బీసీ స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటేలా రాష్ర్ట బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ సెంటర్ (బీసీ స్టడీసర్కిల్స్)ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా తమిళనాడులోని బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా సివిల్స్ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ, విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అక్కడి విధానాలు అధ్యయనం చేసేందుకు ఈ నెల 7,8న హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్లు చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక క్యాంపస్‌లో హాస్టల్, ఇతర సౌకర్యాలతో 320 మందికి 6 నెలల పాటు ప్రిలిమ్స్, 200 మందికి 4 నెలల పాటు మెయిన్స్ శిక్షణ అందజేస్తున్నారు.
అంతేకాకుండా మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఢిల్లీలోని తమిళనాడు హౌజ్‌లో 15 రోజుల పాటు ఇంటర్వ్యూ విధానంపై ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తున్నారు. బీసీ స్టడీసర్కిళ్లలో ప్రవేశానికి బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఇప్పటికే ఈ స్టడీసర్కిళ్లలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 10 ఆఖరి తేదీ కాగా, ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి ఈ నెల 28 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. సివిల్స్ ప్రిలిమ్స్‌కు మొత్తం 140 మందికి శిక్షణనిస్తారు. అందులో హైదరాబాద్‌లో 60 మందికి, వరంగల్‌లో 40 మందికి, కరీంనగర్‌లో 40 మందికి కోచింగ్ ఇస్తారు.
తమిళనాడు తరహాలో సివిల్స్ శిక్షణ
Published Tue, Jan 5 2016 1:08 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement