టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ తరతరాల చరిత్రకు ఆలవాలం. కేవలం ఇది టాటా కుటుంబ వ్యాపార చరిత్రకు మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రపూర్వ ఆర్థిక, రాజకీయ చరిత్రకు, స్వాతంత్య్రానంతర అభివృద్ధి చరిత్రకు కూడా ఆలవాలం. చారిత్రక ఆనవాళ్లను భద్రపరచి, తర్వాతి తరాలకు అందించడంలో మన భారతీయులకు శ్రద్ధ కొంత తక్కువ. మన దేశంలోని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఇందుకు మినహాయింపు కాదు. దేశంలోని తొలి వ్యాపార ఆర్కైవ్స్‌ను టాటా సంస్థ ప్రారంభించింది.
టాటా గ్రూప్ సంస్థలకు దాదాపు ఒకటిన్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి, డెబ్బయి ఏడేళ్లు గడిచాయి. టాటా గ్రూప్ చరిత్ర స్వాతంత్య్ర భారత చరిత్రకు దాదాపు రెట్టింపు. ఆనాటి బ్రిటిష్ కాలంలో జెమ్‌షెడ్జీ నుసర్‌వాన్‌జీ టాటా తొలుత తండ్రి చేసే వ్యాపారానికి సçహాయంగా ఉంటూ వచ్చారు. తర్వాత 1868లో ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేశారు. అప్పట్లో ఆయన రూ.21 వేల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత ఒక కాటన్ మిల్లును ప్రారంభించి, వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ, 1874లో నాగపూర్‌లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు.
బ్రిటిష్ రాజ్యంలో స్థానిక భారతీయుడు ఒకరు ప్రారంభించిన తొలి జాయింట్ స్టాక్ కంపెనీ ఇది. ఆనాటి నుంచి టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. టాటా కుటుంబ వారసుల్లో మూడో తరానికి చెందిన జె.ఆర్.డి. టాటా ఈ చరిత్రను ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి, దేశ పౌరులకు అందుబాటులో ఉంచడానికి వీలుగా టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తొలుత 1991 జనవరిలో బాంబేలో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత 2001లో పుణేలోని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన భవనంలోకి దీనిని తరలించారు.
ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు
టాటా గ్రూప్ ప్రస్థానం ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు రకరకాల రంగాల్లో కొనసాగింది. టాటా గ్రూప్ ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కారణాంతరాల వల్ల నిలిచిపోయాయి. ఇంకొన్ని చేతులు మారాయి. అయినా, టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం దేశ పారిశ్రామిక రంగంలో తన ఉనికిని నేటికీ నిలుపుకుంటూ వస్తోంది. టాటా గ్రూప్ వ్యాపారాలకు సంబంధించి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భద్రపరచిన ఎన్నో అరుదైన విశేషాలు నేటి తరానికి తెలియవు. స్వాతంత్య్రోద్యమ కాలంలో టాటాలు పోషించిన పాత్ర, స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించిన పాత్ర నిరుపమానమైనవి.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెమ్‌షెడ్జీ నుసర్‌వాన్‌జీ టాటా నాగపూర్‌లో 1874లో ప్రారంభించిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో విక్టోరియా మిల్లును నెలకొల్పారు. బ్రిటిష్ రాణిగా విక్టోరియా 1877 జనవరి 1న భారత సామ్రాజ్ఞిగా పట్టాభిషిక్తురాలు కావడంతో ఈ మిల్లు పేరును ఎంప్రెస్ మిల్స్‌గా మార్చారు. కాలక్రమంలో ఈ కంపెనీ పరిధిలోకి మరో మూడు మిల్లులు చేరాయి. అవన్నీ కలిపి టాటా టెక్స్‌టైల్ మిల్స్‌గా పేరుపొందాయి.
టాటా టెక్స్‌టైల్ మిల్స్ వ్యాపారం 1997లో నిలిచిపోయింది. జె.ఆర్.డి.టాటా హయాంలో టాటా గ్రూప్ 1932లో విమానయాన రంగంలోకి ‘టాటా ఎయిర్‌లైన్స్’ పేరుతో అడుగుపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1953లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసి, దీని పేరును ‘ఎయిర్ ఇండియా’గా మార్చింది. ప్రభుత్వం 2000–01 కాలంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చివరకు 2022లో ఈ కంపెనీని తిరిగి టాటా గ్రూప్ కైవసం చేసుకోగలిగింది. ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భద్రంగా అందుబాటులో ఉంచడం విశేషం.
మహాత్మాగాంధీకి తొలి విరాళం
టాటా గ్రూప్ వారసులు నేరుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకపోయినా, భారత స్వాతంత్య్రోద్యమానికి బాసటగా నిలిచారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా కొనసాగుతూ, భారత స్వాత్రంత్య్రోమానికి సన్నాహాలు చేస్తున్న కాలంలోనే 1909లో జెమ్‌షెడ్జీ టాటా చిన్న కొడుకు సర్ రతన్‌జీ టాటా ఆయనకు తొలి విరాళంగా రూ.25 వేలు పంపారు. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం. టాటాల తొలి కంపెనీ పెట్టుబడి కంటే కూడా నాలుగువేల రూపాయలు ఎక్కువ. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి సర్ రతన్‌జీ టాటా బాసటగా ఉండేవారు.
గాంధీజీకి ఆయన 1910లో మరో రూ.25 వేలు, 1912లో మూడో విరాళం పంపారు. ఈ సంగతిని గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమ ప్రచార పత్రిక అయిన ‘ఇండియన్ ఒపీనియన్’లో రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చి, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం చేపట్టారు. అనతికాలంలోనే దేశ ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అని పిలువసాగారు. గాంధీజీ 1925లో జెమ్‌షెడ్‌పూర్ వచ్చారు. అక్కడి టాటా ఉక్కు కర్మాగారం కార్మికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం పట్ల, దేశ ప్రజల పట్ల టాటాలు కనబరుస్తున్న నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు.
గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమానికి జెమ్‌షెడ్జీ టాటా పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా భార్య లేడీ మెహర్‌బాయి టాటా కూడా మద్దతు తెలిపారు. ఇందుకోసం 1919లో ఆమె స్వయంగా రాట్నంపై నూలు వడకడం నేర్చుకున్నారు. జె.ఆర్.డి.టాటా తండ్రి ఆర్.డి.టాటా కూడా గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్య్రోద్యమానికి మద్దతు పలికారు. స్వదేశీ ఉద్యమం కోసం ఆయన టాటా సంస్థ తరఫున లక్ష రాట్నం కుదురులను, ఇతర చేనేత సామగ్రిని పంపారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా తదితర జాతీయ నేతలు బాంబేలో టాటాలకు చెందిన తాజ్‌మహల్ పాలెస్ హోటల్‌లో తరచుగా సమావేశాలు జరుపుకొనేవారు.
నెహ్రూ కోరికపై లాక్మే ప్రారంభం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు లేవు. సబ్బులు, పౌడర్లు తప్ప మిగిలిన సౌందర్య సాధనాలు కావాలంటే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి. ఫలితంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం వీటి కోసం ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి ఉండేది. విదేశీ మారకద్రవ్యం సౌందర్య ఉత్పత్తుల కోసం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే, దేశంలో సౌందర్య సా«ధనాల తయారీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అప్పట్లో జె.ఆర్.డి.టాటాను కోరారు. నెహ్రూ కోరిక మేరకు జె.ఆర్.డి.టాటా 1952లో తొలి స్వదేశీ సౌందర్య సాధనాల సంస్థగా ‘లాక్మే’ను ప్రారంభించారు. అప్పట్లో ‘లాక్మే’ అనే ఫ్రెంచ్ ఒపేరా ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో జె.ఆర్.డి.టాటా తమ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌కు ఆ పేరు పెట్టారు. లక్ష్మీదేవిని ఫ్రెంచ్‌లో ‘లాక్మే’ అంటారు. చాలాకాలం టాటా గ్రూప్‌లో ఉన్న ఈ బ్రాండ్ 1998లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చేతుల్లోకి చేరింది.
విద్యా పరిశోధన సేవా రంగాల్లోనూ ముద్ర
జె.ఆర్.డి.టాటా దాదాపు అర్ధశతాబ్ద కాలం టాటా గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ వ్యాపారాలకు వెలుపలి సేవలకు కూడా విస్తరించాయి. జె.ఆర్.డి.టాటా హయాంలోనే టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫర్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యా పరిశోధన రంగాల్లో ఇవి నేటికీ ప్రతిష్ఠాత్మక సంస్థలుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు కోసం జె.ఆర్.డి.టాటా చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నింటినీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో భావితరాల కోసం భద్రపరచారు.
వీటిని పరిశీలిస్తే, ఒక్కో సంస్థ వెనుక ఉన్న సంకల్పం, వాటి ఏర్పాటు కోసం పడిన తపన అర్థమవుతాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ పేరుతో ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఎలాంటి నిర్బంధం, నిబంధనలు లేనికాలంలోనే టాటాలు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారు. స్వాతంత్య్రానికి మూడేళ్ల ముందే, 1944లో సేవా కార్యక్రమాల కోసం జె.ఆర్.డి.టాటా తన సొంత డబ్బుతో జె.ఆర్.డి.టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు.
తర్వాత కొంతకాలానికి కంపెనీలోని తన షేర్లు కొన్నింటిని, బాంబేలోని ఒక అపార్ట్‌మెంట్‌ను అమ్మేసి, ఆ డబ్బుతో పేద మహిళల స్వావలంబన కోసం తన పేరిట, తన భార్య పేరిట జె.ఆర్.డి.టాటా అండ్ థెల్మా టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. టాటా సంస్థల సుదీర్ఘ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లోని అరుదైన విశేషాలను ఎవరైనా సందర్శించవచ్చు. ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌ను సందర్శించడమంటే, దేశ ఆర్థిక స్వావలంబన చరిత్రను సింహావలోకనం చేయడమే!
Comments
Please login to add a commentAdd a comment