కల్లోల ప్రాంతం నుంచి సివిల్స్ టాపర్!
నిత్యం మిలిటెన్సీ సమస్యతో అట్టుడికిపోయే కశ్మీర్ నుంచి ఓ అభ్యర్థి ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించాడు. కశ్మీర్‌కు చెందిన అథార్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో సెంకండ్ టాపర్‌గా నిలిచాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని మాండి ఐఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన ఆమిర్ రెండో ప్రయత్నంలోనే టాప్-2 ర్యాంకు సాధించాడు. గత ఏడాది సివిల్స్‌లో అతడికి 560 ర్యాంకు రాగా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్)కు ఎంపికయ్యాడు.
ఈసారి తనకు మంచి ర్యాంకు వస్తుందని ఆశించానని, కానీ ఏకంగా టాప్ సెంకండ్ ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆమిర్ చెప్పాడు. కశ్మీర్ నుంచి ఇప్పుడు చాలామంది అభ్యర్థులు సివిల్స్‌కు ప్రయత్నిస్తున్నారని, ఇది సానుకూల ధోరణి అని అతను అభిప్రాయపడ్డాడు. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఉత్తమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని ఆమిర్ ధీమాగా చెప్పాడు. తన తాత తనకు స్ఫూర్తి అని తెలిపాడు.