ఒకరికి బతుకు బండి.. మరొకరికి హోదా.. ఇంకొందరికి వ్యాపారం.. మరి కొద్దిమందికి విహారం.. టూవీలర్, ఆటో, కారు, ట్రాక్టర్, వ్యాన్ , ట్రక్, బస్.. పేరు ఏదైనా, వాడకం ఏదైనా బండి చక్రాలు పరుగెడుతూనే ఉండాలి. ఆ పరుగే అన్నం పెడుతోంది. ఆ పరుగే వృద్ధి ‘ఇంజన్ ’ అవతారంలో భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై దూసుకెళుతోంది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్కెట్‌గా రూ.22 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచి ప్రపంచ దిగ్గజ సంస్థలను భారత్ ఊరిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల భారతావనిలో ఎన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయో తెలుసా? నిమిషానికి 49.53 యూనిట్లు. 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. 2023లో ఈ సంఖ్య 2,39,28,293 యూనిట్లు. గత ఏడాది కొత్త వాహనాల రాక 9.11 శాతం పెరిగిందని ‘వాహన్ ’ గణాంకాలు చెబుతున్నాయి.
పెరుగుతున్న అవసరాలు..
ఉద్యోగం, వ్యాపారం, షాపింగ్, ప్రయాణాలు, విహార యాత్రలు, డెలివరీ సేవలు.. అవసరం ఏదైనా చేతిలో బండి ఉండాల్సిందే! గడియారంలోని సెకన్ల ముల్లుతో పోటీపడుతూ పరుగు తీయాలంటే బండి రోడ్డెక్కాల్సిందే! అంతలా దైనందిన జీవితంలో వాహనం భాగమైపోయింది. అందుకే వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 2030 నాటికి మెగా సిటీల సంఖ్య 87కు చేరనుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో మెగా సిటీలో జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందన్నమాట! ఇంతమందికి సేవలు అందించడానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సిందే! అలాగే ఆరేళ్లలో వర్కింగ్ ఏజ్ గ్రూప్‌లో 100 కోట్ల మంది చేరతారని అంచనా. అంటే ఆ సమయానికి మొత్తం జనాభాలో వీరి వాటా 60 శాతం ఉంటుంది. ఈ అంశం కూడా వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేయనుంది.
మారుతున్న ధోరణులు
భారత మార్కెట్లో ధర అత్యంత సున్నిత అంశం. డబ్బుకు తగ్గ విలువ చూసే కస్టమర్లే అధికం. మైలేజీ ఒక్కటే సరిపోదు. డిజైన్ సైతం ఆకట్టుకోవాలి. అటు భద్రతకు పెద్దపీట వేయాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. మారుతున్న వినియోగదార్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లకు రూపకల్పన చేసేందుకు వందల కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి కంపెనీలు కసరత్తు చేస్తుంటాయి. సరికొత్త మోడళ్లే కాదు సక్సెస్ అయిన మోడల్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను, అప్‌గ్రేడ్స్‌ను ప్రవేశపెట్టాల్సిందే. హైబ్రిడ్స్, ఈవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి.
కొత్త ట్రెండ్ ఏమంటే ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఎస్‌యూవీ, యూవీల హవా నడుస్తోంది. మొత్తం పీవీల విక్రయాల్లో వీటి వాటా 60 శాతం దాటిందంటే మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. కార్ల అమ్మకాల్లో 2,02,031 యూనిట్లతో టాప్ సెల్లింగ్ మోడల్‌గా కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ నిలిచింది. మరోవైపు చిన్న కారు చిన్నబోతోంది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమ్ముడవుతున్న రెండు త్రిచక్ర వాహనాల్లో ఒకటి ఈ–త్రీవీలర్ ఉంటోంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీ సెగ్మెంట్‌నూ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. 350 సీసీ, అంత కంటే అధిక సామర్థ్యంగల ఇంజన్ ్స విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ దూసుకెళుతోంది. ఈ కంపెనీ గత ఏడాది 4.26 శాతం వృద్ధితో 8,57,378 యూనిట్లను విక్రయించి రాయల్‌గా నిలిచింది.
కొత్త వ్యాపారాల రాకతో..
వ్యక్తిగత అవసరాలకే కాదు.. కొత్త వ్యాపారాల రాక కూడా వాహనాల అమ్మకాలకు ఆజ్యం పోస్తోంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లు, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ–కామర్స్ సంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో తదితర క్విక్ కామర్స్ కంపెనీలు.. ఇలా ఒకటేమిటి. ఉత్పత్తుల తయారీ, డెలివరీ సేవల కంపెనీలు వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అటు సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు రుణ లభ్యత పెరిగింది. ఇంకేముంది వాయిదాలు చెల్లించగలిగే స్తోమత ఉంటే చాలు, స్థాయికి మించిన విలువైన వాహనం కొనేందుకూ కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు.
లగ్జరీ.. తగ్గేదేలే!
దేశంలో లగ్జరీ కార్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రూ.50 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ కార్లు 2024లో గంటకు దాదాపు ఆరు (5.83 యూనిట్లు) అమ్ముడయ్యాయి. అయిదేళ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లే రోడ్డెక్కాయంటే ప్రస్తుత భారత మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. 2024లో మొత్తం 51,200 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 50 వేల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండు డజన్లకుపైగా నూతన మోడళ్లు కొలువుదీరనున్నాయి. ఊరిస్తున్న కొత్త మోడళ్లు, సంపన్నులు పెరుగుతుండడంతో 2025లో ఈ సెగ్మెంట్లో 54,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది.
2030 నాటికి లగ్జరీ కార్ల అమ్మకాలు ఏటా 1,00,000 దాటుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో లగ్జరీ వాటా 1 శాతంపైగా ఉంది. 2020లో 20,500 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్లు్య, ఆడి, వోల్వో, మినీ, జేఎల్‌ఆర్, లెక్సస్ టాప్ బ్రాండ్స్‌గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లంబోర్గీని, పోర్ష్ కార్లకూ డిమాండ్ ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 2028 నాటికి 19,908కి చేరనుంది. 2023లో ఈ సంఖ్య 13,263 ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్యలో భారత్ భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది.
ఈవీతో పోటీగా సీఎన్ జీ..
ఆశ్చర్యకర విషయం ఏమంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ఆధారిత వాహనాల డిమాండ్ ఊహకు అందడం లేదు. ఈ విభాగంలో గత ఏడాది 7,15,213 కార్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి ఏకంగా 35 శాతం నమోదు కావడం విశేషం. మారుతీ సుజుకీ ఇండియా అత్యధికంగా 2024లో ఈ విభాగంలో 5,12,155 యూనిట్లతో 71.60 శాతం వాటా దక్కించుకుంది. సీఎన్‌జీ వాటా ప్యాసింజర్ వెహికిల్స్‌లో 18 శాతం, త్రీవీలర్స్ అమ్మకాల్లో 28 శాతం ఉంది.
బజాజ్ ఆటో ఒక అడుగు ముందుకేసి దేశంలో తొలిసారిగా సీఎన్ జీ బైక్ ‘ఫ్రీడమ్’ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 5,500లకు పైగా సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్ ్స ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 8,000 దాటనుంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్ జీ వ్యయం తక్కువ కావడంతో కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు.
వాహన విడిభాగాలు ఇలా..
2023–24లో వాహన విడిభాగాల పరిశ్రమ 9.8 శాతం వృద్ధితో 74.1 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసింది. 2017–18లో ఇది 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో భారత్ వాటా 3.5 శాతం. భారత జీడీపీలో ఈ రంగం వాటా 3.5 శాతం. తయారీ జీడీపీలో ఈ విభాగం 25 శాతం సమకూర్చింది. 50 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. విడిభాగాల ఎగుమతులతో అయిదేళ్లలో 88 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరింది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రకారం భారత వాహన విడిభాగాల పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎగుమతులు 21 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఏసీఎంఏ ధీమాగా ఉంది.
ఐదేళ్లలో తొలి స్థానం..!
భారత ఆటోమోటివ్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లు. దేశ జీడీపీకి ఈ రంగం 7 శాతం సమకూరుస్తోంది. మొత్తం వసూలు అవుతున్న జీఎస్టీలో 14–15 శాతం ఆటోమొబైల్ రంగం అందిస్తోందంటే ఆశ్చర్యం వేయకమానదు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానానికి చేరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయ వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని చెప్పారు. ‘రూ.78 లక్షల కోట్లతో తొలి స్థానంలో యూఎస్‌ఏ, రూ.47 లక్షల కోట్లతో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా చైనా నిలిచింది. ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్–1గా మార్చాలనుకుంటున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్స్ భారత్‌లో ఉండడం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని మంత్రి వివరించారు.
ప్రభుత్వం ఏం చేస్తోందంటే..
సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి నూతన సాంకేతికతలవైపు వాహన పరిశ్రమ మళ్లేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్ ్సడ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ రంగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌కు రూ.10,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈవీ రంగంలో విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం తివాచీ పరిచింది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రాలు నెలకొల్పే సంస్థలు పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి కుదించారు.
లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. 2030 నాటికి ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ విభాగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు స్క్రాప్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలను నిర్దేశిస్తూ, తప్పనిసరి చేస్తోంది. గ్లోబల్ ఎన్ సీఏపీకి దీటుగా భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సీఏపీ) పరిచయం చేసింది. 2030 నాటికి కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 30 శాతం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
మీకు తెలుసా?
వాహనాల తయారీ, విక్రయాల పరంగా భారత్ పేరిట పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రూ.22 లక్షల కోట్లతో భారత మార్కెట్ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధితో 2022–23లో 33.2 బిలియన్ డాలర్ల విలువైన 47.6 లక్షల యూనిట్ల వాహనాలు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 45 లక్షల యూనిట్లు దాటింది. రెండు దశాబ్దాల్లో 25 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. ఒక్క ఈవీ రంగంలోనే 2022–23లో 3.6 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చి చేరింది. వోల్వో, దైమ్లర్ వంటి 60కిపైగా దిగ్గజాలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నెలకొల్పాయి. ట్రాక్టర్ల తయారీలో మహీంద్రా, త్రీవీలర్ల ఉత్పత్తిలో బజాజ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచాయి.
ఆటోమోటివ్ రంగం పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించే దిశగా వెళుతోంది. వృద్ధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రీన్ మొబిలిటీకి మారడం సవాలే. ఈవీలు, హైబ్రిడ్స్, హైడ్రోజన్ లేదా ఇతర ఇంధన విభాగాలైనా సరైన సాంకేతికతను అవలంబించడం కూడా సవాలుగానే ఉంటుంది. వృద్ధిని నిర్ధారిస్తూనే ఆటోమోటివ్ కంపెనీలు మారుతున్న పరివర్తనను ఎలా నిర్వహిస్తాయో అన్న అంశాన్ని ఈ రెండేళ్లు పరిశీలించాల్సి ఉంటుంది.
∙వి.రిషి కుమార్, ఆటో ఎక్స్‌పర్ట్.
ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 60 శాతంపైగా వాటాతో ఎస్‌యూవీలు రూల్ చేస్తున్నాయి. రియల్ సూపర్ స్టార్‌గా సీఎన్ జీ నిలిచింది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ కార్ల వాటా ప్రస్తుతం 2 శాతంలోపు వచ్చి చేరింది.
∙అరుణ్ మల్హోత్రా, మాజీ ఎండీ, నిస్సాన్ ఇండియా
మార్కెట్ రికవరీ, తయారీ సంస్థల నుంచి వ్యూహాత్మక మద్దతు, విధాన స్థాయి స్పష్టత.. వెరసి ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమ 2025లో మెరుగ్గా ఉంటుంది. ఈ ఏడాది వృద్ధి ఉంటుందని 66.41 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. స్థిరంగా ఉంటుందని 26.72 శాతం, తిరోగమన వృద్ధి నమోదవుతుందని 6.87 శాతం మంది డీలర్లు అభిప్రాయపడ్డారు.
∙సి.ఎస్. విఘ్నేశ్వర్,,
ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ్స (ఎఫ్‌ఏడీఏ)
Comments
Please login to add a commentAdd a comment