division of the state
-
20 నుంచి ఆర్‌ఎస్‌వైఎఫ్ జీపు జాతా
కడప వైఎస్సార్ సర్కిల్: రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి జీపుజాతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం ఆర్సీపీ కార్యాలయంలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం విద్యార్థి, యువత సమస్యలపై పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రాయలసీమ ప్రాంతానికి 35 శాతం నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్దికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌వైఎఫ్ నాయకులు శంకర్, నరసింహా, భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వలసదారులు అనడానికి వీల్లేదు
- ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవారు ‘వలసదారులు’ కారు - ఏపీలో స్థానికత ఉండి.. తిరిగొచ్చినవారు వలసదారులు కారు - ఆ పేరుతో వారి కుల ధ్రువీకరణలను తిరస్కరించరాదు: హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత ఉన్న వారు రాష్ట్ర విభజన తరువాత ఏదో ఒక రాష్ట్రంలో స్థానికుడిగా ఉండేందుకు నిర్ణయించుకోవచ్చునని, అలాంటి వారిని స్థానికులుగానే పరిగణించి, వారికి సామాజిక రిజర్వేషన్లను సైతం వర్తింపచేయాలని ఎన్టీఆర్ వైద్య వర్సిటీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో కలిసున్న వారు రాష్ట్ర విభజన తరువాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళితే దానిని ‘వలస’ అని, అలా వెళ్లిన వారిని ‘వలసదారులు’ అని అనడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఒక రాష్ట్రం ఒక వ్యక్తిని ఎస్సీ, ఎస్టీ, బీసీగా గుర్తించినంత మాత్రాన మరో రాష్ట్రం కూడా ఆ వ్యక్తిని అదే వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నేను స్థానికేతరురాలినా? ఏపీకి చెందిన తన తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణకు వచ్చారని, తరువాత బదిలీపై తిరిగి ఏపీకి వెళ్లారని, ఈ నేపథ్యంలో ఎంసెట్ ప్రవేశాల సందర్భంగా తనను స్థానికేతరురాలిగా పరిగణిస్తూ, బీసీ-ఏ కింద రిజర్వేషన్లు కల్పించేందుకు నిరాకరిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి జోత్స్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనలతో మిరియాల ప్రియదర్శిని, మరికొంత మందీ వేర్వేరుగా పిటిషన్లు చేశారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది తడ్డి నాగేశ్వరరావు తన వాదనలు వినిపించారు. వలసదారుడు అనడానికి వీల్లేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ... ఏపీ, తెలం గాణలు రెండుగా విడిపోయిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో స్థానికుడిగా ఉన్న వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని స్థానికుడిగా ఉండేందుకు ఎంచుకోవచ్చనీ, ఆ వ్యక్తిని ఒక రాష్ట్రం నుంచి ‘వలస’ వచ్చారని గానీ, ‘వలసదారుడు’ అని గానీ చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదంది. ఇక రెండో క్లిష్టమైన అంశానికి వస్తే... ఈ వ్యాజ్యాల్లో కొందరు పిటిషనర్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జన్మించారు. వారికి అక్కడి అధికారులే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వారు ఇప్పుడు తిరిగి వారి సొంత ప్రాంతాలకే వెళుతున్నారు. ఇలా ఒక ప్రాంతంలో స్థానికత ఉండి.. మరో ప్రాంతంలో పెరిగి.. తిరిగి స్థానికత ఉన్న ప్రాంతానికి వెళుతుంటే అటువంటి వారిని వలసదారులుగా పేర్కొంటూ వారికి గతంలో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను తిరస్కరించడానికి వీల్లేదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. పిటిషనర్లను స్థానికులుగానే పరిగణిస్తూ వారికి ఆ మేర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. -
నేడు నవ నిర్మాణ దీక్ష
► విజయవాడ బెంజి సర్కిల్లో ఏర్పాట్లు ► ఉదయం 11 గంటలకు ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బెంజి సర్కిల్ వద్ద ‘నవ నిర్మాణ దీక్ష’ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 13 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు నవ నిర్మాణ దీక్ష జరుగుతుంది. ప్రజలతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ నవ్యాంధ్ర నిర్మాణంలో మేమంతా భాగస్తులమవుతామంటూ రాష్ట్ర ప్రజలతో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేయిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది. వేదికకు చేరుకునేది ఇలా.. హైదరాబాద్ వైపు నుంచి స్వరాజ్యమైదానం మీదగా వేదిక వద్దకు వచ్చే వాహనాలను డీవీ మేనర్ వరకు, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ విగ్రహం వరకు, చెన్నై, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను పకీరుగూడెం జంక్షన్ వరకు, ఏలూరు, గన్నవరం నుంచి వచ్చే వాహనాలను నిర్మలా కాన్వెంట్ వరకు అనుమతిస్తారు. అక్కడ నుంచి సభాస్థలికి ప్రజలు నడిచి రావాల్సి ఉంటుంది. ఆయా ప్రదేశాలకు దగ్గరలోనే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మిట్టమధ్యాహ్నం.. మండుటెండలో.. గత ఏడాది జూన్ 2న జరిగిన నవ నిర్మాణ దీక్షను తలుచుకుని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒక వైపు నిప్పులు చెరిగే ఎండ.. మరో వైపు మిట్టమధ్యాహ్నం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు విలవిలలాడారు. మంచినీటి కోసం తహతహలాడారు. ఈ ఏడాది కూడా అందుకు భిన్నంగా జరగకపోవచ్చని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. తెల్లవారుజాము 4 నుంచి 12 గంటల వరకు ట్రాఫిక్‌ను నగరంలోకి రానీయకుండా అడ్డుకుంటారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలు.. జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రచార పాటలతో వారం రోజు ల పాటు రాష్ట్రాన్ని హోరెత్తించనున్నారు. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రా ల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు. -
లక్షన్నర పోస్టులు మాయం
భర్తీ చేసేది 20,244.. సీఎం ఆమోదానికి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, లేదంటే ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలముందు ఊదర గొట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు నిరుద్యోగుల ఆశలపై కత్తి దూశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. ఇంతే కాకుండా జూన్ 2వ తేదీ నాటికి 30 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ పోస్టులతో కలిపితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయరాదని, కేవలం 20,244 పోస్టుల భర్తీతో ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 1.52 లక్షల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలికింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఖాళీల సంఖ్యను కుదించడంపైనే కసరత్తు చేయించారు. ఆ మేరకు 20,244 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీ లేదు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయరాదని నిర్ణయించారు. అంటే పెద్ద చదువులు చదవలేని ఆర్థిక స్థోమత లేని కింద తరగతి, మధ్యతరగతి నిరుద్యోగులకు ఇక సర్కారు కొలువులు ఎండమావేనని తేలిపోయింది. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ మాత్రమే చదివిన నిరుద్యోగులు అటెండర్ లేదా డ్రైవర్, రికార్డు అసిస్టెంట్ వంటి పోస్టులు వస్తాయని భావించేవారు. రాష్ట్రప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయరాదని నిర్ణయించడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. నాలుగో తరగతి ఉద్యోగాలను అవసరాలకు అనుగుణంగా కేవలం ఔట్‌సోర్సింగ్‌లో భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం వివిధ శాఖల్లో 20,244 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది. ఇందులో పోలీసు పోస్టుల భర్తీ మినహాయించి మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఆదేశాలు జారీ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టుల్లో గ్రూప్-1 కేవలం 94 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా పోలీసు శాఖలో 9000 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో కానిస్టేబుళ్లతో పాటు ఎస్ఐ, సీఐ పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్-2 పోస్టులు 1100, గ్రూప్-3 పోస్టులు 1500 భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఇతర రంగాల్లో 6,500 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ రంగాల్లో 550 లెక్చరర్, 500 హాస్టల్ వార్డెన్, 750 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 600 వ్యవసాయ విస్తరణాధికారులు, 200 గణాంక సహాయ ఆఫీసర్లు, 300 గిరిజన సంక్షేమ శాఖ, మత్స్య, పశుసంవర్థక తదితర రంగాల్లో పోస్టులున్నాయని ఉన్నతాధికారి వివరించారు. -
ఆదాయం వస్తున్నా బీద అరుపులేల
► ఇందిరమ్మ’ లబ్ధిదారులగోడు పట్టదా ► ప్రభుత్వంపై పీసీసీ ఉపాధ్యక్షుడు ► నాదెండ్ల మనోహర్ ధ్వజం తెనాలి : రాష్ట్ర విభజనతో ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటును అధిగమించి, ఆదాయం పెరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం, ప్రజల అవసరాలపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాయం పెరిగినా సంక్షేమానికి ప్రభుత్వం అరకొర కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. తెనాలిలోని స్వగృహంలో గురువారం విలేకర్లతో మనోహర్ మాట్లాడారు. సేల్స్‌టాక్సు రూపేణా రూ.31,120 కోట్లు, వివిధ పన్నుల రూపంలో రూ.44, 423 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. తెలంగాణకు రూ.40 వేల కోట్ల పన్ను ఆదాయం వస్తే, ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 4,423 కోట్లు వచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధులు మరో 21,200 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,300 కోట్లు సమకూరాయని, రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు భర్తీ అయి రూ.1573 కోట్లు అదనంగా వచ్చినట్టు వివరించారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద పదేళ్లలో 64 లక్షల గృహాలను నిర్మించినట్టు గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అవకతవకలంటూ విచారణకు ఆదేశించి బిల్లులు నిలుపుదల చేసిందన్నారు. మరోవైపు కొత్తగా రూ.16,300 కోట్లతో ఆరు లక్షల గృహాలను నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో ఇప్పటివరకు కేటాయించింది కేవలం రూ.1132 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టును అరకొర నిధులతో ఎలా పూర్తిచేస్తారన్నారు. వైఎస్ హయాంలో పార్టీల కతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందిస్తే, ఇప్పుడు ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కార్యకర్తల సిఫార్సు చేయాలనే నిబంధనలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. -
రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం
► గడువుకు ముందే లక్ష్య సాధన ► ఫిబ్రవరి నాటికే రూ.162.12 కోట్ల ఆదాయం ► 1,05,415 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యానికి మించిన ఆదాయంతో దూసుకెళ్తోంది. అనంతపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరుకు ఈ రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.153.99 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఏకంగా 162.12 కోట్ల ఆదాయ లభించింది. అనంతపురం పరిధిలో రూ.93.28 కోట్లకు రూ.103.69 కోట్లు రాగా, హిందూపురం పరిధిలో రూ.60.71 కోట్లకు రూ.58.43 కోట్లు వచ్చింది. సాధారణంగా లక్ష్యాలను మార్చి 31 నాటికి ఇస్తారు. ఈ శాఖ లక్ష్యాలను మందుగానే సాధించింది. రాష్ట్ర విభజన, రియల్ వ్యాపారం పెరగడం, ఎక్కువ మంది స్థిరాస్తి పైన పెట్టుబడులకు ఆకర్షితులు కావడంతో క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ శాఖ తొలి నుంచి లక్ష్యాలను మించి ఆదాయం ఆర్జించడం విశేషం. కాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.173.46 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా రూ.137.03 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. అయితే ఈ సారి మాత్రం లక్ష్యాలను మించి ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నాటికి అనంతపురం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 58,042 డాక్యుమెంట్లు, హిందూపురం పరిధిలో 47,373 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఫిబ్రవరి నాటికి సాధించిన లక్ష్యాలను పరిశీలిస్తే ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచింది. ద్వితీయ స్థానంలో హిందూపురం, తృతీయ స్థానంలో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నాయి. లక్ష్య సాధనలో ముందున్నాం అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఆదాయం బాగా సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి లక్ష్యసాధనలో ముందున్నాం. ఫిబ్రవరి వరకు చూస్తే సుమారు రూ.9 కోట్ల వరకు లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు మరింత ఆదాయం వస్తుంది. - ఎ.గిరికుమార్, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
బదిలీ చేయండి.. వెళ్లిపోతాం...
- సొంత ప్రాంతానికి బదిలీ కోరుతున్న 148 మంది ఏపీ టీచర్లు - ఇప్పటికే పలుమార్లు మంత్రులను కలిసి వినతుల సమర్పణ - స్పష్టత ఇవ్వని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు - మాటలతో సరిపెడుతున్న వైనం.. చేతలు శూన్యం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మా రాష్ట్రానికి బదిలీ చేయండి.. వెంటనే వెళ్లిపోతాం’.. అంటూ తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత టీచర్లు వేడుకుంటున్నా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరగడంతో.. అప్పట్లో ఉన్న విద్యాశాఖ నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియతో సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోవడంతో.. ఓపెన్ కేటగిరీలో జిల్లాలో నియమితులైన పలువురు టీచర్లు ఇక్కడే పనిచేస్తున్న వారు సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశం లేదు. ‘స్థానిక’ అవకాశాలకు విఘాతం.. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండటం, మరోవైపు హైదరాబాద్‌లో స్థానిక సంస్థల పాఠశాలలు లేకపోవడంతో అంతర్ జిల్లా బదిలీల కింద వచ్చే వారంతా జిల్లానే ఎంచుకున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా అంతర్ జిల్లా బదిలీల పరంపర కొనసాగింది. దీంతో జిల్లాలో స్థానికేతర టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు ఓపెన్ కేటగిరీ నియామకాల్లోనూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. దీంతో జిల్లాలో స్థానిక, స్థానికేతర నిష్పత్తిలో వ్యత్యాసం అధికమైంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయంటూ అటు విద్యార్థిసంఘాలు, ఇటు ఉపాధ్యాయ, రాజకీయ వర్గాలు ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టాయి. అంతర్ జిల్లా బదిలీల నిలుపుదలతో పాటు నియామకాలన్నీ స్థానికులతోనే భర్తీ చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చాయి. అయితే ఇవన్నీ ఆచరణసాధ్యం కాలేదు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన టీచర్లు స్వచ్ఛందంగా బదిలీ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా జిల్లాలో 148 మంది టీచర్లు సొంత ప్రాంతానికి బదిలీకి సుముఖత వ్యక్తం చేశారు. వీరంతా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారే. గత వారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని రెండు దఫాలుగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. బదిలీలపై స్పష్టత కరువు.. సొంత ప్రాంతాలకు స్వచ్ఛంద బదిలీ కోరుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఉపాధ్యాయులకు అక్కడినుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపితేనే పరిస్థితి కొలిక్కి వస్తుంది. అందుకు ప్రభుత్వ స్థాయిలో చర్చలు నిర్వహించాలి. కానీ ఈ అంశంపై ఇరు ప్రభుత్వాలు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం. దాదాపు ఆర్నెల్లుగా ఆయా టీచర్లు ఈ విషయంపై స్పష్టత రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛంద బదిలీలను ప్రభుత్వం ఆమోదిస్తే జిల్లాలో 148 టీచర్‌పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటి భర్తీలో స్థానిక నిరుద్యోగులకే ఎక్కువ అవకాశం కలగనుంది. -
దూషణలే సమాధానాలు
విపక్షం అడగడమే తరువాయి అధికారపక్షం నుంచి తిట్ల దండకం ఇదీ బడ్జెట్ సమావేశాల తీరు ముగిసిన 15 రోజుల సమావేశాలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పూర్తిస్థాయి తొలి బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరగలేదు. సభలో ఏకైక ప్రతిపక్షం లేవనెత్తిన అనేకాంశాలపై ఎదురుదాడి, దూషణలే సమాధానంగా అధికార తెలుగుదేశం ఒరవడి కొనసాగింది. అధికారపక్షం నుంచి యథేచ్ఛగా సాగిన దూషణలకు నిరసనగా విపక్షం పోడియం వైపు వెళ్లని సందర్భమంటూ లేకుండా సమావేశాలు నడిచాయి. అధికారపక్ష దూషణలు నిత్యకృత్యం కావడంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకదశలో సభాపతిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం వరకు వెళ్లింది. సభలో తమకు మాట్లాడే అవకాశమిచ్చే విషయంలో తదనంతర కాలంలో తగిన న్యాయం చేస్తారన్న నమ్మకంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు ఆ పార్టీ సభ చివరిరోజున ప్రకటించింది. ఈ నెల 7న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో మొదలైన సమావేశాలు 15 రోజులపాటు కొనసాగిన అనంతరం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో ఏ ఒక్క ప్రజాసమస్యపైనా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమావేశాలు వృథా ప్రయాసగానే సాగాయి. ఏదేని అంశంపై ప్రతిపక్షం అడగ్గానే అధికారపక్షం నుంచి నలుగురైదుగురు సభ్యులు లేచి విపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయడానికే సమయాన్నంతా వినియోగించారు. సభానాయకుడు (చంద్రబాబు) సైతం సహనం కోల్పోయి మీ అంతు చూస్తా అంటూ సభా వేదికగా హెచ్చరించడం, దీనికితోడు మీరంతా 420లు.. ఏంట్రా ఏంట్రోయ్... పాతరేస్తా అంటూ అధికారపక్ష సభ్యులు విపక్ష సభ్యులపై దూషణలకు దిగడం వంటివి సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. కుదించుకుపోయిన బడ్జెట్ సమావేశాలు: సాధారణంగా బడ్జెట్ సమావేశాలు సెలవులతో కలుపుకుని ఎప్పుడూ 40 రోజుల వరకు కొనసాగేవి. ఈసారి వాటిని 15 రోజులకే పరిమితం చేశారు. శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసింది. మరో 15 రోజుల పాటు కొనసాగించాలంది. ఇందుకు ప్రభుత్వం తిరస్కరించింది. అవసరమైతే సాయంత్రం సమావేశాలు నిర్వహిస్తామన్నా.. అదేం జరగలేదు. ప్రతిపక్షం ఒక్కటే ఉన్నందున మాట్లా డేందుకు వైఎస్సార్సీపీకి ఎక్కువ సమయమివ్వాలన్న జగన్ విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రతిపక్షం లేకుండానే మూడురోజులు: పోలవరానికి చంద్రగ్రహణం పేరిట ‘సాక్షి’ దినపత్రిక ఇచ్చిన కథనం అసెంబ్లీలో కలకలం రేపింది. దీనిపై చంద్రబాబుసహా మంత్రులు సాక్షిపై కారాలు మిరియాలు నూరారు. అయితే సభలో తన మాటల ద్వారా పోలవరం వ్యవహారంలో తెరవెనుక సాగుతున్న తతంగాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఇక పట్టిసీమ పథకం వెనుక అక్రమాలపై సభలో ప్రతిపక్షం నిలదీయగా అధికారపక్షం సమాధానం చెప్పుకోలేకపోయింది. ఈ సందర్భంగా అసహనానికి లోనైన సీఎం తీవ్రస్థాయిలో విపక్ష సభ్యులపై శివాలెత్తారు. ‘‘పిచ్చిపిచ్చిగా చేస్తే మీ కథేంటో తేలుస్తా... వదిలి పెట్టను మిమ్మల్ని... పిచ్చి ఆటలు ఆడొద్దు... తమాషాలు ఆడుతున్నారు. మర్యాదగా చెబుతున్నాం.. మీకు పిచ్చి పట్టింది. సిగ్గులేదు. మీరు మనుషులు కాదు’’ అంటూ దూషణల పర్వాన్ని అందుకున్నారు. ఆ మరుసటిరోజే టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్సీపీ సభ్యులనుద్దేశించి ‘ఏంట్రా.. ఒరేయ్ ఏంట్రా... పాతేస్తా... నా...కొ..’ అంటూ తీవ్ర పదజాలాన్ని వినియోగించారు. రైతుల సమస్యలపై శాసనసభలో ప్రతిపక్షనేత జగన్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర ఆటంకాలు ఎదురవ్వడం, మైక్ కట్ అవ్వడం యథేచ్ఛగా సాగింది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశమివ్వాలంటూ పోడియంలోకి వెళ్లి నిరసన తెలిపిన సందర్భంలో జరిగిన ఘటనలతో 8 మంది ఎమ్మెల్యేలను సభనుంచి 3 రోజులపాటు సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో విపక్షం మొత్తం సభను బహిష్కరించి బయటకు వచ్చేసింది. చివరకు ప్రతిపక్షం లేకుండానే సభ 3 రోజులపాటు నడిచింది. శాసనసభ చరిత్రలోప్రతిపక్షం లేకుండా సభ జరిగిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఇష్టానుసారంగా అధికారపక్ష సభ్యు లు మాట్లాడటానికి ఎందుకు ఆస్కారం ఇస్తున్నారంటూ స్పీకర్ పోడియం వద్ద ఆవేశం ప్రదర్శించిన ప్రతిపక్షంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వ డం జరిగింది. దానిపై సంబంధిత సభ్యులతోపాటు ప్రతిపక్ష నేత కూడా వారి తరఫున క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారానికి తెరపడింది. ప్రజాసమస్యలపై సర్కారు స్పందన లేమి వైఎస్సార్సీపీ 22 అంశాలపై చర్చ కోరుతూ బీఏసీలో ప్రతిపాదించింది. పలు సమస్యలపై చర్చకోసం జాబితాను సమర్పించింది. దేనిపైనా అధికారపార్టీ చర్చకు ముందుకురాలేదు. రాజధాని, భూసమీకరణలో రైతుల అవస్థలపై చర్చకు విపక్షం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చినా.. 344వ నిబంధన కింద నోటీసిచ్చినా చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదు. రెండు బడ్జెట్లు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1.13 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 12వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు 13న రూ.14,184 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. రైతు రుణ మాఫీ అంశాన్ని కేవలం ప్రస్తావించి వదిలేశారు. పోలవరం, పట్టిసీమలపై దాటవేత పోలవరాన్ని పక్కన పెట్టేలా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నప్పుడు పట్టిసీమ చేపట్టడంలోని మతలబేంటని ప్రశ్నించారు. అలాగే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరిస్తామన్న అంశాన్ని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పెట్టకుండా ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు. ఈ అంశంపై చర్చకు సమయమివ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. చివరకు 344వ నిబంధన కింద స్వల్పకాలిక చర్చను చేపట్టినా ప్రతిపక్ష నేత ప్రసంగానికి అధికారపక్షం అడుగడుగునా అడ్డుతగిలింది. ఇదిలా ఉండగా విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ విపక్షం సభలో ప్రభుత్వాన్ని నిలదీసింది. రూ.941 కోట్ల మేరకు ప్రజలపై భారాన్ని వేయడం సరికాదని, తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. శాసనమండలిలో ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఈ సమావేశాల సందర్భంగా ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. -
పోస్టుల పంపిణీ దాదాపు పూర్తి!
రాష్ట్ర స్థాయి కేడర్‌లోని 76 శాఖల్లోనూ కొలిక్కి ఆంధ్రాకు 22,728 పోస్టులు, తెలంగాణకు 15,922 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలకమైన రాష్ట్ర స్థాయి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశం కొలిక్కి వచ్చింది. మెజారిటీ శాఖలకు చెందిన పోస్టులను కమలనాథన్ కమిటీ ఇప్పటికే ఇరు రాష్ట్రాలకూ పంపిణీని పూర్తి చేసింది. మొత్తం 89 శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో ఇప్పటి వరకు సచి వాలయంతో సహా 76 శాఖలకు చెందిన పోస్టులను జనాభా నిష్ప త్తి ఆధారంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలకు పంపిణీ చేశారు. ఈ పోస్టుల పంపిణీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఖాళీలను కూడా కలపి ఇరు రాష్ట్రాలకు పంపిణీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా పోస్టుల పంపిణీ పూర్తి చేసిన 76 శాఖలకుగాను ఇప్పటికే 51 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్లను కూడా ఇచ్చారు. మరో 25 శాఖలకు చెందిన ఆప్షన్లకు చెందిన ఫైళ్లు సర్కులేషన్లో ఉన్నాయి. ఈ నెల చివరి వారానికి ఇరు రాష్ట్రాల మధ్య పోస్టుల పంపిణీ పూర్తి అవుతుందని.. ఆప్షన్లు ఇచ్చిన శాఖల్లో ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కమలనాథన్ కమిటీ పేర్కొంది. తగ్గిన ఉద్యోగులు.. ఇప్పటి వరకు సచివాలయంతో సహా 76 శాఖలకు చెందిన 38,650 రాష్ట్ర స్థాయి కేడర్ పోసులను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేశా రు. అయితే ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం పోస్టుల కన్నా తక్కువగా ఉన్నారు. పంపిణీ చేసిన పోస్టులతో చూస్తే ఉద్యోగుల సంఖ్య మాత్రం 14,379 మంది తక్కువగా ఉన్నట్లు తేలింది. 76 శాఖల్లో 24,271 మంది ఉద్యోగులున్నట్లు కమలనాథన్ కమిటీ తేల్చింది. ఈ ఉద్యోగులనే ఇరు రాష్ట్రాల మధ్య నిబంధనల ఆధారంగా పంపిణీ చేశారు. సచివాలయంలోని నాలుగో తరగతి ఉద్యోగులందరినీ తామే తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి హామీ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యం లో తాము తీసుకోబోమంటూ ఏపీ ప్రభుత్వానికి టీ సర్కార్ వెల్లడించింది. అదే కారణమా? ఏపీ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థల ఉద్యోగులను స్థానికత ఆధారంగా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగుల పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగుల విషయంలో మాట మార్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మళ్లీ అపార్ట్మెంట్ల జోరు
‘స్మార్ట్’గా పరుగులు బహుళ అంతస్తుల పై నగర ప్రజల మోజు స్మార్ట్ సిటీ ప్రకటన తో ఊపందుకున్న లావాదేవీలు విశాఖపట్నం : రాష్ట్ర విభజనతో విశాఖలో మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం స్మార్ట్‌సిటీ ప్రకటనతో మళ్లీ జోరందుకుంది. అమెరికా సాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ ప్రకటనతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కోరిక పెరిగింది. దీంతో అందరూ ఫ్లాట్లు కొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వ్యక్తిగత ఇళ్లన్నీ అపార్ట్మెంట్ రూపంలోకి దూసుకుపోతున్నాయి. ఈ వరసలో నగర శివారు మధురవాడ, ఎండాడ, విశాలాక్షినగర్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాలు ముందున్నాయి. మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లకంటే అపార్ట్మెంట్ల నిర్మాణాలే అధికంగా కన్పిస్తున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్ సంస్కృతి కొంతకాలం నుంచి అనూహ్యరీతిలో అభివృద్ధి సాధిస్తోంది. పూర్వం మొత్తం వందలోపే అపార్ట్మెంట్లు ఉండేవి. ప్రస్తుతం నగరం విస్తరించడంతో ఆ సంఖ్య 20 వేలు దాటింది. మరో పది వేలకుపైగా నిర్మాణంలో ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా అతి సాధారణ స్థాయి నుంచి ఆధునిక సదుపాయాలతో కూడిన ఫ్లాట్లు నిర్మించి ఖాతాదారుల అభిరుచి మేరకు అందిస్తున్నారు. ఇదీ కారణం... నగరం ‘స్మార్ట్’గా పరుగులు పెడుతోంది. ఐటీ సిగ్నేచర్ టవర్లు, నిరంతర వైఫై సౌకర్యం.. ఇలా అత్యాధునికమైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం ఏమూల చూసినా చదరపు గజం రూ.25 వేలకు తక్కువ లేదు. వంద గజాలు కొని ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.40 లక్షల మంచి రూ.50 లక్షలకు తక్కువ ఖర్చుకావడం లేదు. అంతేకాకుండా కార్మికుల కొరత, భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్లాన్, మంచినీటి కనెక్షన్, విద్యుత్తు ఇలా అనేక సమస్యలతోపాటు సమయం కూడా ఆదా అవడంతో ప్రజలు ఫ్లాట్ల వైపు మక్కువ చూపుతున్నారు. మరో ముఖ్యమైన కారణమేమిటంటే భద్రత. పట్టపగలే నగరంలో చోరీలు అధికమవడం, నేరస్తులు ఎంతటి దారుణాలకైనా తెగబడడంతో ఫ్లాట్లు అన్ని విధాలా మేలనే భావన పెరగడంతో వీటికి డిమాండ్ అధికమైంది. దీంతోపాటు బిల్డర్లే బ్యాంకు రుణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుకు మరింత సౌలభ్యం ఏర్పడుతోంది. ఆధునిక వసతులు నిర్మాణ రంగంలో ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పడు కేవలం స్థానికంగా లభించే మెటీరియల్స్తోనే అపార్ట్మెంట్లు నిర్మించేవారు. ఇప్పుడు విదేశీ సామగ్రి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. అపార్ట్మెంట్ భద్రత కోసం విద్యుత్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, జిమ్, స్టీమ్ ఫంక్షన్ హాలు, వాకింగ్ ట్రాక్, మహిళలకు లేడీ క్లబ్‌లు... ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలతో ఫ్లాట్స్ అందుబాటులో లభిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో గ్రూప్ హౌసెస్, విల్లాలు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణంలో కొందరు బిల్లర్లు ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఖాతాదారుడికి ఏం చెబుతారో అదే చేయుడంతో ఇటువంటి వారు కట్టే అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వ్యాపారమంటేనే నమ్మకం, దాన్ని పోగొట్టుకుంటే దేనికి పనికిరామనే నినాదంతో నడుస్తున్న బిల్లర్లను మనం చూడొచ్చు. కొనేటప్పుడు జాగ్రత్తలు... ఎంతో కష్టపడితేగాని చాలామంది జీవితకాలంలో సొంత గృహాన్ని సొంతం చేసుకోలేరు. మరి ఫ్లాట్ కొనేటపుపడు కొన్ని జాగ్రత్తలు తప్పవు. స్థలం యజమానికి, బిల్డర్‌కు మధ్య ఒప్పంద పత్రాలను చూసుకోవాలి. ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ (ఈసీ) తీసుకోవాలి. క్లియర్ టైటిల్, దానికి సంబంధించిన లింక్ దస్తావేజులు చూసుకోవాలి. తెలీకపోతే న్యాయవాదిని, అనుభవజ్ఞుడైన దస్తావేజు లేఖరిని సంప్రదించాలి. మనం కొనే ఫ్లాట్ నిర్మాణంలో ఉంటే నెలకొకసారైనా వెళ్లి చూసుకోవాలి. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయా లేదా.. అనేది పరిశీలించాలి. భూగర్భ నీటి నిల్వ పైపు కనెక్షన్, ఫైరింజన్, నియంత్రణ పరికరాలు, ఫైర్పంపులు, హోజ్రీలు, తదితర అంశాలు ఏర్పాటు చేశారా లేదా..? అనేది పర్యవేక్షించాలి. మరో ముఖ్యమైన విషయం... బిల్డర్ నుంచి ఏమి కోరుకుంటున్నామో అవి రాతపూర్వకంగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. -
తప్పు సరిదిద్దుకుందాం
కాంగ్రెస్ మేధోమథనంలో దిగ్విజయ్ కోటి సంతకాలను ముమ్మరం చేయాలి తొలి రోజు నాలుగు గ్రూపుల చర్చ నేడు కూడా కొనసాగనున్న సదస్సు విజయవాడ సెంట్రల్ : రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తొలి మేధోమథన సదస్సు నగరం కేంద్రంగా జరిగింది. శుక్రవారం హనుమాన్‌పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సదస్సును ఎపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. అనంతరం ఒక గంట బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కోరిన తర్వాతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని చెప్పారు. మిగిలిన పార్టీలు విభజన వల్ల రాజకీయ లబ్ధిపొందితే, కాంగ్రెస్ చేయని తప్పుకు నింద మోస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నాయకులకు సూచించారు. పార్టీ విధి విధానాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు వివరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఆరు గ్రూపులుగా చేశారు. మొదటి నాలుగు కమిటీలు తొలిరోజు చర్చలు సాగించాయి. మిగిలిన రెండు కమిటీలు శనివారం చర్చలు సాగించనున్నాయి. ముమ్మరంగా కోటి సంతకాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు శాసనమండలి ఫ్లోర్‌లీడర్ సి.రామచంద్రయ్య వెల్లడించారు. సాయంతం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సదస్సు వివరాలను తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాప్రతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పార్టీకి దూరమైన వర్గాలను ఆకట్టుకొనేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కోటి సంతకాలకు మద్దతు తెలుపుదామనుకొనే వారు 7842434121 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు తిరువనక్కరసు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కొండ్రు మురళీ, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, సిటీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, బుచ్చిబాబు, నేతలు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్‌కుమార్, అవినాష్, మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
300 మందికి 8 అంతస్తులా?
*ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ భవనంపై ఆ శాఖ కార్యదర్శి విస్మయం *'సాక్షి' కథనంతో అత్యవసర భేటీ నిర్వహించిన సునీల్‌శర్మ * రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న నిర్ణయాలపై ఆరా * పూర్తి వివరాలు, పత్రాలు అందజేయాలని అధికారులకు ఆదేశం * దీనిపై సీఎంకు నివేదిక అందించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అక్కడ పనిచేసే విభాగాధిపతులు ఆరుగురు... వారి ఆధీనంలో పనిచేసే సిబ్బంది మూడొందలు.. కానీ వారికోసం లక్ష చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంతో ఎనిమిది అంతస్తుల భవనం సిద్ధమవుతోంది. రూ. 67 కోట్లతో నిర్మిస్తున్న ‘అంత పెద్ద భవనంలో మేమేం చేస్తాం..’ అని స్వయంగా ఆ విభాగం అధికారులే ప్రశ్నించే పరిస్థితి. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ విభాగం కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న భవనం వ్యవహారం ఇది. ఈ భవనం నిర్మాణంలో అధికారుల ఇష్టారాజ్యం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘20 కోట్లతో మొదలై 67 కోట్లకు..’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితం కావటంతో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం 300 మంది సిబ్బంది ఉండే చోట ఇంత పెద్ద భవనం నిర్మించాల్సిన పరిస్థితి, తొలుత ఐదంతస్తులుగా తలపెట్టి తర్వాత ఎనిమిది అంతస్తులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను తనకు అందజేయాల్సిందిగా ఆయన ఆర్అండ్బీ బిల్డింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే... ఈ భవనం పనులు పూర్తయ్యేలోపు దాని అంచనాను మరోసారి సవరించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతమున్న అంచనా రూ. 67 కోట్లకు పెంచాలనే ప్రతిపాదన 2014లో చేసింది. కానీ ఇప్పుడు పనులు పూర్తి కావటానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలో మార్పులు వస్తాయి. దీంతో అంచనాను మరోసారి సవరించాల్సి ఉంటుందనే తీరులో అధికారులు చెబుతుండడం గమనార్హం. విభజన ముంగిట నిర్ణయం.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా ఆర్అండ్బీ భవనంలో దాదాపు ఏడు వందల మందికి పైగా సిబ్బంది పనిచేశారు. విభజనతో తెలంగాణ వాటా మూడొందలకు తగ్గిపోయింది. 2009లో ఈ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఐదంతస్తులుగా ప్రణాళిక రూపొందించారు. దానిని 2012లో ఎనిమిది అంతస్తులకు మార్చి... అంచనా వ్యయాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 39 కోట్లకు పెంచారు. అప్పటికే రాష్ట్ర విభజన అంశం కొలిక్కివచ్చే తరుణంలో ఉంది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. రాష్ట్రం విడిపోతే తొలుత నిర్ణయించినట్టుగా ఐదంతస్తుల భవనం కూడా ఎక్కువే. అలాంటిది ఆగమేఘాల మీద అంచనా వ్యయాన్ని పెంచి ఎనిమిది అంతస్తులుగా నిర్మించాలని నిర్ణయించటం పట్ల ఇప్పుడు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆ తర్వాత అదనపు పనుల పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 67 కోట్లకు పెంచేశారు. ఇతర అవసరాలకు వినియోగిస్తే.. ఇంత భారీ భవనం ఆర్‌అండ్‌బీకి అనవసరమనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ భవనంలోనే ఆర్అండ్బీ కార్యదర్శి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. కానీ ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్తగా సచివాలయం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నందున... ఆర్అండ్బీ మంత్రి కార్యాలయం వద్దే కార్యదర్శి కార్యాలయం కూడా ఏర్పటవుతుంది. అదే జరిగితే ఈ కొత్త భవనంలో దాని అవసరం ఉండదు. అలాంటప్పుడు దీన్ని రోడ్లు, భవనాల శాఖకు కాకుండా ఇతర అవసరాలకు వాడితే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టీహైకోర్టు కోసం ఈ భవనాన్ని విని యోగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
ఇదేమిటి.. రామయ్య!
రాజంపేట: రాష్ట్ర విభజన కాకముందు రెండవ భద్రాద్రిగా వెలుగొందిన ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని విభజన తర్వాత మొదటి భద్రాద్రిగా గుర్తించి అధికారిక నవమి ఉత్సవాలు చేపడతారనుకుంటే నిరాశే మిగులుతోంది. ఈ ఉత్సవాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి మహోత్సవాలు భద్రాచలంలో నిర్వహించేవారు. భద్రాచలం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోకి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక పురాతన గొప్ప రామాలయం ఒంటిమిట్టలోదే. భారతదేశంలోని గొప్ప కట్టడాల్లో ఒంటిమిట్ట రామాలయం కూడా ఒకటని విదేశీ యాత్రికుడు తావర్నియర్ ప్రశంసించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరపాలని అందరూ కోరుకుంటున్నారు. మరో రామాలయూనికి అధికారిక గుర్తింపునకు ప్రయత్నాలు.. ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట కోదండరామాలయూనికి అధికారిక గుర్తింపు లభించే సమయంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తమ ప్రాంతంలోని రామాలయూనికి ఆ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు విజయనగరం జిల్లా మెలిమర్ల మండలం రామతీర్థం రామాలయంలో చేపట్టాలని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కృషి చేస్తున్నారని తెలియడంతో జిల్లాలోని రామభక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రభుత్వపరంగా జరిపించడానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కోరడానికి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ దేవస్థాన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను కలిసి అధికార బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. ఆలయ విశిష్టతలోకి వెళితే.. ఒంటిమిట్ట కోదండరామాలయం దేశంలో రెండవ అయోధ్యగా, రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా గుర్తెరిగినది. ఈ రామాలయంలోని మూలవిరాట్లను త్రేతాయుగంలో ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ రామాలయంలోని సీతారామలక్ష్మణులు విడివిడిగా కనిపించినా ఒకే రాతిలో ఉండటంతో ఏక శిలానగరంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఏ రామాలయంలోనైనా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈ రామాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. ఎందుకంటే శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందనేది కథనం. ఒంటిమిట్ట రామాలయానికి ఉన్నంత పవిత్రత, ప్రాసత్యం, శిల్పకళాసంపద మరే రామాలయంలోనూ లేదు. ఒంటిమిట్ట రామాలయంలోని మధ్య మంటపంలో 31స్తంభాలు ఉన్నాయి. చూపరులను ఆకట్టుకునే శిల్పసంపద, విశాలమైన ప్రాంగణం ఈ రామాలయంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు శ్రీమదాంద్ర భాగవతం ఇక్కడే రచయించి శ్రీరామునికే అంకితం ఇచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో పోతన భాగవత తాంబూల సంప్రదాయం బ్రిటీషు కాలం నుంచి ఉంది. దండకారణ్యంలో ఉన్నప్పుడు సీతారామలక్ష్మణులు ఇటుగా వెళుతున్న సమయంలో సీతమ్మకు ఒంటిమిట్టలో దాహం వేయగా ఆమె దాహం తీర్చేందుకు రామలక్ష్మణులు బాణాలు సంధించగా ఏర్పడిన నీటి బుగ్గలే శ్రీరామలక్ష్మణుల తీర్థాలుగా ఇప్పటికీ ఉన్నాయి. కడప నవాబు ఈ రామాలయ ఆవరణంలో ఒకబావిని తవ్వించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితాన్ని రామాలయ అభివృద్ధి కోసం అంకితం చేసిన వావిలకొలను సుబ్బారావు ఊరూరాా భిక్షమెత్తి ఒంటిమిట్ట రామాలయానికి కొన్ని కోట్లరూపాయల విలువ చేసే ఆభరణాలు, భూములు, భవనాలు సమకూర్చారు. ఇంతటి చరిత్ర ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారిక బ్రహోత్సవాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!
విస్మయం వ్యక్తం చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ పరస్పర సంప్రదింపులతో కొలిక్కి తేవాలని సీఎస్‌లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఏడు నెలలు దాటిపోయినా ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగా ఉండడం పట్ల కేంద్ర ఉపరితల రవాణా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. ఆర్టీసీని రెండు కార్పొరేషన్లుగా విభజించే అవకాశమున్నా.. ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం చర్చించుకొని ప్రత్యేక రవాణా సంస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది. తెలంగాణ, ఏపీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో పరిణామాలు, ఆస్తులు, అప్పుల విభజన కసరత్తు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎస్‌లు తమ నివేదికలను సమర్పించారు. చట్టం ప్రకారమే.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని స్పష్టంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆ విధంగానే విభజన జరగాలని తాము కోరుతున్నట్టు నివేదికలో వివరించారు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీతో సంబంధం లేకుండా పూర్తి చేయాలన్నారు. ఏపీ మాత్రం తమ నివేదికలో హైదరాబాద్‌లోని ఆస్తులను కూడా జనాభా ప్రాతిపదికన పంచాలని కోరింది. అయితే ఆర్టీసీ విభజన వ్యవహారంలో కేంద్ర రవాణా కార్యదర్శి ఘాటుగానే స్పందించారు. ఆస్తులు, అప్పుల పంపకాలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని... కానీ అప్పటివరకు ఆర్టీసీని విభజించకుండా ఉంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆస్తులు, అప్పుల పంపిణీ, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలన్నీ మార్గదర్శకాల ప్రకారం వాటంతట అవే జరుగుతాయని... పాలనాపరంగా గందరగోళం లేకుండా ఆర్టీసీని విభజించుకోవచ్చని పేర్కొన్నారు. వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకొని మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మరోదఫా సమావేశమై ఇతర అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. కాగా.. మరో మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ విభజన పూర్తికావచ్చని సీఎస్ రాజీవ్‌శర్మ భేటీ అనంతరం విలేకరులతో చెప్పారు. ఎప్పుడో జరగాల్సింది.. ఆర్టీసీ ఎండీగా ఏపీకి చెందిన అధికారి ఉన్నందున కేంద్రం సూచించిన ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీ పోస్టును గత మే నెలలో ఏర్పాటు చేశారు. ఆర్టీసీని రెండుగా విభజించి ఎండీ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ... జేఎండీ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ విధులు నిర్వహించాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు తెలంగాణకు చెందిన రమణారావును జేఎండీగా నియమించినా... టీఎస్ఆర్టీసీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ తరుణంలో తాజాగా కేంద్రం వేసిన మొట్టికాయతో ఆ తంతును పూర్తి చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
‘రీయింబర్స్మెంట్’పై స్పష్టత ఎప్పుడో
ఇంకా తేలని స్థానికత వివాదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో లక్ష మందికిపైగా విద్యార్థులు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో చదువుతున్న దాదాపు 80 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతోపాటు ఆంధ్రా ప్రాంతంలో చదువుతున్న సుమారు 40 వేల మంది తెలంగాణ విద్యార్థులు కూడా తమకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నది తేలక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్థానికత అంశం ముడిపడి ఉన్న ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివసిస్తున్న ఏపీ విద్యార్థులకు ఇది పెద్దసమస్యగానే ఉంది. ఓవైపు వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నా ఇంకా ఈ విషయంలో స్పష్టత రాకపోవడం మరోవైపు ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు వేదన చెందుతున్నారు. జటిలంగా మారిన సమస్య: తెలంగాణలో చదువుతున్న విద్యార్థులందరికీ (స్థానికతతో సంబంధం లేకుండా) రీయింబర్స్మెంట్ చేసిన పక్షంలో తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల భారం పడనుంది. అదే సమయంలో ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆ ప్రభుత్వం కొన్ని పదుల కోట్ల మేర చెల్లించాలి. ఆర్థికభారం పెరుగుతుందన్న కారణంతో రెండు ప్రభుత్వాలు ముందుగా ఎవరు నిర్ణయం తీసుకుంటారోనని వేచి చూస్తూ విద్యార్థులతో దోబూచులాడుతున్నాయి. తెలంగాణకే చెందిన వారిగా (స్థానికులుగా) ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకునే విద్యార్థులకు ‘ఫాస్ట్’ను వర్తింపజేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉంటున్న ఏపీ విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. ఎమ్మార్వోలు నేటివిటీ సర్టిఫికెట్లకు బదులు ఫలానా ఇంట్లో నివసిస్తున్నారని మాత్రమే పత్రాలు ఇస్తున్నారు. -
తెలంగాణకు కలెక్టర్ రఘునందన్‌రావు
రేపు లేదా ఎల్లుండి రిలీవ్ అయ్యే అవకాశం మచిలీపట్నం : కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల జాబితాలో ఆయన ఉన్నారు. దీంతో కలెక్టర్ బదిలీ అనివార్యమైంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన తెలంగాణ ప్రాంతానికి బదిలీ అవుతారనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో కలెక్టర్ బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని, వెంటనే రిలీవ్ అవుతారని సమాచారం. రఘునందన్‌రావు జిల్లా కలెక్టర్‌గా 2013, అక్టోబరు 14వ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే నంబరు నెలలో వరుసగా సంభవించిన హెలెన్, లెహర్ తుపానుల సందర్భంగా అధికారులను అప్రమత్తం చేసి సమర్థంగా పనిచేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆయన వారంలో మూడు రోజులు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో, విజయవాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు రోజులపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. సమైక్యాంద్ర ఉద్యమ సమయంలోనూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గవర్నర్ పాలన సమయంలోనూ పారదర్శకంగా వ్యవహరించారు. ప్రజలతో మమేకమై ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అచ్చ తెలుగులోనే మాట్లాడే కలెక్టర్‌గా రఘునందన్‌రావు పేరు తెచ్చుకున్నారు.కలెక్టర్ రఘునందన్‌రావు బదిలీ అనివార్యం కావడంతో నూతన కలెక్టర్‌గా ఎవరు వస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన ప్రద్యుమ్న కలెక్టర్‌గా వచ్చే అవకాశం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
తొలి ప్రారంభం ఆనందం
విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ కార్యాలయం ప్రారంభం రాజధాని ప్రాంతంలో మరిన్ని ఆధునిక కట్టడాలు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి విజయవాడ సిటీ : రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిలో తొలి రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో రూ.3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఇంకా అనేక ఆధునిక కట్టడాలు వస్తాయన్నారు. అనతి కాలంలోనే మంచి నాణ్యతా ప్రమాణాలతో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం భవనాన్ని పూర్తిచేసిన అదనపు డీజీ నండూరి సాంబశివరావు, ఆ శాఖ అధికారులను ఆయన అభినందించారు. రాజధాని కావడంతో ప్రపంచమే ఇక్కడకు వస్తున్నందున శాంతి భద్రతలు ముఖ్యమని, ఇదే సమయంలో పౌరుల క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. తనకు తెలిసినంత వరకు కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలు క్రమశిక్షణకు మారుపేరన్నారు. పోలీసులు ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి... పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. తక్కువ పోలీసులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమర్థవంతంగా వ్యవహరించాలన్నారు. అయితే పోలీసు శాఖలో ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఎక్కువ సిబ్బంది, తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నారని, ఇది మారాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో విపత్తుల నివారణ విభాగం, అగ్నిమాపక శాఖలను బలోపేతం చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రతి జిల్లాలోని అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలు అందజేసి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత విపత్తు నివారణ బృందం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భవనాన్ని ప్రారంభించి అన్ని అంతస్తుల్లోని వివిధ కార్యాలయాలను పరిశీలించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న బందరు కాల్వలో విపత్తు నివారణ బృందం నిర్వహించిన రక్షణ విన్యాసాలను తిలకించారు. అగ్నిమాపక శాఖ అదనపు డీజీ నండూరి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, కాగిత వెంకట్రావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీధర్, అగ్నిమాపక శాఖ డెరైక్టర్లు జయరాం నాయక్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రజాలం
ఈ ఆరునెలల్లో సీఎం చేసింది శూన్యం ప్రమాణస్వీకారం చేసిన గుంటూరును సైతం విస్మరించిన వైనం రుణ మాఫీ పేరుతో అన్నదాతలకు శఠగోపం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఊసే లేదు పల్నాడులో సిమెంటు ఫ్యాక్టరీల ప్రస్తావనే మరిచారు వాటర్ గ్రిడ్డూ లేదు..మెట్టకు నీళ్లూ లేవు. రాజధాని భూసమీకరణపై రైతుల్లో వ్యతిరేకత గుంటూరు: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సోమవారం నాటికి ఆరు నెలల కాలం పూర్తయింది. గుంటూరు-విజయవాడ రహదారి పక్కన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై జూన్ 8న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అదే వేదికపై నుంచి గుప్పించిన హామీలు, అంతకముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. అన్నింటా ఘోరంగా విఫలమయ్యారు. చివరకు ప్రమాణస్వీకారానికి వేదికైన గుంటూరు జిల్లాను సైతం మోసం చేశారు. జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో ఒక్క అడుగు సైతం ముందుకు వేయలేకపోయారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం మినహా ఆయన పాలన అంతా డాంబికాన్ని తలపిస్తోంది. ప్రజల ఆశలన్నీ ఆవిరయ్యాయి. రుణమాఫీ చేస్తామని మాట మార్చారు. రకరకాల నిబంధనలు విధించడంతో ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. 11,78,383 బ్యాంకు ఖాతాలకు దాదాపు 3 లక్షల లోపు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. చంద్రబాబును నమ్మి దాదాపు 8 లక్షల మందికి పైగా అన్నదాతలు నట్టేట మునిగారు. అన్నింటికీ ఆధార్ లింక్ అంటూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వాస్తు పిచ్చితో బాబు మూడు పంటలు పండే సారవంతమైన భూములు లాక్కొనే యత్నం చేస్తున్నారని కొంత మంది రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు వస్తాడు జాబు ఇస్తాడని యువతను ఎన్నికల సమయంలో మభ్య పెట్టారు. ఆయన అధికారంలోకి రాగానే కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామీని మరిచారు. జిల్లాలో 2,257 మంది ఆదర్శ రైతులను తొలగించారు. గృహ నిర్మాణ శాఖలో 100 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఇలా ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు. విఫలం.. ఇలా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి నాగార్జునసాగర్ కాలువ ద్వారా మాచర్ల, పిడుగురాళ్లతో పాటు మెట్ట రైతులకు సాగునీరు ఇస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. జిల్లాలో రైతుల పంటలకు గిట్టు బాటు ధర కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు ఆచరణకు నోచలేదు. పల్నాడు ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అర్హులైన పేదలకు మూడు సెంట్ల స్థలంలో రూ. 1.50 లక్షల రూపాయలతో పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పిన మాటలు నెరవేరకపోగా, నిర్మాణాల్లో ఉన్న 23,521 ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు నిలిపి వేసింది. జిల్లాలో 3,49,400 పింఛన్లు ఉండగా, గ్రామ కమిటీలు, సామాజిక కార్యకర్తల పేరుతో అర్హులైన వారి పింఛన్లలో కోత విధించారు. చివరకు 21,795 పింఛన్లు తొలగించారు. జిల్లాలో 13,91,783 రేషన్ కార్డులుండగా ఆధార్ అనుసంధానంతో 1,19,393 కార్డులకు రేషన్ నిలిపి వేశారు. ఎన్టీఆర్ సుజల పేరిట జిల్లాలో మొదటి దశలో 300 గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించినా, కేవలం 24 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా అవి నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి రద్దుకు గ్రామ,మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీల జాడ కూడా లేదు. -
‘డాబుసరి’ పాలన
చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టి నేటికి 6 నెలలు మే 20 తేదీ నుంచే అజమాయిషీ రాజధానిపై ఆత్రం.. ఏకపక్ష నిర్ణయం ఎన్నికల హామీల అమలులో వైఫల్యం {పజా సమస్యల పరిష్కారంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు సమీక్షలు, హైటెక్ మాటలతో సరి శ్వేత పత్రాలు విడుదల, కన్సల్టెంట్ల నియామకంలో ముందుకు విభజన హామీలపై కేంద్రానికి ప్రతిపాదనలతో సరి.. నిధులు తేవటంలో విఫలం విలాసాలకే పెద్ద పీట.. సీఎం, సీఎస్ కార్యాలయాలకు రూ. 45 కోట్లు ఖర్చు హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు పగ్గాలు చేపట్టి సోమవారం తో ఆరు నెలలు పూర్తవుతుంది. సాంకేతికంగా చంద్రబాబు జూన్ 8వ తేదీ నుంచి అధికార పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డేగా జూన్ 2ని నిర్ణయించడంతో అప్పటివరకు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే, అధికార పార్టీ అధినేతగా, కాబోయే ముఖ్యమంత్రిగా మే 20వ తేదీ నుంచే ఆయన ఆజమాయిషీ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఒక్క అంశంలోనూ స్పష్టమైన వైఖరిని కనబరచలేదు. అత్యంత ప్రధానమైన రాజధాని విషయంలో ఆత్రం ప్రదర్శించారు. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాజధాని, విదేశీ పర్యటనలు, కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దుకోవడం, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంలో అత్యుత్సాహం చూపుతున్నారు. మిషన్లు, కన్సల్టెంట్లు, సలహాదారుల నియామకం, సమీక్షల మీద సమీక్షలు, హైటెక్ మాటల్లో ముందున్నారు. మొత్తంగా చూస్తే ‘డాబుసరి’ పాలనే తప్ప.. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి 5 సంతకాలంటూ ఆర్భాటం చేశారు. వీటిలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు మినహా మరేదీ అమలులోకి రాలేదు. రుణ మాఫీ విషయంలో గత 6 నెల లుగా చంద్రబాబు సర్కారు రైతులు, డ్వాక్రా మహిళలను వంచిస్తున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. చివరికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలు చేపట్టడంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీపై ఈ నెల 4న విధివిధానాలు ప్రకటించింది. నూతన రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన రాజధాని ప్రాంతం ఎంపిక విషయంలో నిపుణులు, ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. సారవంతమైన, ఏడాదికి మూడు పంటలిచ్చే భూములను రాజధానికి ఎంపిక చేయడంపై అనేక వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాటుకు ముసాయిదా బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. రాజధాని నిర్మాణంలో సహకారాన్ని కోరేందుకు, పెట్టుబడులను ఆహ్వానించడానికి చంద్రబాబు, ఆయన బృందం సింగపూర్, జపాన్లలో పర్యటించి వచ్చింది. హుద్‌హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు విశాఖపట్టణంలోనే మకాం వేసి అంతా వన్‌మేన్ షో నడిపించారు. అయితే కేవలం విశాఖపట్టణంలోని బాధితులకే సకాలంలో సహాయం సకాలంలో అందించారు తప్ప శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధితులను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రతిపాదనలను బాబు సర్కారు ఢిల్లీకి పంపినప్పటికీ, వాటికి సంబంధించిన నిధులను రాబట్టడంలో మాత్రం విఫలమైంది. పేదల కోసమం టూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు.. ఈ ఆరు నెలల్లో పేదలకు కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోగా, గత ప్రభుత్వం మంజూరు చేసిందనే పేరుతో 7.95 లక్షల గృహాలను మాత్రం రద్దు చేశారు. ఏడు రంగాలకు చెందిన మిషన్ల పేరుతో ఏకంగా 30 మంది కన్సల్టెంట్లను, పలువురు సలహాదారులను నియమించి, లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. వీటి ఫలితమేమిటన్నది ఇప్పటికీ తేలలేదు. గత ప్రభుత్వాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో రంగాలవారీగా శ్వేతపత్రాలను ప్రకటించారు. సమీక్షలతోనే సరి.. ఆరు నెలల చంద్రబాబు పాలన చూస్తే సమీక్షలతోనే సాగదీస్తున్నారన్న విమర్శలు అధికారవర్గాల్లోనే ఉన్నాయి. బాబు ప్రతి వారం గంటల తరబడి సమీక్షలు చేస్తున్నారు. వారం తిరగకుండానే మళ్లీ అవే అంశాలపై సమీక్షలు చేస్తూ చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులందరూ విసుగెత్తిపోతున్నారు. తమ సమయమంతా సమీక్షలకే సరిపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమీక్షలు పత్రికల్లో వార్తలకు, ఏదో చేస్తున్నామన్న భావన కల్పించడానికే పనికొస్తున్నాయి తప్ప, ఒక్కటీ ఫలితమివ్వలేదని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అంతా అనుత్పాదక వ్యయమే..! ప్రభుత్వ ధనాన్ని ఉత్పాదకతకు వెచ్చించాల్సి ఉండగా.. అందుకు పూర్తి విరుద్ధంగా విలాసాల కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తోంది. మరోపక్క భారీ రెవెన్యూ లోటు ఉందని కేంద్రాన్ని నిధులడుగుతోంది. విలాసాల కోసం మాత్రం భారీమొత్తంలో ఖర్చు చేస్తోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఆఫీసు, క్యాంపు కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దడానికే ఏకంగా రూ.45 కోట్లు నీళ్లలా ఖర్చు చేసేశారు. తొలుత సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత అక్కడ వాస్తు బాగోలేదన్న కారణంతో సీఎం కార్యాలయాన్ని ఎల్ బ్లాకుకు మార్చారు. ఇందులో రెండు అంతస్తుల్లో సీఎం, సీఎస్ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దడానికి రూ.15 కోట్లు ఖర్చు చేశారు. సీఎం కార్యాలయంలో ఫర్నీచర్ కోసం మరో రూ.10 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి కార్యాలయం కూడా చంద్రబాబు కార్యాలయం ముందు తీసిపోయేలా ఉందని ఉన్నతాధికారులువ్యాఖ్యానిస్తున్నారు. ఇంతేకాకుండా సీఎం సొంత గృహానికి, లేక్‌వ్యూ అతిథి గృహంలో క్యాంపు కార్యాలయానికి మరో రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. మరో పక్క రాష్ట్రంలో జిల్లాలకు, బెంగుళూరు, ఢిల్లీ వెళ్లినా ఆఖరికి సింగపూర్ వెళ్లినా చంద్రబాబు రెగ్యులర్ విమానాల్లో అడుగుపెట్టడానికి ఇష్టపడటంలేదు. ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లా లు, ఢీల్లీ, బెంగూళూరులకే ఈ 6 నెలల్లో చంద్రబాబు 40 సార్లు ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఎక్కువగా కృష్ణపట్నం పోర్టుకు చెందిన లగ్జరీ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ విమానానికి గంటకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఇలా అనుత్పాదక రంగాలపై నిధులు ఖర్చు చేయడాన్ని అధికారులు తప్పుపడుతోంది. కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితేమిటి? అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని బాబు హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక ఈ విషయాన్నే పట్టించుకోవడంలేదు. వీరికి ఈ నెల 31 వరకు మాత్రం సర్వీసును పొడిగించింది. ఆ తర్వాత పరిస్థితేమిటన్నది అగమ్యగోచరంగా మారింది. హామీల అమలు ఖర్చు ఆరు నెలల్లో రూ.433 కోట్లే ఎన్నికల ముందు తనకు తోచిన విధంగా ప్రజలకు హామీలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల కాలంలో వాటి అమలుకు ఖర్చు పెట్టిందెంతో తెలుసా? కేవలం రూ.433 కోట్లు. ఇదే తీరు కొనసాగితే బాబు ఇచ్చిన హామీలు పూర్తయ్యేందుకు దాదాపు 1,000 ఏళ్లు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు 52 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి పేజీలో పదికి తక్కువ కాకుండా హామీలు గుప్పించారు. అలా ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఇచ్చినట్టే అమలు చేయాలంటే కేవలం రైతు, డ్వాక్రా రుణాల మాఫీకే లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి కనీసం మరో రెండు లక్షల కోట్లు అవసరం. హైదరాబాద్ లాంటి రాజధానిని కొత్తగా నిర్మించుకోవాలంటే ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని గతంలో చంద్రబాబే చెప్పారు. మిగతా హామీలకు మరో లక్ష కోట్లకు పైబడే అవసరం అవుతాయని అంచనా. ఇలా బాబు తానిచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలంటే మొత్తం నాలుగు లక్షల కోట్లకు పైగానే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి రాష్ట్ర మొత్తం బడ్జెట్‌ను బట్టి చూస్తే నాలుగేళ్ల పూర్తి బడ్జెట్‌ను ఇందుకోసమే వినియోగించాలన్న మాట. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చులో ఒక్కటిన్నర శాతం కూడా హామీల అమలుకు వినియోగించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ ఏడవ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల కింద మొత్తం రూ.34,034 కోట్లను ఖర్చు పెట్టింది. అయితే పింఛన్ల పథకానికి తప్ప ప్రభుత్వం మరే హామీ అమలుకు ఖజానా నుంచి రూపాయి ఖర్చు పెట్టడానికి ముందుకు రాలేదు. పింఛన్ల పథకానికీ గత ప్రభుత్వాలు చెల్లించిన మొత్తాలకు అదనంగా చంద్రబాబు సర్కార్ అదనంగా చెల్లించింది కేవలం రూ.433 కోట్లు మాత్రమే. బాబు వచ్చారు.. జాబులే లేవు బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందరికీ ఉద్యోగా లు ఇచ్చే సంగతి అటుంచితే.. సాధారణంగా ఏటా ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలూ ఆపేయాలంటూ ప్రభుత్వం లేఖ రాసింది. లక్షల సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం ఎదురు చూస్తు న్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు అశనిపాతమే అయ్యాయి. గ్రూప్-1, 2, 4 ఉగ్యోగాల భర్తీ ఎప్పుడు చేపట్టేదీ ప్రకటిం చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకూ మొండిచేయే..! అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ సిఫార్సులను యధాతథంగా అమలు చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా, వేతన సవరణ గురిం చి పట్టించుకోలేదు. మండుతున్న ధరలను తట్టుకోలేక అల్లాడుతున్న సగటు ఉద్యోగికి ఊరట కలిగించే చర్యలను చేపట్టలేదు. కొత్త వేతనాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో, ఏ తేదీ నుంచి ఆర్థిక లబ్ధి చేకూరస్తారనే విషయాన్నయినా స్పష్టంగా చెప్పాలన్న ఉద్యోగుల వినతినీ పట్టించుకోలేదు. వారానికి 5 రోజుల పని విధానం ప్రవేశపెడతానన్న ఎన్నికల హామీనీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్లకు పేరుకైతే హెల్త్‌కార్డులు ఇచ్చారు కానీ.. వైద్యం అందించడానికి చర్యలు తీసుకోలేదు. -
కేంద్ర సాయం కోసం పంపిన వివరాలు ఇవ్వండి
ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేయాలి అంచనాల కమిటీ సభ్యులు చెవిరెడ్డి డిమాండ్ తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ అభివృద్ధి, రాజధాని ఇతరత్ర నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కోసం పంపిన వివరాలను ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ అంచనాల కమిటీ ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం సహాయం కోసం నివేదికలు పంపామని ప్రభుత్వం నిత్యం చెబుతోందన్నారు. ఏయే శాఖల, ప్రాజెక్ట్‌ల కోసం ఎంత నిధులు అవసరమని కేంద్రానికి పంపారో ఆ నివేదిక కాపీలను అందజేయాలని ఆర్థిక శాఖను కోరారు. రాష్ట్రం విడిపోవడం వల్ల ప్రభుత్వం అప్పుల్లో ఉందని , ఆదాయం లేదని చెబుతున్నారే తప్ప వాటిని గణాంకాలలో చూపాలని చెప్పారు. అయితే ఏపీ నుంచి వచ్చే ఆదాయం గురించి ఎక్కడా మాట్లాడక పోవడంపై ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నుంచి ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేశారా? అని నిలదీశారు. ఇలా అన్ని శాఖల నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గురించి గణాంకాలు లెక్క వేసి వివరాలు ఇవ్వాలని కోరారు. విభజనకు ముందు ఆర్థిక పరిస్థితులు, నూతన రాష్ర్ట స్థితిగతులపై ఆయన గణాంకాలతో సహా నివేదిస్తూ వివరణ కోరారు. దీనిపై సీనియర్ ఐఏఎస్‌లైన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌కల్లం, సెక్రటరీ ప్రేమ్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ గణాంకాల వివరాలను అందజేస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో కేంద్రం రూ.14,500 కోట్ల సాయం ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్టీఏ వసూలు చేసే ఆదాయాల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుందన్నారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించకుండా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయాన్ని అక్కడ అభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనేక గ్రామాలకు సక్రమమైన రోడ్లు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి విడిపోయాక ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్ నళిని, ఇతర కమిటీ సభ్యులు, అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఆడిట్, అకౌంట్ అధికారులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యలను తొక్కిపెడుతున్న టీడీపీ
మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ‘పచ్చ’ పత్రికల తీరు దారుణం అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో 60 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే బయటి ప్రపంచానికి తెలియకుండా టీడీపీ ప్రభుత్వం, దాని అనుకూల పత్రికలు తొక్కి పెడుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కరువు సంభవించినందున అనంత జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత టీడీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సమస్యలతో సతమతమవుతున్న రైతులు బలవన్మరణాలకు పాల్పడు తుంటే జిల్లా మంత్రి ఆత్మహత్యలు లేనేలేవని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షలో పార్టీ నిర్మాణం గురించి ప్రధానంగా చర్చించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు బోయ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నవీన్ నిశ్చల్, ఏ.సాంబశివారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వి.ఆర్.రామిరెడ్డి, రమేష్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు మహిళ నేత చేరిక తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉషారాణి సోమవారం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు జగన్ పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు. -
చట్టాన్ని పట్టించుకోని చంద్రబాబు
రెండేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం: హరీశ్‌రావు నంగునూరు: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కినా తాము అమలు చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీన్ని సవాలుగా తీసుకుని వచ్చే రెండేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాలమాకులలో సోమవారం 132 కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రాంత ప్రజలు ఇక్కడ సుఖంగా ఉంటున్నారన్నారు. చంద్రబాబుకు గెస్ట్‌హౌస్‌తో పాటు సెక్రటేరియట్‌ను తామిచ్చినా కేంద్ర ప్రభుత్వం సూచిన విధంగా 54 శాతం విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కరెంటు సమస్యలు తీర్చేందుకు వెయ్యి వాట్ల విద్యుత్‌ను ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరిందని..రామగుండం, మణుగూరు ప్లాంట్ల ద్వారా వెయ్యి మెగావాట్లు, సౌర, పవన, జల విద్యుత్తును మరో 15 వేల మెగావాట్ల మేర ఉత్పత్తి చేస్తామన్నారు. తమ విజన్ మేరకు కళకళలాడే చెరువులు, తళతళలాడే రోడ్లు నిర్మించి, ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తామన్నారు. పింఛన్లను తొలగిస్తామంటూ కొన్ని పత్రికలు, పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని బడ్జెట్లో రూ. 3.6 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని విస్మరించొద్దని హరీశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ శ్రీరాములు, జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్.సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శివశంకర్ పాల్గొన్నారు. -
విభజన హామీలపై బాబు విఫలం
వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజం కేంద్రంపై ఒత్తిడి తేవటంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలం సీఎంకు ప్రచారం మీదున్న ధ్యాస ప్రజలపై ఏమాత్రం లేదు ఇతరుల హయాంలో జరిగిన పనులను తన ఘనతగా చెప్పుకుంటున్నారు ఆయన తీరు చూస్తుంటే విఠలాచార్య సినిమాలు గుర్తుకొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 5న కలెక్టరేట్లు ముట్టడించనున్న వైఎస్సార్సీపీ విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి విడిపోవటానికి కారకుడైన చంద్రబాబు ప్రత్యేక హోదా లాంటి హామీలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చేలా ప్రయత్నించే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు, సేల్స్‌టాక్స్, ఇతర పన్నులపై రాయితీలు కల్పిస్తామని, రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రజలను మోసగిస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి ప్రసాదరాజు, మరో ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. ‘సీఎం చంద్రబాబుకు ప్రచారం మీదున్న ధ్యాస హామీలు అమలు చేయటం, ప్రజలకు సేవ చేయటంపై ఏ కోశానా లేదు. ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తానే చేసినట్లు బాబు చెప్పుకుంటున్నారు. 2013లోచిత్తూరులో శ్రీసిటీని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. చంద్రబాబు ఇప్పుడు జపాన్ వెళ్లి తానే అక్కడి కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడకు వెళ్లినా స్మార్ట్ సిటీలంటూ అది చేస్తాం, ఇది చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే నాకు చిన్నతనంలో చూసిన విఠలాచార్య సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ సిని మాలో మాంత్రికుడు చేతిలో మంత్రదండం సాయంతో ఒక్క క్షణంలో నగరాన్ని సృష్టించేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు మాటలు అలాగే ఉన్నాయన్నారు. దివంగత వైఎస్ఆర్ హయాం లో చేపట్టి, అనంతరం మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేసే ఉద్దేశం బాబుకు లేదు. అందుకే 2019లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవాలని కోరుతున్నా. అలాగే మంత్రుల కనుసన్నల్లో టీడీపీ నాయకులు ఇసుకను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. పంట అమ్మబోతే కొనేవారు లేరు చంద్రబాబు పాలనలో వరికి కనీస మద్దతు ధర కరువై రైతులు దిక్కుతోచక ఉన్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్న ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించలేకపోతోంది. ప్రజా పోరాటాలతో బలోపేతం: ధర్మాన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పాలకపక్షానికి, ప్రతిపక్షానికి సమాన బాధ్యతలుంటాయన్నారు. పాలకపక్షం విధివిధానాలను, చట్టాలను రూపొందిస్తే వాటిలో లోపాలను, లొసుగులను నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనన్నారు. సైనికుడిలా పని చేయాలి : జ్యోతుల సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పోరాటాలతోనే చంద్రబాబు సర్కారు మెడలు వంచాలన్నారు. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేసేం దుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంవీఎస్ నాగి రెడ్డి, గౌతమ్‌రెడ్డి, మేరుగ నాగార్జున, ధర్మాన కృష్ణదాస్, సుధాకర్, సలామ్‌బాబు, ఐటీ సెల్ కార్యదర్శి మధుసూదన్ తమ ప్రసంగాల్లో చం ద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చం ద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పార్టీ రాష్ట్ర కా ర్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మలకు మారి, జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణ పాల్గొన్నారు. జనవరిలో రెండు రోజులు జగన్ నిరశన దీక్ష బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వ చ్చిన టీడీపీ అన్ని వర్గాల ప్రజలను వంచిం చిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తమ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందన్నా రు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి మొదటి వారంలో ఉభ యగోదావరి జిల్లాల్లో రెండు రోజుల పాటు జగన్ నిరశన దీక్ష చేయనున్నారని చెప్పారు. ఫిబ్రవరి, మార్చిల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టి పార్టీని సంస్థాగతంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆంధ్రా దేవాలయాల బకాయిలు రూ. వెయ్యి కోట్లు
‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలతోపాటు ఏపీలోని ఇతర దేవాలయాల నుంచి దేవాదాయ శాఖకు రావాల్సిన రూ.వెయ్యి కోట్ల బకాయిలను వసూలు చేయాలని ‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన మంత్రి హరీశ్‌రావును కలసి ఈ అంశాన్ని వివరించారు. మంత్రి సూచన మేరకు ప్రభుత్వ సలహాదారు రమణాచారిని కలసి వినతిపత్రాన్ని అందజేశారు. దేవాదాయ నిర్వహణ నిధి (ఈఏపీ), సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్) తదితరాలు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో టీటీడీతోపాటు ఏపీలో దేవాలయాలు రూ.2,500 కోట్లకుపైగా బకాయి పడ్డాయని, జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు అందులో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు. -
‘హుద్‌హుద్’పై చర్చకు పట్టుబడతాం!
వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి ‘విభజన’ హామీలను పార్లమెంటులో ప్రస్తావిస్తాం అఖిలపక్ష భేటీలో పార్టీ తరఫున హాజరు సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదుహుద్ తుపానుపై పార్లమెంట్లో చర్చించాలని తమ పార్టీ తరఫున పట్టుబడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చాలన్న అంశంపైనా చర్చిస్తామన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ తర ఫున మేకపాటి పాల్గొన్నారు. అనంతరం విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధికి ఎంపీ లాడ్స్ నిధుల పెంపు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలను కూడా సభలో లేవనెత్తుతామని చెప్పారు. ‘హుద్‌హుద్ తుపాను విశాఖ, విజయనగరం, శ్రీశాకుళం జిల్లాలను చిన్నాభిన్నం చేసింది. పంటలు, తోటలు నాశనమయ్యాయి. తుపాను బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ప్రకటించిన రూ. 1,000 కోట్లలో రూ. 400 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మేమంతా ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిసి అక్కడ జరిగిన నష్టాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని ఇచ్చాం. శుక్రవారం స్పీకర్ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తుపాను సాయం విషయాన్ని ప్రస్తావించాం’ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తామన్నారు. ‘రాజధాని లేదు. అసెంబ్లీ భవనం, గవర్నర్ బంగళా, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల నివాసాలెక్కడో తెలియదు. విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం పలు హామీలిచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, లోటు బడ్జెట్ పూడ్చడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకోవాలని కోరతాం’ అని తెలిపారు. తెలంగాణకు సంబంధించి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, వీలైనంత తర్వగా చేపట్టాలని కోరతామన్నారు. ఏపీలో పెండింగ్‌లోని రైల్వే ప్రాజెక్టులనూ సభ దృష్టికి తెస్తామన్నారు.