న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు.
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
స్వావలంబన బాటలో భారత్..
భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment