మదన్‌మోహన్ మాలవీయ
‘హిందువులు: అంతరించిపోతున్న తెగ’ఈ శీర్షికతో సురేంద్రనాథ్ బెనర్జీ పత్రిక ‘బెంగాలీ’ ధారావాహిక వ్యాసాలు ప్రచురించింది. 1909లో యు.ఎన్.ముఖర్జీ ఈ వ్యాసాలు రాశారు. వీటి ప్రకారం 420 ఏళ్లలో హిందువులు మిగలరు. అంటే అబ్రహామిక్ మతాలు క్రైస్తవం, ఇస్లాం జమిలిగా హిందూధర్మం మీద దాడి చేస్తున్నాయని నమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. నాటి జనాభా లెక్కలు, 1891 నాటి జనగణన అధికారి ఒడొన్నెల్ ఇచ్చిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేశాయి. ఇదే నిష్పత్తిలో ముస్లిం, క్రైస్తవ జనాభా పెరిగితే 700 ఏళ్లకు హిందూ ఉనికి ఉండదు అని దాని సారాంశం. ఈ వాతావరణం నుంచి ఉద్భవించినదే హిందూ మహాసభ. 1910 నాటి అలహాబాద్ జాతీయ
కాంగ్రెస్ సమావేశాలలో అఖిల భారత హిందూ వేదిక ఉండాలని లాంఛనంగా ఆమోదించారు. హిందూ మహాసభ మూలాలు బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్‌లో 1880–1920 మధ్య సంభవించిన పరిణామాలలో ఉన్నాయి. ఈ కాలంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలలో ప్రభుత్వం ముస్లింల వైపు మొగ్గింది. కారణం జాతీయ కాంగ్రెస్‌ను నడిపిస్తున్న మితవాదుల ప్రాబల్యం తగ్గించడం. అది పరోక్షంగా హిందువుల సామాజిక, రాజకీయ పురోగతిని నిరోధించడమే అయింది. హిందూ విద్యావంతులను పాలనా విభాగంలోకి రాకుండా నిలువరించడం ఇందులో భాగం.
మింటో మార్లే సంస్కరణల (1909) ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చి, సెంట్రల్, ప్రాంతీయ లెజిస్లేటివ్ అసెంబ్లీలలో ముస్లింలకు కల్పించిన ప్రత్యేక సదుపాయం, వారి జనాభాకు మించి చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించింది. ‘చారిత్రకంగా ముస్లింలు ఈ దేశపు మాజీ పాలకులు’ అన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రకటనకు ఈ పరిణామం బలమిచ్చింది. అహ్మద్‌ఖాన్ అష్రఫీ తెగవారు.
సెంట్రల్ ప్రావిన్స్‌లోని ప్రధాన ఉద్యోగాలు ఆ వర్గీయులకే దక్కాయి. బెంగాల్‌లో వహాబీ, ఫరైజీ ఉద్యమాలకు ఢాకా నవాబు నిధులు ఇచ్చాడు. ఈ ఉద్యమాలు పేద ముస్లింలలో మత దురభిమానాన్ని పెంచాయి. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమానికి వారు దూరంగా ఉండడానికి కారణం ఇదే. పైగా ఆ ఉద్యమాలతో ప్రభావితమైనవారు మైమెన్‌సింగ్, జెస్సోర్ వంటి చోట్ల హిందువుల మీద హత్యాకాండకు పాల్పడ్డారు.
నిజానికి 19వ శతాబ్దం ఆఖర్లో దేశంలో పలుచోట్ల హిందూ సంఘాలు ఏర్పడ్డాయి. హిందువుల రక్షణ, సామాజిక, సాంస్కృతిక రక్షణ, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల సాధన వీటి ఉద్దేశం. వాటిలో పేరున్నవి ఆర్య సమాజ్, హిందూ సభ, గోరక్షణి సభ, నగరి ప్రచారిణి సభ. వాటి ఉద్యమం స్థానికం. ఇదే పేరుతో పలు ప్రాంతాలలో సంఘాలు వెలిశాయి. వీటి ఉద్దేశం, స్థానిక సంస్థలు ముస్లింల ఆధిపత్యంలోకి వెళ్లకుండా కాపాడుకోవడమే.
మొదటి హిందూసభ 1906 ఆగస్ట్ 4న లాహోర్‌లో ఏర్పడింది. ఆర్య సమాజీయులు, సనాతన ధర్మ పరిరక్షకులు స్థాపించారు. ఈ సంస్థల సమావేశాలలో లాలా లజపతిరాయ్, లాల్‌చంద్, రుచి రావ్‌ు సాహ్ని, రావ్‌ుభజ్ దత్త, లాలా హన్స్‌రాజ్ వంటివారు పాల్గొనేవారు. 1909లో పంజాబ్ హిందూ సభ ఏర్పడింది. లాహోర్ హిందూ సభ ఏర్పాటుకు కారణం, ముస్లిం లీగ్ అదే సంవత్సరం ఏర్పడినందువల్లనో, కాదో కానీ, పంజాబ్ హిందూ సభ ఏర్పడడానికి తక్షణ కారణం జనాభా లెక్కలు. 1891లో పంజాబ్‌లో 43.8 శాతం ఉన్న హిందూ జనాభా 1911 నాటికి 36.3 శాతానికి వచ్చింది. అదే సమయంలో ముస్లిం జనాభా 5.7 శాతం పెరిగింది. 1911 జనాభా లెక్కల ప్రకారమే హిందువులు 40,000 ఇస్లాంలోకి, 1,20,000 క్రైస్తవంలోకి మారారు.
1909 అక్టోబర్‌లో పంజాబ్ హిందూ సభ నిర్వహించిన తొలి సదస్సుకు మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షుడు. ఆ అక్టోబర్‌లోనే పంజాబ్ హిందూసభ ప్రాంతీయ సమావేశాలు నిర్వహించింది. దీనికి సర్ ప్రతుల్‌చంద్ర ఛటర్జీ అధ్యక్షత వహించారు. ఆయన పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తిగా, పంజాబ్ విశ్వవిద్యాలయ వీసీగా పనిచేశారు. సంస్కృతం, హిందీ భాషలకు ప్రోత్సాహమివ్వాలని, గోరక్షణ, ఆయుర్వేదకు మద్దతు ఉండాలని, చరిత్ర రచనలో హిందూ యుగానికీ చోటు ఉండాలని ఈ సమావేశాలలో తీర్మానాలు చేశారు. అనతికాలంలోనే ఈ ఉద్యమాన్ని విస్తరించాలని సంకల్పించారు.
ఈ ప్రతిపాదన తెచ్చినదే పంజాబ్ హిందూసభ. 1909 నుంచి 1914 వరకు లాహోర్, అమృత్‌సర్, ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్‌లలో ఆరు పంజాబ్ హిందూ సభ సమావేశాలు జరిగాయి. తరువాత ఉత్తరప్రదేశ్‌లోను ఇతర నగరాలలోను సభలు విస్తరించాయి. పంజాబ్ హిందూ సభ సాయంతోనే ఉత్తరప్రదేశ్‌లో హిందూ సభల విస్తరణకు మాలవీయ కృషి చేశారు. స్థానిక హిందూ సభలను సమన్వయం చేస్తూ ఆయన 1912లో హిందూ విశ్వవిద్యాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ఫలితమే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.
పంజాబ్ హిందూ సభ అంబాలా (ఐదో సమావేశం), ఫిరోజ్‌పూర్ (ఆరో సమావేశం)లలో జాతీయ స్థాయిలో హిందువుల కోసం పనిచేసే ఒక సంస్థ ఉండాలని తీర్మానాలు చేసింది. చివరికి 1915 ఏప్రిల్‌లో ఆ ఆలోచనలకు తుదిరూపం వచ్చింది. హరిద్వార్ కుంభమేళా సందర్భంగా సార్వదేశిక హిందూ సభ పేరుతో గోష్ఠి జరిగింది. ఆ గోష్ఠిలో గాంధీ, స్వామి శ్రద్ధానంద ప్రసంగించారు. కాశీంబజార్ మహారాజా మునీంద్రచంద్ర నంది సభకు అధ్యక్షత వహించారు.
సార్వదేశిక హిందూ సభకు కేంద్రం డెహ్రాడూన్. ఇదే 1921లో అఖిల భారత హిందూ మహాసభగా మారింది. హిందూ మహాసభలోనూ మధ్య తరగతి విద్యావంతులే కీలకం. ఎక్కువ మంది జాతీయ కాంగ్రెస్‌లోని వారే కూడా.
రౌలట్ బిల్లు వ్యతిరేకోద్యమం, గాంధీజీ ఉద్యమ నాయకుడైన సమయంలో జాతీయోద్యమం పట్ల అనుసరించవలసిన వైఖరి గురించి మహాసభకు తొలి పరీక్ష ఎదురైంది. లాలా లజపతిరాయ్, స్వామి శ్రద్ధానంద తదితరులు సహాయ నిరాకరణను సమర్థించారు. మదన్ మోహన్ మాలవీయ సహాయ నిరాకరణను, విద్యాలయాల బహిష్కరణను కూడా వ్యతిరేకించారు. 1922 నాటి గయ సమావేశాలలో హిందూ మహాసభ ‘హిందూ సంఘటన’ నినాదం అందుకుని కొత్త దారికి మళ్లింది. ముస్లిం లీగ్ పోరాడి ప్రత్యేక నియోజకవర్గాలు సాధించుకోగా, హిందూ మహాసభ అఖండ్ హిందుస్థాన్ నినాదం ఇచ్చింది.
హిందూ మహాసభ ఆంగ్లేయులకు మద్దతుగా నిలవకపోయినా, గాంధీజీనీ, ఆయన సాగించిన జాతీయోద్యమాన్ని కూడా పూర్తిగా సమర్థించలేదు. నిజానికి హిందూ మహాసభ తన ప్రధాన శత్రువుగా ఆంగ్లపాలనను చూసిందా? లేక అబ్రహామిక్ మతాల పెరుగుదలను చూసిందా? చాలాకాలం స్పష్టత లేదు. ముస్లింలీగ్‌ను ముస్లింలు నమ్మి, కాంగ్రెస్‌ను హిందూ సంస్థగా చూశారు. హిందువులు తమ హక్కులను రక్షించే సంస్థగా కాంగ్రెస్‌ను పరిగణించలేదు. కాంగ్రెస్ హిందూ ముద్ర వేసుకోలేదు.
-డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment