స్ఫూర్తి
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్‌ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!
‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్‌ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె.
చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.
‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్‌ఐసీలో ఉద్యోగం చేసేది.
అక్క డిప్రెషన్‌తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది.
తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.
‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష.
Comments
Please login to add a commentAdd a comment