Athar Aamir ul Shafi Khan
-
‘ఐఏఎస్‌ల ప్రేమ పెళ్లి రద్దు చేయండి’
న్యూఢిల్లీ: సివిల్స్ 2015 టాప్ ర్యాంకర్ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్ అతహార్ ఆమిర్ ఉల్ షపీ ఖాన్ల ప్రేమ వివాహానికి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వారిద్దరి ప్రేమ వివాహాన్ని రద్దు చేయాలని, లేదంటే ఖాన్‌ను మతం మార్చుకునేందుకు ఒప్పించాలని, అందుకు అతడు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేయాలని టీనా దాబీ తల్లిదండ్రులను కోరుతూ ఆఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్ శర్మ ఓ లేఖ రాశారు. ‘మీ కుటుంబం తీసుకున్న నిర్ణయం లవ్ జిహాద్‌ను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఒక వేళ వారిద్దరికి నిజంగా పెళ్లి చేసుకోవాలని బలంగా ఉంటే మాత్రం ఖాన్‌ను హిందూ మతంలోకి ఖచ్చితంగా మారాలి. మార్పిడి తర్వాతే వివాహం జరగాలి. ఈ కార్యక్రమానికి మా సంస్థ సభ్యులు మీకు సహాయం చేస్తారు’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ ప్రియమైన జశ్వంత్ దాబిగారు.. 2015 ఐఏఎస్ పరీక్షల్లో టాపర్ టీనా నిలవడాన్ని చూసి మేమంతా సంతోషిస్తున్నాం. ఖాన్‌ను పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించిన నిర్ణయం మమ్మల్ని దిగ్బాంతికి గురి చేసింది. ఈ విషయంలో మేం చాలా విచారంగా ఉన్నాం. మీకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ముస్లింలు అంతా లవ్ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో ముస్లిం మతంలోకి మార్చేందుకు వివాహం చేసుకుంటున్నారు. ఒక వేళ పెళ్లి చేసుకోవడమే ఆ ఇద్దిరికి ముఖ్యం అనిపిస్తే ముందు ఖాన్‌ను మతమార్పిడి జరగాలి’ అని కూడా ఆయన అన్నారు. పొలిటికల్ సైన్స్‌లో యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్‌ను సాధించిన టీనా ఎలాంటి వ్యూహం లేకుండానే తొలి ప్రయత్నంలోనే సివిల్స్(2015)లో తొలి ర్యాంక్ ను సాధించింది. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమిర్‌ను కలుసుకుంది. ఆ కార్యక్రమంలోనే వారిద్దరి ప్రేమకు పునాది పడింది. ఇటీవలె వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించారు. టీనా తండ్రి జశ్వంత్ దాబీ ఢిల్లీ టెలికాం విభాగంలో, తల్లి హిమాలీ దాబీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. (చదవండి....టాప్ ర్యాంకర్ల ప్రేమకథ.. ట్విస్ట్) -
టాప్ ర్యాంకర్ల ప్రేమకథ.. ట్విస్ట్
‘1 వచ్చి.. 2పై వాలె.. ’ అని చంద్రబోస్ రాసిన పాట గుర్తుందా? ఆయన సరదాగా రాసిన పాట ఐఏఎస్ టాపర్ల విషయంలో నిజమైంది. 2015 సివిల్స్‌లో టాప్ ర్యాంకర్ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్ అతహార్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్లు ప్రేమలో పడ్డారు. కులం, మతం, ప్రాంతం వేటికవే భిన్న నేపథ్యాలున్న ఈ ఇద్దరి ప్రేమకథ ఐఏఎస్ ఫెలిసియేషన్ సెర్మనీలో తొలిచూసులోనే మొదలై, అనేక ట్విట్లులతో ఐఏఎస్ అకాడమీలో సహజీవనం మీదుగా నిశ్చితార్థం వైపుకు వెళుతోంది.. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల టీనా దాబీ చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభకనబర్చేది. కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ స్కూల్, లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదువుకుంది. పొలిటికల్ సైన్స్‌లో యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్‌ను సాధించిన ఆమె ప్రత్యేక స్ట్రాటజీ ఏదీ లేకుండానే ప్రిపేర్ అయి తొలి ప్రయత్నంలోనే సివిల్స్(2015)లో మొదటిర్యాంక్ సాధించింది. తండ్రి ఢిల్లీ టెలికాం విభాగంలో, తల్లి హిమాలీ దాబీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమిర్‌ను మొదటిసారిగా కలుసుకుంది. ఫస్ట్ డేనే ఆమిర్ ఖాన్ ఆమెను ఇంప్రెస్ చేసేప్రయత్నం చేశాడు.. పాకిస్థాన్ సరిహద్దుకు సమీప అనంతనాగ్ జిల్లాలోని దేవీపురా ఆమిర్ సొంత ఊరు. జమ్ముకశ్మీర్ నుంచి సివిల్స్‌కు ఎంపికైన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. ఆమిర్ తండ్రి అక్కడి ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్. తల్లి గృహిణి. 2014లో 560 ర్యాంక్ సాధించిన ఆమిర్.. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్‌కు ఎంపికై లక్నోలో శిక్షణ పొందారు. అయితే ఐఏఎస్ సాధించాలనే అతని కల రెండో ప్రయత్నంలో(2015లో) నెరవేరింది. ఆలిండియా రెండో ర్యాంక్ సాధించి టీనా తర్వాతి స్థానంలో నిలిచాడు. ఫెసిలియేషన్ సెర్మనీలో మొదటిసారి టీనాను కలుసుకున్నాడు.. ‘మే 11న సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్(నార్త్‌బ్లాక్)లో ఉదయం ఐఏఎస్ ర్యాంకర్ల అభినందన సభ జరిగింది. సాయంత్రానికి ఆమిర్ ను మా ఇంటి ముందు చూసేసరికి షాక్ తిన్నా. తను నిర్మొహమాటంగా చెప్పేశాడు.. ‘చూడగానే ప్రేమ పుట్టింది..లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని! అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసుకోలేకపోయా. కొద్ది రోజుల తర్వాత ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీలో ట్రైనీలుగా చేరాం. మరికొన్నాళ్లకు కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చాం. ఆ టైమ్.. నిజంగా సో స్వీట్! ఆమిర్, నేను తెగ తిరిగేవాళ్లం. మా స్టేటస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాళ్లం. అలా చేయడమే పొరపాటని తర్వాత తెలిసింది.. మా ఇద్దరి మతాలు, కులాలు, ప్రాంతాలు వేరు. అయినా ఆ విషయంలో మాకు పట్టింపులులేవు. కానీ సోషల్ మీడియాలో కొందరు దాన్ని రచ్చచేసే ప్రయత్నం చేశారు. పరాయి మతస్తుడితో చనువేంటని కొందరు, దళిత బిడ్డవు కాబట్టి అణగారిన వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఇదంతా ఓ 5 శాతం మందే. ఆమీర్‌కు, నాకు పరిచయం ఉన్న వాళ్లలో 95 శాంతం మంది మా ప్రేమను అభినందించారు. అటు మా పేరెంట్స్ కూడా అభ్యంతరపెట్టలేదు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే నిశ్చితార్థం చేసుకుంటాం. పెళ్లి ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. అంబేద్కర్ నాకు ఆదర్శం. ఆయన చూపిన బాటలో దేశానికి మేలు చేయాలనేది నా అభిలాష.. ఆమీర్ కోరిక కూడా ఇదే’అని టీనా దాబీ చెప్పారు. -
కల్లోల ప్రాంతం నుంచి సివిల్స్ టాపర్!
నిత్యం మిలిటెన్సీ సమస్యతో అట్టుడికిపోయే కశ్మీర్ నుంచి ఓ అభ్యర్థి ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించాడు. కశ్మీర్‌కు చెందిన అథార్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో సెంకండ్ టాపర్‌గా నిలిచాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని మాండి ఐఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన ఆమిర్ రెండో ప్రయత్నంలోనే టాప్-2 ర్యాంకు సాధించాడు. గత ఏడాది సివిల్స్‌లో అతడికి 560 ర్యాంకు రాగా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్)కు ఎంపికయ్యాడు. ఈసారి తనకు మంచి ర్యాంకు వస్తుందని ఆశించానని, కానీ ఏకంగా టాప్ సెంకండ్ ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆమిర్ చెప్పాడు. కశ్మీర్ నుంచి ఇప్పుడు చాలామంది అభ్యర్థులు సివిల్స్‌కు ప్రయత్నిస్తున్నారని, ఇది సానుకూల ధోరణి అని అతను అభిప్రాయపడ్డాడు. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఉత్తమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని ఆమిర్ ధీమాగా చెప్పాడు. తన తాత తనకు స్ఫూర్తి అని తెలిపాడు.