ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో మార్పులు
27న అన్ని పార్టీల ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ రూపకల్పనపై చర్చించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 27న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అన్ని పార్టీల తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు మళ్లించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నది. ఇటీవల కేంద్రం బడ్జెట్ రూపకల్పన విషయంలో మార్పులు సూచించింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంగా కాకుండా రెవెన్యూ, క్యాపిటల్ అనే పద్దులకింద బడ్జెట్ కేటాయింపులుండాలని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో కూడా మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్ ఎలా రూపొందించాలి అనే విషయాలపై సమ గ్రంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో ప్రజాప్రతి నిధు ల సలహాలు స్వీకరించి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక నిధులు కేటా యించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సీఎంఓ కార్యాలయం తెలిపింది.