‘ఐఏఎస్ల ప్రేమ పెళ్లి రద్దు చేయండి’
న్యూఢిల్లీ: సివిల్స్ 2015 టాప్ ర్యాంకర్ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్ అతహార్ ఆమిర్ ఉల్ షపీ ఖాన్‌ల ప్రేమ వివాహానికి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వారిద్దరి ప్రేమ వివాహాన్ని రద్దు చేయాలని, లేదంటే ఖాన్‌ను మతం మార్చుకునేందుకు ఒప్పించాలని, అందుకు అతడు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేయాలని టీనా దాబీ తల్లిదండ్రులను కోరుతూ ఆఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్ శర్మ ఓ లేఖ రాశారు.
‘మీ కుటుంబం తీసుకున్న నిర్ణయం లవ్ జిహాద్‌ను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఒక వేళ వారిద్దరికి నిజంగా పెళ్లి చేసుకోవాలని బలంగా ఉంటే మాత్రం ఖాన్‌ను హిందూ మతంలోకి ఖచ్చితంగా మారాలి. మార్పిడి తర్వాతే వివాహం జరగాలి. ఈ కార్యక్రమానికి మా సంస్థ సభ్యులు మీకు సహాయం చేస్తారు’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ ప్రియమైన జశ్వంత్ దాబిగారు.. 2015 ఐఏఎస్ పరీక్షల్లో టాపర్ టీనా నిలవడాన్ని చూసి మేమంతా సంతోషిస్తున్నాం. ఖాన్ను పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించిన నిర్ణయం మమ్మల్ని దిగ్బాంతికి గురి చేసింది.
ఈ విషయంలో మేం చాలా విచారంగా ఉన్నాం. మీకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ముస్లింలు అంతా లవ్ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో ముస్లిం మతంలోకి మార్చేందుకు వివాహం చేసుకుంటున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకోవడమే ఆ ఇద్దిరికి ముఖ్యం అనిపిస్తే ముందు ఖాన్‌ను మతమార్పిడి జరగాలి’ అని కూడా ఆయన అన్నారు.
పొలిటికల్ సైన్స్‌లో యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్‌ను సాధించిన టీనా ఎలాంటి వ్యూహం లేకుండానే తొలి ప్రయత్నంలోనే సివిల్స్(2015)లో తొలి ర్యాంక్ ను సాధించింది. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమిర్‌ను కలుసుకుంది. ఆ కార్యక్రమంలోనే వారిద్దరి ప్రేమకు పునాది పడింది. ఇటీవలె వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించారు. టీనా తండ్రి జశ్వంత్ దాబీ ఢిల్లీ టెలికాం విభాగంలో, తల్లి హిమాలీ దాబీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. (చదవండి....టాప్ ర్యాంకర్ల ప్రేమకథ.. ట్విస్ట్)