
21 నుంచి 24 దాకా
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య, తెలుగమ్మాయి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఉన్నత స్థాయి అధికారుల బృందంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారని ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా 21న ప్రధాని మోదీతో సమావేశమవుతారని పేర్కొంది.
ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలను చర్చించనున్నారని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపింది. ట్రంప్ యంత్రాంగం టారిఫ్‌ల మోతెక్కిస్తూ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
వాన్స్, సెకండ్ లేడీ ఉష తమ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌లతో కలిసి జైపూర్, ఆగ్రాలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించనున్నారని వెల్లడించింది. వాన్స్ పర్యటనలో అధికారిక కార్యక్రమాలున్నా వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యముంటుందని సమాచారం. ఉష వాన్స్ తెలుగమ్మాయి అన్నది తెలిసిందే. ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. అమె రికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఇటీవలే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.