Fuel production
-
ఏపీ ఓ బంగారు గని
దొండపర్తి (విశాఖ దక్షిణ): పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే గ్రీన్ అమ్మోనియా ఏపీలో పుష్కలంగా ఉందని, రాష్ట్రం ఒక బంగారు గని అని ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ సౌత్ అండ్ సౌత్ఈస్ట్ అధ్యక్షుడు అలార్డ్ ఎం.నూయ్ అభివర్ణించారు . గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) రెండోరోజైన శనివారం ఆడిటోరియం–4లో పశ్చిమ ఆస్ట్రేలియా, వియత్నాం దేశాల ప్రతినిధులతో సెషన్స్ నిర్వహించారు. ఇందులో పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధిగా పాల్గొన్న అలార్డ్ ముందుగా ఆ దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పతికి అనుసరిస్తున్న మార్గాలు, అందుకు అవసరమయ్యే ఖనిజాలను వెలికితీసేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిపైనే దేశాలన్నీ దృష్టిసారిస్తాయని అలార్డ్ అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని ప్రైవేటు పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. దీని ఫలితంగానే రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రస్తుతించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ టాప్ దేశంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టీఆర్ గిబిన్కుమార్ తెలిపారు. జీఐఎస్‌లో జరిగిన మరో సెషన్లో రాష్ట్రంలో ఆక్వా, మెరైన్ ఉత్పత్తులు, ఇక్కడున్న వ్యాపార అవకాశాలను వియత్నాం ఎంబసీ ప్రతినిధులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా గిబిన్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త పోర్టులతోపాటు ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఒకవైపు సముద్ర ఉత్పత్తులతోపాటు రిజర్వాయర్లు, చెరువులు, ఇతర ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు. అలాగే.. మెరైన్, ఆక్వా రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉత్పత్తుల ఎగుమతులపై కూడా దృష్టిసారించాలని వియత్నాం ఎంబసీ ట్రేడ్ ఆఫీస్ ఫస్ట్ సెక్రటరీ డూ డుయ్ ఖాన్, ఎంబసీ పొలిటికల్ కౌన్సిలర్ థి ఎన్జాగ్ డెంగ్ ఎన్గుయెన్లను కోరారు. అలాగే, వియత్నాం మెరైన్ రంగంలో ఉన్న వాణిజ్య, వ్యాపార అవకాశాలను ఎంబసీ అధికారులు వివరించారు. ఈ సెషన్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ అడిషినల్ డైరెక్టర్ పి. కోటేశ్వరరావు, మ్యాట్రిక్స్ సీ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ సీఈఓ శివప్రసాద్ వెంపులూరు పాల్గొన్నారు. ఏపీతో కలిసి పనిచేస్తాం.. గత కొన్నేళ్లుగా పశ్చిమ ఆ్రస్టేలియా.. భారత్‌తో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తోందని అలార్డ్ గుర్తుచేశారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన అభినందించారు. అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, ప్రాజెక్టులకు కల్పించే మౌలిక సదుపాయాలపై పాలసీ ప్రకటిస్తే విదేశీ పెట్టుబడులు ఆంధ్రాకు పెద్దఎత్తున వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంతో మరిన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాల మెరుగుకోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో కొత్త ఇండస్ట్రీ పాలసీ దేశంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజ సంస్థలే కాకుండా విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలోనే ప్రభుత్వం కొత్త ఇండ్రస్టియల్ పాలసీని ప్రవేశపెట్టనుందన్నారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా ఈ పాలసీని రూపొందించినట్లు వివరించారు. రాష్ట్రంలో అవలంబిస్తున్న మైనింగ్ విధానాలు, అందుబాటులో ఉన్న వనరులను మైన్స్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వివరించారు. ఈ సమావేశానికి పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు సమన్వయకర్తగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ నషీద్ చౌదరి వ్యవహరించగా, హెచ్ఏఎస్ హోల్డింగ్స్ డైరెక్టర్ అక్షయ్ పాల్గొన్నారు. -
శుద్ధ ఇంధనాలు, ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు. విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వావలంబన బాటలో భారత్.. భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు. -
ఏపీ భేష్.. జాతీయ స్థాయి సమీక్షలో ప్రశంసించిన కేంద్రం
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యద్భుత పనితీరు కనబరుస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. ఇంధన పొదుపులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియోన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలతో జాతీయస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈఓ ఎ. చంద్రశేఖర రెడ్డి ఆదివారం వెల్లడించారు. -
టెక్నాలజీ ఊతంతో స్వచ్ఛమైన ఇంధనాలు
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన, సమర్ధమంతమైన, చౌకైన ఇంధనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కాలుష్యకారక కార్బన్‌డైఆక్సైడ్‌ను రీసైక్లింగ్ చేసేందుకు టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ సదస్సులో వీడియో లింక్ ద్వారా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ముడిచమురు ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ అల్–సౌద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్బన్‌డైఆక్సైడ్‌ను ఒక భారంగా భావించకుండా టెక్నాలజీ ఊతంతో ఇతరత్రా ఉత్పత్తుల కోసం దాన్ని ముడి వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పెట్టాల్సి ఉందని ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచంలోని 800 కోట్ల మంది జనాభాకు ఇంధనం అనేది తప్పనిసరిగా అవసరం. ఈ నేపథ్యంలో చౌకైన, సమర్థమంతమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించాలి. అది కూడా బాధ్యతాయుతమైన పద్ధతిలో చేయగలగాలి‘ అని అంబానీ చెప్పారు. -
బీఎస్–6 ఇంధనం రెడీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్–6 (బీఎస్) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్‌లైన్ లోగానే బీఎస్–6 ఫ్యూయెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్–6 ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. ముందు వరుసలో బీపీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్ స్టేషన్లలో బీఎస్–4 స్థానంలో బీఎస్–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్–3 నుంచి బీఎస్–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్ కాస్త ముందుగా బీఎస్–6 ఫ్యూయెల్ విషయంలో పావులు కదుపుతోంది. మార్చికల్లా రెడీ.. మరో సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్ ఔట్లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. డెడ్‌లైన్ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు ఫ్యూయెల్ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్ ముకేష్ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు. వ్యయం రూ.30,000 కోట్లు.. బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్–4 నుంచి బీఎస్–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వెహికిల్స్ విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి. -
బ్యాక్టీరియాతో పెట్రోల్‌లాంటి ఇంధనం ఉత్పత్తి!
పెట్రోల్‌లాంటి ఇంధనాన్ని బ్యాక్టీరియాతో ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ అంటున్నారా? అమెరికా శాస్త్రవేత్తల పుణ్యమా అని త్వరలోనే ఈ అద్భుతం వాస్తవం కానుంది. సరస్సులు, మురికినీటిలోన ఉండే రెండు వేర్వేరు బ్యాక్టీరియా సమూహాల్లోని ఎంజైమ్‌ను ఉపయోగిస్తే బ్యాక్టీరియా స్వయంగా టౌలీన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త హారీ బెల్లర్ అంటున్నారు. పెట్రోలు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు టౌలీన్ను ఉపయోగిస్తూంటారు. ఏటా ఈ రసాయనం దాదాపు మూడు కోట్ల టన్నులు విక్రయమవుతూంటుంది. నిజానికి కొన్ని బ్యాక్టీరియా తక్కువస్థాయిలో టౌలీన్ను ఉత్పత్తి చేయగలవని 1980లలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. కాకపోతే ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో హారీ ఈ రకమైన బ్యాక్టీరియాపై పరిశోధనలు మొదలుపెట్టారు. చివరకు సరస్సుల అడుగుభాగాల్లో, మురికినీటిలో ఉండే రెండు బ్యాక్టీరియా ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ సాయంతో పెద్దఎత్తున టౌలీన్ను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా టౌలీన్ ఉత్పత్తి పద్ధతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని.. ఆ తరువాత బ్యాక్టీరియాతోనే ఈ రసాయనాన్ని ఉత్పత్తి చేయడం వీలవుతుందని హారీ వివరించారు. -
ఉత్తర కొరియాపై అమెరికా తాజా అనుమానం..
సాక్షి నాలెడ్జ్ సెంటర్: అంతర్జాతీయ సమాజం ఆంక్షలను పెడచెవినపెట్టి క్షిపణి ప్రయోగాలతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలకు ఇంధనం ఎక్కడి నుంచి వస్తోంది? ఈ రాకెట్ ఇంధనం మొదట్లో చైనా, రష్యా నుంచి సరఫరా అయ్యేదనీ, ఇప్పుడు ఉత్తర కొరియానే సొంతంగా తయారుచేసుకుంటూ ఉండొచ్చని అమెరికా గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. క్షిపణులు, రాకెట్లను ప్రయోగించడానికి అన్సిమిట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్ (యూడీఎంహెచ్) అనే శక్తిమంతమైన ఇంధనం అవసరం. కమ్యూనిస్ట్ కొరియాపై ఆంక్షలకు ముందు యూడీఎంహెచ్ను చైనా రష్యాలు గుట్టచప్పుడుకాకుండా అందజేసేవి. ఇప్పుడు ఉత్తర కొరియాయే సొంతగా ఈ ఇంధనం ఉత్పత్తిచేసే స్థాయికి చేరుకుని ఉంటుందని అమెరికా సర్కారు అంచనావేస్తోందని ప్రసిద్ధ అమెరికా దినపత్రిక న్యూయార్క్‌టైమ్స్ వెల్లడించింది. అయితే యూడీఎంహెచ్ తయారీకి అవసరమైన పదార్థాలను చైనా, రష్యా ఇంకా రహస్యంగా రవాణాచేస్తున్నాయా? అనే విషయం తేల్చడానికి అమెరికా ప్రభుత్వం నానా పాట్లు పడుతోందంది. ఒకవేళ అదే నిజమైతే ఈ ముడిపదార్థాల సరఫరాను ఆంక్షల ద్వారా ఆపడానికిగానీ, విద్రోహ చర్యల ద్వారా దెబ్బదీయడానికిగాని ఏంచేయాలనేదానిపై అమెరికా భద్రతా సంస్థలు యోచిస్తున్నాయి. కిమ్ సర్కారే తయారుచేసుకుంటోందా? యూడీఎంహెచ్ సరఫరా కోసం కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఇతర దేశాలపై ఆధారపడే దశలో లేదనీ, ఇప్పటికే దీన్ని ఉత్పత్తి చేస్తోందని గూఢచార సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతు న్నా అమెరికా సర్కారు పెడచెవిన పెట్టిందని ఈ సంస్థలు అంటున్నాయి. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయగల క్షిపణులకు అవసరమైన ఇంధనాన్ని ఉత్తరకొరియా తయారుచేయడం నేర్చుకుందని జార్జి డబ్ల్యూ బుష్ ప్రభుత్వ హయాంనాటి రహస్య డాక్యుమెంట్లలోనే అంచనా వేశారు. కిమ్ ప్రభుత్వం ఇటీవల ప్రదర్శించిన సాంకేతిక సామర్థ్యం చూస్తే ఈపాటికే యూడీఎంహెచ్ ఉత్పత్తిచేయడం ప్రారంభించిందని అనుకోవచ్చని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ప్రతినిధి టిమోతీ బారెట్ చెప్పారు. యూడీఎంహెచ్ తయారీ నిలిపేసిన అమెరికా! యూడీఎంహెచ్ తయారీని చైనా, పలు యూరప్ దేశాలు కొనసాగిస్తుండగా అమెరికాలో 1966లోనే నాసా సలహా మేరకు నిలిపివేశారు. అప్పటి నుంచి అగ్రరాజ్యం తమ ఆయుధాలకు మరింత స్థిరమైన, ఘన ప్రొపెలంట్ ఇంధనాన్ని వినియోగిస్తోంది. తేలికగా మండుతూ వేగంగా ఆవిరైపోయే యూడీఎంహెచ్ ఎంతో ప్రమాదకరమైనది. యూడీఎంహెచ్తో ఎగిరే క్షిపణుల ప్రయోగ సమయంలో ఎందరో కార్మికులు గతంలో మరణించారు. రష్యాలో యూడీఎంహెచ్ను ‘దెయ్యం విషం’ అని పిలుస్తారు. రష్యా లేదా చైనా నుంచి ఉత్తర కొరియాకు సరఫరా ఆగిపోయుంటే, ఈ రసాయనం ఎలా తయారుచేయాలో ఉత్తరకొరియా ఇప్పటికే నేర్చుకుని ఉంటుందని నమ్ముతున్నానని యూడీఎంహెచ్ వంటి ఇంధనాలపై పుస్తకం రాసిన ఇక్హార్ట్ ష్మిడ్ పేర్కొంటున్నారు. ఈ ఇంధనం తయారీ టెక్నాలజీ, యంత్రాలు ఉత్తరకొరియా సంపాదించే ఉంటుందని, పూర్తిగా సొంతంగా ఉత్పత్తి చేసే స్థితికి చేరే క్రమంలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అమెరికా విదేశాంగశాఖ మాజీ అధికారి వాన్ డీపెన్ అన్నారు. -
రంగేస్తే చాలు.. బోలెడంత ఇంధనం!
ఇంటికి రంగేస్తే ఏమవుతుంది? చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. అంతేనా? ఇప్పటికైతే ఇది నిజం గానీ.. ఇంకొన్నేళ్లు పోతే మాత్రం ఇంటికేసే రంగు.. మీ పవర్ బిల్లును బోలెడంత తగ్గించవచ్చు. లేదంటే పూర్తిగా లేకుండా కూడా చేయవచ్చు. ఇంటికేసే రంగుకు... కరెంటు బిల్లుకు ఏమిటి సంబంధం అంటే మాత్రం మనం ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోక తప్పదు. అంతకంటే ముందు కొంచెం ప్రాథమిక విషయాలను అర్థం చేసుకుందాం. ఇంట్లో వాడే వంటగ్యాస్ అదేనండీ మీథేన్ వాయువు తెలుసుకదా... దీంట్లో కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. మీథేన్ కంటే హైడ్రోజన్ చాలా మేలైన ఇంధనం. ఈ కారణంగానే హైడ్రోజన్‌తో కార్లను నడిపించాలని, విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గాలి కంటే తేలికగా ఉండే ఈ హైడ్రోజన్‌ను నిల్వ, రవాణా చేయడం సమస్య కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఆర్ఎంఐటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా ఇళ్లకేసే రంగుల ద్వారానే హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుక్కున్నారు. గాల్లోని తేమను పీల్చుకోగల మాలిబ్డినం సల్ఫైడ్ అనే కృత్రిమ రసాయన పదార్థం సాయంతో ఇది పనిచేస్తుంది. రంగులోకి చేరిపోయే మాలిబ్డినం సల్ఫైడ్ గాల్లోని తేమ అంటే.. హెచ్2ఓను సేకరిస్తే.. టైటానియం డయాక్సైడ్ ద్వారా దీన్ని విడగొట్టి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారన్నమాట. ఇలా ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను ఒకదగ్గరకు చేర్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఒకవైపు హైడ్రోజన్ వంటి స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి కావడంతోపాటు.. ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. ఫ్యుయెల్సెల్స్ సాయంతో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకోవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ టోర్బెన్ డానెకే తెలిపారు. ఎర్రటి ఎండలోనైనా.. గట్టకట్టే చలిలోనైనా సరే.. ఈ పెయింట్ భేషుగ్గా పనిచేస్తుందని.. దీనివల్ల మారుమూల గ్రామాల్లోనూ సులువుగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతామని, గ్రిడ్ వ్యవస్థ అవసరమూ తప్పుతుందని ఆయన చెప్పారు. –సాక్షి, నాలెడ్జ్ సెంటర్