Hyderabad: మార్చి.. ఏమార్చి.. | illegal car modification rules in india act | Sakshi
Sakshi News home page

Hyderabad: మార్చి.. ఏమార్చి..

Published Mon, Feb 17 2025 7:31 AM | Last Updated on Mon, Feb 17 2025 1:09 PM

illegal car modification rules in india act

ఇష్టారీతిన ఎడా పెడా మార్పు చేర్పులు 

ఆర్టీయే నిబంధనలు పాటించని నగరవాసులు

రంగు మార్చిన బెంజ్‌ కారు ఓనర్‌పై ఇటీవల చర్యలు

చట్టం, నిబంధనలకు లోబడే మార్పులుండాలి : పోలీసులు 

ఒకప్పుడు ఓ మామూలు కారు కొంటే, ఉంటే గొప్ప.. ఇప్పుడు ఖరీదైన కారు కొంటే.. అది అందరికన్నా భిన్నంగా ఉంటేనే గొప్ప.. రూ.లక్షలు, కోట్లు పెట్టి కారు కొనడం మాత్రమే కాదు దానిని మరింత స్టైల్‌గా చూపించాలనే తాపత్రయంతో కొందరు రకరకాలుగా అలంకరణలు చేస్తున్నారు. బైకర్స్‌ సైతం అంతే.. ఖరీదైన బైక్స్‌ కొనడంతో పాటు ‘మోడిఫైడ్‌’ మోజులో పోలీసు కేసుల బారిన పడుతున్నారు.    

గత నెల 11న మితిమీరిన వేగంతో కారు నడుపుతున్నందుకు ఓ మెర్సిడీస్‌ బెంజ్‌ కారుపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కారు యజమాని అంతటితో సరిపుచ్చలేదు. ఒరిజినల్‌ రంగు అయిన పోలార్‌ వైట్‌ కలర్‌ నుంచి మెర్సిడీస్‌ను మల్టీకలర్‌ వాహనంగా మార్చినందుకు మరో  కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ కారు యజమానితో పాటు మోడిఫికేషన్‌ చేసిన సదరు వర్క్‌షాపుపై కూడా మోటారు వాహన చట్టం సెక్షన్‌ 182–ఎ(1) కింద అభియోగాలు నమోదయ్యాయి. ఇక బైకర్స్‌ పైన ఇలాంటి కేసులకు కొదవే లేదు.  

తప్పు మాత్రమే కాదు ముప్పు కూడా.. 
‘అనేక మంది వాహనదారులు చట్టాన్ని పాటించడం లేదు. ఇష్టానుసారం వాహనాల ఫీచర్లను మార్చుకుంటున్నారు. అలాంటి మార్పు చేర్పులు తప్పు మాత్రమే కాదు, ముప్పు కూడా’ అని నేషనల్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ కమల్‌ అంటున్నారు. వాహన తయారీదారులు నిర్దిష్ట మోడల్‌ను ఉత్పత్తి చేయడానికి అధికారుల నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకుంటారు. అలా తయారైన మోడల్‌ను ట్యాంపరింగ్‌ చేయడం వల్ల వాహనం దాని ఒరిజినల్‌ కొలతలు, ఏరోడైనమిక్‌లను కోల్పోవచ్చు. 

తద్వారా అది నడిపేవారితో పాటు ఇతరులకూ ప్రమాదకరంగా మారవచ్చు’ అని నిపుణులు అంటున్నారు. ‘వాహనం రంగు మార్చడానికి  చట్టపరమైన అనుమతి పొంది, రిజి్రస్టేషన్‌ సరి్టఫికెట్‌లో కొత్త రంగు ప్రతిబింబించాలి. బైకర్స్‌ తమ సైలెన్సర్‌లు, టెయిల్‌ ల్యాంపులను మారుస్తారు, ఈ మార్పులు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి’ అని ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రోడ్‌ సేఫ్టీ ముఖ్య కార్యకర్త వినోద్‌ చెబుతున్నారు.  

 ఏదైనా వాహనం ఇంటీరియర్స్‌ లేదా ఎక్స్‌టీరియర్స్‌ సవరించడం చట్టవిరుద్ధం.  

  1. తస్మాత్‌ జాగ్రత్త.. 
    వాహన మార్పుల వల్ల వాహనానికి ఏదైనా నష్టం జరిగితే తయారీదారు వారంటీ చెల్లదు. 

  2. కార్ల యజమానులు తరచూ చేసే మార్పుల్లో లేతరంగు విండోస్‌ ఒకటి. దీని వల్ల విండోస్‌ 25% కంటే తక్కువ లైట్‌ ట్రాన్స్‌మిషన్‌ స్థాయిని కలిగి ఉండటం వల్ల ఇతర వాహనాలను గమనించే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది.  

  3. మార్పుల వల్ల కొన్ని వాహనాల పనితీరు మందగిస్తుంది.  

  4. కొందరు యజమానులు తమ వాహనాన్ని వీలైనంత మేర మోడిఫై చేస్తుంటారు. దీనివల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.  

  5. సస్పెన్షన్‌ అప్‌గ్రేడ్‌లు, టర్బోచార్జ్‌ జోడించడం, స్పోర్ట్స్‌ సీట్లను ఇన్‌స్టాల్‌ చేయడం వంటి మార్పులు చేస్తుంటారు. ఇవి వాహన పనితీరును దెబ్బతీస్తాయి.

మనం కొన్న కారే కానీ.. 
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే ఎంత డబ్బు ఉంటే అంత కారు కొనుక్కోవచ్చు తప్పులేదు. కానీ.. ఎంత ఖర్చు పెట్టి కొన్న కారైనా, బైక్‌ అయినా మన ఇష్టం వచ్చినట్టు మార్పులు, చేర్పులు చేసుకుంటామంటే చట్టం ఒప్పుకోదు. వాహనం రంగు కావచ్చు, రూపంలో కావచ్చు.. ఏవైనా మార్పు చేర్పులను చేయాలంటే ప్రాంతీయ రవాణా కార్యాలయం వాటిని ఆమోదించాలి. సరైన విధంగా డాక్యుమెంట్‌ చేయాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.  

చట్టం ఏం చెబుతోంది..? 
వాహనంలో అనధికారిక మార్పులు చేసినట్లు తేలితే.. ఒక సంవత్సరం వరకూ జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకూ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఆర్‌టీఏ నుంచి అనుమతి లేకుండా మార్పులు చేసిన వాహనాలను సీజ్‌ చేసే అధికారం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాహనాల రూపాన్ని, పనితీరును మెరుగుపరచడానికి కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉంటాయి. దాని లోబడి అలాంటి మార్పులు చేసుకోవచ్చు. కార్లు లేదా మోటార్‌ సైకిళ్లకు అదనపు పరికరాలను అమర్చడం లేదా ధ్వనులను మార్పు చేయడం వంటివి మోటారు ట్రాఫిక్‌ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఎలాంటి మార్పులూ చేయకూడదు.. 
ఓ వాహనాన్ని తయారీ దారుడు మార్కెట్‌లోకి పంపేముందు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుంటాడు. భద్రతతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వాహనం బరువు, రూపం, తదితరాలను ఖరారు చేస్తారు. అలా వచి్చన వాహనానికి ఎలాంటి మార్పులూ చేయకూడదు. దీంతో పాటు నెంబర్‌ ప్లేట్స్, సైలెన్సర్స్‌ మార్చడం వంటివి చేయకూడదు. విండ్‌ షీల్డ్స్, విండో గ్లాసులకు బ్లాక్‌ ఫిల్మ్స్‌ తగిలించకూడదు. వీటిలో ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడినా మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి.  తీవ్రతను బట్టి జరిమానా, కేసు, ఛార్జిషిట్‌ వంటి చర్యలు ఉంటాయి. 
– జి.శంకర్‌రాజు, ఏసీపీ, నార్త్‌ జోన్‌ ట్రాఫిక్‌ విభాగం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement