సామాజిక బాధ్యత గల కంపెనీగా ఈ హ్యాచ్‌బాక్ జికాను రీ బ్రాండ్ చేయాలనుకుంటున్నామని టాటా మోటార్స్ వెల్లడించింది. గ్రేటర్ నోయిడాలో నేటి నుంచి ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌పోలో ఈ కారును టాటా మోటార్స్ డిస్ప్లే చేయనున్నది. ఈ ఎక్స్‌పోలో జికా పేరుతోనే ఈ కారును డిస్ప్లే చేస్తామని, కొత్త పేరును కొన్ని వారాల్లో ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది. యువ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ అందిస్తున్న ఈ కారు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ కారు ధర రూ.5-6 లక్షల రేంజ్లో ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
మీది ఆండ్రాయిడ్ ఫోనా... జర భద్రం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడే వారు జాగ్రత్తగా ఉండాలంటా ? అదికూడా అలా ఇలా కాదు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'ఓ ట్రోజన్' వైరస్... ఫోన్ నుంచి కీలక సమాచారాన్ని చోరీ చేసి... అంతటితో ఆగకుండా మొబైల్ ఫోన్లోని నంబర్లకు ఎస్ఎంఎస్ పంపుతుందంటా. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని నిపుణులు తెలుపుతున్నారు. 'ఓ ట్రోజన్' వైరస్‌ను ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్సెండ్గా గుర్తించామని... దీనికి మరో నాలుగు పేర్ల కూడా ఉన్నాయని చెప్పారు. ఈ వైరస్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే ఫోన్లను ఉపయోగించే వినియోగదారులను ఏమార్చి విధ్వంసానికి పాల్పడుతుందని తెలిపారు. అదికాక ఈ వైరస్ చట్టబద్దమైన అనువర్తనాలను ఆధారంగా చేసుకుని వ్యాపించి ఫోన్లను దెబ్బతీస్తుందని వెల్లడించారు. ఈ వైరస్ ఒక్కసారి ఫోన్ వ్యవస్థలోకి వెళ్లాక.... జాబితాలోని నెంబర్లనకు సందేశాలను పంపుతుందని సీఈఆర్టీ - ఇన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించేవారు జర భద్రంగా ఉండాలని తెలిపింది. -
అది ఎబోలా కాదు.. కొత్త వైరస్!!
గాంధీ ఆస్పత్రిలో ఎబోలా కేసు కొత్త మలుపు తిరిగింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఎబోలా ఉందన్న అనుమానాలతో అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అతడికి సోకినది ఎబోలా కాదని వైద్యులు స్పష్టం చేశారు. దాన్ని నైజీరియాకు చెందిన కొత్త వైరస్ అని వాళ్లు అంటున్నారు. ఈ వైరస్ సోకిన బాధితుడికి వైద్యం చేసేందుకు అక్కడి సిబ్బంది కూడా ముందుకు రావట్లేదు. దాంతో అతడి పరిస్థితి ఏంటన్నది కూడా ఇంకా తెలియడం లేదు. ఈ వైరస్ ఏంటో.. దానికి చికిత్స ఏంటో తెలియకుండా ముందుకు ఎలా వెళ్తామని సిబ్బంది అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎబోలా బాధితులకు చికిత్స చేసిన నర్సులు, వైద్యులు కొంతమందికి కూడా ఆ వ్యాధి సోకడంతో ఇప్పుడు ఈ బాధితుడికి చికిత్స చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు. -
ప్రాణాలు తీస్తున్న కొత్త వైరస్
-
వై-ఫైతో సరికొత్త వైరస్!!
కంప్యూటర్లో గానీ, ఇంటర్నెట్ ద్వారా గానీ వైరస్ ఏమైనా వస్తే.. మీ యాంటీ వైరస్ దాన్ని సమర్ధంగా అడ్డుకోగలదేమో. కానీ వై-ఫై ద్వారా వస్తున్న సరికొత్త వైరస్‌ను మాత్రం ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారట. గాలి ద్వారా.. వై-ఫై సిగ్నళ్లతో వస్తున్న ఈ వైరస్‌ను అడ్డుకోవడం ఎలాగో తెలియక నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాలు, కాఫీ షాపులలో ఉచితంగా లభించే ఓపెన్ యాక్సెస్ వై-ఫై ద్వారానే ఈ వైరస్ వస్తోందని గమనించారు. సాధారణంగా ఇళ్లలో గానీ, కార్యాలయాల్లో గానీ ఉండే వై-ఫై అయితే సెక్యూరిటీ పాస్‌వర్డ్‌తో ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప వై-ఫై సిగ్నల్ అందదు. కానీ, కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొన్ని పెద్దపెద్ద మాల్స్‌లోను, కాఫీ షాపుల్లోను, చివరకు పెద్దస్థాయి సినిమా థియేటర్లలో కూడా ఉచితంగా వై-ఫై సదుపాయం కల్పిస్తున్నారు. సింగపూర్ లాంటి చోట్ల అయితే ఏకంగా నగరం మొత్తానికి ఉచితంగా వై-ఫై సిగ్నళ్లు అందుతున్నాయి. ఇలాంటి చోట్లే ప్రధానంగా ఈ సరికొత్త వైరస్ వస్తోందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ పరిశోధకులు చెబుతున్నారు. 'కెమిలియన్' అనే ఓ వైరస్‌ను వాళ్లు సృష్టించి, నమూనా కోసం ప్రయోగించారు కూడా. ఎన్క్రిప్షన్ గానీ, పాస్వర్డ్లు గానీ లేని వై-ఫైలను అది సులభంగా పసిగట్టి, లోనికి ప్రవేశించింది. కంప్యూటర్ హ్యాకర్లు ఎక్కువగా వై-ఫై కనెక్షన్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని, అందువల్ల తప్పనిసరిగా పాస్వర్డ్ పెట్టుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.