విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ కొత్తగా బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆ శాఖ ఇప్పటికే పంపిన ప్రతిపాదనలకు విభజన కమిటీ ఆమోదం తెలిపింది. జిల్లాకు సంబంధించి రెండు బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం గరికపాడు వద్ద ఉన్న ఇంటర్నల్ చెక్‌పోస్టును బోర్డర్ చెక్‌పోస్టుగా మార్చనున్నారు.
నల్గొండ జిల్లాకు సరిహద్దుగా కోదాడకు వెళ్లే వాహనాల తనిఖీకి గరికపాడు వద్ద బోర్డర్ చెక్‌పోస్టును ప్రతిపాదించారు. తిరువూరు శివార్లలో ఖమ్మం జిల్లా సరిహద్దున మరో బోర్డర్ చెక్ పోస్టు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఈ రెండు చెక్‌పోస్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి మన జిల్లాలోకి వచ్చే వాహనాలు ఈ రెండు చెక్‌పోస్టుల వద్ద ట్యాక్స్ చెల్లించి లోపలకు ప్రవేశించాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రాంతంలో వాహనాల నంబర్లకు సంబంధించి ఎటువంటి కొత్త సిరీస్ ప్రారంభించేది లేదని జిల్లా డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సీహెచ్ శివలింగయ్య ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కొత్త సిరీస్‌లో నంబర్లు ఉంటాయని ఆయన తెలిపారు. ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి, మన జిల్లాకు కొత్తగా నంబర్ల సిరీస్ జారీచేసే ఉత్తర్వులు రాలేదని, అటువంటి ప్రతిపాదన కూడా లేదని వివరించారు.
జిల్లాకు రెండు బోర్డర్ చెక్‌పోస్టులు
Published Wed, May 21 2014 2:02 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement