Hindu Mahasabha
-
గాడ్సే ఫొటోలతో తిరంగా యాత్ర!
ముజఫర్‌నగర్: పంద్రాగస్టు సందర్భంగా సోమవారం అఖిల భారతీయ హిందూ మహాసభ చేపట్టిన తిరంగా యాత్రలో నాథూరాం గాడ్సే ఫొటోలను ప్రదర్శించడం కలకలం రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పలు సంఘాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, దీన్ని సంస్థ జాతీయాధ్యక్షుడు యోగేంద్ర వర్మ సమర్థించుకోవడం విశేషం. ‘‘ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేము తిరంగా యాత్ర చేపట్టాం. జిల్లా మొత్తం ఈ యాత్ర కొనసాగింది. ఇందులో ప్రముఖ హిందూ నేతలంతా పాల్గొన్నారు. మేము పలువురు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు పెట్టాం. తిరంగా యాత్రలో మా కార్యకర్తలు ప్రదర్శించిన సమర యోధుల ఫొటోల్లో గాడ్సే కూడా ఉన్నారు. గాంధీ జాతి వ్యతిరేక విధానాలపై గాడ్సే గళం విప్పారన్నది మా విశ్వాసం’’ అని చెప్పుకొచ్చారు యోగేంద్ర వర్మ. ఇదీ చదవండి: కర్ణాటక సీఎం బొమ్మైకి మరో తలనొప్పి.. రాష్ట్ర మంత్రి ఆడియో లీక్! -
హిందూ మహాసభ నేపథ్యం
‘హిందువులు: అంతరించిపోతున్న తెగ’ఈ శీర్షికతో సురేంద్రనాథ్ బెనర్జీ పత్రిక ‘బెంగాలీ’ ధారావాహిక వ్యాసాలు ప్రచురించింది. 1909లో యు.ఎన్.ముఖర్జీ ఈ వ్యాసాలు రాశారు. వీటి ప్రకారం 420 ఏళ్లలో హిందువులు మిగలరు. అంటే అబ్రహామిక్ మతాలు క్రైస్తవం, ఇస్లాం జమిలిగా హిందూధర్మం మీద దాడి చేస్తున్నాయని నమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. నాటి జనాభా లెక్కలు, 1891 నాటి జనగణన అధికారి ఒడొన్నెల్ ఇచ్చిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేశాయి. ఇదే నిష్పత్తిలో ముస్లిం, క్రైస్తవ జనాభా పెరిగితే 700 ఏళ్లకు హిందూ ఉనికి ఉండదు అని దాని సారాంశం. ఈ వాతావరణం నుంచి ఉద్భవించినదే హిందూ మహాసభ. 1910 నాటి అలహాబాద్ జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో అఖిల భారత హిందూ వేదిక ఉండాలని లాంఛనంగా ఆమోదించారు. హిందూ మహాసభ మూలాలు బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్‌లో 1880–1920 మధ్య సంభవించిన పరిణామాలలో ఉన్నాయి. ఈ కాలంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలలో ప్రభుత్వం ముస్లింల వైపు మొగ్గింది. కారణం జాతీయ కాంగ్రెస్‌ను నడిపిస్తున్న మితవాదుల ప్రాబల్యం తగ్గించడం. అది పరోక్షంగా హిందువుల సామాజిక, రాజకీయ పురోగతిని నిరోధించడమే అయింది. హిందూ విద్యావంతులను పాలనా విభాగంలోకి రాకుండా నిలువరించడం ఇందులో భాగం. మింటో మార్లే సంస్కరణల (1909) ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చి, సెంట్రల్, ప్రాంతీయ లెజిస్లేటివ్ అసెంబ్లీలలో ముస్లింలకు కల్పించిన ప్రత్యేక సదుపాయం, వారి జనాభాకు మించి చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించింది. ‘చారిత్రకంగా ముస్లింలు ఈ దేశపు మాజీ పాలకులు’ అన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రకటనకు ఈ పరిణామం బలమిచ్చింది. అహ్మద్‌ఖాన్ అష్రఫీ తెగవారు. సెంట్రల్ ప్రావిన్స్‌లోని ప్రధాన ఉద్యోగాలు ఆ వర్గీయులకే దక్కాయి. బెంగాల్లో వహాబీ, ఫరైజీ ఉద్యమాలకు ఢాకా నవాబు నిధులు ఇచ్చాడు. ఈ ఉద్యమాలు పేద ముస్లింలలో మత దురభిమానాన్ని పెంచాయి. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమానికి వారు దూరంగా ఉండడానికి కారణం ఇదే. పైగా ఆ ఉద్యమాలతో ప్రభావితమైనవారు మైమెన్సింగ్, జెస్సోర్ వంటి చోట్ల హిందువుల మీద హత్యాకాండకు పాల్పడ్డారు. నిజానికి 19వ శతాబ్దం ఆఖర్లో దేశంలో పలుచోట్ల హిందూ సంఘాలు ఏర్పడ్డాయి. హిందువుల రక్షణ, సామాజిక, సాంస్కృతిక రక్షణ, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల సాధన వీటి ఉద్దేశం. వాటిలో పేరున్నవి ఆర్య సమాజ్, హిందూ సభ, గోరక్షణి సభ, నగరి ప్రచారిణి సభ. వాటి ఉద్యమం స్థానికం. ఇదే పేరుతో పలు ప్రాంతాలలో సంఘాలు వెలిశాయి. వీటి ఉద్దేశం, స్థానిక సంస్థలు ముస్లింల ఆధిపత్యంలోకి వెళ్లకుండా కాపాడుకోవడమే. మొదటి హిందూసభ 1906 ఆగస్ట్ 4న లాహోర్‌లో ఏర్పడింది. ఆర్య సమాజీయులు, సనాతన ధర్మ పరిరక్షకులు స్థాపించారు. ఈ సంస్థల సమావేశాలలో లాలా లజపతిరాయ్, లాల్‌చంద్, రుచి రావ్‌ు సాహ్ని, రావ్ుభజ్ దత్త, లాలా హన్స్‌రాజ్ వంటివారు పాల్గొనేవారు. 1909లో పంజాబ్ హిందూ సభ ఏర్పడింది. లాహోర్ హిందూ సభ ఏర్పాటుకు కారణం, ముస్లిం లీగ్ అదే సంవత్సరం ఏర్పడినందువల్లనో, కాదో కానీ, పంజాబ్ హిందూ సభ ఏర్పడడానికి తక్షణ కారణం జనాభా లెక్కలు. 1891లో పంజాబ్‌లో 43.8 శాతం ఉన్న హిందూ జనాభా 1911 నాటికి 36.3 శాతానికి వచ్చింది. అదే సమయంలో ముస్లిం జనాభా 5.7 శాతం పెరిగింది. 1911 జనాభా లెక్కల ప్రకారమే హిందువులు 40,000 ఇస్లాంలోకి, 1,20,000 క్రైస్తవంలోకి మారారు. 1909 అక్టోబర్‌లో పంజాబ్ హిందూ సభ నిర్వహించిన తొలి సదస్సుకు మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షుడు. ఆ అక్టోబర్‌లోనే పంజాబ్ హిందూసభ ప్రాంతీయ సమావేశాలు నిర్వహించింది. దీనికి సర్ ప్రతుల్చంద్ర ఛటర్జీ అధ్యక్షత వహించారు. ఆయన పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తిగా, పంజాబ్ విశ్వవిద్యాలయ వీసీగా పనిచేశారు. సంస్కృతం, హిందీ భాషలకు ప్రోత్సాహమివ్వాలని, గోరక్షణ, ఆయుర్వేదకు మద్దతు ఉండాలని, చరిత్ర రచనలో హిందూ యుగానికీ చోటు ఉండాలని ఈ సమావేశాలలో తీర్మానాలు చేశారు. అనతికాలంలోనే ఈ ఉద్యమాన్ని విస్తరించాలని సంకల్పించారు. ఈ ప్రతిపాదన తెచ్చినదే పంజాబ్ హిందూసభ. 1909 నుంచి 1914 వరకు లాహోర్, అమృత్సర్, ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్‌లలో ఆరు పంజాబ్ హిందూ సభ సమావేశాలు జరిగాయి. తరువాత ఉత్తరప్రదేశ్‌లోను ఇతర నగరాలలోను సభలు విస్తరించాయి. పంజాబ్ హిందూ సభ సాయంతోనే ఉత్తరప్రదేశ్‌లో హిందూ సభల విస్తరణకు మాలవీయ కృషి చేశారు. స్థానిక హిందూ సభలను సమన్వయం చేస్తూ ఆయన 1912లో హిందూ విశ్వవిద్యాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ఫలితమే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. పంజాబ్ హిందూ సభ అంబాలా (ఐదో సమావేశం), ఫిరోజ్‌పూర్ (ఆరో సమావేశం)లలో జాతీయ స్థాయిలో హిందువుల కోసం పనిచేసే ఒక సంస్థ ఉండాలని తీర్మానాలు చేసింది. చివరికి 1915 ఏప్రిల్‌లో ఆ ఆలోచనలకు తుదిరూపం వచ్చింది. హరిద్వార్ కుంభమేళా సందర్భంగా సార్వదేశిక హిందూ సభ పేరుతో గోష్ఠి జరిగింది. ఆ గోష్ఠిలో గాంధీ, స్వామి శ్రద్ధానంద ప్రసంగించారు. కాశీంబజార్ మహారాజా మునీంద్రచంద్ర నంది సభకు అధ్యక్షత వహించారు. సార్వదేశిక హిందూ సభకు కేంద్రం డెహ్రాడూన్. ఇదే 1921లో అఖిల భారత హిందూ మహాసభగా మారింది. హిందూ మహాసభలోనూ మధ్య తరగతి విద్యావంతులే కీలకం. ఎక్కువ మంది జాతీయ కాంగ్రెస్‌లోని వారే కూడా. రౌలట్ బిల్లు వ్యతిరేకోద్యమం, గాంధీజీ ఉద్యమ నాయకుడైన సమయంలో జాతీయోద్యమం పట్ల అనుసరించవలసిన వైఖరి గురించి మహాసభకు తొలి పరీక్ష ఎదురైంది. లాలా లజపతిరాయ్, స్వామి శ్రద్ధానంద తదితరులు సహాయ నిరాకరణను సమర్థించారు. మదన్ మోహన్ మాలవీయ సహాయ నిరాకరణను, విద్యాలయాల బహిష్కరణను కూడా వ్యతిరేకించారు. 1922 నాటి గయ సమావేశాలలో హిందూ మహాసభ ‘హిందూ సంఘటన’ నినాదం అందుకుని కొత్త దారికి మళ్లింది. ముస్లిం లీగ్ పోరాడి ప్రత్యేక నియోజకవర్గాలు సాధించుకోగా, హిందూ మహాసభ అఖండ్ హిందుస్థాన్ నినాదం ఇచ్చింది. హిందూ మహాసభ ఆంగ్లేయులకు మద్దతుగా నిలవకపోయినా, గాంధీజీనీ, ఆయన సాగించిన జాతీయోద్యమాన్ని కూడా పూర్తిగా సమర్థించలేదు. నిజానికి హిందూ మహాసభ తన ప్రధాన శత్రువుగా ఆంగ్లపాలనను చూసిందా? లేక అబ్రహామిక్ మతాల పెరుగుదలను చూసిందా? చాలాకాలం స్పష్టత లేదు. ముస్లింలీగ్‌ను ముస్లింలు నమ్మి, కాంగ్రెస్‌ను హిందూ సంస్థగా చూశారు. హిందువులు తమ హక్కులను రక్షించే సంస్థగా కాంగ్రెస్‌ను పరిగణించలేదు. కాంగ్రెస్ హిందూ ముద్ర వేసుకోలేదు. -డా. గోపరాజు నారాయణరావు -
కరోనా ఎఫెక్ట్: గో మూత్రంతో విందు
చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్‌కు ఇప్పటిదాకా ఎలాంటి మందు లేదు. ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు అవసరమైన ఔషదం తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. అయితే.. ఈ వైరస్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేశారు. విందు అనగానే మనకు సాధారణంగా అనేక రకాల వంటకాలు గుర్తుకొచ్చినా ఇక్కడ మాత్రం పింగాణీ కప్పుల్లో గోమూత్రం, పేడను అందించడం విశేషం. గోమూత్రంతో కరోనా వైరస్‌ను రాకుండా చేయవచ్చంటూ గత కొద్ది రోజులుగా స్వామి చక్రపాణి గత కొద్ది రోజులుగా తన వాదనను వినిపిస్తున్నారు. దీనిని బలపరిచే ఉద్దేశ్యంతో ఢిల్లీలో ఒక విందు ఏర్పాటుచేయగా.. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం. అయితే గతంలో ఈ కరోనా వైరస్‌ను గో మూత్రం, ఆవు పేడతో కేన్సర్‌ను నివారించవచ్చని అసోం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ, భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ అసోం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ వాదిస్తున్నారు. గో మూత్రం, ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్యతో గుజరాత్‌లోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో కేన్సర్ పేషెంట్లకు అందిస్తున్నారు. గతంలో కరోనా వైరస్ నివారణకూ ఈ చికిత్స పని చేస్తుందని వారు మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా భారత్‌లో ఇప్పటివరకు 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు పైగా బాధితులు మరణించగా.. 1,45, 810 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ భయాల నేపథ్యంలో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి... షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల ఆఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి: కరోనా ఎఫెక్ట్: పద్మ పురస్కారాలు వాయిదా Achche din 👇🏼 https://t.co/iUZLEwsOW4 — Anurag Kashyap (@anuragkashyap72) March 14, 2020 -
హిందూ మహాసభ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : వీర్‌సావర్కర్, నాథూరాం గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం ప్రచురించిన క్రమంలో తాజాగా రాహుల్ గాంధీపై హిందూ మహాసభ అలాంటి వ్యాఖ్యలనే చేసింది. వీర్‌సావర్కర్‌పై వచ్చిన ఆరోపణలు అర్ధరహితమైనవని అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడనే వాదనలను కూడా తాము విన్నామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా వీర్‌సావర్కర్‌తో నాథూరాం గాడ్సేల శారీరక బంధంపై కాంగ్రెస్ సేవాదళ్ ప్రచురించిన పుస్తకం కలకలం రేపుతోంది. బీజేపీతో పాటు ఆ పార్టీతో గతంలో కలిసి పనిచేసిన శివసేన సైతం సేవాదళ్ తీసుకువచ్చిన వివాదాస్పద పుస్తకాన్ని తప్పుపట్టింది. దేశభక్తుడిగా పేరొందిన గొప్ప నేత వీర్ సావర్కర్‌ను కించపరిచేలా కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం ప్రచురించడం సరైంది కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రజల మనసుల్లో ఉన్నత స్ధానం పొందిన సావర్కర్ ప్రతిష్టను పలుచన చేయాలని చూడటం తగదని హితవు పలికారు. -
అయోధ్య తీర్పు: వారికి 5 ఎకరాలు ఎలా ఇస్తారు?
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సోమవారం హిందూ మహాసభ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ 7 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టులో ముస్లింలు ఇప్పటివరకూ 6 రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. హిందువుల నుంచి తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిందూ మహాసభ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా డిసెంబర్ 2న తొలి రివ్యూ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని జామియత్ ఉలామా-ఏ-హింద్‌కు అధ్యక్షుడైన సయ్యద్ అష్షద్ రషీదీ దాఖలు చేశారు. రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మాణం జరగాలని, ప్రతిగా ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని నవంబర్ 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
అయోధ్య తీర్పు: ‘వారికి పెన్షన్ ఇవ్వాలి’
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కరసేవకులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. 1992లో జరిగిన అయోధ్య ఉద్యమంలో మరణించిన రామభక్తులకు అమరవీరుల హోదా ఇవ్వాలని విఙ్ఞప్తి చేసింది. అదే విధంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ధార్మిక సేనానులుగా గుర్తించి పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరింది. ఇది కరసేవకులు తెలియక చేసిన తప్పిదమని.. కాబట్టి వారిపై కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. ఈ మేరకు హిందూ మహాసభ చీఫ్ స్వామి చక్రపాణి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘నవంబరు 9న రాంలల్లాకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కాబట్టి అక్కడ మందిరం ఉందనే విషయం స్పష్టమైంది. కాబట్టి కరసేవకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. అయెధ్య ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. స్వాతంత్ర్య సమరయోధుల వలె ధార్మిక సేనానులకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు అందించాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేను ఈ మూడు డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నాను’ అని చక్రపాణి లేఖలో పేర్కొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పందగా మారిన రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం విదితమే. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకే చెందుతుందని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలుత సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సున్నీ వక్ఫ్ బోర్డు.. అనంతరం తాము తీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదానికి తెరపడింది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. -
విద్యార్థులకు కత్తుల పంపిణీ..!
ఆగ్రా : స్వాతంత్ర సమరయోధుడు, హిందూ మహాసభ దిగ్గజ నాయకుడు వీర్ సావర్కర్ (వినాయక్ దామోదర్ సావర్కర్) జయంత్యుత్సవాలు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి. దానిలో భాగంగా అఖిల భారత హిందూ మహాసభ నాయకులు ఆగ్రాలో 10, 12 తరగతుల పిల్లలకు కత్తుల్ని పంపిణీ చేశారు. హిందూ సమాజం సాధికారత సాధించేందుకు.. ముఖ్యంగా యువత ఆత్మరక్షణ, దేశ రక్షణకు జాగురూకులై ఉండేందుకు కత్తులను పంపిణీ చేస్తున్నామని హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్ చెప్పారు. విద్యార్థులకు కత్తులతో పాటు భగవద్గీత ప్రతులను కూడా అందిస్తున్నామని తెలిపారు. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆత్మ రక్షణ కోసం యువతులకు ఆయుధ శిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఇక సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ప్రజల్లో దేశభక్తి రగిల్చి ఎందరికో ధీరోదాత్తమైన స్ఫూర్తిని అందించిన సావర్కర్ కృషి మరువలేనిదని అన్నారు. జాతీనిర్మాణం కోసం పనిచేసిన ఆయన సదాస్మరణీయుడని ట్వీటర్లో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో హిందూకీకరణ.. హిందువుల్లో సైనికీకరణ.. అనేది సావర్కర్ నినాదం. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఎన్నికై సావర్కర్ కలను నెరవేర్చారు. ఇక రెండోది. దేశ రక్షణ కోసం ప్రతి హిందువు సైనికుడిగా మారాలి. అందుకోసమే.. యువతకు కత్తులను అందిస్తున్నాం’అని హిందూ మహాసభ అదికార ప్రతినిధి అశోక్ పాండే చెప్పారు. దేశంలో ఇప్పటికే మతపరమైన దాడులు జరగుతున్న నేపథ్యంలో అఖిల భారత హిందూ సభ అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. We bow to Veer Savarkar on his Jayanti. Veer Savarkar epitomises courage, patriotism and unflinching commitment to a strong India. He inspired many people to devote themselves towards nation building. pic.twitter.com/k1rmFHz250 — Narendra Modi (@narendramodi) May 28, 2019 -
గాడ్సే పుట్టిన రోజు వేడుకలు.. 6గురు అరెస్ట్
గాంధీనగర్ : మహాత్మున్ని చంపిన గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సూరత్‌కు చెందిన హిందూ మహాసభ కార్యకర్తలు.. లింబాయత్ ప్రాంతంలోని సూర్యముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గాడ్సే ఫోటో చుట్టూ దీపాలు వెలిగించి.. పూజలు చేశారు. స్వీట్లూ పంచుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. అంతటితో ఊరుకోక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘మహాత్మ గాంధీని చంపిన నేరస్థుడికి పుట్టిన రోజుల వేడుకలు నిర్వహిచండం నిజంగా చాలా విచారకరం. ఇలాంటి పనులు వల్ల దేశ ప్రజలు మనోభావాలు దెబ్బ తింటాయి. ఫలితంగా గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ చర్యలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశామ’ని తెలిపారు. ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్య మాట్లాడుతూ.. ‘గాంధీజిని అవమానించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిదే. బుద్ధి లేని వారే ఇలాంటి తలకు మాసిన పనులు చేస్తారు. వారికి మహాత్ముడి ఆదర్శాలు ఎన్నటికి అర్థం కావ’న్నారు. -
హే రాం.. ఇదేం అవమానం
అలీగఢ్: వర్థంతి రోజునే జాతిపితకు ఘోర అవమానం జరిగింది. 71వ వర్థంతి సందర్భంగా జాతి యావత్తు మహాత్ముడికి నివాళులు అర్పిస్తున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో హిందూ మహాసభ సంస్థ గాంధీని అమానించింది. మహాత్మ గాంధీ హత్యోదంతాన్ని ప్రదర్శించి హిందూ మహాసభ కార్యకర్తలు తమ పైత్యం చూపించారు. అక్కడితో ఆగకుండా హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజ శకున్ పాండే.. మహాత్ముడి దిష్టిబొమ్మను కృత్రిమ తుపాకీతో పదే పదే కాలుస్తూ పైశాచిక ఆనందం పొందారు. తుపాకీ పేల్చగానే దిష్టిబొమ్మ నుంచి రక్తం వస్తున్నట్టుగా చూపించారు. తర్వాత ఆమె అనుచరులు కూడా ఇదేవిధంగా చేశారు. అనంతరం నాథురాం గాడ్సే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాథురాం గాడ్సేకి అనుకూలంగా నినాదాలు చేశారు. పరస్పరం స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ ఉదంతంపై గాంధేయ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతిపితను అవమానించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం గాంధీ వర్థంతిని హిందూ మహాసభ శౌర్య దివస్ లేదా అమరుల దినంగా జరుపుతోంది. పూజ శకున్ పాండేకు నిజమైన హిందూ మహాసభకు సంబంధం లేదని తెలుస్తోంది. Watch: Hindu Mahasabha recreates Mahatma Gandhi’s assassination; shoots Gandhi's effigy pic.twitter.com/jhCKmvjAMe — Afroz Alam (@AfrozJournalist) January 30, 2019 -
‘కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని నిలిపేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై మరోమారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏడీహెచ్‌ఎం) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ కోణంలో కుమారస్వామికి గవర్నర్ పిలుపు కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఏడీహెచ్‌ఎం తన పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా సోమవారం సాయంత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించేది, లేనిది తెలియాల్సిఉంది. గతవారం యడ్యూరప్పను సీఎం చేసిన ఇదే కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై జేడీయూ-కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఫలితాంగా మే 19న అసెంబ్లీలో బలపరీక్షలో జరగడం, డివిజన్ ఓటింగ్‌కు ముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే గవర్నర్.. కుమారస్వామినా ఆహ్వానించడం తెలిసిందే. ఈ నెల 23న బెంగళూరులో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
నాథూరాం గాడ్సేకు గుడి కట్టేశారు!
భోపాల్: హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ.. మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు ఘన నివాళులర్పించింది. గాడ్సే వర్థంతి సందర్భంగా గురువారం గ్వాలియర్‌లో ప్రతేక కార్యక్రమాన్ని నిర్వహించిన మహాసభ.. గాడ్సే అర్ధవిగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి.. శ్రద్ధాంజలి ఘటించింది. అంతేకాకుండా గాడ్సేకు గుడి కూడా కట్టినట్టు వెల్లడించింది. గ్వాలియర్‌లో నాథూరాం గాడ్సేకు గుడి కట్టేందుకు హిందూ మహాసభ ప్రయత్నించగా.. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అనమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 32 అంగుళాల పొడవున్న గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన హిందూ మహాసభ.. ఆయనకు గుడి కట్టాలన్న తమ అభ్యర్థనను జిల్లా యంత్రాంగం నిరాకరించిందని, అయినప్పటికీ తమ సొంత స్థలంలో గాడ్సే విగ్రహం ఏర్పాటుచేసి.. గుడి కట్టామని తెలిపింది. మహాసభకు చెందిన సొంత స్థలంలో గుడి కట్టినందున దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. -
‘ఐఏఎస్‌ల ప్రేమ పెళ్లి రద్దు చేయండి’
న్యూఢిల్లీ: సివిల్స్ 2015 టాప్ ర్యాంకర్ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్ అతహార్ ఆమిర్ ఉల్ షపీ ఖాన్ల ప్రేమ వివాహానికి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వారిద్దరి ప్రేమ వివాహాన్ని రద్దు చేయాలని, లేదంటే ఖాన్‌ను మతం మార్చుకునేందుకు ఒప్పించాలని, అందుకు అతడు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేయాలని టీనా దాబీ తల్లిదండ్రులను కోరుతూ ఆఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్ శర్మ ఓ లేఖ రాశారు. ‘మీ కుటుంబం తీసుకున్న నిర్ణయం లవ్ జిహాద్‌ను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఒక వేళ వారిద్దరికి నిజంగా పెళ్లి చేసుకోవాలని బలంగా ఉంటే మాత్రం ఖాన్‌ను హిందూ మతంలోకి ఖచ్చితంగా మారాలి. మార్పిడి తర్వాతే వివాహం జరగాలి. ఈ కార్యక్రమానికి మా సంస్థ సభ్యులు మీకు సహాయం చేస్తారు’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ ప్రియమైన జశ్వంత్ దాబిగారు.. 2015 ఐఏఎస్ పరీక్షల్లో టాపర్ టీనా నిలవడాన్ని చూసి మేమంతా సంతోషిస్తున్నాం. ఖాన్‌ను పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించిన నిర్ణయం మమ్మల్ని దిగ్బాంతికి గురి చేసింది. ఈ విషయంలో మేం చాలా విచారంగా ఉన్నాం. మీకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ముస్లింలు అంతా లవ్ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో ముస్లిం మతంలోకి మార్చేందుకు వివాహం చేసుకుంటున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకోవడమే ఆ ఇద్దిరికి ముఖ్యం అనిపిస్తే ముందు ఖాన్‌ను మతమార్పిడి జరగాలి’ అని కూడా ఆయన అన్నారు. పొలిటికల్ సైన్స్‌లో యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్‌ను సాధించిన టీనా ఎలాంటి వ్యూహం లేకుండానే తొలి ప్రయత్నంలోనే సివిల్స్(2015)లో తొలి ర్యాంక్ ను సాధించింది. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమిర్‌ను కలుసుకుంది. ఆ కార్యక్రమంలోనే వారిద్దరి ప్రేమకు పునాది పడింది. ఇటీవలె వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించారు. టీనా తండ్రి జశ్వంత్ దాబీ ఢిల్లీ టెలికాం విభాగంలో, తల్లి హిమాలీ దాబీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. (చదవండి....టాప్ ర్యాంకర్ల ప్రేమకథ.. ట్విస్ట్) -
'ఈ రోజుల్లో అలా నడుచుకోవడం కుదురుతుందా'
మీరట్: 'ఈ రోజుల్లో గాంధీజీ అడుగుజాడల్లో నడవడం కుదురుతుందా. ఇటీవల మన భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నా ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. మనం ఒకవేళ గాంధీజీ చూపిన మార్గంలోనే నడిస్తే.. సర్జికల్ దాడులు జరగకూడదు' అని అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ ఇక్కడ గాడ్సే విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడారు. ఆదివారం గాంధీ జయంతిని అఖిల భారతీయ హిందూ మహాసభ ధిక్కార్ దివస్‌గా జరుపుకుంది. ఈ సందర్భంగా మీరట్‌లోని సంస్థ కార్యాలయంలో గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత హిందూ మహాసభ 2014 లోనే గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. పోలీసులు, వివిధ సంఘాలు ప్రతిఘటించడంతో విగ్రహ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. అయితే.. ఈసారి గాంధీ జయంతి సందర్భంగా హిందూ మహాసభ తన పంతం నెరవేర్చుకుంది. గాంధీజీ అడుగుజాడల్లో నడవడం మానేసి అందరూ గాడ్సేను ఆరాధించడం మొదలుపెట్టాలని ఈ సందర్భంగా అశోక్ శర్మ మాట్లాడారు. -
'ప్రేమకు సరైన నిర్వచనం చెబుతాం'
న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు లవర్స్ సిద్దమవుతుండగా వారికి 'పెళ్లి' చేసేందుకు హిందూ సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ప్రేమికులు కనబడితే కళ్యాణం చేస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. ఇందుకోసం సుశిక్షితులైన 45 మంది వాలంటీర్లను రంగంలోకి దింపనున్నట్టు హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ తెలిపారు. పార్కులు, ధియేటర్లు, రెస్టారెంట్ లు ఇతర ప్రాంతాల్లో తమ వాలంటీర్లను మొహరించనున్నట్టు చెప్పారు. విశృంఖలత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. ప్రేమికులకు తమ వాలంటీర్లు ప్రేమకు సరైన నిర్వచనం చెబుతారని వెల్లడించారు. ప్రేమకు తాము వ్యతిరేకం కాదని, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడితనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కులం, తల్లిదండ్రులు ఒత్తిడి తదితర కారణాలతో బాధపడే ప్రేమికులకు పెళ్లిళ్లు చేయాలని భావిస్తున్నామన్నారు. అయితే హిందూ మహాసభ హెచ్చరికలను ఖతారు చేయబోమని, తామేం తప్పు చేయడం లేదని ప్రేమికులు అంటున్నారు.