
సీమాంధ్ర-తెలంగాణ మధ్య ఎనిమిది అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు
హైదరాబాద్: తెలంగాణ - సీమాంధ్రల మధ్య 8 ప్రాంతాల్లో సరిహద్దులను నిర్ధారిస్తూ చెక్‌పోస్టుల ఏర్పాటుకు రవాణా శాఖ సిద్ధమైంది. వీటిని అంతర్రాష్ట్ర సరిహద్దులుగా పేర్కొంటూ వాహనాల తనిఖీ కోసం మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, రవాణా శాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఈ చెక్‌పోస్టుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో గుర్తించిన ప్రాంతాల్లో ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాలకు చెందిన సిబ్బందిని వీటిల్లో ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ - ఇతర రాష్ట్రాల మధ్య వాహనాల తనిఖీ ఎలా కొనసాగుతోందో ఇక నుంచి (విభజన అమల్లోకి వచ్చాక) తెలంగాణ - సీమాంధ్ర మధ్య కొత్తగా ఏర్పాటు చేయనున్న చెక్‌పోస్టుల వద్ద కూడా అలాగే కొనసాగనుంది. మోటార్ వెహికల్ ట్యాక్స్ చెల్లింపు, పర్మిట్ల గడువు, వాహనాల ఫిట్‌నెస్, వాహనాల లెసైన్స్.. తదితరాలను ఈ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తారు. తదనుగుణంగా వారు చర్యలు తీసుకుంటారు. అయితే .. ఈ పన్నులకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇప్పటికే పర్మిట్లు తీసుకున్న వాహనాలకు ఆ గడువు పూర్తయ్యే వరకు ఎలాంటి పద్ధతిని కొనసాగిస్తారు? పన్నుల చెల్లింపు ఎప్పటినుంచి మొదలవుతుంది? ఇతరత్రా ఫీజుల విధానం ఎలా ఉంటుంది? తదితరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.
రెండు రాష్ట్రాల సరిహద్దులు, చెక్‌పోస్టులు ఇవీ..
రహదారి, ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
1. హైదరాబాద్ - కర్నూలు హైవే కర్నూలు సమీపంలో.. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్
2. కల్వకుర్తి - శ్రీశైలం కర్నూలు జిల్లా సున్నిపెంట మహబూబ్‌నగర్ జిల్లా ఈగలపెంట
3. దేవరకొండ - మాచర్ల గుంటూరు జిల్లా మాచర్ల నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్
4. మిర్యాలగూడ - ఒంగోలు గుంటూరు జిల్లా దాచేపల్లి నల్లగొండ జిల్లా విష్ణుపురం
5. విజయవాడ - హైదరాబాద్ కృష్ణా జిల్లా గరికపాడు నల్లగొండ జిల్లా కోదాడ
6. ఖమ్మం - తిరువూరు కృష్ణా జిల్లా తిరువూరు ఖమ్మం జిల్లా కల్లూరు
7. ఖమ్మం - రాజమండ్రి ప.గో. జిల్లా జీలుగుమిల్లి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట
8. కొత్తగూడెం - జగదల్‌పూర్ హైవే తూ.గో.జిల్లా మారేడుమిల్లి ఖమ్మం జిల్లా పాల్వంచ