40 శాతం దాటని ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ఖర్చులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల అమలు క్రమంగా వెనకబాటు పడుతోంది. మరో నెల రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇప్పటివరకు ఈ ప్రణాళికల కింద కేటాయించిన మొత్తంలో 40 శాతం మాత్రమే ఖర్చు కావడం గమనార్హం. వాస్తవానికి సబ్‌ప్లాన్ కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నిధులు విడుదల చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ... యంత్రాంగం ఉదాసీనతతో ఈ నిధులతో చేపట్టిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ప్రణాళికల కోసం రూ.16,655 కోట్లు కేటాయించారు. కానీ వీటిలో ఇప్పటివరకు కేవలం రూ.6,714 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
జనాభా ఆధారంగా కేటాయింపులు..: జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. బడ్జెట్‌లో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 9శాతం చొప్పున నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతో జనాభా ఆధారంగా గ్రామాల వారీగా పనులు చేపడతారు. 2016–17 సంవత్సరంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.10,483.96 కోట్లు.., ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.6,171.15 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ ప్రణా ళికల కింద ఖర్చు భారీగా తగ్గింది. ఇప్పటివరకు ఖర్చు 40 శాతానికే పరిమితమైంది. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 4,236 కోట్లు ఖర్చు కాగా.. ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.2,478 కోట్లు ఖర్చు చేసినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి.
‘ఉప ప్రణాళిక’ ఈసారీ అంతంతే!
Published Sat, Feb 18 2017 4:04 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement