
మే 12, 2025న ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’ (ఏసీఎఫ్) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభలు హైదరా బాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయి. ఇందులో ‘అరుణోదయం’ సావనీర్ ఆవిష్కృతమవుతుంది. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో ఏసీఎఫ్ ఏర్పడింది. ఏసీఎఫ్ చరిత్రను అంతా అవలోకనం చేసుకోవడానికి ఇంతకు మించిన తరుణం మరొకటి ఉండదు. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఎమర్జెన్సీలో హత్యగావించబడగానే...ఎమర్జెన్సీ డిటెన్యూగా ఉన్న విప్లవ కవి వై.కాశీపతి జైల్లోనే ‘ఉయ్యాలో /జంపాల/ఈ దోపిడీ కూల దొయ్యాల’ అనీ... ‘నీ బార సాల జరిపేము/చెరసాలలో మేము’ అనీ పాటలు రాశారు. అలాగే ‘అరుణోదయం – ఉషోదయం – నూతన క్రాంతి యుగోదయం’ అంటూ అరుణోదయ బ్యానరు గీతం రచించారు. అరుణోదయ కళాకారులు వీటిని ఆలపించారు. అప్పటి నుంచి ప్రజా కవుల, ప్రజా ఉద్యమకారుల త్యాగా లన్నీ కీర్తిస్తూ పాడుతోంది ఏసీఎఫ్.
పాత సాంప్రదాయిక కళారూపాలలోని వస్తువు సారాన్ని మార్చుకొంటూ కొత్త సారంతో తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి వరకు డజన్ల కొలది కళా రూపాలను అరుణోదయ అందిపుచ్చుకుంది. శ్రీకాకుళం, గోదావరి లోయ, కరీంనగర్ లాంటి సాయుధ రైతాంగ పోరా టాలను గానం చేసింది. సింగరేణి, బీడీ కార్మికుల లాంటి శ్రమజీవుల సమస్యలపై కళారూపాలు రూపొందించింది. ఆదివాసుల స్వయంపాలనను ఎలుగెత్తి పాడింది. స్త్రీ విముక్తిని చాటింది. మైనార్టీల ఆత్మరక్షణా హక్కులను లేవనెత్తింది. పీడిత కులాల సమస్యలను, వర్గ–కుల పోరాటాల ఆవశ్యకతను గానం చేసింది. తెలంగాణ, రాయల సీమ, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా ప్రజల ఆకాంక్షలను ఎలుగెత్తింది. అందుకే అరుణోదయ ఒక సంస్థగా కంటే ఒక సాంస్కృతికోద్యమంగానే ప్రజల్లో శ్వాసిస్తూ ఉంది.
– అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ,తెలంగాణ రాష్ట్రాల కార్యవర్గాలు
(నేడు అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ)