మాల్దీవులకు భారత్‌కు నడుమ దౌత్యపరమైన విభేధాలు కొనసాగుతున్నాయి. ఈ గ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. మాల్దీవులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటోంది. అదే సమయంలో పాకిస్థాన్ సైతం మాల్దీవులకు ఆర్థిక సాయం అందిస్తుందట. అసలు పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మాల్దీవులకు ఆర్థిక సాయం ఎలా చేస్తుందో?.
మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ భారత్ ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గుచూపిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. అయితే గతంతో పోల్చితే కొంత మొత్తంలో ఆర్థిక సాయం తగ్గింది. అయితే.. ఇదే క్రమంలో దాయాది దేశమైన పాకిస్తాన్ సైతం మాల్దీవులకు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చింది.
మాల్దీవుల అభివృద్ధి అవసరాలకు తాము సాయం అందిస్తామని పాకిస్తాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అన్వర్ ఉల్ హక్ కాకర్ పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పాక్ అధ్యక్షుడు అన్వర్.. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జకు ఫోన్ చేసి మరీ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పాక్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
పాక్ ప్రభుత్వం తమ దేశ అభివృద్ది కోసం నిధులు అందించనుందని తెలిపినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు సైతం పేర్కొన్నారు. ఇరు దేశాల నేతలు అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల మధ్య అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణ మార్పులకు సంబంధిచిన విషయంలో కూడా మాల్దీవులకు ఆర్థిక సాయంతో పాటు తమ పూర్తి మద్దతు ఉంటుందని పాక్ అధ్యక్షుడు పేర్కొన్నట్లు సమాచారం.
ఇక.. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 26, జూలై 1996 నుంచి కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు కూడా చైనాకు అనుకూలమైన దేశాలుగా గుర్తింపు ఉండటం గమనార్హం. మరోవైపు పాకిస్తాన్ దేశమే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మాల్దీవులకు ఆర్థిక సాయం ఎలా చేస్తుందని అక్కడి ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: సంక్షోభంలో పాక్.. జనం పెదవి విరుపు, వ్యాపారుల గగ్గోలు
Comments
Please login to add a commentAdd a comment