భవనాలు కేటాయిస్తూ జీవోలు జారీ
* కొద్దిసేపటికే నిలిపివేసిన సీఎస్ మహంతి
* ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంతో పాటు రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 18 జీవోలను జారీ చేసింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో అధికారులు ఆ జీవోలను చూసేందుకు వీల్లేకుండా గోప్యం గా ఉంచారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలోనే జీవోలను నిలుపుదల చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించినట్లు అధికార వర్గాల సమాచారం.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుండటం, ఇక్కడ కూడా రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నందున సీఎస్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. సచివాలయంలోని ఏ,బీ,సీ,డీ బ్లాకులను గతంలో పేర్కొన్న విధంగానే తెలంగాణ ప్రభుత్వానికి, సౌత్ హెచ్, నార్త్ హెచ్, జె, కె, ఎల్ బ్లాకులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించడంతో పాటు ఏ అంతస్తులను ఏ శాఖలకు కేటాయించిందీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సగం అంతస్తులను తెలంగాణ ప్రభుత్వానికి, మిగతా సగం అంతస్తులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించారు.