బీసీ స్టడీ సర్కిళ్ల కార్యాచరణకు ఆమోదం
రూ. 25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల(బీసీ) స్టడీ సర్కిళ్లకు సంబంధించి రూ.25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూర్చేలా రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది (2016-17) కొత్తగా 500 మందికి జీఆర్‌ఈ/జీమాట్, టోఫెల్/ఐఎల్‌ఈటీఎస్‌లకు శిక్షణ అందించాలనే ప్రతిపాదనను ఆమోదించింది. దీని కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోస్టులు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు కెరీర్ కౌన్సెలింగ్ తదితరాలను కలుపుకుని మొత్తం 500 మందికి శిక్షణ అందిస్తుంది. జీఆర్‌ఈ/టోఫెల్ తదితరాలకు సంబంధించి బీసీ విద్యార్థులు కోరుకున్న ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో బోధన ఇప్పించేం దుకు నిర్ణయించింది.
సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి వంద మందికి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్‌ను ప్రభుత్వం ఆదేశిం చింది. రాష్ట్రంలోని 10 స్టడీ సర్కిళ్లలో నలుగురు డెరైక్టర్లు మాత్రమే రెగ్యులర్ పోస్టులతో పనిచేస్తుండగా, ఖాళీగా ఉన్న మరో 6 జిల్లాల డెరైక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. స్టడీ సర్కిళ్ల మేనేజింగ్ కమిటీని మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొత్తగా పరిశ్రమలు, ఉపాధి, గ్రామీణాభి వృద్ధి శాఖల కమిషనర్లను సభ్యులుగా చేర్చుకోవాలని శనివారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్ సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో మేనేజ్‌మెంట్ కమిటీ కమిషనర్ జీడీ అరుణ, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, హైదరాబాద్ ఏజేసీ అశోక్‌కుమార్, కన్వీనర్, బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్ చంద్రశేఖర్, ఎస్టీ శాఖ డీడీ నికొలస్, మహిళా, శిశుసంక్షేమ డీడీ లక్ష్మీ, ఎస్సీ శాఖ డీడీ హనుమంతనాయక్ పాల్గొన్నారు.