రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు, చాట్ బండి, పండ్ల షాపులను గమనించారా? అక్కడ మీకో యూపీఐ క్యూఆర్ కోడ్ దర్శనమిస్తుంది. చూడ్డానికి చిన్నదే అయినా వాటి ఆధారంగా జరుగుతున్న వ్యాపారం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! దేశ వాణిజ్యంలో యూపీఐ క్యూఆర్ కోడ్స్ అత్యంత కీలకంగా మారాయంటే అతిశయోక్తి కాదు. కుగ్రామాల్లోని చిరు వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్న ఈ కోడ్‌లను గమనిస్తే, డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతావని ముఖచిత్రం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల నుంచి వర్తకులకు చేరిన డిజిటల్ పేమెంట్స్‌లో సంఖ్యపరంగా రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 84.27 శాతం ఉంది. చిన్న చిన్న మొత్తాలే డిజిటల్ రూపంలో చేతులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం.
ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్ భారత వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి కోట్లాది మందిని తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసింది. కోట్లాదిమంది భారతీయులకు క్రెడిట్, సేవింగ్స్ వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించింది. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా చేరాయి. పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం ఇంతకు ముందు చూడని స్థాయిలో ఈ సాంకేతిక ఆవిష్కరణ ప్రభావం చూపించింది.
సౌకర్యాల కలబోత..
చాక్లెట్ కొన్నా షాపు యజమానికి అక్కడి క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరు సాయంతో డబ్బులు చెల్లించొచ్చు. అదీ 10 సెకన్లలోపే. కస్టమర్‌కి గాని, వ్యాపారస్తుడికి గాని చేతిలో చిల్లర లేదన్న బెంగ లేదు. క్యాష్ కోసం ఏటీఎమ్‌కి, బ్యాంకుకు పరుగెత్తే పని లేదు. షాపింగ్ కోసం చేతినిండా నగదు ఉంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా చేతిలో ఉన్న ఫోన్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పేమెంట్ యాప్ ఉంటే చాలు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి క్షణాల్లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. వర్తకులు ప్రతిసారీ తమ మొబైల్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాయిస్ బాక్సులు వచ్చాయి.
వినియోగదారుడి బ్యాంకు ఖాతా, లేదా డిజిటల్ వాలెట్ నుంచి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ అవుతాయి. యూపీఐ యాప్‌లో ప్రతి బ్యాంకు ఖాతాకు ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ (ఐడీ) క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడీ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరుతో కూడా డబ్బులు చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిగే చెల్లింపులకు ఎటువంటి చార్జీ ఉండదు. అంటే బ్యాంకు ఖాతా నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే లావాదేవీలు కూడా ఉచితం అన్నమాట. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు, బీమా, డీటీహెచ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. లావాదేవీల పరిమితి రోజుకు రూ.1 లక్ష వరకు ఉంది. దేశవ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో విలువ పరంగా యూపీఐ వాటా 43 శాతం ఉందంటే అతిశయోక్తి కాదు.
పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి..
క్యూఆర్ కోడ్స్‌కు ఆదరణ అంతా ఇంతా కాదు. విక్రేతలు ఎవరైనా డిజిటల్ రూపంలో నగదును స్వీకరించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే తెల్లకాగితం మీద కూడా క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ తీసుకుని వినియోగించే వెసులుబాటు ఉండడం. పైగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ ఖరీదు సుమారు రూ.12 వేల వరకు ఉంది. ఎంపీవోఎస్ ఖరీదు అయిదు వేల వరకు పలుకుతోంది.
చౌకైన వ్యవహారం కాబట్టే క్యూఆర్ కోడ్స్ పాపులర్ అయ్యాయి. వినియోగదారులు సైతం డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతుండటమూ వీటి వినియోగం పెరిగేందుకు దోహదం చేసింది. నగదుతో పోలిస్తే చాలా సందర్భాల్లో అతి తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి వర్తకుల కోసం 26 కోట్ల పైచిలుకు క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును స్వీకరించే పీవోఎస్ టెర్మినల్స్ 78 లక్షలు ఉన్నాయి. పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయంటే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థలు క్యూఆర్ కోడ్స్‌ను జారీ చేస్తున్నాయి.
ఆధార్ ఆధారంగా..
దేశంలో 99 శాతం మంది పెద్దలు బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 130 కోట్లకుపైగా ఆధార్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచే పనిని సులభతరం చేశాయి. అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అని పిలిచే తక్షణ చెల్లింపు వ్యవస్థకు పునాదిగా మారాయి. 2016 నవంబర్‌లో భారత ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేసింది. నోట్ల కొరత కూడా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడానికి కారణం అయింది. గత ఏడాది భారత్‌లో ఇన్‌స్టంట్ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ యూఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ల కంటే చాలా ఎక్కువ. ఈ నాలుగు దేశాల మొత్తం లావాదేవీలే కాదు, ఈ మొత్తం విలువను నాలుగుతో గుణించినదాని కంటే భారత లావాదేవీలు అధికమని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 30 కోట్ల పైచిలుకు వ్యక్తులు, 5 కోట్లకు పైగా వర్తకులు యూపీఐ వేదికపైకి వచ్చి చేరారు.
పట్టణ ప్రాంతాలను దాటి..
యూపీఐ వేదికగా 2021 ఏప్రిల్‌లో రూ.4,93,663 కోట్ల విలువైన 264 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాతి సంవత్సరం ఏప్రిల్‌లో రూ.9,83,302 కోట్ల విలువైన 558 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 వచ్చేసరికి యూపీఐ లావాదేవీల విలువ ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.14,15,504.71 కోట్లకు ఎగసింది. లావాదేవీల సంఖ్య 886.32 కోట్లకు చేరింది. అంటే రెండేళ్లలో లావాదేవీల విలువ మూడింతలకు చేరువ అవుతోంది. పరిమాణం మూడు రెట్లు దాటింది. 2021లో గరిష్ఠంగా డిసెంబర్‌లో రూ.8,26,848 కోట్లు, 2022 అత్యధికంగా డిసెంబర్‌లో రూ.12,81,970.8 కోట్లు నమోదయ్యాయి. డిజిటల్ పేమెంట్లు భారత్‌లో వేగంగా ఆదరణ చెందుతున్నాయని అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కోవిడ్–19 మహమ్మారి సమయంలో యూపీఐ ప్లాట్‌ఫామ్ పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది. పట్టణ ప్రాంతాలను దాటి గ్రామీణ భారతదేశానికి కూడా యూపీఐ విస్తరించడం నిపుణులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత్‌లో 2016 నుంచి..
సౌలభ్యం ఉంది కాబట్టే చెల్లింపుల వ్యవస్థలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విప్లవం సృష్టిస్తోంది. భారత్‌లో అయితే వీటి లావాదేవీల సంఖ్య, విలువ అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. విభిన్న బ్యాంకు ఖాతాలను పేమెంట్ యాప్‌కు అనుసంధానం చేయడం ద్వారా నగదుకు బదులు డిజిటల్ రూపంలో చెల్లింపులను సురక్షితంగా, క్షణాల్లో పూర్తి చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) 2016 ఏప్రిల్ 11న యూపీఐ సేవలను పైలట్ ప్రాజెక్టుగా 21 బ్యాంకులతో కలసి భారత్‌లో ప్రారంభించింది. అదే ఏడాది ఆగస్ట్ 25 నుంచి గూగుల్ ప్లే స్టోర్లలో బ్యాంకులు తమ పేమెంట్ యాప్స్‌ను జోడించడం మొదలుపెట్టాయి. భారత్‌లో ప్రస్తుతం 414 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి.
పేమెంట్ యాప్స్‌లో ఫోన్‌పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్‌లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్‌పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టాప్–10 పేమెంట్ యాప్స్‌లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది.
2023 ఏప్రిల్‌లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్
పేమెంట్ యాప్స్‌లో ఫోన్‌పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్‌లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్‌పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టాప్–10 పేమెంట్ యాప్స్‌లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది.
(2023 ఏప్రిల్‌లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్)
కోవిడ్ కాలంలో రెండింతలు..
2016 డిసెంబర్‌లో రూ.708 కోట్ల విలువైన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు జరిగాయి. 2017లో ఒక నెలలో గరిష్ఠంగా రూ.13,174 కోట్లు నమోదయ్యాయి. 2018 డిసెంబరులో లక్ష కోట్ల మార్కును దాటింది. ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. 2020 జూలై నుంచి యూపీఐ లావాదేవీల వేగం పుంజుకుంది. ఆ నెలలో రూ.2,90,538 కోట్ల విలువైన 149.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కాలంలో వైరస్ భయానికి నోట్లను ముట్టుకోవడానికి ప్రజలు ససేమిరా అన్నారు. దీంతో డిజిటల్ చెల్లింపులకు మళ్లారు. ఫలితంగా 2020, 2021లో డిజిటల్ లావాదేవీల విలువ రెట్టింపైంది. 2022 మే నెలలో రూ.10 లక్షల కోట్ల మైలురాయి దాటి యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే 40 నెలల్లోనే పదిరెట్లు అయ్యాయంటే పేమెంట్ యాప్స్ ఏ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.
యూపీఐదే 43 శాతం వాటా..
ఏటీఎమ్‌ల నుంచి నగదు స్వీకరణ, జమ, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, ఇతర మార్గాల్లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక లావాదేవీల పరిమాణం 2022–23లో 10,620.6 కోట్లు. వీటి విలువ రూ.3,22,36,700 కోట్లు. ఇందులో యూపీఐ సింహభాగం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ వేదికగా 8,375.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,39,20,678 కోట్లు. అధికారికంగా జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల్లో యూపీఐ ఏకంగా 43.18 శాతం వాటా కైవసం చేసుకుందన్న మాట. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) చెక్ క్లియరింగ్ విధానం ద్వారా రూ.71,67,040 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొబైల్ ఫోన్స్ ద్వారా బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవలైన ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) వేదికగా రూ.55,86,147 కోట్లు నమోదయ్యాయి. ఏటీఎమ్‌లలో నగదు జమ, స్వీకరణ లావాదేవీల విలువ రూ.16,62,419 కోట్లు ఉంది. ప్రజల వద్ద చలామణీలో ఉన్న నగదు రూ.36 లక్షల కోట్లు.
ఇవీ డిజిటల్ లావాదేవీలు..
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పురోగతి ఇందుకు తోడ్పడింది. 2017–18లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 10,000 కోట్లు దాటింది. దీంతో డిజిటల్ లావాదేవీల విలువ 50 శాతానికిపైగా ఎగసింది. యూపీఐ ఇందుకు దోహదం చేసింది. 2022లో రూ.149.5 లక్షల కోట్ల విలువైన 8,792 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.126 లక్షల కోట్ల విలువైన 7,405 కోట్ల లావాదేవీలు యూపీఐ కైవసం చేసుకుంది.
డిజిటల్ పేమెంట్ల విలువ 2026 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోన్‌పే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఇదే జరిగితే నగదు లావాదేవీల వాటా 60 నుంచి 35 శాతానికి వచ్చి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భవిష్యత్ అంతా 3–6 తరగతి శ్రేణి నగరాలు, పట్టణాలదే. గడిచిన రెండేళ్లుగా కొత్త మొబైల్ పేమెంట్ కస్టమర్లలో ఈ నగరాలు, పట్టణాలకు చెందినవారు 60–70 శాతం ఉన్నారట. 2023 మార్చినాటికి భారత్‌లో 96.12 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. 5.5 కోట్ల మంది వద్ద 8.53 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. డిజిటల్ వేదికల రాకతో బ్యాంకులపై భారం గణనీయంగా తగ్గింది. బ్యాంకుల్లో ఇప్పుడు క్యూలు కానరావడం లేదు.
ఎక్కడ ఎక్కువంటే..
గ్రాసరీస్, సూపర్‌మార్కెట్లలో అత్యధికంగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, టెలికం సేవలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్, గేమ్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, సర్వీస్ స్టేషన్స్, ఔషధ దుకాణాలు, బేకరీస్ నిలిచాయి. విలువ పరంగా 2023 ఏప్రిల్‌లో నమోదైన లావాదేవీల్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) చేరిన మొత్తం 77.18 శాతం. మిగిలినది వ్యక్తుల నుంచి వర్తకులకు (పీర్ టు మర్చంట్) చేరింది. పీర్ టు పీర్ విభాగంలో రూ.2 వేలు ఆపైన విలువ చేసే లావాదేవీలు 87.05 శాతం, రూ.500–2000 వరకు 9.73, రూ.500 లోపు 3.21 శాతం కైవసం చేసుకున్నాయి. పీర్ టు మర్చంట్ విభాగంలో రూ.2,000 పైన 67.3 శాతం, రూ.500–2000 వరకు 17.72, రూ.500 లోపు 15.24 శాతం నమోదయ్యాయి.
లావాదేవీల సంఖ్య పరంగా 2023 ఏప్రిల్‌లో పీర్ టు మర్చంట్ అధికంగా 56.63 శాతం దక్కించుకుంది. మిగిలినది పీర్ టు పీర్ చేజిక్కించుకుంది. పీర్ టు మర్చంట్ విభాగంలో సింహభాగం అంటే 84.27 శాతం లావాదేవీలు రూ.500 లోపు విలువైనవే. రూ.500–2000 విలువ చేసేవి 11.01 శాతం, రూ.2 వేలకుపైగా విలువ కలిగిన కొనుగోళ్లు 4.71 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు బదిలీ చేసినవి 54.22 శాతం, రూ.500–2,000 వరకు 22.25 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.53 శాతం ఉన్నాయి.
ఇంటర్నెట్ తోడుగా..
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్త నివేదిక ప్రకారం.. భారత్‌లో సగానికి పైగా జనాభా ఇంటర్నెట్‌ను తరచుగా వినియోగిస్తోంది. 2022లో దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఈ స్థాయిలో యాక్టివ్ యూజర్లు ఉండడం భారత్‌లో ఇదే ప్రథమం. వీరు కనీసం నెలకు ఒకసారైనా నెట్‌లో విహరిస్తున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 90 కోట్లకు చేరనుంది. మొత్తం యాక్టివ్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, మిగిలిన వారు పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు.
దేశీయంగా ఇంటర్నెట్ వినియోగ వృద్ధికి గ్రామీణ ప్రాంతం దన్నుగా నిలుస్తోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. ఏడాది వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నెట్ వినియోగ వృద్ధి 6 శాతంగా ఉండగా, గ్రామీణ భారతంలో ఇది 14 శాతంగా నమోదైందని వివరించింది. 2025 నాటికి కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఇక డిజిటల్ చెల్లింపులు చేసేవారి సంఖ్య 2021తో పోలిస్తే గతేడాది 13 శాతం దూసుకెళ్లి 33.8 కోట్లకు చేరింది. వీరిలో 36 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో 99 శాతం మంది యూపీఐ యూజర్లే ఉండడం విశేషం.
క్రెడిట్‌ను విస్తరించడానికి..
భారతదేశం యూపీఐ రూపంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉంది. ఇప్పుడు యూపీఐ పట్టాలను క్రెడిట్ లావాదేవీలకు విస్తరించడానికి సమయం ఆసన్నమైంది. రూపే క్రెడిట్ కార్డ్‌లపై యూపీఐ లావాదేవీలను ప్రారంభించడం ద్వారా దీని మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భారత్ కేవలం 5.5 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులను కలిగి ఉంది. క్రెడిట్ కార్డ్‌లకు ఎటువంటి లింక్ లేకుండా నిజమైన క్రెడిట్ లావాదేవీలను ప్రారంభించడానికి ఈ పట్టాలను విస్తరించడం చాలా ముఖ్యం. ఇది అధికారిక క్రెడిట్ పరిధికి దూరంగా ఉన్న 60 కోట్లకుపైగా మందికి క్రెడిట్‌ను విస్తరించడానికి వివిఫై, ఇతర కంపెనీలకు వీలు కల్పిస్తుంది.
– అనిల్ పినపాల, ఫౌండర్, వివిఫై ఇండియా ఫైనాన్స్.
-- నూగూరి మహేందర్
Comments
Please login to add a commentAdd a comment