ప్రపంచాన్ని నడిపించే సరికొత్త ఇంధనం | Sakshi Guest Column On Hydrogen fuel | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని నడిపించే సరికొత్త ఇంధనం

Published Mon, Dec 2 2024 5:36 AM | Last Updated on Mon, Dec 2 2024 5:36 AM

Sakshi Guest Column On Hydrogen fuel

విశ్లేషణ

ఈవీలు కలకాలం నిలుస్తాయా? వీటికంటే మెరుగైన, పర్యావరణ హితమైన వాహనాలు వస్తాయా? చాలామందిని వేధించే ప్రశ్నలివి. ఆ ఇంధనం పెట్రోలు, డీజిళ్ల మాదిరి కాలుష్యాన్ని మిగల్చదు. ఈవీ బ్యాటరీల్లో మాదిరిగా లిథియం వంటి ఖరీదైన, అరుదైన ఖనిజాలు అస్సలు వాడదు. ఏమిటా అద్భుత ఇంధనం? అదే హైడ్రోజన్‌!

మీకు తెలుసా? పెట్రోలు, డీజిల్‌ ఇంజిన్ల ద్వారా సుమారు 80 శాతం శక్తి వృథా అవుతోందని? లీటర్‌ పెట్రోలు లేదా డీజిల్‌ పోసి కారు నడిపితే 20–25 శాతం వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగి లిన 75–80 శాతం ఇంజన్‌లో ఆహుతి కాని ఇంధనం, వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది.

ఇంజిన్‌లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి, దానిని చల్లార్చే కూలింగ్‌ వ్యవస్థ రూపంలో వృ«థా అవుతూంటుంది! విద్యుత్తు బ్యాటరీలు కాలుష్య కారక పొగలు కక్కవు కానీ... వీటి బ్యాటరీల తయారీకి మూడంటే మూడు దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్‌ ఫోన్లతోపాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్‌ అన్నింటి బ్యాటరీలకూ కావాలి. 

విద్యుత్తుతో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్‌ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతూండటం, పూర్తిస్థాయిలో రీఛార్జింగ్‌ నెట్‌ వర్క్‌ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్, విద్యుత్తుల కంటే మెరుగైన, చౌకైన, సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రో జన్‌ లభ్యత భూమండలం మీద అనంతం. ఒక లీటర్‌ (మంచి) నీటి నుంచి ఎలక్ట్రోసిస్‌ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసు కోవచ్చు.

ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్‌ కారు(పెట్రోలు + విద్యుత్తు) ‘ప్రియస్‌’ను తయారు చేసిన రికార్డు టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్‌ ఫ్యుయెల్‌ సెల్‌ (అక్కడికక్కడ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీ లాంటిది) వాహనం ‘మిరాయి’ కూడా టయోటా సృష్టే. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్తు వాహనాల కంటే హైడ్రోజన్‌ వాహనాలకే ప్రాధాన్యమిస్తామని టయోటా ఛైర్మన్‌ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టినీ హైడ్రోజన్‌ పైకి మళ్లించింది. విద్యుత్తు వాహనాల వల్ల ఉపాధి కోల్పో తారని ఆందోళన చెందుతున్న కోట్లాదిమంది టెక్నీషిషన్లకు హైడ్రోజన్‌ ఇంధనం ఆ దుఃస్థితి రానివ్వదు.

హైడ్రోజన్‌ ఫ్యుయల్‌ సెల్స్‌ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోలు, డీజిళ్ల మాదిరిగా హైడ్రోజన్‌ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణ మైనా, విపరీతమైన వేడి ఉన్నా వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజీ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కుల్లాంటివి దూర ప్రాంతా లకు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. సౌర, పవన వంటి పునరుత్పత్తి ఇంధనాల సాయంతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తే పర్యావరణ కాలుష్యమూ గణనీయంగా తగ్గుతుంది. 

పెరిగిపోతున్న భూతాపాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశా లన్నీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు హైడ్రోజన్‌ పని కొస్తుంది. హైడ్రోజన్‌ ఇంధనంతో ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, దక్షిణ కొరియా చైనా దేశాలు రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని దేశాలు ప్రోటో టైపులను రూపొందించి త్వరలో పట్టాలెక్కేంచేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లకు హైడ్రోజన్‌ ఇంధనం వాడటం వల్ల ఎలక్ట్రిక్‌ లైన్లు ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.

ఈ టెక్నాలజీని ఇప్పటికే నాసా అంతరిక్ష ప్రయో గాల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. అంటే రోడ్లు, నీటిపై తిరిగే వాహనాలకు మాత్రమే కాకుండా... అంతరిక్ష ప్రయోగాల్లోనూ దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయన్న మాట. భవిష్యత్తులో విమానాలు హైడ్రోజన్‌ ఇంధనంపైనే నడుస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో హైడ్రోజన్‌ సరుకు రవాణాకు, బ్యాటరీలు వ్యక్తిగత రవాణాకు పరిమిత మవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రస్తుతా నికి హైడ్రోజన్‌ వాహనం ఉత్పత్తి ఖర్చు కొంచెం ఎక్కువే. కానీ... సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఈ ఖర్చు సగమవుతుందనీ, ఆ వెంటనే విస్తృత వినియోగమూ పెరుగుతుందనీ హైడ్రోజన్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది. 

హైడ్రోజన్‌ బాటన ప్రపంచం 
గత ఏడాది ప్రపంచ హైడ్రోజన్‌ ఫ్యుయల్‌ సెల్‌ అమ్మకాలు 30 శాతం వరకూ పెరిగాయి. ఈ రంగం విలువ 2022 నాటికే రూ. 1.08 లక్షల కోట్లకు చేరుకోగా 2030 నాటికి రూ. 3.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే కొరియా, జపాన్‌లతో పాటు యూరోపియన్‌ యూని యన్‌ కూడా హైడ్రోజన్‌ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలు బంకుల మాదిరిగానే హైడ్రో జన్‌ బంకుల్లాంటివి వందల సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. 

కొరియాలో 2040 నాటికి 1,200 బంకుల ఏర్పాటుకు ప్రయత్నిస్తూండగా జపాన్‌ 2030 నాటికే ఎనిమిది లక్షల వాహనాలు, 900 రీఫ్యుయలింగ్‌ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. యూరోపియన్‌ యూని యన్‌ 2050 నాటికల్లా ఐదు లక్షల హైడ్రోజన్‌ ట్రక్కులు ఉత్పత్తి చేసే దిశగా అడుగులేస్తోంది. ఆ యా దేశాల ప్రభు త్వాలే కాకుండా... ప్రైవేట్‌ రంగం కూడా చురుకుగా హైడ్రోజన్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తూండటం గమనార్హం. టయో టాతో పాటు హ్యుండయ్, హోండా, బీఎండబ్ల్యూ, మెర్సి డిస్, ఫోర్డ్‌ వంటి దిగ్గజ వాహన కంపెనీలు కూడా హైడ్రోజన్‌ టెక్నాలజీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కారణంగా ఇంకొన్నేళ్లలోనే ఈ ఇంధనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని అంచనా. 

బి.టి. గోవిందరెడ్డి 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement