2030 నాటికి జీడీపీలో 20 శాతం వాటా
మైటీ, ఐసీఆర్‌ఐఈఆర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో క్లౌడ్ మార్కెట్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలుగా కేంద్ర ప్రభుత్వం నివేదిక స్పష్టం చేసింది. దేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 2030 నాటికి 20 శాతానికి చేరుకుంటుదని తెలిపింది. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (మైటీ), కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్‌ఐఈఆర్) సంయుక్త నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
2022–23 నాటికి జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.31.64 లక్షల కోట్ల మేర ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ ఎకానమీలో సంప్రదాయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) ఇక ముందూ అతిపెద్ద విభాగంగా కొనసాగుతుందని పేర్కొంది. 2023నాటికి అంతర్జాతీయంగా భారత క్లౌడ్ మార్కెట్ వాటా 1.1–1.2 శాతం మేర ఉంటుందని వివరించింది. ‘‘భారత డిజిటల్ ఎకానమీ చాలా వేగంగా రెట్టింపు కానుంది.
2029–30 నాటికి 20 శాతం వాటాను అందించనుంది. వచ్చే ఆరేళ్లలో సంప్రదాయ వ్యవసాయం, తయారీని మించి డిజిటల్ ఎకానమీ ఎదగనుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ఐసీటీ ఎగుమతులు 162 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐర్లాండ్ 236 బిలియన్ డాలర్ల ఎగుమతుల తర్వాత రెండో పెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలవడం గమనార్హం. 2023–24లో 1644 బిలియన్ డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.
20 బిలియన్ డాలర్లకు క్లౌడ్ మార్కెట్
‘‘కంపెనీలు జనరేటివ్ ఏఐని అందిపుచ్చుకోవడం పెరుగుతోంది. తద్వారా ఉత్పాదకత, కస్టమర్ అనుభవాన్ని పెంచుకోవడం, కొత్త సేవల ప్రారంభంతో క్లౌడ్ మార్కెట్ ఏటా 24 శాతం చొప్పున పెరుగుతూ 2027 నాటికి 20.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. జీసీసీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, 2022 నాటికి ప్రపంచంలోని జీసీసీల్లో 55 శాతం భారత్‌లోనే ఉన్నట్టు తెలిపింది. పరిశోధన, అభివృద్ధి, ఐటీ సపోర్ట్ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ తదితర సేవల కోసం ఎంఎన్‌సీలు జీసీసీలను ఏర్పాటు చేస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment