
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కుటుంబ సమేతంగా మంగళవారం జైపూర్‌లోని అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబ సభ్యులకు యూనెస్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్ వద్ద రాజస్థానీ సంప్రదాయంలో ఘన స్వాగతం లభించింది. హతీ గావ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన చందా, పుష్ప అనే ఏనుగులు వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికగా.. పలువురు నృత్యాలతో అలరించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబుల్ సమేతంగా నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింక్ సిటీ జైపూర్ పర్యటనలో ఉన్న వాన్స్ కుటుంబం.. అంబర్ కోటతో పాటు హవా మహల్, జంతర్ మంతర్‌ను సైతం సందర్శించనుంది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎర్ర ఇసుక రాయి, పాలరాతితో ఉన్న అంబర్ పోర్ట్‌ను ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తుంటారు. రాజా మాన్ సింగ్ 16వ శతాబ్దంలో దీనిని నిర్మించారు.
#WATCH | Rajasthan: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance and their children welcomed at Jaipur's Amber Fort. pic.twitter.com/bhFxFOLrHW
— ANI (@ANI) April 22, 2025
ఇక.. ఈ పర్యటనలో ఆ రాష్ట్ర గవర్నర్ హరిబావు కిషన్‌రావ్, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఇచ్చే ఆతిథ్యం వాన్స్ కుటుంబం స్వీకరించనుంది. రాజస్థాన్ ఇంటర్నేషన్ సెంటర్‌లో(RIC)లో దౌత్యవేత్తలు, మేధావులను ఉద్దేశించి అమెరికా-భారత్ సంబంధాలపై జేడీ వాన్స్ ప్రసంగించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో జైపూర్ అలర్ట్ అయ్యింది. ప్రముఖులు బస చేసే రామ్‌బాగ్ ప్యాలెస్‌లో వాన్స్ కుటుంబం దిగగా.. అక్కడ కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
సోమవారం ఉదయం భారత్‌కు చేరుకున్న వాన్స్ కుటుంబం.. న్యూఢిల్లీలో బస చేసింది. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాలపై జేడీ వాన్స్ చర్చించారు. అనంతరం వాన్స్ కుటుంబానికి ప్రధాని మోదీ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వాన్స్ పిల్లలతో మోదీ సరదాగా గడిపారు. బుధవారం వాన్స్ కుటుంబం ఆగ్రాను సందర్శించనుంది. గురువారం ఉదయం తమ పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరనున్నారు.