డీఎస్సీ–98 అభ్యర్థులకు ఉద్యోగాలేవి?
⇒ 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేల మంది నిరుద్యోగులు
⇒ అమలుకు నోచుకోని సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–1998లో నష్టపోయిన వారికి ఉద్యోగాలు ఎప్పుడు అందుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. వారికి న్యాయం చేయాలని, ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. అసలు ఆ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండేళ్ల కింద హామీ ఇచ్చినా అధికారులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు.1998లో జరిగిన 40 వేల టీచర్ పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఆ డీఎస్సీలో 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించగా.. 15 మార్కులు ఇంటర్వ్యూలకు కేటాయించారు.
తొలుత ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారికి 40 మార్కు లను కనీస అర్హతగా నిర్ణయించారు. కానీ పోస్టుల సంఖ్య కంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో.. కనీస అర్హత మార్కులను 45, 40, 35కు కుదించారు. నియామకాల సందర్భంగా అవకతవకలకు పాల్పడ్డారు. రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వూ్యల్లో ఎక్కువ మార్కులు వేసి ఎంపిక చేశారు. దీంతో నష్టపోయిన వేలాది మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని సుప్రీం కూడా ఆదేశించింది.
సీఎం హామీ కూడా అమలుకాదా?: 2015 జనవరిలో సీఎం కేసీఆర్ 1998 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు త్వరలోనే ఉద్యోగాలు ఇచ్చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఒకసారి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారే కాక.. 2012 వరకు నిర్వహించిన మరో ఐదు డీఎస్సీల్లోనూ నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికీ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఉద్యోగాల కోసం దాదాపు 7 వేల మంది బాధితులు మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.