
భారత్‌లో నాలుగు రోజులపాటు పర్యటించబోతున్న అమెరికా ఉపాధ్యక్షుడు
నేడు ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక సమావేశం
భారత్–అమెరికా సంబంధాలు, వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం
వాన్స్ దంపతులకు విందు ఇవ్వనున్న ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సతీసమేతంగా భారత పర్యటనకు రాబోతున్నారు. భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో కలిసి ఆయన సోమవారం ఇటలీ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. దేశంలో మొత్తం నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాన్స్ దంపతులు ఇండియాకు వస్తుండడం ఇదే మొదటిసారి.
ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న అమెరికా మహిళ అనే సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధించడం, తర్వాత 90 రోజులపాటు వాయిదా వంటి పరిణామాల నేపథ్యంలో జె.డి.వాన్స్ ఇండియా పర్యటన ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు.
వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత
వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం విందు ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఇరువురు నేతలు సమావేశమవుతారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని సమాచారం. ఇరు దేశాల నడుమ సంబంధాల పురోగతిని వారు సమీక్షిస్తారు. సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై సంప్రదింపులు జరుపుతారు.
వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అత్యంత కీలకమైన ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మోదీ–వాన్స్ భేటీలో ముందడుగు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చర్చల్లో భారత్ తరఫున ప్రధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొంటారని తెలిసింది. అమెరికా తరఫున వాన్స్‌తోపాటు ఐదుగురు సీనియర్ అధికారులు హాజరవుతారని సమాచారం.
జైపూర్, ఆగ్రా సందర్శన
ఢిల్లీకి చేరుకున్న తర్వాత వాన్స్, ఉషా దంపతులు ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భారతీయ సంప్రదాయ హస్తకళాకృతులు విక్రయించే మార్కెట్‌ను సందర్శిస్తారు. ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్‌లో బస చేయబోతున్నారు. సోమవారం రాత్రి వారు రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు చేరుకుంటారు. రామ్‌భాగ్ ప్యాలెస్‌లో బస చేస్తారు. మంగళవారం అమేర్(అంబర్) కోటతోపాటు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత కట్టడాలను సందర్శిస్తారు. సాయంత్రం జైపూర్‌లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఓ కార్యక్రమంలో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ పాలనలో భారత్–అమెరికా సంబంధాలపై ఆయన అభిప్రాయాలు వెల్లడిస్తారని సమాచారం. బుధవారం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించబోతున్నారు. సాయంత్రం మళ్లీ జైపూర్‌కు తిరిగివెళ్తారు. వాన్స్ కుటుంబం జైపూర్ నుంచి గురువారం అమెరికాకు పయనమవుతుంది