ఆనందం ఆవిరి..
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల లేమి
- పెండింగ్‌లో రూ.25 కోట్లు
- 21వేల మంది బీసీ విద్యార్థులకు ఇబ్బందులు
- సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలు
- ట్రిపుల్ ఐటీది అదేదారి
నూజివీడు : ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని సుమారు 21 వేల మంది బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోర్సులు పూర్తయినా ఫీజు బకాయి ఉండటంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో కోర్సులు పూర్తిచేశామనే ఆనందం విద్యార్థుల్లో ఆవిరైపోయింది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైనవారు, ఇతర కోర్సుల్లో చేరాల్సిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పేద విద్యార్థులు అప్పు చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఉపకార వేతనాలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇంటర్, పాలిటెక్నిక్, నర్సింగ్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఈడీ, ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ తదితర కోర్సులతోపాటు ట్రిపుల్ ఐటీలో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు కూడా ఉపకారవేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
భారీగా బకాయిలు..
ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన ఫీజులను విడతలవారీగా ప్రభుత్వం చెల్లిస్తోంది. బీసీలకు సంబంధించిన ఫీజులు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ప్రస్తుతం జిల్లాలోని 21వేల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు సంబంధించిన రూ.25కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. ఎస్సీలకు సంబంధించిన మరో కోటి రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయకపోవడం దారుణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈబీసీలకు 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలై ట్రెజరీలకు వచ్చినా ఖజానాలో కొర్రీలు వేసి నిధులు నిలిపివేశారని విద్యార్థులు వాపోతున్నారు.
ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు..
ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం పూర్తి చేసుకున్న 2వేల మంది విద్యార్థులకు బకాయి లేకుండా ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని స్పష్టంచేశారు. ట్రిపుల్ ఐటీలో కోర్సులు పూర్తిచేసిన వారిలో కొందరు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు పొందారు. వీరితోపాటు వివిధ కళాశాల విద్యార్థులు కూడా క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు పొందారు. పలు ప్రాంతాల్లో వారు ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికెట్లు కోసం తమ కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కళాశాలల నిర్వాహకులు కోర్సు పూర్తయినట్లుగా లెటర్ ఇస్తున్నారనీ, సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.