ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ల సిరీస్ కూడా మారనుంది. ఇప్పటివరకు ఏపీ 20 సిరీస్‌తో ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకనుంచి టీజీ 08 పేరున జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి ఈ సిరీస్ అమలవుతుందని ఆర్టీఏ అధికారులు చెపుతుండగా, తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో ఆలస్యమయితే మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అయితే, కొత్త సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు మాత్రం పాత నంబర్లే కొనసాగనున్నాయి. (వాహనదారుల ఇష్టం మేరకు మార్చుకోవాలనుకుంటే మళ్లీ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది) కాగా, ఈ కసరత్తు కోసం అన్ని జిల్లాల ఆర్టీఓలతో సోమవారం రవాణా శాఖ కమిషనర్ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి ఆర్టీఏ మోహిమీన్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎన్ని వాహనాలు ఉన్నాయి. వాటిలో పర్మిట్లు ఉన్న వాహనాలు ఎన్ని...లేని వాటికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలపై సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది.
లోగో ఆలస్యం అయితే...
అయితే, జిల్లాలకు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లేబుళ్లు, రాష్ట్రం లోగో, ఆర్‌సీ బుక్‌లు, సీ బుక్‌లు, అన్ని లెసైన్స్‌లకు కావలసిన లోగోలు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని, దీంతో కొత్త రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తారు. టీజీ 08 వచ్చే వరకు జిల్లాల్లో టీజీ అనే బ్లాంక్‌తో రిజిస్ట్రేషన్లు చేస్తారు. పూర్తి స్థాయిలో నంబర్ వచ్చిన తరువాత వాహనాలకు కేటాయిస్తారు. జిల్లాలోని ఆశ్వారావుపేట, కల్లూరుల్లో కొత్తగా చెక్‌పోస్టుల ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే, అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో రవాణా శాఖ కింద ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు. ఏఏ ప్రాంతం చెందినవారు ఎంత మంది? అనే వివరాలతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు, శాఖకు ఉన్న ఆస్తులు, ఆదాయం ఇతర వివరాలను ఆ శాఖ అధికారులు 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి అందజేశారు.
కొత్త రాష్ట్రం.. కొత్త సిరీస్!
Published Tue, May 27 2014 2:01 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement