Ind Vs Pak: భారత్‌లో అణ్వాయుధాలు ఎన్నో తెలుసా.. పాక్‌లో ఇలా.. SIPRI Report Says India Has More Nuclear Weapons Than Pakistan. Sakshi
Sakshi News home page

Ind Vs Pak: భారత్‌లో అణ్వాయుధాలు ఎన్నో తెలుసా.. పాక్‌లో ఇలా..

Published Tue, Jun 18 2024 9:48 AM

SIPRI Report Says India Has More Nuclear Weapons Than Pakistan

ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌ కంటే భారత్‌లోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని స్పీడన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో అణ్వాయుధాలను పెంచుకోవడంతో ఆసియా దేశాలు భారత్‌, చైనా, పాకిస్తాన్‌లు పోటీ పడుతున్నాయని స్పష్టం చేసింది.

కాగా, సిప్రి నివేదిక ప్రకారం.. భారత్‌లో అణ్వాయుధాలు 172 ఉండగా పాకిస్తాన్‌లో 170 ఉన్నట్టు పేర్కొంది. 2023 తర్వాత రెండు దేశాలు కొత్త రకమైన న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం కొనసాగించాయని పేర్కొంది. ఇక, గతేదాడితో పోలిస్తే 2024 జనవరి నాటికి చైనాలో వార్‌ హెడ్స్‌ సంఖ్య 410 నుంచి 500 పెరిగినట్టు తెలిపింది.

 

 

ఇక, అణ్వాయుధ సేకరణలో భారత్‌ను నిరోధించడమే లక్ష్యంగా పాకిస్తాన్‌ ప్రణాళికలు చేస్తున్నట్టు కీలక విషయాలను వెల్లడించింది. అలాగే, సుదీర్ఘ లక్ష్యాలను తాకే అణువార్‌ హెడ్లపై భారత్‌ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే, చైనాలో అణు వార్‌హెడ్‌ల నిల్వ ఇప్పటికీ రష్యా, అమెరికా కంటే తక్కువగానే ఉందని పేర్కొంది.

 

మరోవైపు.. భారత్‌, పాక్‌, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ దేశాల అణు వార్‌హెడ్లకు సంబంధించి కీలక విషయాలను నివేదికలో పేర్కొన్నది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు(బాలిస్టిక్‌ క్షిపణులు) ఉన్నాయి. దీంట్లో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్‌లో 90 వార్‌హెడ్స్‌ ఉన్నాయని తెలిపింది. 

కాగా, ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర చేసిన నేపథ్యంలో రెండు దేశాల్లోనూ అణు బలగాలకు సంబంధించి పారదర్శకత క్షీణించిందని తెలిపింది. అలాగే, రెండు దేశాల్లో అణు భాగస్వామ్య ఏర్పాట్ల గురించి చర్చలు ఉధృతంగా పెరిగాయని పేర్కొంది. 2024 జనవరిలో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12,121 వార్‌హెడ్స్‌ ఉండగా.. వాటిలో దాదాపు 9,585 సైనికుల వద్దే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. జనవరి 2023తో పోలిస్తే ఇది 60 ఎక్కువ అని స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement