జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్ 1886లో తన కారుకి పేటెంట్ పొందారు. ఆ కారులో వాడిన ఇంధనమేంటో తెలుసా.. గ్యాస్. ఔను.. ప్రపంచంలో మొట్టమొదటి కారు గ్యాస్‌తోనే నడిచింది. ఆ తరువాత అనేక పరిశోధనలు, ప్రయోగాల కారణంగా పెట్రోల్, డీజిల్‌ను కార్లలో విరివిగా వినియోగించడం మొదలైంది. దశాబ్దాలుగా ఆ రెండిటితో పాటు గ్యాస్ ఆధారిత కార్లనే మనం రోడ్లపై చూస్తున్నాం.
కానీ.. ప్రపంచ పర్యావరణంపై మొదలైన ఆందోళన, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాల ఫలితంగా సరికొత్త ఇంధన ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. దాని ఫలితమే విద్యుత్ వాహనాల ప్రవేశం. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ సౌర విద్యుత్, హైడ్రోజన్ పవర్‌తో నడిచే కార్లను తయారు చేసే స్థాయికి చేరుకున్నాం.
ఢిల్లీలో పరుగులు
నేషనల్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా 6 నెలల క్రితమే హైడ్రోజన్ స్పైక్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌పై నడిచే వాహనాలను ప్రారంభించిన మొదటి భారతీయ నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీ లిమిటెడ్ కూడా లేహ్, ఢిల్లీలో 10 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులు, ఇంధన సెల్ ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైడ్రోజన్ కార్లలో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను హైడ్రోజన్ గ్యాస్‌తో చార్జ్ చేసి కారును నడిచేలా చేస్తారు. దీనికి అవసరమయ్యే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఫరీదాబాద్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది.
భారత్‌లో గ్రీన్ హైడ్రోజన్ కారు
ప్రపంచంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ (హరిత ఉదజని)తో నడిచే కారును మన దేశంలో ఇటీవల పరిచయం చేశారు. బ్రౌన్ హైడ్రోజన్ అంటే పెట్రోల్, బ్లాక్ హైడ్రోజన్ అంటే బొగ్గు. మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటనేగా మీ సందేహం. దీనిని నీరు, చెత్త నుంచి తీస్తారు. వీటినుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే ఈ కారుకు ‘మిరాయి’ అని నామకరణం కూడా చేశారు. ఇలాంటి కార్లను అతి తొందరలోనే దేశమంతటా నడపనున్నారు.
అందుకు అవసరమైన ఈ గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్లను ముందుగా నిర్మించనున్నారు. ఆ తర్వాత ఈ కార్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. ఈ కారు కేవలం 5.69 కేజీల గ్రీన్ హైడ్రోజన్‌తో రెండు రోజుల్లో 1,359 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు వెళ్లిపోవచ్చని నిరూపించింది. దాదాపు రూ.17 లక్షల కోట్ల పెట్రోలియం ఉత్పత్తులను ఏటా దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్‌ను విస్తరిస్తే రైతులు సైతం దానిని ఉత్పత్తి చేయగలిగే పరిస్థితి వస్తుంది.
దూసుకొస్తున్న సోలార్ కార్
ఎలక్ట్రిసిటీ అవసరం లేని కార్ కూడా వస్తోంది. ప్రపంచంలోనే తొలి సోలార్ కార్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. నెదర్లాండ్స్‌కు చెందిన స్టార్టప్ సోలార్ కారును డిజైన్ చేసింది. ‘లైట్ ఇయర్’ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కారుకు ఎండ ఉంటే చాలు. సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఈ కారును ముందుకు నడిపిస్తుంది. ఈ కారు కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది రోడ్లపైకి దూసుకురానుంది. దీనిలో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.
సోలార్ పవర్ ద్వారా బ్యాటరీ చార్జ్ అవుతుంది. అవసరమైతే ఇంట్లో సాధారణ ప్లగ్‌కు కనెక్ట్ చేసి విద్యుత్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పద్ధతి ద్వారా గంట చార్జింగ్ చేస్తే 32 కిలోమీటర్లు, ఫుల్ చార్జ్ చేస్తే 625 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే సోలార్ పవర్ ద్వారా అయితే 70 కిలోమీటర్ల రేంజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కారు పైకప్పు, హుడ్‌పై డబుల్ కర్వ్ సోలార్ గ్లాస్ ఉంటుంది. మరో విశేషం ఏమంటే.. ఈ కారు చక్రాల నుంచి కూడా కొంత మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా డిజైన్ చేయడం విశేషం. ఈ కారులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలో అందుకోవచ్చు. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది.
చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’
Comments
Please login to add a commentAdd a comment