రంగేస్తే చాలు.. బోలెడంత ఇంధనం! | Full of Fuel from this pain | Sakshi
Sakshi News home page

రంగేస్తే చాలు.. బోలెడంత ఇంధనం!

Published Mon, Jun 19 2017 1:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

రంగేస్తే చాలు.. బోలెడంత ఇంధనం!

రంగేస్తే చాలు.. బోలెడంత ఇంధనం!

ఇంటికి రంగేస్తే ఏమవుతుంది? చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. అంతేనా? ఇప్పటికైతే ఇది నిజం గానీ.. ఇంకొన్నేళ్లు పోతే మాత్రం ఇంటికేసే రంగు.. మీ పవర్‌ బిల్లును బోలెడంత తగ్గించవచ్చు. లేదంటే పూర్తిగా లేకుండా కూడా చేయవచ్చు. ఇంటికేసే రంగుకు... కరెంటు బిల్లుకు ఏమిటి సంబంధం అంటే మాత్రం మనం ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోక తప్పదు. అంతకంటే ముందు కొంచెం ప్రాథమిక విషయాలను అర్థం చేసుకుందాం. ఇంట్లో వాడే వంటగ్యాస్‌ అదేనండీ మీథేన్‌ వాయువు తెలుసుకదా... దీంట్లో కార్బన్, హైడ్రోజన్‌ పరమాణువులు ఉంటాయి. మీథేన్‌ కంటే హైడ్రోజన్‌ చాలా మేలైన ఇంధనం.

ఈ కారణంగానే హైడ్రోజన్‌తో కార్లను నడిపించాలని, విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గాలి కంటే తేలికగా ఉండే ఈ హైడ్రోజన్‌ను నిల్వ, రవాణా చేయడం సమస్య కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఆర్‌ఎంఐటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా ఇళ్లకేసే రంగుల ద్వారానే హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుక్కున్నారు. గాల్లోని తేమను పీల్చుకోగల మాలిబ్డినం సల్ఫైడ్‌ అనే కృత్రిమ రసాయన పదార్థం సాయంతో ఇది పనిచేస్తుంది. రంగులోకి చేరిపోయే మాలిబ్డినం సల్ఫైడ్‌ గాల్లోని తేమ అంటే.. హెచ్‌2ఓను సేకరిస్తే.. టైటానియం డయాక్సైడ్‌ ద్వారా దీన్ని విడగొట్టి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారన్నమాట. ఇలా ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను ఒకదగ్గరకు చేర్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మొత్తం ప్రక్రియలో ఒకవైపు హైడ్రోజన్‌ వంటి స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి కావడంతోపాటు.. ఆక్సిజన్‌ కూడా విడుదలవుతుంది. ఫ్యుయెల్‌సెల్స్‌ సాయంతో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకోవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ టోర్బెన్‌ డానెకే తెలిపారు. ఎర్రటి ఎండలోనైనా.. గట్టకట్టే చలిలోనైనా సరే.. ఈ పెయింట్‌ భేషుగ్గా పనిచేస్తుందని.. దీనివల్ల మారుమూల గ్రామాల్లోనూ సులువుగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతామని, గ్రిడ్‌ వ్యవస్థ అవసరమూ తప్పుతుందని ఆయన చెప్పారు. 
–సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement