Civil Services Exam
-
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్‌ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్‌ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్‌తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
పండక్కి ఊరెళ్తున్నారా? మీ ఇంటి తాళాన్ని యజమానికి ఇచ్చి వెళ్తున్నారా?
అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? పండుగలకు, పబ్బాలకు ఊరెళుతున్నారా? ఊరు వెళ్లే సమయంలో మీ ఇంటికి తాళం వేస్తున్నారా? ఆ తాళం ‘కీ’ని మీ ఇంటి యజమానికి ఇచ్చి వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.తూర్పు ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో కలకలం రేగింది. ఓ ఇంటి యజమాని కుమారుడు దారుణానికి ఒడిగాట్టాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యార్థిని బెడ్ రూం, బాత్రూంలలో కెమెరాల్ని అమర్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? తూర్పు ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ నిమిత్తం షకర్పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. అయితే మూడు నెలల క్రితం యువతి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లింది. వెళ్లే ముందు ఇంటి తాళాన్ని ఇంటి యజమానికి ఇచ్చి వెళ్లింది. అప్పుడే యజమాని కుమారుడు కరణ్ తన దుర్భుద్దిని చూపించాడు.ఏదో జరుగుతుంది..యువతి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో బెడ్రూమ్లోని బల్బులలో, బాత్రూంలో ఉండే బల్బులలో స్పై కెమెరాల్ని అమర్చాడు. ఊరెళ్లిన యువతి మళ్లీ తిరిగి వచ్చింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన చుట్టూ ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తుండేంది. కానీ ఏం జరుగుతుందో తెలిసేది కాదు.👉చదవండి : సీఎం యోగి కొత్త రూల్స్ వాట్సప్‌తో బట్టబయలుఈ నేపథ్యంలో ఓ రోజు ఆమె అనుమానం నిజమైంది. ఎవరో అగంతకులు తన వాట్సప్‌ను ల్యాప్‌ట్యాప్‌లో లాగిన్ అయినట్లు గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన యువతి వాట్సప్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తన పరిసరాల్ని, ఇంట్లోని ప్రతి అణువణువునూ పరీక్షించింది. చివరిగా తాను అద్దెకు ఉంటున్న ఇంటి బెడ్రూం, బాత్రూం బల్బుల్లో స్పై కెమెరాల్ని గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెడ్ రూం, బాత్రూంలో మూడు స్పై కెమెరాలుసమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి గురించి,ఇంటి యజమాని గురించి ఆరా తీశారు. ఇంట్లో కరెంట్ పనులు చేయించాలనిపోలీసుల విచారణలో ఇంటి యజమానికి కుమారుడు ఆకాష్..ఆ స్పై కెమెరాల్ని అమర్చినట్లు నిర్ధారించారు. నిందితుడు అమర్చిన స్పై కెమెరాలో రికార్డయిన డేటాను ఆన్లైన్లో చూసేందుకు వీలు లేదు. ఆ డేటా అంటే స్పై కెమెరాల్లో ఉన్న మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయ్యేది. మెమోరీ కార్డ్‌లలో స్టోరేజీ అయిన డేటాను చూసేందుకు ఇంట్లో కరెంట్ పని ఉందని పలు మార్లు తాను రహస్యంగా ఉంచిన మెమోరీ కార్డ్‌లను తీసుకున్నట్లు నిందితుడు ఆకాష్ ఒప్పుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ స్టడీ హాల్స్‌లో భద్రత కరువు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఢిల్లీ వెళ్లేవారు. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్.. ముఖ్యంగా అశోక్‌నగర్ పరిసర ప్రాంతాలు సివిల్స్ ప్రిపరేషన్‌కు అడ్డాగా మారింది. సివిల్ సర్వీసెస్‌తో పాటు గ్రూప్–1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ దినదిన గండంగా అభ్యర్థులు గడుపుతున్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు యమ పాశాల్లా స్టడీ హాల్స్ చుట్టూ విద్యుత్ వైర్లు.. అగ్గిపెట్టెల్లాంటి గదులు.. ఆకతాయిల వేధింపులు.. పుస్తకాలతో పాటు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ నీటమునిగి విద్యార్థులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఇక్కడి స్టడీ హాళ్ల పరిస్థితులపై చర్చ జరుగుతోంది. అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో.. స్టడీ హాల్స్‌లో చదువుకుంటే ఏకాగ్రత ఉండదేమోనన్న బెంగతో లైబ్రరీ, స్టడీ సెంటర్లలో చాలా మంది చేరుతుంటారు. ఇదే అదునుగా వారి ఆశలను క్యాష్ చేసుకునేందుకు వీధివీధినా మూడు, నాలుగు స్టడీ హాల్స్ వెలిశాయి. అగ్గిపెట్టెల మాదిరిగా ఉన్న గదుల్లో ఇరుకుగా, గాలి వెలుతురు లేకుండా ఒక్కరిద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు, నలుగురిని కూర్చోబెడుతున్నారు. ఎండాకాలం వస్తే అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. ఏసీ స్టడీ హాల్స్ పేరిట అదనపు చార్జీలు వేస్తూ అభ్యర్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటారు. ఫైర్ సేఫ్టీ పాటించేదెవరు? చాలా స్టడీహాల్స్ లోపలికి ఇరుకైన మెట్ల ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి స్టడీ హాల్స్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ప్రమాదం జరిగితే తప్పించుకునే పరిస్థితులే కానరావట్లేదు. అలాంటి ప్రాంతాల్లో అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. విద్యుత్ వైర్లకు దగ్గరగా.. చాలా స్టడీ హాల్స్ లేదా లైబ్రరీలను నివాస సముదాయాల్లోనే ఏర్పాటు చేశారు. ఎక్కువగా రెండో అంతస్తులో వీటిని నడుపుతున్నారు. సాధారణంగా నివాస సముదాయాల్లో ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు నడపడం చట్ట విరుద్ధం. కొన్నింటికి ఎలాంటి బోర్డులు పెట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా గుట్టుగా నడిపించేస్తున్నారు. ఈ భవనాలకు దగ్గరి నుంచే ప్రమాదకరంగా హై వోల్టేజీ ఉన్న ఎక్స్టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరికైనా ఆ వైర్లు తగిలితే ఎవరు బాధ్యత వహించాలన్నది పెద్ద ప్రశ్న. ఇక, కొన్ని ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను వైన్ షాపుల పక్కనే ఏర్పాటు చేశారు. అదీ మెయిన్ రోడ్డుపైనే ఇలా ఏర్పాటు చేస్తే పట్టించుకున్న వారే లేరు. వీధి లైట్లు లేక ఇబ్బందులు.. అభ్యర్థులు పొద్దుపోయే వరకు స్టడీ హాల్స్, లైబ్రరీల్లో చదువుకుని హాస్టల్ లేదా వారి గదులకు వెళ్తుంటారు. వెళ్లే దారిలో చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు లేక యువతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు రోడ్లపై అడ్డాలు వేసుకుని, వచ్చి పోయే అమ్మాయిలపై కామెంట్స్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. బైక్‌లపై వారి ముందు స్టంట్లు చేస్తున్నారు. అమ్మాయిల భద్రత గాలికి.. హాస్టళ్లలో అమ్మాయిల భద్రత గాలికొదిలేశారు. ఇటీవల ఓ అమ్మాయిల హాస్టల్లోకి దర్జాగా ఓ దుండగుడు ప్రవేశించి, అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తమ చదువులకు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు, హాస్టల్‌కు చెడ్డ పేరు వస్తుందని యాజమన్యం మిన్నకుండి పోయింది. ఇక, కొత్తగా నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్ పై నుంచి పక్కనే ఉన్న భవనాల్లోకి మద్యం తాగి బాటిళ్లను విసిరేసే వారని మరికొందరు వాపోయారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చదివేకంటే ఇంటికి వెళ్లిపోవడమే ఉత్తమమని, చాలామంది అమ్మాయిలు సొంతూళ్లకు వెళ్లిపోయారు.జోరుగా గంజాయి అమ్మకాలు అశోక్ నగర్, గాంధీనగర్, హిమాయత్‌నగర్, చిక్కడపల్లిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే చదువుకునే వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం ఆకతాయిలకు అవకాశంగా మారింది. ఆంధ్ర కేఫ్ రోడ్డు, ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో చాలా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక, షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చేందుకు స్టడీహాళ్ల మధ్య ఎస్‌వోఎస్ బూత్ పోల్స్‌ను అమర్చాలని కోరుతున్నారు. దీంతో వెంటనే ఫిర్యాదు చేసి, సహాయం పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు.టౌన్‌ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలం.. నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. సెల్లార్‌ను పార్కింగ్‌కు బదులు వ్యాపార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి భవనాలు అశోక్‌నగర్‌లో కోకొల్లలు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడే హడావుడి చేయడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. -
వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్.. పోలీసులకు దివ్యాంగుల ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్‌లు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె‘ఎక్స్’వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా.. దివ్యాంగులపై అనుచిత వాక్యాలు చేసినా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అకాడమి నిర్వాహకురాలు, మెంటర్, కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.‘స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. అసెంబ్లీ ముట్టడిస్తాం. దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ప్రభుత్వం ఆలోచన లేదా.. ఆమె మాటలా?. ఆమె మెంటల్‌గా అప్సెట్ అయ్యారు. తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా? చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు.... స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి. అలాగే.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలి. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారామె. ఇప్పటికే నాతో చాలా విద్యార్థులు చర్చించారు. ఈ విషయాన్ని కచ్చితంగా ఖండించాలి. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలి. మాకు న్యాయం జరగాలి’’ అని అన్నారు. మరోపైపు.. తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ‘ఎక్స్’ వేదికగానే స్పందించారు. ఐపీఎస్/ ఐఎఫ్‌ఒఎస్‌తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్, ఐఎఫ్‌ఒఎస్ లాగే ఐఏఎస్‌లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. అంతేకానీ సున్నిత స్వభావానికి నా మనసులో చోటు లేదనడం కరెక్ట్ కాదు’ అని తెలిపారు.See a lot of outrage on my timeline. I suppose addressing the elephant in the room gets you that reaction. Would request the Rights Activists to also examine why this quota has still not been implemented in the IPS/ IFoS and certain sectors like defence. My limited point is…— Smita Sabharwal (@SmitaSabharwal) July 22, 2024 -
దేశసేవకు మించింది లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దేశ సేవకు మించింది లేదు.. సమాజానికి మేలు చేసే పనితో పోలిస్తే డబ్బుకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు.. అందుకే, మూడు రెట్ల అధిక జీతం వదులుకొని సివిల్ సర్వీస్‌లో చేరబోతున్నాను.. పేదలు, సమాజం కోసం పాటుపడేందుకు, వారిని ఆదుకునేందుకు సివిల్స్ గొప్ప వేదిక.. ఐదేళ్ల క్రితం మొదలైన సివిల్స్ వేట మొన్నటి ఫలితాలతో పూర్తయింది. పేదరికం, కుటుంబ సమస్యలు సివిల్స్ సాధనలో అసలు ఆటంకాలే కావు.. ప్రణాళిక ప్రకారం చదివితే సాధించడం కష్టమేమీ కాదు’ అన్నారు సివిల్స్ ఆలిండియా 27వ ర్యాంకర్ నందాల సాయికిరణ్. తాను సివిల్స్‌కు ఎంపికై న తీరు, విజయం సాధించిన క్రమాన్ని బుధవారం తన స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. కల కోసం శ్రమించాను.. సివిల్ సర్వీసెస్‌లో చేరాలన్న నా కల కోసం చాలా శ్రమించాను. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. కానీ, ఏ ఉద్యోగం చేయాలన్నది మాత్రం అప్పుడే నిర్ణయించుకోలేదు. ఆర్ఈసీ వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. మంచి ప్యాకేజీతో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అయినా, ఏదో వెలితి. ఆ సమయంలో ఐఏఎస్ అయితే దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచించాను. నా సివిల్స్ కలకు అక్కడే బీజం పడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మా నాన్న కాంతారావు చేనేత కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీలు కార్మికురాలు. మాది మధ్య తరగతి కుటుంబం అని నేను ఏనాడూ కలత చెందలేదు. వారి శక్తి మేరకు నన్ను, నా సోదరిని బాగా చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం.. నేటి యువతకు సివిల్స్ కష్టమేమీ కాదు. కాకపోతే క్రమశిక్షణతో ప్లాన్ ప్రకారం చదువుకుంటూ పోవాలి. పేదరికం, కుటుంబ సమస్యలపై దిగులు పడొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దరిచేరుతుంది. బోలెడంత మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మాక్ ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వొచ్చు. సాధిస్తానన్న నమ్మకంతో చదివా.. సివిల్ సర్వీసెస్ చదవడమంటే చాలా కష్టపడాలి. అందులోనూ కోచింగ్ లేకుండా, మరోవైపు ఉద్యోగం చేస్తూ చదవడమంటే మాటలు కాదు. కానీ, సాధిస్తానన్న నమ్మకంతో ప్రణాళిక ప్రకారం చదివా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కొంచెం ఇంటర్నెట్ నుంచి తీసుకునేవాడిని. ఉద్యోగానికి వెళ్లేవాడిని. రోజూ 3 నుంచి 4 గంటలు క్రమం తప్పకుండా చదివేవాడిని. వారాంతాల్లో మాత్రం పూర్తి సమయం చదివేందుకే కేటాయించేవాడిని. అలా క్రితం సారి సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. అక్కడ కేవలం 18 మార్కులతో సివిల్స్ మిస్సయ్యాను. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చదివాను. ముఖ్యంగా నేను రాసిన పేపర్లను థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేయడం వల్ల నా సామర్థ్యం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలిగాను. ఆన్లైన్లోనే మాక్ ఇంటర్వ్యూలకు ప్రిపేరవడం కలిసి వచ్చింది. సివిల్స్ ప్రిపేరవుతున్నా సోషల్ మీడియాకు దూరంగా లేను. నాకు ఎంత కావాలో అంత పరిమితి మేరకు వాడుకున్నాను. -
యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుకుల గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)-2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించన్నుట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్‌లో రాణించేందుకు నిపుణుల మెలకువలు అర్హత: భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యా సంస్థలు లేదా సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఏదైనా విశ్వవిద్యాలయాల డిగ్రీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956, లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. వయోపరిమితి (01/08/24 నాటికి): 21 - 32 సంవత్సరాలు ఎన్ని సార్లు రాయొచ్చంటే: సాధారణ అభ్యర్థులు: 06 OBC అభ్యర్థులు: 09 SC/ST అభ్యర్థులు: పరిమితి లేదు పరీక్ష ప్రణాళిక: సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష రెండు వరుస దశలను కలిగి ఉంటుంది. మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్); మరియు వివిధ సర్వీసులు మరియు పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (వ్రాత మరియు ఇంటర్వ్యూ). -
పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ‘విదేశీ విద్యా దీవెన’: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. చదవండి: Dec 20th: AP పొలిటికల్ అప్డేట్స్ జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కామెంట్స్.. ‘ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి. ఎక్కడో ఒక చోట కెరీర్లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయి. ►కార్నిగిమెలన్ యూనివర్సిటీలో రూప అనే చెల్లెమ్మకు 89 లక్షలు కంప్యూటర్ సైన్స్ ► సాంబశివ అనే తమ్ముడికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు.. ►కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 75.87 లక్షలు ఫీజు ►వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో శ్రేయ 70 లక్షలు ఫీజు ► యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో మరియంకు సీటు వచ్చింది 67.50 లక్షలు ఫీజు.. ఇలా 51 మంది పేర్లు ఉన్నాయి. ►సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నంబర్స్ ఉన్నాయి. ► ఫీజులు కట్టడానికి ఎంత అప్పులు, ఎక్కడ చేయాలి, ఎలా రీ పే చేయాలనే సంశయం ప్రతి తల్లిదండ్రికీ కలిగే పరిస్థితి. ► అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా అడుగులు పడుతున్నాయి. ►ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఇదొక బూన్ కింద, దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతోంది. ►ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వాళ్ల కుటుంబాలను ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు స్థాయిలోకి తీసుకుపోయేలా రావాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని ఆశీస్తున్నా. ► మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు. ►ఇక్కడ కూడా ఒక స్పూర్తినిచ్చే కథలు రావాలని తపన, తాపత్రయంతో, ఆరాటంతో దీనికి సంబంధించి ఈరోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ►ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్‌కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు.. మొత్తంగా లక్షన్నర ఇచ్చేట్టుగా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. ►ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ►చదువులు మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ►చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ►ఈ రెండో కార్యక్రమం ద్వారా 95 మంది పిల్లలు నా తమ్ముళ్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నాం. ►11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నాం ► గవర్నమెంట్లో శాచురేషన్, ట్రాన్స్పరెన్సీ పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ►అర్హత ఉంటే ఎవరికైనా మంచి జరిగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ► ఎక్కడా రికమెండేషన్లు పని చేయవు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ► అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మనందరి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని భరోసా ఇస్తున్నా. ►గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించినవి. ►ఫీజులు 60, 70 లక్షలు కనపడుతున్నాయి. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. ►ఇలా చేస్తే ఏ ఒక్కరికీ కూడా మంచి జరగదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ► ఎప్పుడూ బతుకులు మారవు. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లు నడిచిన కార్యక్రమాలవి. ►* దాదాపు 3,326 మందికి 2016-17కు సంబంధించి రూ.318 కోట్లు బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీల ఎంపికలోనూ పారదర్శకత లేదు. ►ఎల్లయ్య.. పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా రికమెండేషన్లు పెట్టుకొని కొంతమంది మాత్రమే పొందేవారు. ►అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. పొలిటికల్ జోక్యం, కరప్షన్, లంచాలు లేవు. ►ఎవరికైనా టాప్ 50 కాలేజీలు 21 ఫ్యాకల్టీలు 350 కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా కోటీ 25 లక్షల దాకా లిమిట్ పెట్టి చేశాం. ► ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. లీడర్స్‌గా ఎదగాలి. ► మీరు రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ స్టోరీలు స్పూర్తిగా నిలవాలి. ►ఇవన్నీ జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ మనస్పూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. ►నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా.. ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదీ ఉపయోగం ఈ పథకం ద్వారా దరఖాస్తుదారులకు ప్రభుత్వం రెండు దశల్లో ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదటిది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.లక్ష, నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి ఈ నగదు ఉపయోగపడుతుంది. రెండోది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.50వేలు ప్రోత్సాహకం అందిస్తుంది. ఇది వ్యక్తిత్వ పరీక్షకు సన్నద్ధమవడానికి ఉపయోగపడుతుంది. ఈ నగదు అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చులకు భరోసా ఇస్తుంది. అర్హత ప్రమాణాలు ఇవి.. ♦ దరఖాస్తుదారు తప్పనిసరిగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అయ్యుండాలి. ♦ ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి(స్థానికుడు) అయ్యుండాలి. ♦ తప్పనిసరిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి. యూపీఎస్సీ అనుమతించిన ఎన్ని ప్రయత్నాల్లోనైనా ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని అభ్యర్థి పొందవచ్చు. ♦ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్ ద్వారా ధృవీకరిస్తారు. ♦ కుటుంబానికి పది ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు. ♦ఇలా పలు అర్హతలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నవభారత నారీశక్తి
పెరుగుతున్న మహిళాశక్తికి ఇది మరో నిదర్శనం. 2022కి గాను ఇటీవల ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో కృతార్థులైన అభ్యర్థుల్లో మూడోవంతు మంది, మరో మాటలో 34 శాతం ఆడవారే! తొలి 4 ర్యాంకులూ మహిళలవే! ఇంకా చెప్పాలంటే, అగ్రశ్రేణిలో నిలిచిన పాతిక మంది అభ్యర్థుల్లో 14 మంది స్త్రీలే! ఈ లెక్కలన్నీ మారుతున్న ధోరణికి అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఈ మూడు దశల పరీక్షలో యువతులు ఇలా అగ్రపీఠిన నిలవడం ఇదే తొలిసారి కాకున్నా, వరుసగా కొన్నేళ్ళుగా వారు ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న తీరు అసాధారణం. అంతేకాక, ఒకే ఏడాది ఇంతమంది యువతులు సివిల్స్‌కు ఎంపికవడం ఇదే ప్రప్రథమం. సివిల్ సర్వీసుల్లో ఏయేటి కాయేడు స్త్రీల వాటా పెరుగుతుండడం సానుకూల ధోరణి. అంతకు మించి ఆనందదాయకం. గణాంకాలు గమనిస్తే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తున్నవారిలో మహిళల వాటా 2018లో 24 శాతమైంది. 2021లో అది 26 శాతానికి ఎగబాకింది. తాజాగా 2022 పరీక్షల్లో అది గణనీయంగా 34 శాతానికి హెచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే, ఈసారి మొత్తం 933 మంది అభ్యర్థులకు సివిల్స్‌లో చోటు దక్కగా, వారిలో 320 మంది స్త్రీలే. ఇది ఒక్కరోజులో, రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. దశాబ్దాల పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పు. అనేక ఇతర రంగాల లాగే సివిల్స్ సైతం ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యమైనదే. 2006 వరకు యూపీఎస్సీ ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో దాదాపు 20 శాతమే మహిళలు. ఇక, ఇంకాస్త వెనక్కి వెళితే, 1980ల్లో, 1990ల తొలినాళ్ళలో వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువే. ఆ గత చరిత్ర మారి, ఈసారి 34 శాతం మహిళలు సివిల్స్ ఉద్యోగానికి లేఖలు అందుకోవడం గణనీయమైన మార్పు. భారతదేశంలో విస్తృత సివిల్ సర్వీస్ వ్యవస్థలోకి ప్రతిభావంతులైన యువతీ యువకులను ఏటా ప్రవేశపెట్టే యూపీఎస్సీ పరీక్ష అత్యంత కష్టమైనది. చైనాలో జాతీయ కాలేజ్ ప్రవేశపరీక్ష గావో కవో లాంటి ఒకటి, రెండే ప్రపంచంలో ఈ స్థాయి క్లిష్టమైనవంటారు. ఏటా మూడు దశల్లో సాగే ఈ కఠిన పరీక్షకు ఏటా దాదాపు 10 లక్షల మంది లోపు దరఖాస్తు చేసుకుంటే, అందులో 1 శాతం కన్నా తక్కువ మందే రెండో దశ అయిన లిఖిత పరీక్ష (మెయిన్స్)కు చేరుకుంటారని లెక్క. అలాంటి పోటీ పరీక్షలో గత ఏడాది కూడా సివిల్స్‌లో తొలి 4 ర్యాంకులూ మహిళలకే దక్కాయి. వరుసగా రెండోసారి ఈ ఏడాదీ అదే ఫలితం పునరావృతమవడం విశేషం. గమనించాల్సింది ఏమిటంటే – వైద్యప్రవేశ పరీక్షలు ‘నీట్’లోనూ ఈ ఏడాది యువతులదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో 12వ తరగతి బోర్డ్ పరీక్షా ఫలితాల్లోనూ గత అయిదేళ్ళుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పైచేయి. సివిల్స్‌లో ప్రథమ స్థానంలో నిల్చిన ఇషితా కిశోర్ మొదలు మూడో స్థానం దక్కిన తెలుగ మ్మాయి ఉమా హారతి సహా సివిల్స్‌లో నెగ్గిన అనేకమంది అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు, జీవితంలోని కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన వారి పట్టుదల, సహనం స్ఫూర్తిదాయకం. కృతనిశ్చయులైతే... కులం, మతం, ప్రాంతం, లింగ దుర్విచక్షణ లాంటి అనేక అవరోధాలను అధిగమించి సమాజంలోని అన్ని వర్గాల నుంచి వనితలు విజేతలుగా అవతరించడం సాధ్యమని ఈ విజయగాథలు ఋజువు చేస్తున్నాయి. నిష్పాక్షికంగా, అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా సాగే సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు ఈ తరహా విజయాలు సాధిస్తూ, ఉన్నతోద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఒకపక్కన కార్పొరేట్ ప్రపంచం సైతం సీనియర్ హోదాల్లో లింగ వైవిధ్యం సాధించడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ సర్వీసులో ఈ స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం చరిత్రాత్మకమే! అయితే ఇది చాలదు. నిజానికి, ప్రభుత్వ పాలనలో లింగ సమానత్వంపై యూఎన్డీపీ 2021 నివేదిక ప్రకారం అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో స్త్రీల వాటా స్వీడన్లో 53 శాతం, ఆస్ట్రేలియాలో 40 శాతం, సింగపూర్ 29 శాతం కాగా, భారత్ వాటా కేవలం 12 శాతమేనట. ప్రస్తుత మహిళా విజయగాథ మరింత కాలం కొనసాగినప్పుడే ఈ లోటు భర్తీ అవుతుంది. ఇప్పటికీ జమ్ము– కశ్మీర్, జార్ఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అవసరానికి తగ్గ సంఖ్యలో అసలు ఐఏఎస్‌లే లేరన్న పార్లమెంటరీ సంఘం నివేదికను చెవికెక్కించుకోవాలి. అయితే, కేవలం సివిల్స్‌లోనో, మధ్యశ్రేణి ఉద్యోగాల్లోనో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే సరిపోదు. నేటికీ పితృస్వామిక భావజాలం, ఆడవారు ఇంటికే పరిమితమనే మనస్తత్వం మన సమాజంలో పోలేదన్నది చేదు నిజం. అందుకు తగ్గట్లే... మన జాతీయ శ్రామికశక్తిలో పనిచేసే వయసులోని మహిళల వాటా కూడా తక్కువే. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005లో 35 శాతమున్న వనితల వాటా, 2021లో 25 శాతానికి పడిపోయింది. వెలుగు వెనుకే ఉన్న ఈ చీకటి ఓ విషాదం. కాకపోతే, మునుపటితో పోలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల సంఖ్య తగ్గింది. ఆధు నిక మహిళ ఒకప్పటితో పోలిస్తే విద్య, ఉద్యోగాల్లో బంధనాలను తెంచుకుంది. ఆటల నుంచి ఆర్మ్›్డ సర్వీసుల దాకా అన్నింటా తాను పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిళ్ళు, పనిప్రదేశాల్లో అభద్రత, నగరాల్లోనూ నాసిరకపు ప్రజారవాణా దుఃస్థితిని మార్చాలి. లింగ దుర్విచక్ష లేని పనిసంస్కృతిని ప్రోత్సహించాలి. సమాజంలో దుర్లక్షణాలున్నా వాటిని దాటుకొని పడతులు పైకి రావడం సాధ్యమేనని తాజా సివిల్స్ ఫలితాలు ఆశావాదాన్ని ప్రోది చేస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ధోరణి గ్రామాలకూ విస్తరించడం శుభవార్త. ఇలాంటి మహిళా విజేతలు మరింత పెరిగితేనే, మన యువభారతం... నవభారతం అవుతుంది. -
సివిల్స్‌లో నారీ భేరి
న్యూఢిల్లీ: సివిల్ సర్విసెస్–2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకోవడం విశేషం. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించారు. గరీమా లోహియా, తెలుగు యువతి నూకల ఉమా హారతి, స్మృతీ మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నారు. టాప్–25 ర్యాంకర్లలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్‌లో టాప్–3 ర్యాంకులు మహిళలే సాధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం గమనార్హం. సివిల్స్–2021లో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామినీ సింగ్లా తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మూడో ప్రయత్నంలో తొలి ర్యాంక్ ఈసారి సివిల్స్ తొలి ర్యాంకర్ ఇషితా కిశోర్ ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకొని మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. రెండో ర్యాంకర్ గరీమా లోహియా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరీమల్ కాలేజీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ అభ్యసించారు. సివిల్స్‌లో కామర్స్ అండ్ అకౌంటెన్సీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంక్ సాధించారు. మూడో ర్యాంకర్ నూకల ఉమా హారతి ఐఐటీ–హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. ఐదో ప్రయత్నంలో మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక స్మృతీ మిశ్రా మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో బీఎస్సీ చదివారు. జువాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్‌లో జయకేతనం ఎగురవేశారు. ఐదో ర్యాంకర్ మయూర్ హజారికా తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. అస్సాంకు చెందిన హజారియా ఎంబీబీఎస్ చదివారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి రాక టాప్–25 ర్యాంకర్ల విద్యార్హతలను గమనిస్తే చాలామంది ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్, హుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారే ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లా, హిస్టరీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, జువాలజీని ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రిజర్వ్ లిస్టులో 178 మంది అర్హత సాధించిన వారిలో 345 మంది జనరల్ కేటగిరీ, 99 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈడబ్ల్యూఎస్), 263 మంది ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), 154 మంది షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), 72 మంది షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) వర్గానికి చెందినవారున్నారు. 178 మంది అభ్యర్థులను రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు యూపీఎస్సీ తెలియజేసింది. మొత్తం విజేతల్లో 41 మంది దివ్యాంగులు ఉన్నారు. నా కల నెరవేరింది సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధించడం ద్వారా నా కల నెరవేరింది. ఐఏఎస్ అధికారిగా మహిళా సాధికారత కోసం, అణగారిన వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తా. మొదటి ర్యాంకు లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తొలుత నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి. సివిల్స్‌లో మొదటి రెండు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మెరుగైన ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో ప్రతిరోజూ 8 గంటల నుంచి 9 గంటలపాటు చదివాను. నా కఠోర శ్రమకు ఈ ఫలితం దక్కిందని భావిస్తున్నా. నా ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ క్యాడర్. ఈసారి సివిల్స్‌లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది – ఇషితా కిశోర్, సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ రెండో ర్యాంకు ఊహించలేదు ‘‘సివిల్స్ సాధించాలన్నది నా చిన్నప్పటి కల. ఏకంగా రెండో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. ఈ ప్రయాణంలో మా అమ్మ, కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలిచారు. ప్రిపరేషన్ నిరంతరం కాకుండా మధ్యలో అప్పుడప్పుడు విరామం ఇచ్చా. బంధుమిత్రులను కలుసుకున్నా. స్ఫూర్తి, సొంతంగా చదుకోవడం, విశ్లేషణతో ఎవరైనా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. సరైన మార్గనిర్దేశం కూడా అవసరమే. పెద్ద నగరంలో ఉంటున్నామా, చిన్న పట్టణంలో ఉంటున్నామా అనేది సమస్య కాదు. ఇంట్లో ఉండి చదువుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్విసులో చేరాక మహిళాభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేస్తా’’ – గరీమా లోహియా, సివిల్స్ రెండో ర్యాంకర్ 15 రోజుల్లోగా మార్కుల వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్ http//www.upsc. gov.in ద్వారా ఫలితాలు, సివిల్స్ విజేతల వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు ఏదైనా సమాచారం కావాలంటే 011– 23385271/ 23381125/ 23098543 ఫోన్ నంబర్ల ద్వారా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది. సివిల్స్–2022లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లోగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను గత ఏడాది జూన్ 5న నిర్వహించారు. 11,35,697 మంది దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,090 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గత ఏడాది సెపె్టంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో 933 మంది అర్హత సాధించారు. విజేతలకు మోదీ అభినందనలు సివిల్స్–2022 విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. దేశానికి సేవలందించే అవకాశం రావడం, ప్రజల జీవితాన్ని సానుకూల మార్పును తీసుకొచ్చే అదృష్టం లభించడం గొప్ప విషయమంటూ ట్వీట్ చేశారు. విజయం సాధించలేకపోయినవారు నైపుణ్యాలను, బలాలను ప్రదర్శించేందుకు దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ర్యాంకర్లకు కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్‌కు 667వ ర్యాంక్ ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్ కుమార్ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్‌భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. -
పాలకులకు మేలుకొలుపు!
‘ఉత్తములైన సివిల్ సర్వీస్ అధికారులుంటే సరైన చట్టాలు లేకున్నా సమర్థవంతమైన పాలనకు లోటుండదు. అత్యుత్తమ చట్టాలున్నప్పటికీ అధికారులు సరైనవారు కాకుంటే అలాంటిచోట పాలన కుంటుబడుతుంది’ అంటాడు జర్మన్ రాజనీతిజ్ఞుడు బిస్మార్క్. బాలికలుగా తమ అవసరాలేమిటో చెప్పిన ఒక విద్యార్థినికి బిహార్ మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ నిర్దయగా ఇచ్చిన జవాబు గమనిస్తే దేశంలో అధికార యంత్రాంగం మొద్దుబారుతున్నదా అనే సందేహం కలుగుతుంది. రాజధాని పట్నాలో బుధవారం ఒక గోష్ఠి సందర్భంగా జరిగిన ఈ ఉదంతం ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆ గోష్ఠి మకుటమే ‘సశక్తి బేటీ, సమృద్ధ బిహార్’. బాలికా సాధికారత ద్వారానే బిహార్ సమృద్ధి సాధిస్తుందన్నది దాని సారాంశం. కానీ ఆ అధికారిణి అందుకు విరుద్ధమైన పోకడలకు పోయారు. ప్రశ్న అడిగిన బాలికతో వాదులాటకు దిగారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్ని పథకాలకు ఇంతగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వంవారు బాలికలకు ప్రతి నెలా 20, 30 రూపాయల విలువ చేసే నాప్కిన్లు ఇవ్వలేరా?’ అన్నది ఆ బాలిక ప్రశ్న. నిజానికి బాలికలు అడగకముందే పాలకులు గమనించి తీర్చవలసిన సమస్య ఇది. దేశంలో మధ్యలోనే చదువు ఆపేస్తున్న బాలికల శాతం ఆందోళనకరంగానే ఉంది. కౌమార దశలో బడి మానేస్తున్న ఆడపిల్లల శాతం గత మూడేళ్లలో బిహార్‌లోనే అధికమని మొన్న ఏప్రిల్‌లో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పార్లమెంటులో చెప్పారు. రుతుస్రావ సమయంలో పరిశుభ్రమైన నాప్కిన్లు వాడలేకపోవటం, ఉన్నా వాడటానికి అనువైన మరుగు స్కూళ్లలో కొరవడటం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. వారు అనేక వ్యాధులబారిన పడవలసివస్తోంది. కేవలం ఈ కారణంతో ఏటా చదువులకు దూరమయ్యే విద్యార్థినులు 23 శాతం ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవహారాల మండలి నిరుడు తెలియ జేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉంటూ కూడా ఇలాంటి దుఃస్థితిని బాలిక చెప్పేంతవరకూ గమనించలేకపోయినందుకు సిగ్గుతో తలవంచు కోవాల్సిందిపోయి హర్జోత్ కౌర్ దబాయింపు ధోరణిలో మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ‘ఇవాళ నాప్కిన్స్ అడుగుతున్నారు. రేపు జీన్స్, ఆ తర్వాత అందమైన షూస్ కావాలంటారు. చివరకు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వమని అడుగుతారు’ అంటూ ఆమె జవాబివ్వటం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక ‘అన్నీ ప్రభుత్వమే ఎందుకివ్వాలి... ఇది తప్పుడు ఆలోచనాధోరణి’ అంటూ వాదులాటకు దిగడం ఆమె వైఖరికి అద్దం పడుతుంది. మరుగుదొడ్ల గురించి అడిగినప్పుడు సైతం తలతిక్క సమాధానమే వచ్చింది. పైగా దేశాన్ని పాకిస్తాన్ చేస్తారా అని బాలికలను ప్రశ్నించారు. అయినా తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఆ బాలికలు వెరవకుండా నిలదీసిన తీరు ప్రశంసించదగ్గది. మొదటగా ప్రశ్నించిన బాలిక నేపథ్యం గమనిస్తే సమస్య తీవ్రతేమిటో అర్థమవుతుంది. రియా కుమారి అనే ఆ బాలిక నగరంలోని ఒక మురికివాడకు చెందినామె. నాప్కిన్ వాడకం ఈమధ్యే తెలిసిందట. తనవంటి బాలికలు ఇంకా వేలాదిమంది ఉన్నార ని, తెలిసినా వాటిని వాడే స్థోమత ఆ బాలికలకు లేదని చెబుతోంది. చదువుల్లో చురుగ్గా ఉండేవారు, నాయకత్వ లక్షణాలున్నవారు, సవాళ్లను ఎదుర్కొనే సాహస వంతులు సివిల్ సర్వీసుల బాట పడతారని ఒక అభిప్రాయం ఉంది. దేశంలో మెజారిటీగా ఉన్న అట్టడుగువర్గాల ప్రజానీకం సమస్యలపై సహానుభూతితో వాటిని ఆకళింపు చేసుకుని, సృజనాత్మక పరిష్కారాలను వెదికే అధికారుల వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. హర్జోత్ కౌర్‌కు ఈ అవగాహన ఏ మేరకుందో అనుమానమే. సివిల్ సర్వీసు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో కృతార్థులయ్యాక ఆ అధికారులకు ఇక పరీక్షలేమీ ఉండకపోవచ్చు. కానీ పాలనా యంత్రాంగంలో భాగస్థులై, సమస్యలను సవాలుగా తీసుకుని పనిచేసేవారికి ఎప్పుడూ పరీక్షే. నిజానికి ఆ బాలికలు అడిగిన సమస్యలేమీ తీర్చలేనివి కాదు. దేశంలో ఎవరూ అమలు చేయనివి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో ఇలాంటి పథకం ప్రారంభించింది. 7వ తరగతి మొదలు ఇంటర్మీడియెట్ వరకూ చదివే పది లక్షలమంది బాలికలకు ప్రతినెలా పది నాప్కిన్ల చొప్పున ఈ పథకం కింద అందజేస్తున్నారు. ఆఖరికి ఇంటి దగ్గర వాడుకోవడానికి వేసవి సెలవుల ముందు ఒకేసారి ఇస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు. రెండేళ్లనాడు సివిల్ సర్వీసుల ప్రొబేషనర్లనుద్దేశించి ‘ప్రజలను కేవలం ప్రభుత్వ పథకాలు తీసుకొనేవారిగా పరిగణించొద్దు. నిజానికి మన పథకాలకూ, కార్యక్రమాలకూ వారే చోదకశక్తులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార యంత్రాంగంలో ఈ స్పృహ కలగాలంటే పనిచేస్తున్న శాఖల్లో వారి నిబద్ధత, నిమగ్నత ఏపాటో మదింపు వేస్తుండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు, వాటి మంచిచెడ్డల గురించి వారి అవగాహనేమిటో తెలుసుకోవాలి. అసలు సివిల్ సర్వీసులకున్న ఎంపిక ప్రక్రియనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రజలు మునుపట్లా లేరు. అన్నీ చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలడిగిన బాలికలు ఒక రకంగా పాలకులకు మేలుకొలుపు పాడారు. సరిదిద్దుకోవాల్సిన వంతు వారిదే. -
శతమానం భారతి: లక్క్ష్యం 2047 సివిల్ సర్వీసులు
రాజ్యాంగ నిర్మాణ సభలో ఆనాటి సభ్యులు చాలామంది ఐసీఎస్‌ను రద్దు చేయాలని సూచించారు! పాలనకు ఆయువు పట్టయిన భారత సివిల్ సర్వీసు (ఐసీఎస్) లను రద్దు చేయాలని వారు సూచించడానికి తగిన కారణమే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఉన్న ఈ వ్యవస్థలో ఆనాటి ఐసీఎస్ అధికారులు అనేకమంది నిరంకుశంగా తమ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలపై పెత్తనం సాగిస్తుండేవారు. అయితే రద్దు అనేది పరిష్కారం కాదనీ, ఐసీఎస్‌ను కొనసాగించడమే మేలని సర్దార్ వల్లభాయ్ పటేల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐసీఎస్ ఒక్కటే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఓఎస్ వంటి సర్వీసులను కూడా సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక, సామాజిక, మానవహక్కుల సాధన సుళువు అవుతుందని పటేల్ భావించారు. బ్రిటిష్ ఇండియాలో ఐసీఎస్ 1854లో ప్రారంభం అయింది. అందుకు నేపథ్యం.. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే అధికారులను ఇండియన్ సివిల్ సర్వీసులలో నియమించాలని బ్రిటిష్ అధికారి మెకాలే ప్రతిపాదించడం. ఆ ప్రతిపాదనతో ఆయన పార్లమెంటుకు నివేదికను సమర్పించిన అనంతరం సివిల్ సర్వీస్ కార్యరూపం దాల్చింది. 1855లో బ్రిటన్‌లో తొలి ఐసీఎస్ పరీక్ష జరిగింది. తర్వాత 1922 లో తొలిసారి భారతదేశంలోనే ఈ పరీక్షను నిర్వహించారు. అమృతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో సివిల్ సర్వీసుల వ్యవస్థను మరింత మెరుగ్గా ప్రజాప్రయోజనార్థం సంస్కరించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. (చదవండి: నేను నమ్ముతున్నాను) -
సీఎం జగన్‌ను కలిసిన సివిల్ సర్వీసెస్ విజేతలు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు. చదవండి: Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్‌రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్‌రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్‌కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
‘అదనపు’ అవకాశాన్ని పరిశీలించండి: సుప్రీం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల పరీక్షకు హాజరు కాలేకపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పరీక్ష రాసేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ వారు చేస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అదనపు అవకాశం కోసం యూపీఎస్పీని ఆశ్రయించాలని పిటిషన ర్లకు సూచించింది. సివిల్స్ అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గతవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. నిర్దేశిత తేదీన ఏ కారణం వల్లనైనా ఒకసారి పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి ఆ అవకాశం కల్పించే వెసులుబాటు లేదని యూపీఎస్పీ చెబుతోంది. -
‘సివిల్స్’ అటెంప్ట్‌లు, వయోపరిమితిని సడలించం
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ)కు సంబంధించి ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వయో పరిమితి, అటెంప్ట్‌ల సంఖ్యలో సడలింపులు ఇవ్వాలంటూ సివిల్స్ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారని, రిట్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం.. సివిల్స్ ఎగ్జామ్ విషయంలో ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్), వయో పరిమితిపై ఇప్పుడున్న నిబంధనలను మార్చలేమని లిఖితపూర్వక సమాధానంలో జితేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. సడలింపుల అంశాన్ని న్యాయస్థానం సమగ్రంగా పరిశీలించి, తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. కోవిడ్–19 ప్రొటోకాల్స్ సక్రమంగా పాటిస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు. -
సివిల్స్ అభ్యర్థులకు సడలింపులు లేవు
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి, ఇతరత్రా ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అన్న వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆన్లైన్ క్రీడల క్రమబద్ధీకరణపై అధ్యయనం దేశంలో ఆన్లైన్ ఫాంటసీ క్రీడల ప్లాట్‌ఫామ్‌ల క్రమబద్ధీకరణకు జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై వివిధ మంత్రిత్వ శాఖలు అధ్యయనం చేస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్.. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రి టెండరు జారీకాలేదు ఆంధ్రప్రదేశ్‌లో రూ.384.26 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈఎస్ఐ ఆస్పత్రికి సంబంధించి టెండరు జారీచేయలేదని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. 400 పడకల ఆస్పత్రి (అదనంగా 50 పడకలు సూపర్ స్పెషాలిటీ వింగ్) బాధ్యతను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ)కి అప్పగించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎన్ఆర్డీఎంఎస్లో ఏపీ లేదు న్యాచురల్ రీసోర్స్ డాటా మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎన్ఆర్డీఎంఎస్)లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లను చేర్చలేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞానశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమల్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. ఆదర్శ సంపర్క్‌లో మౌలిక వసతులు ఆదర్శ సంపర్క్ పథకంలో భాగంగా లేపాక్షి వీరభద్ర ఆలయం, శ్రీకాకుళంలోని శాలిహుండం బౌద్ధ ఆనవాళ్లు, నాగార్జున కొండల్లో పర్యాటకులకు మౌలికవసతులు కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చేనేతకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోండి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను రక్షించేలా కేంద్రం వారికి ప్రోత్సాహమిచ్చే చర్యలు తక్షణమే చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ కోరారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్ కేటాయించాలని, నూలు కొనుగోళ్లపై నేత కార్మికులకు సబ్సిడీని అందించే పథకాన్ని సవరించి అమలు చేయాలని కోరారు. దీన దయాళ్ హెల్త్ కార్గ్ ప్రోత్సాహ యోజనను పునరుద్ధరించడంతోపాటు రూ.30 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న సొసైటీలే ఈ పథకానికి అర్హులన్న నిబంధనలను తొలగించాలని సూచించారు. నూలు వస్త్రంపై విధించిన 5 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని కోరారు. -
సివిల్స్‌కు సిద్ధమవుతారా.. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఉద్యోగార్ధులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా.. మొత్తం 19 కేంద్ర సర్వీసుల్లో పోస్ట్‌ల భర్తీకి.. నిర్వహించే పరీక్ష ఇది! ప్రభుత్వ పాలనా విభాగంలో అత్యున్నతమైన కొలువు..సమాజంలో హోదా, గౌరవం.. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ సివిల్ సర్వీస్ ఉద్యోగుల సొంతం. అందుకే.. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలనే తపనతో.. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు!! తాజాగా సివిల్ సర్వీసెస్–2022 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ ఎంపిక ప్రక్రియ, పరీక్ష వివరాలు, ప్రిపరేషన్ గైడెన్స్... సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారనడం అతిశయోక్తి కాదు. నోటిఫికేషన్ రాగానే.. ఇక ఎలా ముందుకు అడుగులు వేయాలి.. అని ఆలోచిస్తుంటారు. వారంతా ఇప్పుడు తొలి దశ ప్రిలిమ్స్‌పై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. గతేడాది కంటే పెరిగిన పోస్టులు సివిల్స్–2022 ప్రక్రియ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 కేంద్ర సర్వీసుల్లో మొత్తం 861 పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లుగా సివిల్స్ పోస్ట్‌ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. 2021లో 712 పోస్ట్‌లు, 2020లో 796 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పది లక్షల వరకు పోటీ సివిల్స్‌కు ఏటా దాదాపు పది లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగటున అయిదు లక్షలకు పైగానే. దీంతో.. వందల్లో ఉండే పోస్ట్‌ల కోసం లక్షల సంఖ్యలో పోటీని చూసి అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేస్తే.. తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మొత్తం మూడు దశలు సివిల్స్ ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. అవి..తొలి దశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్; రెండో దశ: మెయిన్ ఎగ్జామినేషన్; చివరి దశ: పర్సనాలిటీ టెస్ట్(పర్సనల్ ఇంటర్వ్యూ) ప్రిలిమినరీ ఇలా తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్– 1: జనరల్ స్టడీస్:100ప్రశ్నలు–200 మార్కులు; పేపర్–2: అప్టిట్యూడ్ టెస్ట్: 80 ప్రశ్నలు–200 మార్కులు. ఇలా.. మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పేపర్–1(జనరల్ స్టడీస్)లో నిర్దిష్ట కటాఫ్ మార్కులను సాధించిన వారిని తదుపరి దశ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన కూడా ఉంది. ఇలా.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు.. ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 12.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్.. ఇలా ► సివిల్స్ ఎంపిక ప్రక్రియలో రెండో దశ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్. ► ఇందులో రెండు లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. ► అర్హత పేపర్లలో..పేపర్–1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు; పేపర్–బి ఇంగ్లిష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ పేపర్లు కేవలం అర్హత పేపర్లే. అయితే వీటిలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేసి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ► తప్పనిసరి పేపర్లు: ఇందులో జనరల్ ఎస్సే 250 మార్కులకు; నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున; ఒక ఆప్షనల్ సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున అడుగుతారు. ► మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ పరీక్ష ఉంటుంది. ► మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు లేదా ముగ్గురిని (1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్‌కు కేటాయించే మార్కులు 275. ► పర్సనాలిటీ టెస్ట్‌లోనూ ప్రతిభ చూపితే.. మెయిన్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు. ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే సివిల్స్ ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్‌లోని రెండు పేపర్లకు రెండు ప్రత్యేక వ్యూహాలతో అడుగులు వేయాలి. ► జనరల్ స్టడీస్ పేపర్‌గా నిర్వహించే పేపర్–1లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ► రెండో పేపర్ సీశాట్‌లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ► అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం..గత మూడు,నాలుగేళ్లుగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్‌ను కోర్ టాపిక్స్‌తో అన్వయం చేసుకుంటూ తమ ప్రిపరేషన్ సాగించాలి. అనుసంధాన వ్యూహం సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు–ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో అన్వయం చేసుకుంటూ చదివితే.. ఒకే సమయంలో రెండు అంశాల్లోనూ పట్టు లభిస్తుంది. అలాగే పాలిటీ–ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో అడుగుతున్న ప్రశ్నల తీరును గమనిస్తే.. ప్రభుత్వం తీసుకున్న శాసన నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే తీరులో ఉంటున్నాయి. డిస్క్రిప్టివ్ అప్రోచ్ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు ప్రిపరేషన్లో డిస్క్రిప్టివ్ విధానం అనుసరించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్‌ను సులభతరం చేస్తుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్లపై ప్రత్యేక దృష్టి ప్రిలిమ్స్‌లో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి. పేపర్–2కు ఇలా అర్హత పేపర్‌గానే పేర్కొంటున్న పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో కనీసం 33శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్2 కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్,రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.ఇందుకోసం ఇంగ్లి ష్ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మెయిన్‌తో అనుసంధానం సివిల్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్‌లో పేర్కొన్న అంశాలను మెయిన్ ఎగ్జామ్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదివితే మెయిన్స్‌కు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టాపిక్‌ను నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ప్రిలిమ్స్‌లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. సిలబస్‌పై అవగాహన ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి అంశాలపై అవగాహన కలుగుతుంది. పుస్తకాలు సిలబస్‌పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రామాణికం అని గుర్తింపు పొందిన ఒకట్రెండు పుస్తకాలకు పరిమితం అవడం మేలు. ముఖ్యంగా తొలిసారి రాస్తున్న అభ్యర్థులు ఈ తరహా వ్యూహం అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. టైమ్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇలా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్‌లో అన్ని అంశాలను పూర్తి చేసే విషయంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్.. సిలబస్ అంశాలు ► పేపర్–1 (జనరల్ స్టడీస్): జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయితీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్(సస్టెయినబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్‌క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్. ► పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్): కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్. దీర్ఘకాలిక వ్యూహం సివిల్స్ అభ్యర్థులు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రధానంగా.. ప్రిలిమ్స్‌ను మెయిన్ ఎగ్జామినేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ పరీక్షలకు సిద్ధమవుదామనే ధోరణి వీడాలి. యూపీఎస్సీ అడిగే ప్రశ్నల తీరు కూడా మారుతోంది. కాబట్టి గత ప్రశ్న పత్రాలను సాధనం చేయడం ఎంతో అవసరం. ప్రిలిమ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి. – శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ సివిల్స్ ప్రిలిమ్స్–2022 పరీక్ష సమాచారం ► అర్హత:ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2022 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయో పరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 ► ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ► ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://upsconline.nic.in/mainmenu2.php ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.upsc.gov.in -
‘విజయ్’గాథ: ఎలాంటి కోచింగ్ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్ ర్యాంకు
తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్... ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్‌ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు. తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు సివిల్స్‌లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్‌గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. తాను అందుకోలేకపోయిన సివిల్స్ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్‌బాబు ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు. తాతయ్య ఉత్తరంతో బీజం.. 2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని విజయ్‌బాబు చెప్పారు. టెన్త్‌లో 10/10 జీపీఏ సాధించాక విజయ్ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్‌కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్‌బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. ఐఏఎస్‌పైనే గురి.. ఇంటర్ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని విజయ్ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్‌కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్‌తో ప్రాక్టీస్ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్‌కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్‌బాబు చెప్పారు. రోజూ జాగింగ్, మెడిటేషన్ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్ఎస్ పోస్టింగ్ తీసుకున్నా ఐఏఎస్ సాధనకు మళ్లీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్‌బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబుదాం. -
సివిల్స్‌లో తెలుగువారి సత్తా
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఆలిండి యా సివిల్ సర్వీసెస్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా 20వ ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన పి.శ్రీజ దక్కించుకోగా.. టాప్–100లో 12 మంది నిలిచారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు వ చ్చాయి. ఈ మేరకు సివిల్ సర్వీసెస్–2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. డాక్టర్ నుంచి సివిల్స్‌కు.. సివిల్స్‌లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్‌లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్‌కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది. ‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వూ్యలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. రైతుల ఆత్మహత్యలు ఆగేలా పనిచేస్తా.. సివిల్స్ 207 ర్యాంకు సాధించిన వి.సంజనాసింహ నివాసం హైదరాబాద్‌లోని మలక్‌పేట. ఐఏఎస్ కావాలన్నది తన కోరిక. ‘‘నేను కలెక్టర్ అయితే రైతుల ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తా. మహిళలపై దాడులు జరగకుండా ప్రణాళిక రూపొందించి.. అవగాహన కల్పిస్తా’’ అని తెలిపింది. ఐపీఎస్‌కు ఎంపికవుతా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మల కుమారుడు కిరణ్‌కుమార్. దమ్మపేట గురుకుల పాఠశాలలో చదివిన కిరణ్.. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. కిరణ్ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి ఆ గ్రామ సర్పంచ్, సోదరుడు బాబురావు పోలీసు విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. సివిల్స్‌లో 652వ ర్యాంకు సాధించిన కిరణ్.. ఐపీఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది సివిల్స్‌లో 616వ ర్యాంకు సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆందాసు అభిషేక్ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖపట్నా నికి చెందిన అభిషేక్ ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన అభిషేక్.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మరికొందరు ర్యాంకర్ల వివరాలివీ.. ►66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్‌లోని ఆర్కేపురం. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ►317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ►248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్ నివాసం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆమె.. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని విజయవాడకు చెందిన బద్దెల్లి చంద్రకాంత్‌రెడ్డి సివిల్స్‌లో 120వ ర్యాంకు సాధించాడు. కరోనా పరిస్థితులతో నేరుగా క్లాసులు వినలేకపోయినా.. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని సిద్ధమయ్యానని చంద్రకాంత్‌రెడ్డి చెప్పాడు. ‘‘ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఐఏఎస్ అయితే విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనే ఆలోచన ఉంది. మాతృభాషను మరింత దగ్గర చేసేలా కృషి చేస్తా. ఒకవేళ ఐపీఎస్ వస్తే.. నేరాలను అరికట్టేలా ప్రయత్నిస్తా..’’ అని పేర్కొన్నాడు. మొదటిసారే సాధించా.. హైదరాబాద్‌లోని తార్నాకలో నివసించే రిచా కులకర్ణి సివిల్స్‌లో 134వ ర్యాంకు సాధించింది. ‘‘యూపీఎస్సీ రాయడం ఇదే మొదటిసారి. ఇంత మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా కోచింగ్ తీసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి నాకు తోడ్పడింది. ఐఎఫ్ఎస్ వస్తుందన్న ఆశతో ఉన్నాను..’’ అని రిచా పేర్కొంది. మూడో ప్రయత్నంలో.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సూరపాటి ప్రశాంత్ ఆలిండియా 498వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి బాబూరావు రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రశాంత్ తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మహిళలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందన్నది తన అభిప్రాయమని ప్రశాంత్ పేర్కొన్నాడు. ప్రజల జీవితంలో మార్పు తెచ్చేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్లకు చెందిన శ్రీనివాస్‌గౌడ్, వనజ దంపతుల కుమారుడు పృథ్వీనాథ్‌గౌడ్. కొత్తకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పృథ్వీనాథ్.. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తాజాగా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 541వ ర్యాంకు సాధించాడు. ‘‘ఎంబీబీఎస్ చదివినా సంతృప్తి అనిపించలేదు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే పరిపాలనా విభాగంలో ఉండాలన్న పట్టుదలతో సివిల్స్ కోసం సిద్ధమయ్యాను..’’అని పృథ్వీనాథ్ తెలిపాడు. -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
సాక్షి, అమరావతి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎనలేని క్రేజ్. ఏటా వేలమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరులక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. దీనికి సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.kpias.com లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి ఏడాదిన్నర. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, ముల్టీపుల్ చాయిస్ కొశ్చన్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9666637219, 9666283534, 9912671555. పనిదినాల్లో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సంప్రదించవచ్చు. -
సివిల్స్ ఫలితాలపై యూపీఎస్సీ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సివిల్ సర్వీసుల పరీక్షా ఫలితాలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గురువారం వివరణ ఇచ్చింది. ఈ పరీక్షల్లో 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు-2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను నిర్వహించామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయదలుచుకున్న ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్ధులను ఎంపిక చేశారని తప్పుదారి పట్టించే ప్రచారం తమ దృష్టికి వచ్చిందని యూపీఎస్సీ పేర్కొంది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా నియామకాల కోసం భారత ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షా నిబంధనలను కమిషన్ తూచాతప్పకుండా అనుసరించిందని తెలిపింది. సివిల్ సర్వీసుల పరీక్షల ద్వారా 927 ఖాళీల కోసం తొలి విడతగా 829 మంది అభ్యర్ధుల ఫలితాలను ప్రకటించామని, నిబంధనల ప్రకారం రిజర్వ్ జాబితాను నిర్వహిస్తున్నామని ఆ ప్రకటనలో యూపీఎస్సీ వెల్లడించింది. దశాబ్ధాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారని తెలిపింది. సాధారణ ప్రమాణాల్లో ఎంపికైన రిజర్వ్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు వారికి ఉపయోగకరంగా ఉంటే వారి రిజర్వ్ స్టేటస్ ఆధారంగా సర్వీసులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. చదవండి : మాజీ సర్పంచ్ కొడుకు.. సివిల్స్ టాపర్ -
శెభాష్ దేవాశిష్
భువనేశ్వర్: ఒడిశా సివిల్ సర్వీసెస్–2018 పరీక్షల్లో దేవాశిష్ పండా టాపర్‌గా నిలిచారు. సోమవారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఆయన సుందర్‌గడ్ జిల్లా జకాయికలా గ్రామస్తుడు. రితుపర్ణ మహాపాత్రో ద్వితీయ టాపర్‌గా, ఆకాశ కుమార్ పండా తీయ టాపర్‌గా నిలిచారు. గ్రూపు ఎ, గ్రూపు బి సేవల్లో భర్తీ కోసం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పర్సనాలిటీ పరీక్షల్లో 218 మంది అభ్యర్థుల్ని తాత్కాలికంగా ఎంపిక చేశారు. వారిలో 72 మంది యువతులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఉత్తీర్ణత ఫలితాల పూర్తి వివరాలు http://opsc.gov.in వెబ్ పోర్టల్‌లో ప్రసారం చేశారు. సుందర్‌గడ్ జిల్లా ప్రజలు దేవాశిష్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్), ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీసెస్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీసెస్), ఐఎఫ్ఓఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్) ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బీలోని కొన్ని గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి, ముఖ్యంగా కొన్ని గ్రూప్ బీ ఉద్యోగాల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ పోస్ట్‌లు, కొన్ని గ్రూప్ బీ గెజిటెడ్ పోస్ట్స్, గ్రూప్ సీ పోస్ట్‌ల భర్తీకి ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఆ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ‘కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)’ను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’ అని కేంద్ర సిబ్బంది శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. అలాగే, ఉద్యోగార్థులు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరారు. సెట్ నిర్వహణతో ఉద్యోగార్థులకు, ప్రభుత్వ సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర చెప్పారు. ప్రధాని లక్ష్యమైన సులభతర పాలనలో భాగంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. ‘ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వేర్వేరు సంస్థలు ప్రకటించే వేర్వేరు ఉద్యోగాలకు అభ్యర్థులు వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి పరీక్షకు హాజరవడం వరకు అభ్యర్థి అనేక వ్యయ ప్రయాసలకు లోనవాల్సి వస్తోంది. అందువల్ల ఒకే ఏజెన్సీ నిర్వహించే ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఒకేసారి ప్రిపేర్ కావచ్చు’ అని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలున్నాయి. -
ఐదుసార్లు ఫెయిల్
ఉమ జీవితంలోని వరుస అపజయాలు ఆమెను దృఢపరచి, ఆత్మవిశ్వాసంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసేందుకు ఉపయోగపడ్డాయి. గత ఏడాది చేసిన ఆరో ప్రయత్నంతో ఉత్తీర్ణత సాధించిన ఉమకు స్ఫూర్తిని ఇచ్చినవారు స్టీవ్ జాబ్స్ సహా ఎందరో ఉన్నారు. ‘‘నా బాల్యమంతా తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేశాక, ఎంబిఏ చదవాలనుకున్నాను. సిఎస్ఈ చదువుతానని ఏ రోజూ అనుకోలేదు. మా ప్రొఫెసర్ అబూబకర్ ప్రోత్సాహం మీద 2011 లో మొదటిసారి పరీక్ష రాశాను. తగినంత కృషి చేయకపోవడం వల్లనో ఏమో ఫెయిల్ అయ్యాను’ అంటారు ఉమ. ఒకేసారి మూడు ఉద్యోగాలు! చదువు పూర్తి అవుతుండగానే, మూడు పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి ఒకేసారి మూడు ఆఫర్ లెటర్స్ అందుకున్నారు ఉమ. ఒకదాన్ని ఎంచుకుని అందులో చేరారు. ‘‘నాన్న గతించేవరకు నా జీవితం పూలబాటలో నడిచింది. కొన్ని రోజులకే అమ్మ కూడా పోవడంతో, భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది’ అని గుర్తుచేసుకుంటారు ఉమా మహేశ్వరి. కార్పొరేట్ సంస్థలలో ఆమె ఐదు సంవత్సరాలు పని చేశారు. అలా పని చేస్తూనే, సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యారు. ఐదుసార్లు రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు! సాధారణంగా ఇన్నిసార్లు ఓటమి చెందితే మళ్లీ రాయరు. చుట్టూ ఉన్నవారంతా ‘ఇంకేం చదువుతావులే మానేయ్’ అని హేళన చేసినా, ఉమలో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది. 2017లో ఉద్యోగాన్ని వదిలి, పరీక్ష కోసం దీక్షగా కూర్చొని ప్రిపేర్ అయ్యారు. చదువుతుండగానే తెల్లారేది అప్పటికే పెళ్లయింది ఉమకు. ఇంటిని చక్కబెట్టుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, చదువుకోవటానికి కొంత సమయం కేటాయించారు. ‘‘ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చదువు, ఆ తరవాత ఇంటి పనులు, అమ్మాయిని స్కూల్‌కి రెడీ చేయడం, మధ్యాహ్నం భోజన సమయం వరకు మళ్లీ చదువుకుని, సాయంత్రం మా అమ్మాయి ఇంటికి వచ్చాక తనతో గడపడం, తరవాత మళ్లీ చదువుకోవడం.. ఇదీ నా షెడ్యూల్. మెయిన్స్‌కి మాత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు చదివాను’’ అని తెలిపారు ఉమా మహేశ్వరి.ఇంటిని, పిల్లలను చూసుకుంటూనే సిఎస్ఈలో రెండోస్థానం సాధించిన అనూ కుమారి కూడా ఉమకు ఒక ఇన్స్పిరేషన్. హర్యానాకు చెందిన అనూ కుమారి సాధించిన విజయాలు, ఉమ అత్తమామలకు, భర్తకు కూడా ఉమ మీద నమ్మకాన్ని పెంచాయి. పట్టుదల ఉంటే బిడ్డ తల్లికి కూడా అన్నీ సాధ్యమే అని అర్థం చేసుకున్నారు. చివరి ప్రయత్నంలో 2018లో ఉమ సివిల్స్‌లో విజయం సాధించారు. ఈ ఏడాది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇప్పుడు తన పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. ‘‘నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకు, ఆ నమ్మకమే నిన్ను విజయం వైపుగా నడిపిస్తుంది’’ అన్న స్టీవ్ జాబ్స్ మాటలు తన విజయానికి బాటలు వేశాయి అంటారు ఉమా మహేశ్వరి. – వైజయంతి