ST sub-plan
-
‘ఉప ప్రణాళిక’ ఈసారీ అంతంతే!
40 శాతం దాటని ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ఖర్చులు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల అమలు క్రమంగా వెనకబాటు పడుతోంది. మరో నెల రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇప్పటివరకు ఈ ప్రణాళికల కింద కేటాయించిన మొత్తంలో 40 శాతం మాత్రమే ఖర్చు కావడం గమనార్హం. వాస్తవానికి సబ్‌ప్లాన్ కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నిధులు విడుదల చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ... యంత్రాంగం ఉదాసీనతతో ఈ నిధులతో చేపట్టిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ప్రణాళికల కోసం రూ.16,655 కోట్లు కేటాయించారు. కానీ వీటిలో ఇప్పటివరకు కేవలం రూ.6,714 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనాభా ఆధారంగా కేటాయింపులు..: జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. బడ్జెట్లో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 9శాతం చొప్పున నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతో జనాభా ఆధారంగా గ్రామాల వారీగా పనులు చేపడతారు. 2016–17 సంవత్సరంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.10,483.96 కోట్లు.., ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.6,171.15 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ ప్రణా ళికల కింద ఖర్చు భారీగా తగ్గింది. ఇప్పటివరకు ఖర్చు 40 శాతానికే పరిమితమైంది. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 4,236 కోట్లు ఖర్చు కాగా.. ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.2,478 కోట్లు ఖర్చు చేసినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. -
ఉప ప్రణాళికలకు గుడ్‌బై!
► వీటి స్థానంలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ► బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సర్కారు నిర్ణయం ►ఎస్సీ, ఎస్టీ కమిటీలకు కొత్త పథకాల రూపకల్పన బాధ్యత సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్ )లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. తాజాగా 2017–18 రాష్ట్ర బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సబ్‌ప్లాన్ అమలు సాధ్యం కాదని భావించిన సర్కారు ఈమేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతుల్లో పద్దులను ప్రవేశపెట్టేది. ప్రస్తుతం ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతులను రద్దు చేస్తూ వాటి స్థానంలో రెవెన్యూ వ్యయం(రెవెన్యూ ఎక్స్పెండీచర్), మూలధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్పెండీచర్) పద్ధతుల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీంతో ప్రణాళిక కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక గందరగోళంలో పడింది. ఈక్రమంలో దళితులు, గిరిజనుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి పేరిట సరికొత్త కార్యక్రమాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి వాటిలో కొనసాగించాల్సిన, కొత్తగా చేపట్టాల్సిన వాటిపై పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. రెండు విభాగాలకు ‘ప్రత్యేక అభివృద్ధి నిధి... ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల స్థానంలో కొత్తగా ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సబ్‌ప్లాన్ కు కేటాయించిన నిధులకంటే ఎక్కువ మొత్తంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద కేటాయించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన ఏర్పాౖటెన ఎస్టీ కమిటీలు కార్యాచరణకు ఉపక్రమించాయి. సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షిస్తూ వీటిలో కొత్తగా చేపట్టాల్సిన పథకాలపైనా పరిశీలన మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా సోమవారం ఈ రెండు కమిటీలు ప్రత్యేంగా సమావేశమయ్యాయి. సామాజిక భద్రత పథకాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్యం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రణాళికలు తయారు చేయనున్నాయి. వీటిని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి తుది నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. సబ్‌ప్లాన్ –2013 చట్టానికి సవరణలు... ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ట్టబద్ధమైనవి. ఈమేరకు 2013లో అప్పటి ప్రభుత్వం ఉభయసభల్లో చర్చించి చట్టబద్ధత కల్పించాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు చట్టంలో చేపట్టాల్సిన సవరణలపై సూచనలు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఉప ప్రణాళిక చట్టానికి సవరణలు చేయనుంది. ఆ రెండు శాఖలే కీలకం... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉప ప్రణాళికలకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేంద్రంగా ఉన్నప్పటికీ... కార్యక్రమాలకు కే టాయించే నిధులు పలు శాఖల ద్వారా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలో శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో లక్ష్యసాధన వెనుకబడుతూ వచ్చింది. ఈ క్రమంలో కొత్తగా అమ లు చేయనున్న ప్రత్యేక అభివృద్ధి నిధితో చేపట్టే కార్యక్రమాలకు ఇకపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారానే ఖర్చు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో మార్పులు
27న అన్ని పార్టీల ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ రూపకల్పనపై చర్చించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 27న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అన్ని పార్టీల తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు మళ్లించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నది. ఇటీవల కేంద్రం బడ్జెట్ రూపకల్పన విషయంలో మార్పులు సూచించింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంగా కాకుండా రెవెన్యూ, క్యాపిటల్ అనే పద్దులకింద బడ్జెట్ కేటాయింపులుండాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో కూడా మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్ ఎలా రూపొందించాలి అనే విషయాలపై సమ గ్రంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో ప్రజాప్రతి నిధు ల సలహాలు స్వీకరించి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక నిధులు కేటా యించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సీఎంఓ కార్యాలయం తెలిపింది. -
ఆ హక్కు చంద్రబాబుకెక్కడిది: మేరుగ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదోవ పట్టించారని మేరుగ నాగార్జున ఆరోపించారు. టీడీపీలోని దళిత మంత్రులందరు కళ్లులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధంగా దళితులు, గిరిజనులకు రావాల్సిన వాటాలను పక్కదారి పట్టించే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని అన్నారు. అమరావతిలో దళితుల భూమి లాక్కుని అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారా? అని ప్రశ్నించారు. తప్పుడు జీవోలు, లెక్కలతో దళితులు, గిరిజనులను అన్యాయం చేయొద్దని మేరుగ నాగార్జున సూచించారు. -
రాజకీయ జోక్యం తగదు
ఐఎంఎస్ ఆధ్వర్యంలో పెన్నార్ భవనం ఎదుట ధర్నా అనంతపురం ఎడ్యుకేషన్: రుణాల పంపిణీలో రాజకీయ జోక్యం నివారించాలని ఐక్య మాదిగ సమాజ్ (ఐఎంఎస్) ఆధ్వర్యంలో మంగళవారం పెన్నార్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఐఎంఎస్ అధ్యక్షులు వెంకటేశు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు జీఓ 25 మేరకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని కోరారు. 2015-16 విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో ఐఎంఎస్ జిల్లా అధ్యక్షులు మల్లేసు, కార్యదర్శి శంకర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టి.లక్ష్మీ, నాయకులు వరలక్ష్మీ, రాణి, ఓబులేసు, గోపాల్, వెంకటరాముడు, రాము, గిరమ్మ, సుంకమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉప ప్రణాళికపై దొంగ దెబ్బ
అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు ఎసరు అసలే ప్రణాళిక వ్యయం తగ్గింపు.. అందులోనూ భారీ కోత ప్రణాళిక వ్యయం రూ.26 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో రూ.1,944 కోట్లు కోత సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా వ్యయాన్ని భారీగా తగ్గించడంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల కేటాయింపుల్లో కోతలు పడ్డాయి. ప్రణాళికా వ్యయంలో ఎస్సీ ఉప ప్రణాళికకు 17.10 శాతం, ఎస్టీ ఉప ప్రణాళికకు 5.33 శాతం కేటాయిస్తారు. బడ్జెట్లో ప్రణాళిక వ్యయాన్ని ప్రభుత్వం రూ.26,672 కోట్లకు పరిమితం చేయటంతో మొదట్లోనే ఉప ప్రణాళికల నిధుల కేటాయింపులు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఉప ప్రణాళికను దొంగ దెబ్బతీసింది. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రణాళికా పద్దు కింద చేసిన కేటాయింపులను ప్రణాళికేతర పద్దు కిందకు మార్చేసింది. ప్రణాళికా వ్యయంలో రైతుల రుణమాఫీకి కేటాయించిన రూ.4000 కోట్లను ప్రణాళికేతర పద్దులోకి మార్చేసింది. పరిశ్రమల రాయితీల నిధులను కూడా ప్రణాళికా పద్దు నుంచి ప్రణాళికేతర పద్దుకు మార్చింది. ఇంకా కొన్ని రంగాల కేటాయింపులను కూడా ప్రణాళిక పద్దు నుంచి ప్రణాళికేతర పద్దుకు మార్చేయడంతో ప్రణాళికా వ్యయం రూ.18,000 కోట్లకే పరిమితం కానుంది. అంటే ప్రణాళిక పద్దు కింద కేటాయించిన సుమారు రూ.8,672 కోట్లను ప్రణాళికేతర పద్దు కిందకు ప్రభుత్వం మార్చివేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు కేటాయింపులకు భారీగా కోత పడనుంది. ప్రణాళికా వ్యయం రూ.26,672 కోట్ల నుంచి రూ.18,000 కోట్లకు పరిమితం కానుండటంతో ఆ మొత్తం నుంచే ఉప ప్రణాళికకు నిధులను పరిమితం చేస్తారు. ప్రణాళిక పద్దు వ్యయం కుదించడంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.1,944 కోట్ల నిధుల కోత పడనుంది. అరకొర కేటాయింపులు.. ఆపై కోతలు ఉప ప్రణాళిక అమలు ఇప్పటికే అంతంతమాత్రంగా ఉంది. తొలుత ప్రణాళిక కేటాయింపుల ఆధారంగా ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.4,560 కోట్లను కేటాయించినా డిసెంబర్ నెలాఖరు వరకు చేసిన వ్యయం కేవలం రూ.1,340 కోట్లే. అలాగే ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.1,421 కోట్లు కేటాయించినా డిసెంబర్ చివరి వరకు రూ.273 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇప్పుడు ప్రణాళికా వ్యయాన్ని రూ.18,000 కోట్లకు తగ్గించడంతో ఉప ప్రణాళిక కేటాయింపుల్లో భారీగా కోత పడనుంది. ఎస్సీ ఉప ప్రణాళికకు 17.10 శాతం మేర రూ.1,482 కోట్ల నిధులు తగ్గిపోనున్నాయి. ఎస్టీ ఉప ప్రణాళికకు 5.33 శాతం మేర రూ.462 కోట్ల నిధులు తగ్గిపోనున్నాయి. -
‘సబ్‌ప్లాన్’ మురుగుతోంది!
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం 3 నెలల్లోగా నిధులు వ్యయం చేయకపోతే రూ. 4,421 కోట్లు మురిగినట్లే ⇒ కేటాయింపులే అరకొర.. అవీ ఖర్చు చేయరు! ⇒ దళిత, గిరిజనుల అభ్యున్నతి లక్ష్యం ఉత్తుత్తి మాటలే ⇒ ఉప ప్రణాళిక కేటాయింపుల్లో ఖర్చు నామమాత్రమే ⇒ సర్కారు తాజా సమీక్షలో వెల్లడైన చేదు నిజాలు సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనుల జీవనప్రమాణాలు పెంచే ఉద్దేశంతో ప్రత్యేకంగా చట్టం తెచ్చి చేపట్టిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. వాస్తవ అవసరాలకు తగ్గట్లు కేటాయింపులే చేయకపోగా.. కేటాయించిన నిధులను కూడా ఖర్చుపెట్టకుండా మురగబెడుతున్న తీరు.. ఆ వర్గాలపై సర్కారు ప్రేమ ఏ పాటిదో తేట తెల్లం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముప్పావు వంతు ముగిసిపోయినప్పటికీ.. ఎస్సీ ఉప ప్రణాళికలో కనీసం 30 శాతం కూడా ఖర్చుచేయలేదు. ఇక ఎస్టీ ఉప ప్రణాళిక విషయంలో వ్యయం మరింత దిగజారిపోయింది. కేటాయించిన అరకొర నిధుల్లో కేవలం 18 శాతం మాత్రమే ఖర్చు చేశారు. ఇక మిగిలివున్న మూడు నెలల కాలంలో మిగతా 70, 80 శాతం నిధుల్లో ఏ మాత్రం ఖర్చు పెడతారో ఊహించుకోవచ్చు. కేటాయింపుల్లోనే తగ్గిపోయిన ఉపప్రణాళికలు... చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ సమయంలోనే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు వీలైనంత మేర నిధుల కేటాయింపు తగ్గించాలనే ఆలోచనతోనే రాష్ట్ర వార్షిక ప్రణాళికను కేవలం రూ. 26,670 కోట్లకే పరిమితం చేసింది. వార్షిక ప్రణాళిక తగ్గిపోవడంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల వాటా కూడా తగ్గిపోయింది. అయితే.. చేసిన అరకొర కేటాయింపులను ఖర్చు చేయటంలోనూ అలవిమాలిన నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు తీరుపై సమీక్షించడానికి సమయం దొరకలేదు. అధికారులు సమీక్ష కోసం అనేక సార్లు కోరినప్పటికీ ఆఖరికి శనివారం నాడు సమయం ఇచ్చి సమీక్షించారు. ఈ సమీక్షలో వెల్లడైన వాస్తవాలు.. దళిత, గిరిజన, బడుగు వర్గాల సంక్షేమంపై ప్రభుత్వ తీవ్ర అలసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. ఆ వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యం అంటూ బయట చేసుకుంటున్న ప్రచారానికి, వారికోసం చేపట్టిన ప్రణాళిక అమలుకు మధ్య పొంతనలేని తనం స్పష్టంగా కనిపిస్తోంది. కేటాయించిన నిధులైనా ఖర్చుచేయరు... ⇒ ఎస్సీ ఉపప్రణాళిక కోసం బడ్జెట్లో 4,574 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటివరకు కేవలం 1,340 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేశారు. అంటే మొత్తం కేటాయింపుల్లో ఇది కేవలం 29.3 శాతం మాత్రమే. దళితుల కోసం కేటాయించిన నిధుల్లో నూటికి 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టని దుస్థితి. ఎస్సీ ఉప ప్రణాళిక కేటాయింపుల్లో రూ. 3,234 కోట్లను మూడు నెలల్లో ఖర్చు చేయాలి. లేదంటే ఆ నిధులన్నీ ఎస్సీ వర్గాల ప్రయోజనం చేకూర్చకుం డానే మురిగిపోతాయి. ⇒ ఇదే తరహాలో ఎస్టీ ఉప ప్రణాళిక కోసం బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు చేసిన వ్యయం కేవలం రూ. 273 కోట్లు మాత్రమే. అంటే ఇది వాస్తవ కేటాయింపుల్లో కేవలం 18.2 శాతం మాత్రమే. గిరిజనుల కోసం కేటాయించిన నిధుల్లో నూటికి 18 రూపాయల 20 పైసలు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్టీ ఉప ప్రణాళిక కేటాయింపుల్లో మిగతా రూ. 1,187 కోట్లను వచ్చే మార్చి నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఆ నిధులన్నీ మురిగిపోనున్నాయి. ⇒ ఇక బీసీ సంక్షేమానికి బడ్జెట్లో రూ. 1,460 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ. 979 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక వ్యయంకన్నా కాస్త మెరుగుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది కూడా మొత్తం నిధుల్లో 67 శాతం మాత్రమే. అంటే నూటికి రూ.67 మాత్రమే ఖర్చు చేశారు. కేటాయింపుల్లో మిగతా రూ. 481 నిధులను వచ్చే ఏడాది మార్చి లోగా వ్యయం చేయకుంటే మురిగిపోతాయి. ఎస్టీ జనాభా 5.53 శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంతో గిరిజనుల జనాభా శాతం స్వల్పంగా పెరగనుంది. ఆ మండలాలు లేకుం డా అయితే ఎస్టీ జనాభా 5.33 శాతం ఉండగా ఆ మండాలను కలిపిన తరువాత ఎస్టీ జనాభా 5.53 శాతానికి పెరిగింది. రూ. 4,421 కోట్లు మురిగిపోవాల్సిందేనా? మొత్తం మీద.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అనేది కేటాయింపులకే పరిమితమైంది తప్ప వాస్తవ ఖర్చు మాత్రం అంతంతమాత్రమేనని తేలింది. కేటాయించిన నిధుల్ని ఎంతో ప్రాధాన్యతతో వ్యయం చేయాల్సిన చోట నిర్లక్ష్యం, ఉదాసీనత రాజ్యమేలుతోందని సమీక్షలో వెల్లడయింది. ఇదే సమీక్ష రెండు, మూడు నెలల క్రితమే చేసి ఉంటే వ్యయంలో ఎంతో కొంత కదలిక వచ్చేదని అధికార యంత్రాంగమే వ్యాఖ్యానిస్తోంది. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు ఉప ప్రణాళికలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయలేకపోతే ఆ నిధులన్నీ మురిగిపోతాయి. అదే జరిగితే ఏకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చేరాల్సిన 4,421 కోట్ల రూపాయలు మురిగిపోనున్నాయి. -
ప్రతిపక్షం గొంతునొక్కి అబద్ధాలు ప్రచారమా?
వైసీపీ ఎమ్మెల్యేల మండిపాటు దళిత సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని ధ్వజం హైదరాబాద్: శాసనసభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అం శంపై చర్చ సందర్భంగా ఆ వర్గ ప్రతి నిధులను మాట్లాడనివ్వలేదని, పైగా వైఎస్సార్ హయూం లో నిధులు పక్కదోవ పట్టాయని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని ఉప్పులేటి కల్పన మండిపడ్డా రు. వైఎస్సార్ తన హయూంలో చేసిన అభివృద్ధి మరెవరూ చేయలేదని తెలిపారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీల నిధులు జన్మభూమికి మళ్లించారని ధ్వజమెత్తారు. తన పరిపాలనలో రూ. 10 వేల కోట్ల నిధులు మళ్లించిన సంగతి బాబు మరిచారన్నారు. మేకా వెంకటప్రతాప అప్పారావు మాట్లాడుతూ బడ్జెట్లోని లోటుపాట్లను జగన్‌ను చెప్పనిస్తే అధికారపక్షం డొల్లతనం బయటపడుతుం దని, అందుకే సభా సమయం వృథా చేయడానికి టీడీపీ సభ్యులు, మంత్రులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వకుండా ప్రజల గొంతు నొక్కాలను కోవడం సరికాదని ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ సూచించారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేయించి అధికార పక్ష సభ్యులు తమ నైజం చాటుకున్నారన్నారని ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, ముస్తఫాలు విమర్శించారు. ప్రతి పక్ష పార్టీకి చెందిన దళిత సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ైవె ఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి తదితరులు కూడా తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో నిజమెం తో, అవాస్తవాలెంతో తేలాలంటే శ్వేతపత్రం విడుదల ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి చెప్పారు. -
ఇక సం‘క్షేమ’మా..?!
ఖమ్మం హవేలి: రాష్ట్ర విభజనకు ముందు అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను చట్టబద్ధం చేసినా సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు ఒక్క పైసా విదల్చకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఉపప్రణాళిక నిధులు సాంఘిక సంక్షేమశాఖకు వస్తాయనే ఆశలు ప్రతి ఒక్కరిలో చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉపప్రణాళిక నిధులకు బదులు జనరల్ ఫండ్స్ మాత్రమే వస్తుండడంతో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేకపోతోంది. సగానికిపైగా సీట్లు ఖాళీయే.. మూడు నుంచి 10 తరగతులు చదివే విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో జిల్లాలో 77 వసతిగృహాలు ఉన్నాయి. ఇందులో 52 బాలుర, 25 బాలికల కు సంబంధించినవి. వీటితోపాటు అనాథ పిల్లల కోసం ఖమ్మంలో బాలికలు, భద్రాచలంలో బాలుర వసతిగృహాలు ఉన్నాయి. సత్తుపల్లిలో ఒక ఇంటిగ్రేటెడ్ వసతిగృహం, ఖమ్మంలో ఒక చైల్డ్ బెగ్గర్ హోమ్ నిర్వహిస్తున్నారు. వీటన్నింటిలో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిదివేల సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం నాటికి 3,847 సీట్లు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా 4,153 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ వసతి గృహాలన్నీ సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వేంసూరు బాలుర, మధిర బాలి కల, ఖమ్మం ‘సి’ బాలుర, భద్రాచలం బాలుర అనంద నిలయం, ఎర్రుపాలెం బాలుర, పెనుబల్లి బాలుర వసతిగృహాలు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలికంగా వీటిని అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య రెండేళ్లుగా తగ్గిపోతోంది. ఉపప్రణాళిక నిధులు వస్తే సౌకర్యాలు మరింతగా మెరుగుపడి విద్యార్థుల చేరిక పెరిగే అవకాశం ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా గత ఆర్థిక సంవత్సరం 17,800 మంది విద్యార్థులకు రూ.10,15,91,430 ఉపకార వేతనాలు, రూ.36,23,57,043 ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ విద్యాదీవెన ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.76,18,300 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్స్, ఎస్సీ న్యాయవాదుల శిక్షణ కోసం రూ.3,50,000, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద రూ.1,03,10,000, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పథకం ద్వారా రూ.5,00,000, విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు రూ.1,95,000, కులాంతర వివాహాలకు రూ.7,20,000 ఖర్చు చేశారు. ఉపప్రణాళిక ద్వారా జిల్లాలో ఎస్సీ కాలనీల్లో విద్యుత్‌చార్జీలు (50 యూనిట్ల లోపు) 22,322 సర్వీసులకు రూ.2,25,57,000 వెచ్చించారు. ఈ ఒక్క విభాగంలో మాత్రమే ఉప ప్రణాళిక నుంచి నిధులు మంజూరు కావడం గమనార్హం. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు ఎల్‌డబ్ల్యూఈఏ ద్వారా రూ.206కోట్లు జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలలు 365, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 75, వసతిగృహాలు 45 ఉన్నాయి. ఇందులో విద్యార్థుల ప్రవేశాల లక్ష్యం నాలుగేళ్లుగా నెరవేరుతోంది. ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా గత సంవత్సరం రూ.50 కోట్లు మంజూరు కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతా ల నిధులు (ఎల్‌డబ్ల్యూఈఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.206 కోట్లు వచ్చాయి. 67 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో 30 అద్దె భవనాల్లోనే.. బీసీ సంక్షేమశాఖ కింద జిల్లాలో మొత్తం 67 వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 47 హాస్టళ్లు ప్రీమెట్రిక్, 20 వసతి గృహాలు కళాశాలలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో 30 వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగేవాటిలో కల్లూరు, వి.వెంకటాపురం, అశ్వాపురం బాలుర, నేలకొండపల్లి బాలికల వసతిగృహాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన 26 హాస్టళ్లకు ఇప్పటివరకు స్థలం కేటాయించ లేదు. వీటిలో మొత్తం 5,020 సీట్లు ఉండగా నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలోనే భర్తీ అవుతున్నాయి. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా సగటు 89.78 శాతం కాగా బీసీ వసతిగృహాల్లో ఉండి చదువుకున్న విద్యార్థుల్లో 705 మందికి 672మంది (95.2శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. బీసీ సంక్షేమ శాఖకు నిధులు మంజూరు చేసి అద్దె భవనాల్లో కొనసాగుతున్నవాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థులకు మరింత మేలు కలిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాశిక ద్వారా ఆయా శాఖల సంక్షేమ వసతిగృహాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు బీసీ సంక్షేమ వసతిగృహాలకు నిధులు మరింతగా పెంచి వాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థుల సంక్షేమం ప్రగతిపథంలో దూసుకెళ్లే అవకాశం ఉంది. -
జిల్లాకు ఉప ప్రణాళిక నిధులు రూ.6.64కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా జిల్లాకు రూ. 6.64కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ బి.శ్రీధర్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, చిన్న నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. మండలాల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. చిన్న నీటిపారుదల కింద రూ.4.38కోట్లు, పంచాయతీరాజ్ పనులకు రూ.1.32కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ. 92.86లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. కేటాయించిన వర్గాలకే ఈ నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిధుల వినియోగంలో దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి ల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిమిత్తం ప్రతి మండలానికి రూ.5వేల చొప్పున నిధులు మంజూరయ్యాయన్నారు. ఈనెల 9న అన్ని మండల కేంద్రాల్లో మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. 10న జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చిలుకూరులోని మహిళా ప్రాంగణంలో జిల్లాస్థాయి ఉత్సవాలు చేపట్టాలన్నారు. ఉత్సవాల్లో గ్రామ, మండల సమాఖ్యలు, యువజన సంఘాలు, అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయాలన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.