ఏఐఐబీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన
న్యూఢిల్లీ: సాంకేతిక సహాయం, ఇతరత్రా సర్వీసుల ద్వారా అల్పాదాయ సభ్య దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా తోడ్పాటు అందించాలని ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌కి (ఏఐఐబీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించే విధానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఉజ్బెకిస్తాన్‌లో ఏఐఐబీ బోర్డు గవర్నర్ల 9వ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ లికున్‌తో భేటీ సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మైక్రో బ్లాగింగ్ సైటు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రుణ కార్యకలాపాలను ఏఐఐబీ వేగవంతంగా విస్తరించిందని మంత్రి ప్రశంసించారు. అలాగే సంస్థ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించడంలోను, వృద్ధి సాధనలోను భారత్ కీలకపాత్ర పోషిస్తోందని బ్యాంకు తెలిపింది.
మరోవైపు, ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీతో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఏఐఐబీలో భారత్ రెండో అతి పెద్ద వాటాదారు, అతి పెద్ద క్లయింట్‌గాను ఉంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వనరులను అందించే బహుళపక్ష డెవలప్‌మెంట్ బ్యాంకుగా, బీజింగ్ కేంద్రంగా ఏఐఐబీ ఏర్పడింది. ఇందులో చైనాకు అత్యధికంగా 2,97,804 షేర్లు ఉండగా, భారత్‌కు 83,673 షేర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment