ఖమ్మం హవేలి: రాష్ట్ర విభజనకు ముందు అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను చట్టబద్ధం చేసినా సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు ఒక్క పైసా విదల్చకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఉపప్రణాళిక నిధులు సాంఘిక సంక్షేమశాఖకు వస్తాయనే ఆశలు ప్రతి ఒక్కరిలో చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉపప్రణాళిక నిధులకు బదులు జనరల్ ఫండ్స్ మాత్రమే వస్తుండడంతో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేకపోతోంది.
సగానికిపైగా సీట్లు ఖాళీయే..
మూడు నుంచి 10 తరగతులు చదివే విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో జిల్లాలో 77 వసతిగృహాలు ఉన్నాయి. ఇందులో 52 బాలుర, 25 బాలికల కు సంబంధించినవి. వీటితోపాటు అనాథ పిల్లల కోసం ఖమ్మంలో బాలికలు, భద్రాచలంలో బాలుర వసతిగృహాలు ఉన్నాయి. సత్తుపల్లిలో ఒక ఇంటిగ్రేటెడ్ వసతిగృహం, ఖమ్మంలో ఒక చైల్డ్ బెగ్గర్ హోమ్ నిర్వహిస్తున్నారు. వీటన్నింటిలో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిదివేల సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.
ఈ విద్యా సంవత్సరం నాటికి 3,847 సీట్లు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా 4,153 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ వసతి గృహాలన్నీ సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వేంసూరు బాలుర, మధిర బాలి కల, ఖమ్మం ‘సి’ బాలుర, భద్రాచలం బాలుర అనంద నిలయం, ఎర్రుపాలెం బాలుర, పెనుబల్లి బాలుర వసతిగృహాలు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలికంగా వీటిని అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య రెండేళ్లుగా తగ్గిపోతోంది.
ఉపప్రణాళిక నిధులు వస్తే సౌకర్యాలు మరింతగా మెరుగుపడి విద్యార్థుల చేరిక పెరిగే అవకాశం ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా గత ఆర్థిక సంవత్సరం 17,800 మంది విద్యార్థులకు రూ.10,15,91,430 ఉపకార వేతనాలు, రూ.36,23,57,043 ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ విద్యాదీవెన ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.76,18,300 ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్స్, ఎస్సీ న్యాయవాదుల శిక్షణ కోసం రూ.3,50,000, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద రూ.1,03,10,000, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్ పథకం ద్వారా రూ.5,00,000, విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు రూ.1,95,000, కులాంతర వివాహాలకు రూ.7,20,000 ఖర్చు చేశారు. ఉపప్రణాళిక ద్వారా జిల్లాలో ఎస్సీ కాలనీల్లో విద్యుత్‌చార్జీలు (50 యూనిట్ల లోపు) 22,322 సర్వీసులకు రూ.2,25,57,000 వెచ్చించారు. ఈ ఒక్క విభాగంలో మాత్రమే ఉప ప్రణాళిక నుంచి నిధులు మంజూరు కావడం గమనార్హం.
ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు ఎల్‌డబ్ల్యూఈఏ ద్వారా రూ.206కోట్లు
జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలలు 365, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 75, వసతిగృహాలు 45 ఉన్నాయి. ఇందులో విద్యార్థుల ప్రవేశాల లక్ష్యం నాలుగేళ్లుగా నెరవేరుతోంది. ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా గత సంవత్సరం రూ.50 కోట్లు మంజూరు కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతా ల నిధులు (ఎల్‌డబ్ల్యూఈఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.206 కోట్లు వచ్చాయి.
67 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో 30 అద్దె భవనాల్లోనే..
బీసీ సంక్షేమశాఖ కింద జిల్లాలో మొత్తం 67 వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 47 హాస్టళ్లు ప్రీమెట్రిక్, 20 వసతి గృహాలు కళాశాలలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో 30 వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగేవాటిలో కల్లూరు, వి.వెంకటాపురం, అశ్వాపురం బాలుర, నేలకొండపల్లి బాలికల వసతిగృహాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన 26 హాస్టళ్లకు ఇప్పటివరకు స్థలం కేటాయించ లేదు.
వీటిలో మొత్తం 5,020 సీట్లు ఉండగా నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలోనే భర్తీ అవుతున్నాయి.
గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా సగటు 89.78 శాతం కాగా బీసీ వసతిగృహాల్లో ఉండి చదువుకున్న విద్యార్థుల్లో 705 మందికి 672మంది (95.2శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. బీసీ సంక్షేమ శాఖకు నిధులు మంజూరు చేసి అద్దె భవనాల్లో కొనసాగుతున్నవాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థులకు మరింత మేలు కలిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాశిక ద్వారా ఆయా శాఖల సంక్షేమ వసతిగృహాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు బీసీ సంక్షేమ వసతిగృహాలకు నిధులు మరింతగా పెంచి వాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థుల సంక్షేమం ప్రగతిపథంలో దూసుకెళ్లే అవకాశం ఉంది.
ఇక సం‘క్షేమ’మా..?!
Published Mon, Jul 7 2014 1:36 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement