Younus Farhan: క్లౌడ్‌ ఫొటోగ్రఫీ.. ఓ మేఘ సందేశం | Younus Farhan Cloud Photography | Sakshi
Sakshi News home page

Younus Farhan: క్లౌడ్‌ ఫొటోగ్రఫీ.. ఓ మేఘ సందేశం

Oct 21 2024 9:38 AM | Updated on Oct 21 2024 10:45 AM

Younus Farhan Cloud Photography

కళల్లో క్లౌడ్‌ ఫొటోగ్రఫీ అద్భుత కళ అని నిరూపిస్తున్న యూనస్‌ ఫర్హాన్‌ 

భారత్‌ను క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ వరిస్తుందని ముందే జోస్యం చెప్పిన వైనం

నగరంతోపాటు మైసూర్, బెంగళూరు యూనివర్సిటీల్లో ఎగ్జిబిషన్లు 

ఇప్పటి వరకు తీసిన క్లౌడ్‌ ఫొటోలు 9 వేలు

‘సాక్షి’తో అనుభవాలు పంచుకున్న ప్రముఖ క్లౌడ్‌ ఫొటోగ్రాఫర్‌  

ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మేఘాన్ని ఎప్పుడైనా పలకరించారా..?? ఒంటరిగా ఉండే ఆకాశంతో ఫ్రెండ్‌షిప్‌ చేశారా..?? అసలు ఆకాశం మేఘాల ఆకారంలో మనతో మాట్లాడుతుందని మీకు తెలుసా..? ప్రకృతి పంపిన సందేశం మేఘాలని మీకసలు తెలుసా...?? అయితే ఇవన్నీ నాకు తెలుసు అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ క్లౌడ్‌ ఫొటోగ్రాఫర్‌ యూనస్‌ ఫర్హాన్‌. మేఘంలో అమోఘం కనిపిస్తుంది అతడికి. స్కై కాన్వాస్‌పై నేచర్‌ చేసిన సిగ్నేచర్‌ను అతడి కెమెరా ఇట్టే బంధిస్తుంది. తను క్లిక్‌మనిపించే మేఘాల ఫొటోల్లో ఓ సందేశం ఉంటుంది. ఆత్మీయత, పర్యావరణం, సమానత్వం, జంతువులు, వింతలు, విశేషాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. అతడి క్లౌడ్‌ ఫొటోగ్రఫీలో నిక్షిప్తమై ఉంటాయి. 2011లో మన భారత దేశానికి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ వస్తుందనే మేఘ సందేశాన్ని 3 నెలల ముందే క్లిక్‌మనిపించి అందరితో ఔరా అని అనిపించుకున్నారు. స్కూల్‌ కిటికీలోంచి కనిపించిన మేఘంతో మొదలైన తన ఫ్రెండిషిప్‌ ప్రకృతి సందేశానికి మేఘాలు వారధులని నిరూపించే వరకు వచి్చందని యూనస్‌ ఫర్హాన్‌ అంటున్నారు. ఇప్పుడు అతడి మనసంతా మేఘావృతమైంది. అసలు అతని ప్రయాణమేంటో.. ఆయన చెప్పే మేఘ సందేశమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..!? 

మేఘంతో నా సాన్నిహిత్యం
చిన్నతనంలో 3 నుంచి 7వ తరగతి వరకు నల్లగొండలోని ఓ బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకున్నాను. అప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్‌ మేఘం. అలా కదులుతూ వెళ్లే మేఘాలు నన్ను ఆకర్షించేవి. వాటి ప్రయాణంలో ఏదో అర్థం ఉందనిపించేది. వాటితో అలా మొదలైన నా స్నేహం 8వ తరగతిలో నాన్నకు ఉన్న చిన్న కీప్యాడ్‌ ఫోన్‌తో ఫొటోలు తీయడం నుంచి మరింత పెరిగింది. హాబీగా మొదలైన క్లౌడ్‌ ఫొటోగ్రఫీ కెరీర్‌గా మారింది. మొదట్లో మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఆకారాలను గుర్తించి క్లిక్‌మనిపించేవాడిని. అనంతరం అవే మేఘాలు నాకు చెప్పే కథలను ఫొటోలు తీయడం వరకూ సాగింది. 

ముఖ్యంగా 2011లో భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలిచే కన్నా 3 నెలల ముందే.. వరల్డ్‌ కప్‌ ఆకారమున్న మేఘాలు నాకు ఆకాశంలో కనిపించాయి. వాటిని క్లిక్‌మనిపించాను. ఆ తరువాత అదే నిజమైంది. భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలిచింది. అప్పుడు నా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నాకు గుర్తింపునిచ్చాయి. ఆ సమయంలో నన్ను మొదట గుర్తించింది ‘సాక్షి’దినపత్రికనే. సాక్షి టీవీ స్టూడియోకు ఆహ్వానించి నా అభిరుచిని అభినందించింది. అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న సమయంలో, 2013 జూన్‌ 27న ఆకాశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పోలిన మేఘం కనిపిస్తే, ఫొటో తీశాను. నాకు ముందే అందించిన మేఘ సందేశంలా దానిని భావించాను. ఇలా ఎన్నో విషయాలను నేను మేఘంలోనే వెతుక్కుంటాను.  

నార్కోటిక్స్‌ డే ప్రచారంగా.. 
నేను మొదటిసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతీ జీవి సమానం అనే సందేశాత్మకంగా ఉన్న మేఘాన్ని బంధించాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సందేశమున్న క్లౌడ్‌ షేప్‌ను కూడా ఫొటో తీశాను. వరల్డ్‌ నార్కోటిక్స్‌ డే రోజు నేను తీసిన ఫొటోను సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా ఆవిష్కరించారు. అంతేకాకుండా పోలీసు శాఖకు చెందిన వీసీ సజ్జనార్, సీవీ ఆనంద్, మహేష్‌ భగత్‌ వంటి అధికారులు ఈ ఫొటో పోస్టర్‌లను ప్రత్యేకంగా ఆవిష్కరించి అభినందించారు. బయోడైవర్సిటీ, పర్యావరణం, జంతువులకు సంబంధించి నేను తీసిన పలు మేఘాల ఫొటోలు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాయి.  

భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహం 
సోషల్‌ మీడియాలో నా క్లౌడ్‌ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నా ఫొటోలకు సముచిత స్థానాన్ని కలి్పంచారు. రవీంద్ర భారతిలో మొదటి క్లౌడ్‌ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించారు. అనంతరం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ లిటరరీ ఫెస్టివల్‌లో, ఇతర కాలేజీల్లో ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఫొటోలు నచ్చి నగరంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ వారు ఆహా్వనించగా అక్కడ కూడా ప్రదర్శించాను. మైసూర్‌ యూనివర్సిటీ, బెంగుళూరు యూనివర్సిటీలో కూడా క్లౌడ్‌ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను.  
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చేరాలి
2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 వేల సందేశపు మేఘాలను నా కెమెరాలో బంధించాను. నేను ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సులు చేయలేదు. ప్రకృతి తన సందేశాన్ని సమాజానికి అందించడానికి నన్నొక వారధిలా మార్చుకుందని నమ్ముతాను. ప్రస్తుతం మాస్టర్స్‌ హిస్టరీ చేస్తున్నాను. తెలంగాణతోపాటు అరబ్‌ దేశాలు, అమెరికా వంటి దేశాలను పర్యటించి క్లౌడ్‌ ఫొటోలను తీయాలి. ఈ మేఘసందేశాన్ని ఒక సబ్జెక్ట్‌ లేదా థియరీలా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆవిష్కృతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. 
– యూనస్‌ ఫర్హాన్‌ క్లౌడ్‌ ఫొటోగ్రాఫర్‌  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement