వణికిస్తున్న లంపీ ముప్పు.. రోజుకు 600–700 ఆవులు మృత్యువాత | Lampi Virus Danger Bells In 10 States Of India | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న లంపీ ముప్పు.. రోజుకు 600–700 ఆవులు మృత్యువాత

Published Wed, Sep 21 2022 1:37 AM | Last Updated on Wed, Sep 21 2022 1:37 AM

Lampi Virus Danger Bells In 10 States Of India - Sakshi

దేశంలో కొద్ది నెలలుగా మరో వైరస్‌ పేరు మారుమోగుతోంది. పాడి పశువుల్లో ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే లంపీ స్కిన్‌ వ్యాధి (ఎల్‌ఎస్‌డీ). కాప్రిపాక్స్‌ అని పిలిచే ఈ వైరస్‌ ఆవులు, గేదెలకు సోకుతోంది. ఈ ఏప్రిల్‌లో గుజరాత్‌లోని కచ్‌లో తొలిసారి ఇది బయటపడింది. రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, యూపీ సహా పలు రాష్ట్రాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 వేల పశువులు మరణించాయి. మరో 15 లక్షల పశువులకు వైరస్‌ సోకింది. ఈ అంటువ్యాధి మరింత విస్తరిస్తే దేశ పాడిపరిశ్రమకే తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలున్నాయి. 

రాజస్తాన్‌లో పశువులపై తీవ్ర ప్రభావం  
లంపీ స్కిన్‌ వ్యాధి రాజస్తాన్‌లో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వ్యాధితో  రాష్ట్రంలోనే ఏకంగా 57,000 ఆవులు  మరణించగా, మరో 11 లక్షల ఆవులు దీని బారిన పడ్డాయి. రోజుకి సగటున 600–700 ఆవులు మరణిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి 15–18 శాతం తగ్గిపోయింది. దీంతో పాలు, వాటితో తయారు చేసే స్వీట్ల ధరలు బాగా పెరిగిపోయాయి. రోజుకు 5–6 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోయిందని రాజస్థాన్‌  కో ఆపరేటివ్‌ డెయిరీ వెల్లడించింది.

రాజస్తాన్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతలు  
ఈ వ్యాధి నివారణకు రాష్ట్రంలోని అశోక్‌ గెహ్లాట్‌  ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ భారతీయ జనతా పార్టీ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.  అసెంబ్లీ ముట్టడికి భారీ సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. కానీ నిరసనకారులు బారికేడ్లు దూకి మరీ అసెంబ్లీలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు.

దీంతో చాలా సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాధి తీవ్రత గురించి అందరికీ తెలియజేయడానికి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒక ఆవుని కూడా తోలుకొని వచ్చారు. వ్యాధి సోకిన పశువులకి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా డిమాండ్‌ చేశారు. మరోవైపు దీనిపై కేంద్రమే స్పందించాలని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దాదాపుగా 13 రాష్ట్రాల్లో పశువులకి ఈ వ్యాధి సోకడం వల్ల జాతీయ విపత్తుగా ప్రకటించి  రాష్ట్రానికి సాయం అందించాలన్నారు.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

ఏమిటీ వైరస్‌?  
దోమలు, ఈగలు, పేలు మరికొన్ని కీటకాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది గోటోపాక్స్, షీప్‌ పాక్స్‌ కుటుంబానికి చెందిన వైరస్‌. ఈ వ్యాధితో పశువులకు జ్వరం సోకడంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఈ వైరస్‌ సోకితే పశువులు ఆహారం తీసుకోలేవు. అధికంగా లాలాజలం ఊరి నోట్లో నుంచి బయటకు వస్తుంది. ముక్కు, కళ్లల్లోంచి కూడా స్రవాలు బయటకి వస్తాయి. కొన్నాళ్లకే పశువులు బరువును కోల్పోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది.ఈ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎన్నో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్‌ సోకిన జంతువులకు పశు వైద్యులు ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్‌ ఇస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు.  

మనుషులకు సోకదు
లంపీ స్కిన్‌ వ్యాధి మనుషులకి సోకే అవకాశం ఎంత మాత్రం లేదదిది జూనోటిక్‌ (మనుషులకు సంక్రమించదు) వైరస్‌ కాదని, మనుషులకు సోకదని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిపుణులు వెల్లడించారు. వ్యాధి సోకిన ఆవుల పాలను నిర్భయంగా తాగవచ్చునని మనుషులకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు.  

పరిష్కారమేంటి? 
ప్రస్తుతానికి ఈ వ్యాధి మరింత విస్తరించకుండా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులు, పశుపోషకుల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్రం రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కొన్నాళ్లు పాటు పశువుల్ని వేరే రాష్ట్రాలకు తరలించవద్దని సూచించింది. గోట్‌పాక్స్‌ వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ దీనినీ అరికడుతుందని నిపుణులు చెప్పడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 కోట్లను ఈ వైరస్‌ ఉన్న  ప్రాంతాలకు పంపిణీ చేశారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌), ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐబీఆర్‌ఐ) సంయుక్తంగా లంపీ స్కిన్‌ వ్యాధికి వ్యాక్సిన్‌ కనుగొన్నారు. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుంది. దేశంలోని పశువులన్నింటికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే 18–20 టీకా డోసులు అవసరం. దేశంలోని పశువులకి 80శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయితేనే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడతామని ఏనిమల్‌ సైన్సెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ బి.ఎన్‌. త్రిపాఠి అభిప్రాయపడ్డారు. 2025 నాటికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement