
ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను కోరిన భారత్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆర్థిక మూలా లను దెబ్బకొట్టడంపై దృష్టిపెట్టిన భారత్ ఆ దిశగా ప్రయత్నాలు ఉధృతంచేసింది. పాకిస్తాన్‌కు వందల కోట్ల రూపాయల రుణాలు, ఆర్థిక సాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఆ యత్నాలను మానుకోవాలని భారత్ అభ్యర్థిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఇటలీలోని మిలాన్ సిటీలో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) అధ్యక్షుడు మసాటో కందాతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు.
ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్‌కు ఆర్థికసాయం చేయడం మానుకోవాలని నిర్మల కోరారు. ఈ సందర్భంగా ఇటలీ ఆర్థిక మంత్రి జిన్‌కార్లో జార్జెట్టీతోనూ నిర్మల భేటీ అయ్యారు. నాలుగురోజులపాటు జరిగే ఏడీబీ 58వ వార్షిక సమావేశాలు ఆదివారం ఇటలీలో ప్రారంభమవడం తెల్సిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ వంటి బహుళజాతి సంఘాలు పాకిస్తాన్‌కు సాయంపై పునరాలోచన చేస్తే మంచిదని ఈ సందర్భంగా నిర్మల హితవు పలికారు.
ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకుగాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిర్ణయించడం తెల్సిందే. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. మరోవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) గ్రే జాబితాలోకి పాకిస్తాన్‌కు చేర్చడానికి భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది.