పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడో ఒక్క చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని మరువకముందే తాజాగా అస్సాంలో మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
అస్సాంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నాగావ్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు వద్ద వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డుపై వివస్త్రగా పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రక్షించి జిల్లాలోని డింగ్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు నిరసనగా నేడు విద్యార్ధి సంఘాలు స్థానిక ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment